మీరు ఏదైనా పారిశ్రామిక పార్కులో యూనిట్ ఏర్పాటుకోసం స్థలం ఎక్కడ ఉంది? ఎంత విస్తీర్ణం ఉంది? సరిహద్దులు ఏంటి? ప్రధాన రోడ్డుకు ఎంత దూరంలో ఉంది? ఇటువంటి వివరాల కోసం నేరుగా పారిశ్రామిక పార్కుకు వెళ్లాల్సిన అవసరంలేదు.. మొబైల్‌లో సింగిల్ క్లిక్ చేస్తే చాలు!!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ)కు సమస్త సమాచారాన్ని మొబైల్ యాప్ రూపంలో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందుకోసం జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఐఎస్) పోర్టల్ ఆధారిత మొబైల్ యాప్‌ను తయారుచేయాలని ఏపీఐఐసీ నిర్ణయించింది. పారిశ్రామిక పార్కుల్లో ఉన్న పరిస్థితిని మొబైల్ యాప్‌లో పక్కాగా చూపించేందుకు డ్రోన్ సహాయంతో కూడా సర్వేచేసి.. ఇందులో ఫొటోలు, వీడియోల రూపంలో నిక్షిప్తం చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇందుకోసం ఏజెన్సీని ఎంపికచేసే పనిలో ఏపీఐఐసీ పడింది. మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక ఇంటి నుంచే పారిశ్రామిక పార్కుల్లో ఎక్కడెక్కడ ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి? వాటి ధర ఎంత అనే వివరాలన్నీ తెలుసుకునే వెసులుబాటు కలగనుంది. పరిశ్రమల అనుమతుల కోసం ఇప్పటికే సింగిల్ విండో విధానాన్ని పక్కాగా అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరింత సులభంగా వారికి సమాచారం చేరవేసేందుకు ఈ మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ఆ అవకాశంలేదు
వాస్తవానికి ఏపీఐఐసీకి చెందిన సమాచారం ఇప్పటికే ఆన్‌లైన్‌లో లభిస్తోంది. పారిశ్రామిక పార్కుల వారీగా ఖాళీ ప్లాట్ల వివరాలు లభించడంతో పాటు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. అయితే, పక్కాగా ఆ ప్లాటును నేరుగా ఆన్‌లైన్‌లోనే చూసేందుకు మాత్రం అవకాశంలేదు. దానిని పరిశీలించేందుకు అక్కడకు వెళ్లాల్సిందే. ఆ ఖాళీ ప్లాటు విస్తీర్ణం ఎంత? ధర ఎంత అనే వివరాలు ఉంటున్నాయి. అయితే, నిర్దిష్టంగా సరిహద్దులు ఏమిటనే వివరాలు అందుబాటులోలేవు. అయితే, కొత్తగా తయారుచేయనున్న యాప్‌లో మాత్రం సమస్త సమాచారం.. కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు ఏపీఐఐసీ సమాయత్తమవుతోంది.
యాప్‌తో ఇవీ ఉపయోగాలు..
ఏపీఐఐసీ తయారుచేస్తున్న మొబైల్ యాప్ ద్వారా సింగిల్ క్లిక్‌లో సమస్త సమాచారం తెలుసుకోవచ్చు. అవి ఏమిటంటే...
► పారిశ్రామిక పార్కుల్లో ఖాళీగా ఉన్న ప్లాట్ల వివరాలు.
► ఆయా ప్లాట్ల సరిహద్దులు, విస్తీర్ణం, ధర వగైరా అన్ని అంశాలు.
► సదరు ప్లాటుకు రోడ్డు, రైల్వే మార్గం ఎంత దూరంలో ఉందో తెలుసుకోవచ్చు.
► ఖాళీ ప్లాటును కొనుగోలు చేసేందుకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు.
► భవిష్యత్తులో ప్లాటు కొనుగోలు ధరను కూడా ఆన్‌లైన్‌లో చెల్లించే ఆప్షన్ వచ్చే అవకాశముందని సమాచారం.
అన్ని వివరాలు ఒకే యాప్‌లో
రాష్ట్రంలో ఎక్కడెక్కడ పారిశ్రామిక పార్కులు ఉన్నాయనే వివరాలతో పాటు వాటి వాస్తవ భౌగోళిక స్థితిని తెలుసుకునేందుకు కూడా యాప్ ఉపయోగపడుతుంది. పరిశ్రమలు ఏర్పాటుచేయాలనుకునే వారు ఇంటి నుంచే ఒక్క మొబైల్ క్లిక్‌తో స్థలాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మాది ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ప్రభుత్వం. వారికి అవసరమైన అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నాం.
– గుడివాడ అమర్‌నాథ్, పరిశ్రమల శాఖ మంత్రి
మొబైల్ యాప్ తయారుచేస్తున్నాం
ఇప్పటికే ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కులకు సంబంధించిన సమాచారం వెబ్ ఆధారిత పోర్టల్‌లో లభిస్తోంది. కానీ, ఒక యాప్ రూపంలో దీనిని అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. ఇందులో పారిశ్రామిక పార్కులు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఖాళీలు.. వాటి ధరల వివరాలతో పాటు దగ్గరలోని రైల్వేస్టేషన్, రోడ్డు మార్గం వివరాలన్నీ లభిస్తాయి. వాటి ఫొటోలు, సరిహద్దులు ఆన్‌లైన్‌లోనే చూసుకోవచ్చు.
– సుబ్రహ్మణ్యం, ఏపీఐఐసీ ఎండీ
Comments
Please login to add a commentAdd a comment