
సాక్షి, అమరావతి: కాకినాడ సమీపంలోని తీరాన్ని కాలుష్య రహితంగా, పర్యావరణాన్ని పరిరక్షించేలా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కాకినాడకు కొద్ది దూరంలో ఏర్పాటు చేసే పరిశ్రమల వల్ల కాలుష్యం పెరగకుండా, మత్స్య సంపద, ఇతరత్రా జీవరాశికి హాని కలగకుండా కేంద్ర పర్యావరణ నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పరిశ్రమలు సముద్రంలోకి శుద్ధి చేసిన వ్యర్థాలను ఇష్టానుసారం ఎక్కడపడితే అక్కడ వదలకుండా ఒక ఉమ్మడి వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.
ఈ భాధ్యతను ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ)కి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. కాకినాడ సెజ్‌లో రాబోయే పరిశ్రమలు, చుట్టుపక్కల ఏర్పాటయ్యే ఫార్మా, పెట్రో కెమికల్స్ యూనిట్ల వల్ల సముద్ర జలాలు కలుషితం కాకుండా ఉమ్మడి మురుగు నీటి శుద్ధి వ్యవస్థ ఏర్పాటు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐఐసీకి అప్పగించిందని ఆ సంస్ధ వైస్ చైర్మన్, ఎండీ జవ్వాది సుబ్రమణ్యం ‘సాక్షి’కి తెలిపారు. శుద్ధి చేసిన వ్యర్థ జలాలను ఒకే పైప్‌లైన్ ద్వారా సముద్రంలోకి 5 కిలోమీటర్ల దూరంలో వదిలేలా ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు.
ఇప్పటికే కాకినాడ సమీపంలో దివీస్ ఫార్మా యూనిట్ ఏర్పాటవుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు బల్క్ డ్రగ్ పార్కుల్లో ఒకటి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విశాఖ–కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్‌లో భారీ రిఫైనరీని కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ రిఫైనరీని ఏ విధంగా లాభదాయకతతో ఏర్పాటు చేయవచ్చన్న విషయాన్ని సీఎం వైఎస్ జగన్ కేంద్రానికి వివరించారు. దానిపై అధ్యయనానికి కేంద్ర, రాష్ట్ర అధికారులతో ఒక బృందం ఏర్పాటు చేశారు. ఈ పరిశ్రమలను దృష్టిలో పెట్టుకొని 2023 మే నెలకల్లా ఉమ్మడి మురుగు నీటి శుద్ధి వ్యవస్థను అందుబాటులోకి తేవాలని ఏపీఐఐసీని ప్రభుత్వం ఆదేశించింది.
కన్సల్టెన్సీ కోసం టెండర్లు
ఉమ్మడి మురుగు నీటి శుద్ధి వ్యవస్థ, శుద్ధి చేసిన జలాలను సముద్రంలోకి విడుదల చేయడానికి సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం కన్సల్టెన్సీని నియమించాలని ఏపీఐఐసీ నిర్ణయించింది. ఇందుకోసం బిడ్లను ఆహ్వానించింది. ఆసక్తి గల సంస్థలు ఫిబ్రవరి 7వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల లోపు బిడ్లు దాఖలు చేయాలని కోరింది.