
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం అమలు జనవరి 26కి వాయిదా పడింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం మంగళవారం నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే సాంకేతిక పరిజ్ఞానం, తయారీ సామగ్రిని మార్చుకునేందుకు తగిన సమయం ఇవ్వాలంటూ ఫ్లెక్సీ తయారీదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిని అధికారులు సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు.
ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధాన్ని జనవరి 26 నుంచి అమల్లోకి తేవాలని సీఎం ఆదేశించారు. ఈలోగా ప్లాస్టిక్ ఫ్లెక్సీ తయారీదారులకు చేదోడుగా నిలవాలని, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో వారికి అండగా నిలవాలని అధికారులకు సూచించారు. ఫ్లెక్సీ తయారీదారులు సామగ్రిని మార్చుకునేందుకు అవసరం మేరకు రూ.20 లక్షల వరకు పావలా వడ్డీకే రుణాలు ఇప్పించాలని ఆదేశించారు. పర్యావరణ హితం కోసం ప్లాస్టిక్ ఫ్లెక్సీల తయారీ, వినియోగంపై ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే.