
నిస్వార్థంగా సేవ చేయడానికి సిద్ధమయ్యే యువత చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే దీనికి భిన్నంగా ప్రకృతిని అమితంగా ప్రేమిస్తూ, పర్యావరణ పరిరక్షణకు నిరంతరం పాటుపడుతున్న సునీల్ యాదవ్ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఒకవైపు జాతీయ స్థాయి కబడ్డీలో రాణిస్తూ, మరోవైపు పర్యావరణ పరిరక్షణలోనూ తన భాగస్వామ్యం ఉందంటున్న సునీల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సునీల్ తన 25 ఏళ్ల వయసుకే పదివేలకు పైగా మొక్కలు నాటి రికార్డు సృష్టించాడు.
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన సునీల్ యాదవ్ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. 2018-2019లో ఉత్తరప్రదేశ్ నుండి కబడ్డీ జూనియర్ జట్టులో ఆడి మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఆ తర్వాత 2020లో రెండోసారి రాష్ట్ర స్థాయిలో కబడ్డీ ఆడాడు. ఓవరాల్‌గా ఇప్పటి వరకు ఐదుసార్లు రాష్ట్ర స్థాయిలో ఆడాడు. ఒకవైపు క్రీడారంగంలో ఎదుగుతూనే మరోవైపు ప్రకృతిని కాపాడేందుకు కృషి సాగించాడు.
లాక్‌డౌన్ సమయంలో జనమంతా ఇంట్లో ఉన్నప్పుడు సునీల్ ఉదయాన్నే నిద్రలేచి పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటేవాడు. తరువాత వాటిని సంరక్షించేవాడు. ఈ నేపధ్యంలోనే సునీల్ వినూత్న ప్రచారాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎవరినైనా అభినందిస్తూ పుష్పగుచ్ఛాలు ఇచ్చేందుకు బదులుగా ఔషధ మొక్కలు బహుమతిగా ఇవ్వాలనే ఆలోచన అందరిలో కల్పించాడు. తద్వార పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని భావించాడు. ఈ నేపధ్యంలో సునీల్ యాదవ్ ‘ఆక్సిజన్ మ్యాన్’గా గుర్తింపు పొందాడు.
సునీల్ ఇప్పటివరకూ దేశంలోని మూడు రాష్ట్రాలలో సైకిల్ యాత్ర చేపట్టి, జనం మరింతగా మొక్కలు నాటేలా చైతన్యపరిచారు. సునీల్ చేపడుతున్న ప్రచారం నిరంతరం కొనసాగుతోంది. సునీల్ సుమారు 20 నుంచి 30 గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విరివిగా మొక్కలు నాటాడు.