సాక్షి, అమరావతి: ఉదయం పాలు, కూరలు తేవాలంటే ప్లాస్టిక్ కవర్లు.. టీ తాగాలంటే ప్లాస్టిక్ కప్పు.. వాటర్ బాటిల్ ప్లాస్టిక్.. కూల్‌డ్రింక్ బాటిల్ ప్లాస్టిక్.. టిఫిన్ లేదా ఏదైనా పార్సిల్ తేవాలంటే ప్లాస్టిక్.. దుస్తులు కొన్నా ప్లాస్టిక్ కవర్లోనే ఇంటికి వస్తాయి.. నిత్య జీవితంలో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకొనే వరకు అనేక ప్లాస్టిక్ వస్తువులు వాడుతుంటాం. కానీ, రసాయనాలతో కూడిన ఈ ప్లాస్టిక్ ఉత్పత్తులు మానవుడితో సహా సమస్త జీవజాలానికి, పర్యావరణానికి అత్యంత హాని కలుగజేస్తున్నాయి. వాడి పారేసే ప్లాస్టిక్ వ్యర్ధాలు చేస్తున్న చేటు అంతా ఇంతా కాదు. ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి (డీకంపోజ్) ఏకంగా 400 ఏళ్లు పడుతుంది.ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగాన్ని నివారించాలని ప్రభుత్వాలు ఎంతగా ప్రయత్నిస్తున్నా, సాధ్యమవడంలేదు. పైగా, వీటి వినియోగం ఏటికేడాది పెరుగుతూనే ఉందని కేంద్ర పర్యావరణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. గత నాలుగేళ్లలో ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం రెట్టింపైందని, ఇది మరింత వేగంగా విస్తరిస్తుందని తాజా నివేదికలో పేర్కొంది.
2015–16 సంవత్సరంలో దేశంలో ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం 15.89 లక్షల టన్నులు కాగా, 2019–20 నాటికి 35 లక్షలకు చేరింది. రోజుకు 25,940 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే అందులో సుమారు 10,376 టన్నుల వ్యర్థాలను సేకరించకుండా వదిలేస్తుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. 2050 నాటికి 12 బిలియన్ టన్నుల ప్లాస్టిక్ దేశ భూ భాగంపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో ప్లాస్టిక్ వినియోగం తక్కువే. అమెరికాలో తలసరి ప్లాస్టిక్ వినియోగం 109 కేజీలు , చైనాలో 38 కేజీలుంటే ఇండియాలో 11 కేజీలే. అయినప్పటికీ ప్లాస్టిక్ వినియోగం వేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆన్‌లైన్ డెలివరీ విస్తరిస్తుండటంతో ప్లాస్టిక్ వినియోగం కూడా భారీగా పెరుగుతోంది. కేవలం జుమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా ప్రతి నెలా అదనంగా 22,000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వస్తున్నట్లు అంచనా. ప్రభుత్వం తక్షణం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, లేకపోతే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ప్లాస్టిక్ వినియోగంపై కేంద్రం ఆంక్షలు
ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు ఆ ఉత్పత్తులపై ఆంక్షలు విధిస్తూ 2016లో కేంద్రం నిబంధనలు విధించగా, తాజాగా వాటిని సవరించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఒకసారి మాత్రమే వినియోగించే (సింగిల్ యూసేజ్) ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించింది. దీని ప్రకారం కూల్‌డ్రింక్‌ల్లో వినియోగించే స్ట్రాలు, ఐస్‌క్రీం స్టిక్‌లు, ప్లాస్టిక్ గ్లాసులు, కప్పులు, చెంచాలు, బెలూన్స్, క్యాండీ స్టిక్స్ వంటి వాటిలో సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.
ప్లాస్టిక్ కట్టడిలో ఏపీ చొరవ
ప్లాస్టిక్ వినియోగం, నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ మెరుగైన పనితీరు కనబరుస్తోందని కేంద్ర పర్యావరణ శాఖ తాజా నివేదికలో పేర్కొంది. పట్టణాల నుంచి సేకరించిన వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ నిర్వహణ పద్ధతులను పాటిస్తోందని పేర్కొంది. రాష్ట్రంలో ఏటా 46,222 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా. సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంట్ తయారీలో, రోడ్ల నిర్మాణంలో వినియోగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 131 ప్లాస్టిక్ సంబంధ యూనిట్లు ఉండగా అందులో 117 ప్లాస్టిక్ ఉత్పత్తి చేసేవి. 14 ప్లాస్టిక్ రీ–సైక్లింగ్ యూనిట్లు. తాడిపత్రి, బొబ్బిలి, తిరుపతి, విజయవాడ వంటి మునిసిపాలిటీల్లో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల వినియోగంపై పాక్షిక నిషేధం అమలవుతోంది.
కేంద్ర నిబంధనలను అతిక్రమించిన వారిపై దాడులు చేయడం ద్వారా రాష్ట్ర అధికారులు 235 టన్నల ప్లాస్టిక్ బ్యాగులను సీజ్ చేశారు. రూ.1.64 కోట్లు జరిమానాగా విధించారు. తాజాగా ప్లాసిŠట్‌క్ వ్యర్థాల నుంచి సముద్ర తీరప్రాంతాన్ని రక్షించేలా అమెరికాకు చెందిన పార్లే ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతంలో ఏటా ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటిని రీసైక్లింగ్ చేయనున్నట్లు పార్లే ఫర్ ది ఓషన్స్ ఫౌండర్ సైరిల్ గట్చ్ తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 500 పార్లే ఎయిర్ స్టేషన్లు, 10 ఎకో ఇన్నోవేషన్ హబ్స్ ఏర్పాటుతోపాటు 20 వేల మంది సముద్రపు వారియర్స్‌ను నియమిస్తామని వివరించారు. ఆయన ఈ నెల 5న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారు చేసే ఉత్పత్తులను వివరించి, రాష్ట్రంతో కలిసి పనిచేయడానికి ఆసక్తిని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment