
భారతదేశంలోని ప్రతి నగరానికి ఒక చరిత్ర ఉంది. కొన్ని కలల నగరం హోదాను కలిగి ఉoడగా, మరికొన్ని చరిత్రను సజీవంగా ఉంచడానికి కృషి చేస్తున్నాయి. భారతదేశంలోని ఒక నగరాన్ని ఇత్తడి నగరం అని అంటారు. ఆ నగరంలో జరిగే వ్యాపారం మనదేశంలోనే కాదు అమెరికా నుండి యూరప్ వరకు విస్తరించింది. ఆ నగరం గురించి, అక్కడి వ్యాపారం గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అది మనదేశ ఘనతను తెలియజేస్తుంది. ఆ నగరానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్
ఇత్తడి నగరంగా ప్రసిద్ధి చెందిన నగరం పేరు మొరాదాబాద్. ఈ నగరం ఉత్తరప్రదేశ్‌లో ఉంది. ప్రభుత్వం ఈ నగరానికి బ్రాస్ సిటీ అనే పేరు పెట్టింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ఒక ఉత్పత్తి పథకం కింద దీనికి ఈ పేరు వచ్చింది. ఈ నగరంలో తయారైన ఇత్తడి ఉత్పత్తులు భారతీయ సంస్కృతి, వైవిధ్యం, వారసత్వం, చరిత్రను ప్రతిబింబిస్తాయి. ఇక్కడ ఇత్తడి వస్తువుల తయారీకి సంబంధించిన చిన్న పరిశ్రమలు, పెద్ద కర్మాగారాలు అనేకం ఉన్నాయి. హిందూ దేవుళ్లు, దేవతల బొమ్మలు మొదలుకొని మొఘల్ కాలం నాటి ఆకృతుల వరకు అన్నింటినీ ఇక్కడ ఇత్తడితో తయారుచేస్తారు. ఫలితంగా నగరంలో అనునిత్యం ఎక్కడచూసినా పాత్రల తయారీ శబ్ధాలు వినిపిస్తుంటాయి.
అమెరికా నుండి యూరప్ వరకు..
బ్రాస్ సిటీలో తయారయ్యే ఉత్పత్తులు భారతదేశంలో విక్రయమవడమే కాకుండా అమెరికా, యూరప్ వంటి ఖండాలకు కూడా ఎగుమతి అవుతాయి. భారత్ నుంచి అమెరికాకు పెద్ద మొత్తంలో ఇత్తడి ఎగుమతి అవుతుంది. ఇక్కడి ఇత్తడి పరిశ్రమ టర్నోవర్ ఏటా రూ. 8,000 నుంచి 9,000 కోట్ల వరకూ ఉంటుంది. ది వైర్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం ఈ నగర జనాభాలో దాదాపు 47% మంది ముస్లింలు. ఇక్కడి ముస్లింలు ఇత్తడి పాత్రల తయారీలో ముందున్నారు. ప్రస్తుతం మొరాదాబాద్‌లో దాదాపు 4,000 మంది ఇత్తడి ఎగుమతిదారులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: అంతరిక్షంలో వ్యోమగామి చనిపోతే మృతదేహం భూమికి ఎలా చేరుతుంది?