ఆ చీకట్లో గొడ్లసావిడి దగ్గరకు వచ్చి పెద్ద పెద్దగా అరుస్తున్నాడు పెద్దయ్య.‘‘రేయ్...గొడ్లకు నీళ్లు పెట్టారా లేదా?’’ఎటు నుంచి సమాధానం వినిపించడం లేదు.కాస్త ముందుకు వెళ్లి అక్కడున్న వ్యక్తిని చూసి...‘‘అదేమిటి ఉలుకూపలుకూ లేకుండా నిల్చున్నావు. ఎవరో అనుకుని నేను దడుచుకుచచ్చాను’’ అన్నాడు పెద్దయ్య.ఎల్లయ్య ముఖంలో విషాదం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.‘‘ఎందుకురా అలా ఉన్నావు?’’ అని అడగక ముందే... ‘‘నా పిల్ల కనబడటం లేదయ్యా’’ అన్నాడు. పిల్ల అంటే ఆయన కూతురు.‘‘పొద్దున్నే లేచి పొరుగూరి సంబంధం చూస్తానన్నావు!’’ అడిగాడు పెద్దాయన.‘‘అది ఉన్న ఊళ్లోనే మొగుడ్ని వెదుక్కుంది సామి’’ బాధగా అన్నాడు ఎల్లయ్య.‘‘ఉన్న ఊర్లోనే మొగుడ్ని వెదుక్కుందా? దాన్ని లేవదీసుకుపోయింది ఎవడో చెప్పు చెట్టుకు కట్టేసి చెప్పుతో కొడతాను’’ కోపంగా అన్నాడు పెద్దాయన.అతడు ఎవరో చెప్పకుండా ఎల్లయ్య మౌనముద్ర దాల్చాడు. ఆ మౌనంలో ఏదో భయం ఉంది.‘‘చెప్పరా?’’ అని గద్దించాడు పెద్దాయన.‘‘సామి! నా నోటి నుంచి ఆ మాట ఎలా చెప్పాలి?’’ అంటూనే ‘‘మీ మేనల్లుడు సిట్టయ్యండి. వాళ్లిద్దరూ కలిసి తిరగడం ఊరందరికీ తెలుసు. నా బిడ్డ వట్టి పిచ్చిదయ్యా. దానికి అన్నెంపున్నెం తెలియదు. అది పారిపోయి నెలతప్పి ఇంటికొస్తే ....’’ ఏడుపు ఆపుకుంటూ మనసులోని బాధని వెళ్లగక్కాడు ఎల్లయ్య.పెద్దయ్య కళ్లలో ఆశ్చర్యం.‘‘చొక్కాయికి బొత్తాలు కూడా పెట్టుకోలేని వెధవ అంత పెద్దవాడయ్యాడా. ఎల్లయ్యా...అలాంటిది ఏం జరగదు. నీ బిడ్డ భద్రంగా ఇల్లు చేరుతుంది పో’’ అంటూ పారిపోయిన జంటను వెదకడానికి బయలుదేరాడు పెద్దాయన.
‘‘ఒరేయ్ పుల్లయ్యా...’’ ‘‘ఏంటయ్యా ఇలా వచ్చారు?’’ ‘‘ఎల్లయ్య కూతురు కనిపించడం లేదు...’’ ‘‘దానికి మీరెందుకయ్యా నేను వెదుకుతాను’’పుల్లయ్య మాటతో సమాధానపడని పెద్దయ్య శరభయ్య ఇంటికి వెళ్లి...‘‘అరే శరభయ్యా...నీ స్నేహితుడు చిట్టయ్య ఆ ఎల్లయ్య కూతురిని ఎక్కడికి తీసుకెళ్లాడో చెప్పు’’ అని గద్దించాడు.‘‘నాకు తెలియదు’’ అని బుకాయించబోయాడు శరభయ్య.‘‘నరికిపోగులు పెడతాను’’ అని పెద్దాయన అరిచేసరికి శరభయ్య వణుకుతూ...‘‘యేటి పక్కకు తీసుకెళ్లాడయ్యా...అంతకుమించి నాకు ఏమీ తెలియదు’’ అని చెప్పాడు.‘‘అక్కడ లేకపోతే నీ సంగతి చెబుతా’’ అని బుసలు కొడుతూ యేటి దగ్గరికి బయలుదేరాడు పెద్దాయన.అక్కడేవో శబ్దాలు వినిపిస్తున్నాయి.‘‘చిట్టెయ్య...మీ మామ వస్తున్నాడు. దోనెలో దాక్కోండి...’’ అంటుంది గౌరి.పెద్దాయన దగ్గరకు రాగానే...‘‘ఈ యేళ ఇక్కడున్నరేమిటీ?’’ అడిగింది గౌరి.‘‘నేను అదే అడుగుతున్నాను. ఈ యేళ నీకు ఇక్కడేం పని?’’ గట్టిగా అడిగాడు పెద్దాయన.గౌరీ ఏదో చెప్పబోయిందిగానీ...అది అక్షరాలా అబద్ధమని తెలిసిపోతూనే ఉంది.గౌరి చెంప చెళ్లుమనిపించి....‘‘ఎవర్నే దోనెలో సాగనంపుతున్నావు? గుట్టుగా ఏరు దాటించి కాపురం చేయించడానికి అక్కడ ఏమైనా మేడ కట్టించావా!’’ అని గర్జించాడు పెద్దాయన.‘‘నన్ను ఏమైనా చేసుకోండి. నాకు బాధ లేదు. నన్ను కొట్టు చంపు...కానీ వాళ్లిద్దరినీ మొగుడు పెళ్లాలుగా అంగీకరిస్తేనే ఒడ్డుకు వస్తారు. లేకపోతే యేట్లో కొట్టుకుపోనీ.... వదలవయ్యా తాడు’’ అన్నది గౌరి.గౌరి మాటలు పట్టించుకోకుండా దోనె తాడును ఒడ్డు వైపు బలంగా లాగుతున్నాడు పెద్దాయన.అయినా గౌరి నోరు ఆగలేదు.‘‘వయసులో ఉన్నవాడు తనకు ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకుంటే ఏమిటి తప్పు? వరుసైందని, డబ్బు చాలా ఉందని ఎవరినో ఒకరిని చేసుకుని బతికినంత కాలం వాన్ని ఏడ్వమంటావా.’’ అన్నది.గౌరి వైపు కోపంగా చూశాడు పెద్దాయన.‘‘నీకెందుకయ్యా ఉలుకు’’ అని గట్టిగా అంది గౌరి. పెద్దాయన కోపం నషాళానికి ఎక్కింది.‘‘ఏయ్ నోర్మోయ్...కడుపు చేత్తో పట్టుకుని తిరిగేవాళ్లకు కుటుంబ గౌరవం గురించి ఏం తెలుసే..’’ అని అరిచాడు.
పెద్దయ్య మాటలకు గౌరి నొచ్చుకుంది.‘‘అవునయ్యా...మేము బతుకుదెరువు కోసం వొచ్చినోళ్లమే. పూరి గుడిసెలో పడుకున్నా, ఏటి ఒడ్డున పడుకున్నా పడుకోగానే నిద్ర పట్టే జాతయ్యా మాది. అంబలి తాగినా, జొన్న కూడు తిన్నా, మట్టి తిన్నా సరే...మళ్లీ ఆకలేసే జాతయ్యా మాది.కొంగలు, పిచ్చుకలు ఏ జాతయ్యా?అవి సంతోషంగా బతకడం లేదా!ఇంకా నయం రామచిలక,ఊరపిచ్చుక,గూడకొంగ అని జాతులు విడదీయలేదు. నీ కోపం కంటే ఏటి కోపం ఎక్కువ. తాడు వదిలేయ్’’ ఆవేశంగా అంది.‘ఏ వేదంబు పఠించె లూత?’ అన్నట్లు గౌరి ఏ వేదాలూ చదవలేదు. ఏ పుస్తకాలూ చదవలేదు. అక్షరజ్ఞానం లేని అమ్మాయి ఎంత లోతుగా మాట్లాడింది!యువజంట ఒడ్డుకు వచ్చి పెద్దాయన కాళ్ల మీద పడ్డారు. కోపంతో కత్తి పైకి లేపాడు పెద్దాయన. కానీ అప్పుడు ఆయన అంతరాత్మ చెవిలో ఇలాగొణికింది:‘‘ఏమాయ్య...నువ్వు నీ పెళ్లాంతో ఎలాగూ సుఖంగా లేవు. వాళ్లనైనా సుఖంగా కాపురం చేసుకోనివ్వు’’అంతే.. పెద్దయ్య బెట్టు చెదిరింది. అప్పుడే సన్నగా వర్షపు చినుకులు మొదలయ్యాయి.ఆచిన్నిచినుకుల్లో పెద్దాయన కోపం చల్లారి పోయింది. అతని పెదాలపై సన్నని నవ్వు. ఆ నవ్వు ఎన్నో చెబుతున్నట్టుగా ఉంది.‘చిన్నదానివైనా పెద్ద మాటలు చెప్పి చీకట్లో ఉన్న నన్ను వెలుగులోకి తీసుకువచ్చావు’అప్పటి వరకు మంటలా చెలరేగిపోయిన పెద్దాయన మంచులా చల్లబడటంతో గౌరి కళ్లు చెమర్చాయి.‘‘నువ్వెంత కటువుగా మాట్లాడినా నీది చిన్నపిల్లాడి మనసు. రెండు మేకకూనలు వీడిపోతేనే బాధపడతావు...సిన్న పిల్లలు విడిపోతే ఊరుకుంటావా! ప్రాణాలు తీసే యముడి దగ్గర పాశం ఉంటుంది. శివుడి దగ్గర పాశం ఉంటుంది. నువ్వు శివుడివయ్యా...’’ పెద్దాయనను ఆకాశానికెత్తుతూఅన్నది గౌరి సంతోషంగా.
కొంగలు, పిచ్చుకలు ఏ జాతయ్యా?
Published Sun, Feb 10 2019 12:18 AM | Last Updated on Sun, Feb 10 2019 12:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment