సాక్షి, సిటీబ్యూరో : ప్లాస్టిక్.. ప్లాస్టిక్..అంతటా.. అన్ని వేళలా ప్లాస్టిక్ వినియోగం. ఉదయాన్నే పాల ప్యాకెట్ నుంచి పండ్లు.. మాంసం..హోటళ్లు, కర్రీపాయింట్ల పార్సిళ్లకూ ప్లాస్టిక్ కవర్లే. ఆహార పదార్థాల నుంచి తాగే నీటిబాటిళ్ల దాకా ప్లాస్టిక్కే. ఒక్క క్యారీ బ్యాగ్‌లే కాదు స్వచ్ఛమైన కొబ్బరి బొండాల్లోనూ ప్లాస్టిక్ స్ట్రాలే. తీసుకువెళ్లడానికి సదుపాయంగా ఉంటుందని వినియోగదారులు, చవకగా వస్తాయని వ్యాపారులు క్యారీబ్యాగ్‌లను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. వందలు, వేల ఏళ్లయినా మట్టిలో కలిసిపోని ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో పలు అనర్థాలు పొంచి ఉన్నాయి. వాటిని తిని జీర్ణించుకోలేక జంతువులు, జలచరాలు, పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఆహారపదార్థాలతోపాటు మనిషి శరీరంలోకి చేరిన ప్లాస్టిక్ రేణువుల వల్ల మనుషుల ఆరోగ్యానికీ హాని కలుగుతోంది.
అంతేకాదు..ఆఖరుకు నగరంలో వర్షం వస్తే రోడ్లు, కాలనీలు చెరువులుగా మారి నగరం మునగడానికీ ప్లాస్టికే కారణమవుతోంది. వివిధ వ్యర్థాలతోపాటు నగర ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాల్నీ నాలాల్లో వేస్తుండటంతో అవి నీటి ప్రవాహానికి అడ్డుపడి నీరు పారే దారి లేక నాలాలు పొంగిపొర్లుతూ నగరాన్ని ముంచుతున్నాయి. నాలాల్లోని వ్యర్థాల్లో దాదాపు 45 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలే ఉన్నాయి. మన దేశంలో 86 శాతం నల్లా నీటిలో ప్లాస్టిక్ అణువులున్నట్లు గుర్తించారు. ఇళ్లనుంచి డంపింగ్‌యార్డుకు వెళ్లేలోగా చెత్తలోని ప్లాస్టిక్‌వ్యర్థాలు గాలికి చెల్లాచెదురై అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. వాటివల్ల పరిసరాలు కలుషితమవుతూ ప్రభావం చూపుతున్నాయి. దేశంలో ప్లాస్టిక్ వాడకం పెరిగి దాదాపు 40 సంవత్సరాలు కాగా వాటి వ్యర్థాలు 80 శాతం ఇంకా మిగిలే ఉన్నాయి. దేశంలో ఏటా 56 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడుతుండగా, 2030 నాటికి ఇవి 165 మిలియన్ టన్నులకు చేరుతాయని అంచనా. ప్రాణాలు తీసే బాంబులా మారిన ప్లాస్టిక్‌ను నిషేధించాల్సి ఉందని సుప్రీం కోర్టు సైతం హెచ్చరించిందంటే ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
గ్రేటర్ హైదరాబాద్‌లో..
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ప్రతినిత్యం వెలువడుతున్న వ్యర్థాలు దాదాపు 4800 మెట్రిక్‌టన్నులు కాగా, అందులో దాదాపు 450 మెట్రిక్ టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలే. ఇవి ఏటా దాదాపు 8 శాతం పెరుగుతున్నాయి. వీటిల్లో సింగిల్‌యూజ్‌వే దాదాపు 66 శాతం ఉంటున్నాయి. గ్రేటర్‌లో ఏటా 73 కోట్ల ప్లాస్టిక్ కవర్లు వాడుతుండగా, వీటిల్లో 50 మైక్రాన్లలోపువే అధికం. వీటిని డంపింగ్ కేంద్రానికి తరలించేందుకు జీహెచ్‌ఎంసీ ఏటా దాదాపు రూ. 30 కోట్లు ఖర్చు చే స్తోంది.
స్వచ్ఛందంగానే ఆచరించాలి..
- చట్టాలు, కఠిన చర్యలవల్ల కాకుండా ఎవరికి వారుగా ప్రతినబూని ప్లాస్టిక్‌ను వాడకపోవడం వల్ల మాత్రమే ఈ అనర్థాలకు అడ్డుకట్ట పడుతుంది.
- ప్లాస్టిక్ నీళ్లసీసాల బదులు రాగి, స్టీలు సీసాలు వాడటం మేలు.
- మాంసం, తదితర మైనవి తెచ్చుకునేందుకూ ప్లాస్టిక్ వాడవద్దని విందుల్లో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులూ వాడవద్దని జీహెచ్‌ంఎసీ చేపట్టిన ప్రచారం విజయవంతం కావాలంటే ఎవరికి వారుగా ఆచరించాలి. కూరగాయలు, ఇతరత్రా సరుకుల కోసం జనపనార లేదా వస్త్రంతో చేసిన సంచుల్ని వాడాలి.
పర్యావరణదినోత్సవం రోజున ప్రతిన..
1972 జూన్ 5న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పర్యావరణ దినోత్సవాన్ని ప్రారంభించింది. అదే సంవత్సరం ఏర్పాటైన యూఎన్‌ఈపీ పర్యావరణానికి సంబంధించి ప్రజలకు అవగాహన, చైతన్యపరిచే కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం జూన్ 5న నిర్వహించే పర్యావరణ దినోత్సవానికి ఈసారి మన దేశం ఆతిథ్యమిస్తోంది. ఈ సంవత్సరం థీమ్ ‘బీట్ ది ప్లాస్టిక్ పొల్యూషన్’ దీన్ని ఆచరించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాలని జీహెచ్‌ఎంసీ కోరుతోంది.
దశలవారీగా అమలుచేస్తాం: బొంతు రామ్మోహన్, నగర మేయర్
బయో డిగ్రేడబుల్ వ్యర్థాలు 240 రోజుల్లో భూమిలో కలుస్తాయి. ప్లాస్టిక్ వందల నుంచి వేల సంవత్సరాల వరకు భూమిలో కలవదు. ప్లాస్టిక్ నిషేధంపై తొలుత ప్రజలకు తగిన అవగాహన కల్పించడంతో పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇండోర్‌లో మాంసం దుకాణాలకు వెళ్లేవారు టిఫిన్ బాక్సులు తీసుకువెళ్తే మాంసం కొనుగోలు ధరలో రాయితీ ఇస్తున్నారు. అలాంటి విధానాలు అమలు చేస్తాం. దుకాణదారులు ప్లాస్టిక్ కవర్లను వాడితే దుకాణం సీజ్ చేసేలా చర్యలు తీసుకుంటాం. 2022 నాటికి సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ నిషేధిస్తాం.
సంపూర్ణనిషేధం సాధ్యం ఎప్పటికో..?
దేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలు ప్లాస్టిక్‌పై యుద్ధం ప్రకటించి, నిషేధం విధించినప్పటికీ అమలు అంతంత మాత్రమే. హైదరాబాద్‌లో 2022 నాటికి సింగిల్‌యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తామని యూఎన్‌ఈపీ డైరెక్టర్ ఎరిక్ సోల్హెమ్, మంత్రి కేటీఆర్‌ల సమక్షంలో అధికారులు ప్రతిజ్ఞ చేశారు. జీహెచ్‌ఎంసీ పాలకమండలిలోనూ ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వ అనుమతి కోసం నివేదించారు. 2011లో సైతం 40 మైక్రాన్లలోపు నిషేధాన్ని ప్రకటించినప్పటికీ మూణ్నాళ్ల ముచ్చటగా మార్చారు.
- పదేళ్లక్రితమే ప్లాస్టిక్ అనర్థాలను గుర్తించి, పకడ్బందీగా నిషేధాన్ని అమలు చేస్తున్న దేశాల్లో రువాండాది ప్రథమ స్థానం. ఆస్ట్రేలియా, చైనా, జింబాబ్వే, కెనడా, ఫ్రాన్స్ తదితర దేశాలు ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడకంపై భారీ పన్నులు విధించాయి.
- మన దేశంలోని సిక్కిం రెండు దశాబ్దాల క్రితం ప్లాస్టిక్ క్యారీబ్యాగుల్ని, రెండేళ్ల క్రితం ప్లాస్టిక్ ప్లేట్లు, నీటి సీసాల్ని నిషేధించింది.
- ఇండియాలో ప్లాస్టిక్ వ్యాపారం 1,10,000 కోట్లు
- కంపెనీలు 35000
- వినియోగం :ఏటా 13 మిలియన్ టన్నులు
- వెలువడుతున్న వ్యర్థాలు :9 మిలియన్‌టన్నులు
- చెత్త, ప్లాస్టిక్ నుంచి విద్యుత్ తయారీపై వివిధ దేశాలు శ్రద్ధ చూపుతుండగా, మనదేశంలో ఇప్పుడిప్పుడే ఈప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చెత్తనుంచి విద్యుత్ తయారీ ప్లాంట్లు దాదాపు 2200 ఉన్నాయి. మన దేశంలో కేవలం ఎనిమిదే ఉన్నాయి.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు – 2015 నివేదిక మేరకు రోజుకు వెలువడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు ఆయా నగరాల్లో.. మెట్రిక్ టన్నుల్లో
ఢిల్లీ 690
చెన్నయ్ 429
కోల్‌కత్తా 426
ముంబై 408
బెంగళూర్ 314
హైదరాబాద్ 200
Comments
Please login to add a commentAdd a comment