
సాక్షి, అమరావతి: ఆక్వా ఫీడ్ ధరలను ఇష్టారీతిన పెంచడం, రొయ్యల కౌంట్ ధరలను తగ్గించడంపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆక్వా ఫీడ్ తయారీ కంపెనీలు, ప్రాసెసర్లు దిగి వచ్చారు. పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను పూర్తిగా ఉపసంహరించుకోవడంతో పాటు రొయ్యల కౌంట్ ధరలను పెంచేందుకు అంగీకరించారు. గురువారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో జరిగిన ఆక్వా సాధికార కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 17 నుంచి దీనిని అమలు చేస్తామని ప్రకటించారు. రొయ్యల ఫీడ్ ధరలు ఇష్టానుసారం పెంచుతున్నారని, కౌంట్ ధరలు తగ్గిస్తున్నారంటూ ఆక్వా రైతులు ఫిర్యాదు చేయడంతో, ఈ వ్యవహారంపై సీఎం వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం నేతృత్వంలో సాధికార కమిటీని ఏర్పాటు చేశారు.
బుధవారం జరిగిన కమిటీ తొలిభేటీలో మంత్రుల ఆదేశాల మేరకు ఆక్వా రైతులు, ఫీడ్ తయారీదారులు, ప్రాసెసర్లతో గురువారం సాయంత్రం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రి అప్పలరాజు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం, స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, కమిషనర్ కె.కన్నబాబు పాల్గొన్నారు. రైతులు, ఫీడ్ కంపెనీలు, ప్రాసెసర్ల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
రైతులకు నష్టం కలిగించే చర్యలొద్దు
ఆక్వా రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి నష్టం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని మంత్రి అప్పలరాజు స్పష్టంచేశారు. ప్రభుత్వం, రైతులతో చర్చించకుండా ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచినా, కౌంట్ ధరలు తగ్గించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. పెంచిన ఫీడ్ ధరలు తగ్గించాలని, కౌంట్ ధరలను పెంచాలని ఆదేశించారు. స్టేక్ హోల్డర్స్, ఎగుమతిదారులు, ప్రాసెసరల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
లాజిస్టిక్స్ సమస్యలేమైనా ఉంటే చెప్పాలని సూచించారు. ముడి సరుకుల ధరలు పెరగడం వల్లే ఫీడ్ ధరలు పెంచాల్సి వచ్చిందని వారు కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. సోయాబీన్, ఫిష్ ఆయిల్, ఇతర ముడిసరుకుల ధరలు గతంతో పోలిస్తే ఇప్పుడు తగ్గాయని, ఈ సమయంలో పెంచిన ధరలు ఎందుకు కొనసాగిస్తున్నారని అప్సడా వైస్ చైర్మన్ రఘురాం ప్రశ్నించారు. పెంచిన ఫీడ్ ధరలను తగ్గించాలని కమిటీ ఆదేశించింది. దీంతో నెల క్రితం టన్నుకి రూ.2,600 చొప్పున పెంచిన ఫీడ్ ధరను ఉపసంహరించుకునేందుకు తయారీదారులు అంగీకరించారు.
కౌంట్‌కు రూ.55 వరకు పెంపునకు ప్రాసెసర్లు అంగీకారం
రొయ్యల కౌంట్ ధరలు అనూహ్యంగా తగ్గించడంపైనా సమావేశంలో చర్చించారు. రూ.270 నుంచి రూ. 280 ఉన్న 100 కౌంట్ «ధరను రూ.200కు, రూ.420కు పైగా ఉన్న 30 కౌంట్ ధరను రూ.380కు తగ్గించారు. మిగిలిన కౌంట్ ధరలను కూడా రూ.30 నుంచి రూ.80 వరకు తగ్గించారు. ఈ విషయం సీఏం దృష్టికి వెళ్లడం, ఆయన ఆదేశాలతో సాధికార కమిటీ ఏర్పాటు చేయడంతో కౌంట్‌కు రూ.20 నుంచి రూ.35 వరకు పెంచారు. ఈ ధరలు ఏమాత్రం లాభసాటి కాదని రైతులు స్పష్టంచేసారు. అంతర్జాతీయంగా ధరలు నిలకడగా ఉన్నప్పుడు ఇక్కడ ఏ విధంగా తగ్గిస్తారని, తక్షణం పెంచాల్సిందేనని మంత్రి, అప్సడా వైస్ చైర్మన్‌లు ఆదేశించారు. దీంతో సీఎం జోక్యం చేసుకోడానికి ముందు ఉన్న ధరలతో పోలిస్తే కౌంట్‌కు రూ.40 నుంచి రూ.55 మేర పెంచేందుకు ప్రాసెసర్లు అంగీకరించారు. ఫీడ్ ధరల తగ్గింపు, కౌంట్ ధరల పెంపును 17వ తేదీ నుంచి అమలు చేస్తామని తెలిపారు. ఈ ధరల వివరాలను అన్ని ఆర్బీకేల్లో ప్రదర్శించాలని, ఇవే ధరలు 24వ తేదీ వరకు కొనసాగించాలని మంత్రి సూచించారు. ఇకపై ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన తర్వాతే ధరలపై నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.