Sparrows
-
పిచ్చుక మీదనా బ్రహ్మాస్త్రం?
‘‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం’’ అనే జాతీయం ఉంది. అతి తక్కువ బలం ఉన్నప్రాణి మీద అనవసరంగా అతి పెద్ద బలప్రయోగం చేయటం అనే అర్థంలో ఉపయోగిస్తారు. ఎంత చిన్నప్రాణి అయినా దాని అస్తిత్వం నిరుపయోగం కాదు. విశ్వంలో, ముఖ్యంగా భూగోళంలో, ప్రధానంగా అది ఉండే ప్రాంతంలో అది పోషించవలసిన పాత్ర ఒకటి ఉండనే ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ, తద్వారా పర్యావరణ సమతౌల్యత ఉంటాయి. దానికి భంగం కలిగిస్తే పర్యవసానం అనుభవించ వలసి ఉంటుంది. ఒక పిచ్చుక సంవత్సరంలో 6.5 కిలోల బియ్యం తింటుంది అని చైనాలో ఒకప్పుడు చేపట్టిన సర్వే తెలిపింది. మొత్తం పిచ్చుకలు లేకుండా చేయగలిగితే 60 వేల మందికి ఆహారం లభిస్తుంది అని కూడా తెలిపింది. ఇంకేముంది? అసలే అధిక జనాభా సమస్య ఉన్న చైనా, వీలైనంత మందికి ఆహారం అందించటానికి ఇదొక మార్గం అనుకుని పిచ్చుకల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టింది. 30 లక్షల పిచ్చుకలని చంపారు. 1958 – 61 సంవత్సరాల మధ్య చైనాలో తీవ్రమైన కరవు వచ్చింది. సుమారుగా నాలుగు కోట్ల యాభై వేల మంది చనిపోయారు. కారణం ఏమై ఉంటుంది అని విచారణ చేస్తే పిచ్చుకలు లేక పోవటం వల్ల అని తేలింది. అదెట్లా? పిచ్చుకలు ధాన్యం తినటంతోపాటు పంటలని నాశనం చేసే పురుగులని కూడా తింటాయి. చీడ పురుగులని తినే పిచ్చుకలు లేక పోవటంతో పంటలకి చీడ పట్టి, తెగులు సోకి ధాన్యం దిగుబడి గణనీయంగా తగ్గింది. అది రాను రాను పెరిగింది. ప్రజలు తిండి లేక చనిపోయారు. దీనికి పరిష్కారం పంటలని నాశనం చేసే తెగుళ్లు కలిగించే పురుగులని రసాయన పదార్థాలు వాడ నవసరం లేకుండా తినేసే పిచ్చుకలు ఉండేట్టు చేయటమే అని నిర్ధారించారు. చేసేది ఏమీ లేక పిచ్చుకలని దిగుమతి చేసుకోవాలనుకున్నారు. రష్యా నుండి పిచ్చుకలని దిగుమతి చేసుకున్నారు. పరిస్థితి అదుపు లోకి వచ్చింది. ఇటువంటి శాస్త్రీయమైన విషయాలని మన దేశంలో ఒక ఆనవాయితీగా, ఆచారంగా చేయటం అలవాటు. భారతదేశంలో, ముఖ్యంగా తెలుగువారు వరికంకులని కుచ్చుగా అల్లి ఇంటి ముందు వేలాడ దీసే వారు. పిచ్చుకలు వచ్చి ఒక్కొక్క వడ్లగింజని తీసుకు వెళ్లేవి. అది రైతు పురుగులని తిని చీడ పీడల నుండి పంటని రక్షించిన పిచ్చుక పట్ల చూపించే కతజ్ఞత. ఇంటి ముందు కొన్ని గింజలు చల్లటం అలవాటు. ఆ అవకాశం ఉన్నా, లేక పోయినా ప్రతి రోజు పక్షులకి, ప్రత్యేకంగా కాకికి తినబోయే ముందు ఒక ముద్ద పెట్టటం అలవాటు. కాకి పరిసరాల్లో ఉన్న చెత్తని, చిన్న చిన్న పురుగులని తిని శుభ్రం చేస్తుంది. దేవాలయాలలో కూడా బలిహరణం అన్న పేరుతో నాలుగు దిక్కుల అన్నం ఉంచటం సంప్రదాయం. ఇంటి చూరులో పిచ్చుక గూడు పెడితే పరమానందం. ఆ గూట్లో పెట్టిన గుడ్లను పిల్లి తినకుండా కాపలా కాయటం ఒక సరదా. అవి ఉండే ప్రదేశాలని మనం ఆక్రమించి, చెట్లని నరికి వాటికి ఆహారం లేకుండా చేసినందుకు ఈ మాత్రం చేయక పోతే కృతఘ్నులం అవుతాం. అలాగని పిల్లులని పూర్తిగా తరమం. పిల్లి తిరుగుతుంటే ఆ వాసనకి ఎలుకలు విజృంభించవు. సృష్టిలో ప్రయోజనం లేని జీవి ఒక్కటి కూడా లేదు. గుర్తించక పోవటం మన లోపం. జాగ్రత్తగా గమనిస్తే ఇతర జీవులని, ప్రకృతిని స్వార్థానికి వాడుకుని ఎవరికీ ఉపయోగ పడని ప్రాణి మానవుడొక్కడే నేమో అనిపిస్తుంది. కనీసం పిచ్చుక పాటి అయినా చేయవద్దా? – డా. ఎన్. అనంత లక్ష్మి -
పిచ్చుకా క్షేమమా
మనిషి తన సౌకర్యం కోసం ప్రకృతి సమతుల్యతకు విఘాతం కలిగిస్తూనే ఉంటాడు. ప్రకృతి సహనంతో ఓర్చుకుంటూ, అప్పుడప్పుడూ విలయం రూపంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటుంది. మొత్తంగా తనను తాను సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ‘మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు’... అని పిచ్చుకలు ఆవేదన చెందుతున్న సమయంలో ప్రకృతి ఓ అమ్మాయి మనసును కదిలించింది. ఆమె ఇప్పుడు పక్షి ప్రేమికురాలైంది. తన ఇంటిని పక్షులకు విలాసంగా మార్చింది. తాను పక్షి ప్రేమికురాలిగా మారిన సందర్భాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు మంచాల హరిణి. అడవికి దాహం వేసింది! ‘‘అప్పుడు నేను బీబీఏ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. అమ్మా నాన్న, నేను, అక్క అందరం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న మా పెద్ద నానమ్మ వాళ్ల ఊరికి వెళ్తున్నాం. నిర్మల్ దాటి కడెం మీదుగా అడవిలో ప్రయాణిస్తున్నాం. మే నెల కావడంతో ఎండ తీవ్రంగా ఉంది. చెట్ల మొదళ్లు ఎండిపోయి వానల కోసం ఎదురు చూస్తున్నాయి. ఓ పక్షి మా కళ్ల ముందే చెట్టుకొమ్మ మీద నుంచి జారి నేల మీద పడింది. కొద్ది సెకన్లపాటు రెక్కలు కొట్టుకున్నాయి. కారాపి వెళ్లి చూశాం, పక్షిని చేతుల్లోకి తీసుకుని మా దగ్గరున్న నీటిని చల్లి, తాగించడానికి ప్రయత్నించాం. కానీ ఆ పక్షి అప్పటికేప్రాణాలు వదిలేసింది. ఆ చిన్నప్రాణికి ఎన్ని నీళ్లు కావాలి, ఆ గుక్కెడు నీళ్లు లేకనే కదాప్రాణం పోయిందని చాలా బాధేసింది. ఆ దృశ్యం పదే పదే కళ్ల ముందు మెదలసాగింది. ఇలాగ ఒక్కో వేసవికి ఎన్ని పక్షులుప్రాణాలు కోల్పోతున్నాయో కదా... అనిపించింది. ఏదైనా చేయాలనిపించింది. కానీ ఏం చేయాలనేది వెంటనే స్ఫురించ లేదు. పిచ్చుకలు వచ్చాయి! పక్షులకు నీటికోసం ఇంటిముందు చిన్న పాత్రలో నీటిని పెట్టడం మొదలు పెట్టాను. పావురాలు ఇతర పక్షుల కంటే పిచ్చుకలే ఎక్కువగా రాసాగాయి. దాంతో పర్మినెంట్ సొల్యూషన్ కోసం ఆలోచించిస్తున్నప్పుడు పిచ్చుకల సైజ్‌ని కూడా దృష్టిలో పెట్టుకుని ఫీడర్ బాక్స్ డిజైన్ చేశాను. ఇందుకోసం ఇంటర్నెట్లో చాలా సెర్చ్ చేశాను. మహారాష్ట్ర, నాసిక్‌లోని ప్లాస్టిక్ వస్తువులను తయారు చేసే ఫ్యాక్టరీ వాళ్లతో మాట్లాడి నాక్కావలసిన డిజైన్‌ను వివరించాను. వాళ్లు రఫ్ తయారు చేసి వాట్సాప్‌లో పంపించేవారు. ప్లాస్టిక్ డబ్బాకు కిటికీల్లాగ ఓపెన్‌గా ఉంచి చిన్న ప్లాస్టిక్ రాడ్‌ను పెట్టించాను. పక్షి ఆ రాడ్ మీద నిలబడి, తెరిచి ఉన్న కిటికీలో ముక్కు పెట్టి గింజలను తింటుంది. నీటి కోసం డబ్బా కింద సాసర్ పెట్టించాను. నాకు సంతృప్తి కలిగే వరకు డిజైన్‌ను మారుస్తూ చేసిచ్చారు వాళ్లు. ఐదేళ్ల కిందట ఇదే తొలి డిజైన్. మొదట వంద పీస్‌లు చేయించి బంధువులు, స్నేహితులకిచ్చాను. తర్వాత అందరూ అడుగుతుండడంతో పెద్ద మొత్తంలో చేయిస్తున్నాం. తాతయ్య పేరుతో ‘మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా అందరికీ పంచుతున్నాం. ఒక మంచి పని చేయడం, అది కూడా మా తాతయ్య పేరుతో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికి రెండువేలకు పైగా ఇలాంటి డబ్బాలను పంచాను. ఇప్పుడు నేను యూఎస్‌లో పీజీ చేస్తున్నాను. నేను మొదలు పెట్టిన పనిని మా నాన్న కొనసాగిస్తున్నారు. మా చేతిమీదుగా ఈ బర్డ్ ఫీడర్ బాక్స్‌లు అటు ఆదిలాబాద్, నాందేడ్ వరకు, ఇటు హైదరాబాద్, సూర్యాపేట, గుంటూరుకు కూడా చేరాయి. ఈ బాక్స్ కావాలని ఎవరడిగినా వాళ్ల అడ్రస్ పంపిస్తే చాలు కొరియర్ చార్జ్‌లు కూడా మేమే భరించి ఉచితంగా పంపిస్తాం. వంద మాటలు చెప్పడం కంటే ఒక మంచి పని చేయడం మేలని నమ్ముతాను. ఐదేళ్ల నుంచి ఈ పని చేస్తున్నప్పటికీ నేను ఎక్కడా ప్రచారం చేసుకోలేదు. ఐ లవ్ స్పారోస్ అనేది ఈ ఏడాది వరల్డ్ స్పారో డే (మార్చి 20)సందర్భంగా ప్రపంచం ఇచ్చిన పిలుపు. కానీ నేను పిచ్చుకలను ప్రేమించడం ఎప్పుడో మొదలైంది. నేను అందరినీ కోరుకునేది ఒక్కటే. ఆ చిన్నప్రాణుల కోసం రోజూ ఓ లీటరు నీటిని పెడదాం’’ అన్నారు మంచాల హరిణి. చుక్క నీరుంటే చాలు! గుప్పెట్లో పట్టుకుంటే నిండా గుప్పెడంత కూడా ఉండదు. పిచ్చుకంతప్రాణం, రేడియేషన్ బారిన పడి అల్లాడిపోతోంది. అభివృద్ధి పేరుతో మనిషి చేసే అరాచకానికి భయపడిపోతోంది. మనిషి కంటపడకుండా పారిపోతోంది. ఏకంగా ఈ భూమ్మీద నుంచే మాయమైపోదామనుకుంటోంది. మనసున్న మనిషి కరవైన నేల మీద తనకు మనుగడ లేదని ఊరు వదిలి పారిపోయింది. అడవుల బాట పట్టి ఏ చెట్టుకొమ్మనో తనను తాను దాచుకుంటూ నీటిచుక్క కోసం వెతుక్కుంటోంది. మనిషి మనసులో ఆర్ద్రత, గుండెలో తడి ఉందని తెలిసిన పిచ్చుక మళ్లీ రెక్కలు టపటపలాడిస్తోంది. వందలాది బంధుగణంతో నిజామాబాద్‌లో మంచాల హరిణి ఇంటి ముందు కొలువుదీరింది. ఈ మాత్రం ఆలంబన దొరికితే చాలు... కిచకిచలతో ఊరంతటికీ వీనులవిందు చేస్తానంటోంది పిచ్చుక. – వాకా మంజులారెడ్డి -
పది వేల ఏళ్లనుంచి కాపాడుతోంది..మరి మనం ఏం చేస్తున్నాం..?
ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 20న జరుపుకుంటారు. పొద్దున్నే మన కిటికీ దగ్గరో, పెరడులోని చెట్టుపైనో పిచ్చుక కిచకిచలు వింటూ ఆనందంగా కళ్లు తెరిచిన క్షణాలు గుర్తున్నాయా? ఆ మధుర స్వరాలు గుర్తున్నాయా అని అనుకోవడంలోనే నానాటికి కనుమరుగైపోతున్న పిచ్చుకల పరిస్థితి అర్థం అవుతుంది. అందుకే వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ, పిచ్చుకల పరిరక్షణపై అవగాహన పెంచడానికి ప్రపంచ పిచ్చుకల దినోత్సవం జరుపుకుంటాం. వరల్డ్ స్పారో డేని 2010లో నేచర్ ఫరెవర్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. ప్రతీ ఏడాది ఏదో ఒక ధీమ్ ఉంటుంది. "ఐ లవ్ స్పారోస్" ఇదే. ప్రపంచ పిచ్చుక దినోత్సవం 2024 అధికారిక థీమ్. ఇది పిచ్చుకలు, మనుషుల మధ్య ప్రేమను, పర్యావరణ పరిరక్షణలో పిచ్చుకల బాధ్యతను గుర్తు చేస్తుంది. పిచ్చుకలను రక్షించడం అంటే మనల్ని మనల్ని కాపాడుకోవడమే. హాయి గొలిపే, ఉత్సాహపరిచే పిచ్చుకల కిలకిలారావాలు రాబోయే తరాలకు అందించిన వారమవుతాం. పదివేల సంవత్సరాలుగా పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ముఖ్యపాత్ర పోషించిన చిన్ని జీవి పిచ్చుక. పిచ్చుకల సంఖ్య తగ్గిపోవడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల్లో ఇవి కనిపించడం లేదు.నగరీకరణ, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విపరీతంగా చెట్లను నరికివేయడం, ఎక్కడబడితే అక్కడ సెల్ టవర్ల నిర్మాణం తదితర కారణాలు పిచ్చుకల పాలిట పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయి. పిచ్చుకలు-వాస్తవాలు ప్రపంచవ్యాప్తంగా 60 రకాల పిచ్చుక జాతులు ఉన్నాయి. పిచ్చుకలు స్వతహాగా స్వతంత్రంగా ఉంటాయి. సొంతంగా అందమైన గూళ్ళను నిర్మించుకుంటాయి. పిచ్చుకల సగటు వయస్సు 4 నుండి 5 సంవత్సరాలు, పిచ్చుకలు చూడ్డానికి బుల్లిపిట్లలే కానీ, పర్యావరణ వ్యవస్థలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. బుజ్జి బుజ్జి ముక్కులతో తెగులు కీటకాలను ఏరిపారేసి (తినేసి), మొక్కల్ని తెగుళ్లు, చీడపీడలనుంచి కాపాడతాయి. మొక్కల పెరుగుదలకు సహాయపడే విత్తనాలను వ్యాప్తి చేస్తాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) నివేదిక ప్రకారం, భారతదేశంలోని దక్షిణ ప్రాంతంలో వీటి సంఖ్య దాదాపు 80 శాతం తగ్గింది. తీర ప్రాంతాల్లో 70 నుంచి 80 వరకు తగ్గగా, ఇతర ప్రాంతాల్లో 20 శాతం తగ్గుదల కనిపించింది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) పిచ్చుకను అంతరించిపోతున్న జాతిగా (రెడ్ లిస్ట్) పేర్కొంది. కొన్ని పట్టణ ప్రాంతాల్లో 99 శాతం వరకు వీటి సంఖ్య తగ్గిపోవడం గమనార్హం. అందుకే బాల్కనీల్లో, ఇంటి పెరడులో వాటి కోసం కాసిన్ని నీళ్లు పెడదాం. బర్డ్ ఫీడర్‌ను ఉంచి వాటిల్లో కొన్ని బియ్యం గింజలు, లేదంటే మనకు అందుబాటులో ఉన్న ఇతర తృణధాన్యాల్ని వాటికి ఆహారంగా అందిద్దాం.హే పిచ్చుక..గూడు కట్టుకో అని ఆహ్వానిద్దాం! -
ప్యారెట్స్..పేరెంట్స్.. 650 చిలుకలు,100 పిచ్చుకల ఆకలి తీరుస్తూ..
సాక్షి, ఏలూరు: ఉదయం, సాయంత్రం వేళల్లో రామచిలుకలు, పిచ్చుకల కిలకిలరావాలతో ఆ వీధి ఆహ్లాదకరంగా మారుతుంది. వందల సంఖ్యలో అక్కడి విద్యుత్ తీగలపై వాలి ఆహారం కోసం నిరీక్షిస్తుంటాయి. ఉదయం 7.30, సాయంత్రం 4 గంటలకు ఠంచనుగా ఈశ్వరరావు, పార్వతి దంపతులు అందించే మేతను ఆరగిస్తాయి. ఐదేళ్లుగా రామచిలుకలు, పిచ్చుకల ఆకలి తీరుస్తూ పక్షులపై తమ ప్రేమను చాటుతున్నారు కైకలూరుకు చెందిన ఈశ్వరరావు, పార్వతి దంపతులు. ప్రతి రోజూ సుమారు 650 రామచిలుకలు, 100 బంగారు రంగు పిచ్చుకలకు ఆహారాన్ని అందిస్తున్నారు. కైకలూరులోని వైఎస్సార్ నగర్లో ఉంటున్న ఈశ్వరరావు ఇంటి సమీపంలో ఉండే విద్యుత్ తీగలపై వాలి పచ్చటి తోరణాలను తలపిస్తాయి. పూటకు పది కేజీల చొప్పున బియ్యాన్ని కడిగి డాబాపై నాలుగు వరుసల్లో చిన్న చిన్న ముద్దలుగా ఉంచుతారు. పిచ్చుకలు తిన్న తరువాత ఒక్కసారిగా రామచిలుకలు గుంపుగా వచ్చి మేతను ఆరగిస్తాయి. గతంలో ముఠా పనిచేసి కొంతకాలంగా టీమాస్టర్‌గా పనిచేస్తున్న ఈశ్వరరావు ఇటీవల వైఎస్సార్ నగర్లో ఇంటిని నిర్మించుకున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు కాగా, వీరి సాయంతో రోజూ రూ.200 ఖర్చుతో చిలుకలకు ఆహారంగా ఒక్కో రోజు బియ్యంతో పాటు కొర్రలు, జామకాయలు అందిస్తున్నారు. చిలుక జాతులలో మూడింట ఒక వంతు అంతరించే ప్రమాదంలో ఉందని ఇటీవల అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి రెడ్‌లిస్టులో వెల్లడించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామచిలుకలకు ప్రతిరోజూ మేతను అందిస్తున్న ఈశ్వరరావు, పార్వతి దంపతుల సేవను పలువురు అభినందిస్తున్నారు. చిలుకలను దేవతలుగా భావిస్తాం అరుణాచలం దేవాలయానికి వెళ్లినప్పుడు రెండు చిలుకలు మా తలలపై తిరిగాయి. మా మామ మరణించే చివరి ఘడియల్లో గోడపై చిలుక బొమ్మ ముద్రించారు. ఈ ఘటనలతో చిలుకలను దేవతలుగా భావిస్తూ రోజూ మేతను అందిస్తున్నాం. వాటి సవ్వడులు మాకు ఎంతో ఆనందాన్నిస్తాయి. ప్రతిరోజూ 20 కేజీల బియ్యాన్ని సమకూర్చడం కష్టతరమవుతోంది. దాతలు బియ్యం అందించి సహకరించాలి. బియ్యం, మేత సాయం చేసే దాతలు 63048 72868, 93818 93450 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. – కొల్లి ఈశ్వరరావు, పార్వతి దంపతులు చదవండి: లేటు వయసులోనూ నీట్ రాశారు.. పేదలకు వైద్య సేవలు అందించాలని 69 ఏళ్ల విశ్రాంత ప్రొఫెసర్ సంకల్పం.. -
రాత్రికిరాత్రే వందలాది పక్షులు మృతి
-
పల్లెకు పోయింది పిచ్చుకమ్మ!
సాక్షి, అమరావతి: ఒకప్పుడు మనతోపాటు ఇళ్లల్లో జీవించిన పిచ్చుకలు చాలా ఏళ్లుగా కనిపించడం మానేశాయి. మనుషుల జీవన విధానం మారిపోవడం, వాతావరణ మార్పుల వల్ల పిచ్చుకలకు మనుషుల ఆవాసాల వద్ద స్థానం లేకుండాపోయింది. దీంతో అవి గ్రామాలకు తరలిపోయాయి. గతంలో పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా పెంకుటిళ్లు, తాటాకిళ్లు ఉండేవి. వాటి చూర్లలో పిచ్చుకలు గూళ్లు కట్టుకుని.. ఆ ఇంట్లో దొరికే గింజలు, చుట్టుపక్కల పొలాల్లో ఉండే క్రిమికీటకాలను తిని జీవించేవి. కాంక్రీట్ భవన నిర్మాణాలు మొదలయ్యాక చూర్లు కనుమరుగవడంతో పిచ్చుకలకు గూళ్లు పెట్టుకునే అవకాశం లేకుండాపోయింది. దీంతో అవి పల్లెలకు తరలిపోయాయి. అక్కడా వాటికి ఇప్పుడు అనువైన వాతావరణం లేకపోవడంతో చాలా తక్కువ సంఖ్యలోనే కనిపిస్తున్నాయి. మన ఆహార అలవాట్లు ప్రభావం చూపాయి కాంక్రీట్ భవనాలు పిచ్చుకలకు గూళ్లు లేకుండా చేస్తే మారిన మన ఆహార అలవాట్లు వాటికి ఆహార భద్రత లేకుండా చేశాయి. గతంలో గింజ ధాన్యాలు ఎక్కువగా ఉపయోగించే ప్రజలు ఇప్పుడు వాటిని తగ్గించేయడమే ఇందుకు కారణంగా గుర్తించారు. మరోవైపు పిచ్చుకలు పంట పొలాల్లో ఉండే క్రిమికీటకాలను తినేవి. తద్వారా పంటలకెంతో మేలు కలిగేది. ఇప్పుడు ఎరువులు, పురుగు మందులు ఎక్కువగా వాడటం వల్ల వాటి ప్రభావానికి పిచ్చుకలు మనలేకపోతున్నాయి. కాలుష్యం పెరగడం, వాతావరణంలో వస్తున్న మార్పులు వాటి మనుగడపై ప్రభావం చూపాయి. గతంలో లక్షల సంఖ్యలో కనిపించే పిచ్చుకల సంఖ్య ఇప్పుడు వేలకు తగ్గిపోయింది. 40 సంవత్సరాలకు ముందు పిచ్చుకల సంఖ్య బాగా ఎక్కువగా ఉండేది. ఆ తరువాత నుంచి క్రమంగా వాటి సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. గత 20 ఏళ్లలో పిచ్చుకల సంఖ్యలో తగ్గుదల లేదని ‘స్టేట్ ఆఫ్ ఈ–బర్డ్’ నివేదిక స్పష్టం చేస్తోంది. దేశంలో 5 జాతులు ప్రపంచంలో 26 రకాల పిచ్చుక జాతులుండగా.. వాటిలో ఐదు రకాలు మాత్రమే మన దేశంలో కనిపిస్తాయి. అవి స్పానిష్ స్పారో (పాసర్ హిస్పానియోలెన్సిస్), సింద్ స్పారో (పాసర్ ఫిర్హనాటస్), రస్సెట్ స్పారో (పాసర్ రుటిలాన్స్), యూరేషియన్ ట్రీ స్పారో (పాసర్ మొంటానస్), హౌస్ స్పారో (స్పాసర్ డొమెస్టికస్). మన ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించేవి హౌస్ స్పారోస్ జాతి పిచ్చుకలే. ఇవి సగటున 15 సెంటీమీటర్ల పొడవుంటాయి. 24 నుంచి 40 గ్రాముల బరువు ఉంటాయి. అంతరించిపోలేదు..తగ్గాయంతే! పిచ్చుకలు అంతరించిపోలేదు కానీ.. వాటి సంఖ్య బాగా తగ్గిపోయింది. జీవించడానికి, గూళ్లు పెట్టుకోవడానికి అనువుగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పిచ్చుకలు ఉంటున్నాయి. నగరాల్లో అన్నీ భవనాలే కావడం వల్ల గూళ్లు పెట్టుకునే ఆస్కారం లేదు. అందుకే వాటికి అనువైన ప్రాంతాలకు వెళ్లిపోయాయి. రేడియేషన్ వల్ల పిచ్చుకలు తగ్గిపోయాయనడానికి సైంటిఫిక్‌గా ఎటువంటి నిరూపణలు లేవు. పర్యావరణ సమతుల్యతలో పిచ్చుకలు ఎంతో కీలకం. వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. – రాజశేఖర్ బండి, ప్రిన్సిపల్ కో–ఆర్డినేటర్,ఐఐఎస్ఈఆర్ -
పిచుకా క్షేమమా..!
అది దొరకదు. కాని అది ఉంటుంది. మనం ఇల్లు కట్టుకుంటే హక్కుగా వచ్చి దాని ఇల్లు కట్టుకుంటుంది. మనం ఒండుకుని తింటాం. రాలినవి అవి ఏరుకుని తింటుంది. వాసాల మీద వాలుతుంది. వసారాపై వాలుతుంది. బల్బ్ మీద కూచుంటుంది. నీళ్ల తొట్టి అంచు మీద ఆలోచిస్తుంది. అది మనల్ని పట్టించుకుంటుంది. అసలు మనల్నే మర్చిపోతుంది. మనిషిది కూడా పిచ్చుక ప్రాణమే. కాని ఆ పిచ్చుక ప్రాణానికి ఈ పిచుక చేసే పిచ్చిపనులే ప్రమాదం. పిల్లల కథల్లో, పాటల్లో, సామెతల్లో, పలుకుబడుల్లో, సినిమాల్లో పిచ్చుక లేకుండా ఎలా ఉంటుంది. పిచ్చుక లేకపోతే మనం ఉండగలమా? రాసుకోవద్దూ ఇవాళ దాని గురించి? ‘గురి తప్పిన బాణం వలే తిరుగాడింది పిచ్చుక’ అని రాశాడు ఒక తెలుగు కవి. గదిలోకి దూసుకు వచ్చిన పిచ్చుక ఒక్క క్షణం ఎక్కడికొచ్చానా అని తొట్రుపడి గురి తప్పిన బాణంలా గిరికీలు కొట్టి మళ్లీ బయటకు బుర్రున ఎగిరిపోయిన దృశ్యం ఆ వాక్యం చదవగానే కళ్ల ముందు మెదులుతుంది. నిజానికి ‘పిచ్చుక’ అనగానే దృశ్యాలు, జ్ఞాపకాలు, బాల్యాలు చుట్టుముట్టనిది ఎవరికి? చిలుకలు ఎప్పుడో కాని రావు. కాకులు వచ్చినా మనకు నచ్చవు. నెమళ్లు ఎక్కడుంటాయో తెలియదు. గద్దలు ప్రమాదం. పావురాళ్లు గుళ్లను మసీదులను ఇష్టపడతాయి. మరి మన ఇళ్లకి ఎవరు రావాలి? పిచ్చుకమ్మే. అది తానుగా వచ్చి లేదా మగనితో వచ్చి వరండా లో కిచకిచమని, వడ్లను పొడిచి తిని, అద్దంలో ముఖం చూసుకొని, అమ్మ చేటలో బియ్యం ఏరుతూ ఉంటే దూరాన నేల మీద గెంతుతూ ఉండి విసిరిన నూకలను నోట కరుచుకుని, బావి గట్టు మీద వాలి, గిలక మీద కాళ్లు పెట్టి, బిందె పెట్టి పెట్టి లోతుకు పోయిన సిమెంటు గుంటలో నిలిచిన నీళ్లలో స్నానాలాడి... ఈ పిచ్చుకలే కదా జీవన లిప్తలను ఇస్తాయి ఇచ్చాయి అందరికీ. అందుకే అవంటే అందరికి ఇష్టం. కసురుకోవడానికి ఇష్టపడని స్నేహం. గమనించండి అప్పటికీ ఇప్పటికీ ఎవరూ పిచ్చుకలను కసురుకోరు. అవి వస్తే ఆనందం. వచ్చి వెళ్లిపోయినా ఆనందమే. అంటీ ముట్టని చుట్టం... పిచ్చుక మనిషితోనే ఉంది. మనిషితోనే ఉంటుంది. కాని అంటదు. ముట్టదు. అంటినా ముట్టినా సహించదు. మనిషి ఆవాసాల్లోనే అది గూడు కట్టుకుంటుంది. పూరి గుడిసెల వసారాల్లో, మిద్దిళ్ల వాసాల్లో ఉండే ఖాళీల్లో, వాకిలి పైన, సీలింగ్ ఫ్యాన్ పైడొప్పలో, వెంటిలేటర్లలో, ఓపెన్ షెల్ఫ్‌లలో, బావి లోపలి గోడల్లో ఉండే రంధ్రాల్లో అవి గూడు కట్టుకుంటాయి. గడ్డి వాటి గూడుకు ముఖ్యమైన మెటీరియల్. లేకుంటే పుల్లలు పుడకలూ ఎలాగూ సేకరిస్తాయి. పిచ్చుకల గూళ్లను భారతీయులు ఏ కోశానా కూల్చరు. కూల్చడం పాపం అనుకుంటారు. వాటిలోకి తొంగి చూడటం వాటికి పుట్టిన పిల్లలను తాకడం చేయరు. అలా చేయడాన్ని పిచ్చుకలు నచ్చవు. పొదగడానికి పెట్టిన గుడ్లను తాకితే అవి వాటిని పొదగవని పిల్లలకు చెబుతారు. పిచ్చుకలు మనుషుల్లానే కుటుంబానికి విలువ ఇస్తాయి. ఆడ, మగ కలిసి కష్టపడి గూడు కట్టి పిల్లలను సాకి సంతరిస్తాయి. అందుకని కూడా మనవాళ్లకు అవంటే ఇష్టం. మగపిచ్చుక కొంచెం బొద్దుగా ఉంటే ఆడ పిచ్చుక సన్నగా స్పీడుగా ఉంటుంది. అవి రెండు ఏమిటేమిటో మాట్లాడుకుంటూ ఉంటాయి. వాటి మాటలు వినడం ఎవరికైనా సరే బాగుంటుంది. పిచ్చుకలు మూడేళ్లు బతుకుతాయి. కాని అవి ఆ మూడేళ్లను సంపూర్తిగా జీవిస్తాయి. బద్దకించవు. మెల్లగా ఉండవు. ఉత్సాహం మానుకోవు. ఎప్పుడూ బతుకు మీద ఆశతో మన బతుకు మనం బతుక్కుందాం అన్నట్టుగా ఉంటాయి. మనుషులు తినేవి కొన్ని అవి తింటాయి. అవి తినేవి కొన్ని వాటికి దొరుకుతాయి. ఇప్పుడు మనుషులు తినేవి కొన్ని వాటికి విషపూరితం. అవి తినే పురుగులు కూడా విషపూరితమైపోతున్నాయి. కథల్లో పలుకుబడిలో.... కథల్లో పిచ్చుక ఉంటే పిల్లలకు ఇష్టం. పసిపిల్లలకు గోరుముద్దలు తినిపించేటప్పుడు ‘ఇది కాకమ్మ ముద్ద... ఇది పిచ్చుకమ్మ ముద్ద’ అని తినిపిస్తారు. కొన్ని పిచ్చుక లు కథల్లో భలే తెలివి చూపిస్తాయి. కొన్ని నవ్విస్తాయి. కాకి ఉప్పుతో మేడ కట్టుకుందట, పిచ్చుక పుల్లలతో కట్టుకుందట. కాకి పిచ్చుకను చూసి ఎగతాళి చేసిందట. కాని వానొస్తే ఏముంది? ఉప్పు కరిగి కాకి దిక్కులేనిది అయ్యింది. పిచ్చుక మాత్రం వెచ్చగా తన బిడ్డలను జవురుకొని నిద్రపోయింది. పిచ్చుక సోషలిస్టు. దానికి ఎంత కావాలో అంతే తిని ఎగిరిపోతుంది. ఆశ చాలా చెడ్డది అని చెబుతుంది. గిన్నెలో మరికొన్ని గింజలను వదలడం దానికి ఇష్టం. అందుకే పల్లీయులు దానిని చేరదీస్తారు. వసారాల్లో వరి కంకులనో జొన్న కంకులనో వేళ్లాడగడతారు. అవి వచ్చి తింటే ఆ తృప్తి వేరు. ‘పిచ్చుక మొడితే మంచిది’ అని పల్లెల్లో అనుకుంటారు. అది మొట్టడం అరుదు. ‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం’ మూర్ఖత్వం పాపం అనుకుంటారు. మనుషుల్లో అలాంటి అల్పప్రాణి కనిపిస్తే కనికరించాలని పిచ్చుకను చూసి నేర్చుకున్నారు. బంగారు బాతులాగే బంగారు పిచ్చుక కూడా పోలికకు వాడతారు. ‘కాకమ్మ పిచుకమ్మ కబుర్లు’ అంటారు కాని ఉద్దేశాలు లేని హాౖయెన కబుర్లు చెప్పుకుంటే మంచిది కదా పిచ్చుకమ్మల్లాగా. అపాయం తడి చెత్త, పొడి చెత్త అని అన్నీ కవర్లలో పెట్టి పారేస్తున్నాం. బావి దగ్గర గిన్నెలు కడిగి మెతుకులు నేలన పడేసేది లేదు. బియ్యం ఏరేది లేదు. అందులో నూకను పారేసేది లేదు. శ్లాబ్ వేసి ఇళ్లు కట్టుకుంటున్నాం. కిటికీలు తెరవకుండా మూసేస్తున్నాం. బోర్లు చల్లదనాన్ని ఇవ్వవు... స్థలాన్నీ ఇవ్వవు. ఫ్యాక్టరీల ద్వారా, కార్ల ద్వారా, ఏసిల ద్వారా, ఫోన్ల ద్వారా గాలిలో హానికారమైన రసాయనాలను తరంగాలను వదులుతున్నాం. తిండి గింజల పంటలకు బదులు వ్యాపార పంటలు వేసి పిచ్చుకలు ఎంత దూరం ఎగిరినా ఏమీ దొరకని స్థితి తెస్తున్నాం. వాటిపై కొట్టిన రసాయనాలు తిని చచ్చిన పురుగులను తిని పిచ్చుకలు చచ్చిపోతున్నాయి. పిచ్చుకది పిచ్చుక ప్రాణం. తట్టుకోలేదు. అందుకే రచయితలు ‘చివరి పిచ్చుక’ అని కథలు కూడా రాశారు. పర్యావరణకారులు పిచ్చుకలను ఆదరించడానికి గూళ్లను ఏర్పాటు చేసే ప్రచారం చేస్తున్నారు. వాటికి కావాల్సిన గింజలు పెట్టమని, నీళ్లు పెట్టమని చైతన్యం కలిగిస్తున్నారు. రేడియేషన్ లేకుండా సెల్‌టవర్లను తగ్గించాలని ‘రోబో2.ఓ’ వంటి సినిమాలే వచ్చాయి. ఎంత పెద్ద భవంతి ఉన్నా దాని బాల్కనీలో మొక్కలు ఆ నీటి కుండీ పక్కన వాలేందుకు పిచ్చుకలు లేకపోతే ఆ సంపదకు అర్థమేమిటి? ఒక చిన్ని బుజ్జి పిచ్చుక ఉదయాన్నే ‘ఎలావున్నావమ్మా వొదినా’ అని ఇంట్లోకి వచ్చి నిద్ర లేపేలా మన పరిసరాలు, ఊరు, నేల, భూగోళం ఉండాలని కోరుకొని ఆ విధంగా ఉండేలా ప్రయత్నించకపోతే మనం ఎలా ఉంటున్నట్టు. ఆలోచిద్దాం ఇవాళ్టి నుంచైనా. బయట ఎండగా ఉన్నట్టుంది.. వెళ్లి కొంచెం పిచ్చుకలకు గింజలు, నీళ్లు పెడదాం పదండి. – సాక్షి ఫ్యామిలీ -
మిడతలపై దాడికి చైనా ‘డక్ ఆర్మీ’
చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం ‘గొప్ప ముందడుగు’ పేరిట 1958 నుంచి 1962 వరకు రెండో పంచవర్ష ప్రణాళికను అమలు చేసింది. అందులో ‘ఎలుకలు, ఈగలు, దోమలు, పిచ్చుకలు’ సమూలంగా నిర్మూలించడం ఓ లక్ష్యం. ఆ లక్ష్యంలో చాలా వరకు విజయం సాధించినప్పటికీ చైనా అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చింది. పిచ్చుకలు లేకుండా పోవడంతో చైనాలో మిడతల దాడులు పెరిగాయి. అంతకుముందు మిడతలు కనిపిస్తే పిచ్చుకలు వాటి వెంటబడి తినేవి. (మిడతలను పట్టే ‘మెథడ్స్’) మిడతలను నిర్మూలించేందుకు ప్రత్యామ్నాయ మార్గలేమిటని చైనా ప్రభుత్వం అన్వేషించగా, అందుకు బాతులు బాగా పనికొస్తాయని తేలింది. దాంతో పెద్ద ఎత్తున బాతుల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. లక్షలకు చేరుకున్న బాతులకు ‘డక్ ఆర్మీ’ అని పేరు పెట్టి మిడతల పైకి దాడికి పంపించేది. ఆ బాతులు మిడతల లార్వాలను, ఎగురలేని పిల్ల మిడతలను శుభ్రంగా తినేసేవి. నోటికందిన పెద్ద మిడతలను కూడా వదిలేవి కావు. (మిడతలు మిక్సీ.. కోడికి మస్తీ! ) మిడతల దండు దేశంలోని పంటలపైకి దాడికి వచ్చినప్పుడల్లా, ఇప్పటికీ ‘డక్ ఆర్మీ’ని చైనా ఉపయోగిస్తోంది. పాకిస్థాన్ ప్రభుత్వం వినతిపై లక్ష బాతుల ఆర్మీని ఆ దేశానికి పంపించేందుకు గత ఫిబ్రవరి నెలలో చైనా ప్రభుత్వం అంగీకరించింది. అయితే పంపించిందీ, లేనిదీ కరోనా వార్తల పరంపరలో తెలియలేదు. (ఫోటోలు తీసి సోషల్ మీడియాలో కుమ్మేశారు) -
గూడు చెదిరిన పిచుక కోసం
కాలుష్యం వల్ల పిచ్చుకలు అంతరించిపోతున్నాయి. గ్లోబల్‌వార్మింగ్‌కి ఇదో సూచిక అని పర్యావరణ మేధావులు హెచ్చరిస్తున్నారు. అది విని ఎవరికి వారు చింతిస్తున్నారు. కాని ఆ తర్వాత తీరికలేని పనుల్లో పడి ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. అయితే యాభైఏడేళ్ల రాకేష్ ఖత్రీ మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నాడు. ఢిల్లీవాసి అయిన రాకేష్ ఖత్రీ ఇప్పుడు దేశమంతటా పిచ్చుక గూళ్లు ఏర్పాటు చేయాలని, పిచ్చుకలను కాపాడాలని కంకణం కట్టుకున్నాడు. స్కూళ్లలోనూ, గృహసముదాయాల్లోనూ వర్క్‌షాపులను ఏర్పాటు చేస్తూ పిచ్చుకల కోసం గూళ్లను నిర్మిస్తున్నాడు. ‘చిన్నప్పుడు స్కూల్ నుంచి ఇంటికి రాగానే టెర్రస్ మీదకు పరిగెత్తేవాడిని. అక్కడ మా స్నేహితులతో కలిసి పక్షులకు గింజలు వేసేవాణ్ణి. వాటితో ఎంత సమయం గడిచేదో కూడా తెలిసేది కాదు. కొన్ని రోజులయ్యాక పిచ్చుకలు మా ఇంటి బాల్కనీల్లో, కిటికీల్లో, స్విచ్బోర్డుల్లో గూళ్లు కట్టుకునేవి. ఆ గూళ్లను, అవి కట్టుకునే విధానాన్నీ గమనిస్తూ ఉండేవాడిని’ అని తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుంటారు రాకేష్. భవిష్యత్తు తరానికి పిచ్చుకేది? ‘పిచ్చుక గూడు ఓ జ్ఞాపకమే కానుందా.. ఈ విషయం అర్ధమయ్యాక ఆవేదనే మిగిలింది’ అంటాడు రాకేష్. మీడియాలో పనిచేసే ఖత్రీ 2008లో చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి కృత్రిమ గూళ్లు నిర్మించడం ద్వారా పిచ్చుకల సంరక్షణ కోసం పని చేయడం మొదలుపెట్టాడు. ఇప్పటివరకు లక్షకు పైగా గూళ్లు నిర్మించాడు. ప్రతి నెలా నగరం చుట్టూ చల్లడానికి పిచ్చుల కోసం ధాన్యం కొనుగోలు చేస్తుంటాడు. ‘పిచ్చుకల పరిరక్షకుడిని అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. పిచ్చుకల ప్రాముఖ్యత గురించి భవిష్యత్తు తరానికి అవగాన కల్పించడమే నా లక్ష్యమైంది’ అని చెబుతారు ఖత్రీ. వర్క్‌షాప్‌ల ద్వారా అవగాహన నాలుగు ఏళ్ల కిందట తన భార్య మోనికా కపూర్, కొడుకు అనిమేష్తో కలిసి ఎకోరూట్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. కుటుంబంతో కలిసి పక్షుల కోసం గూళ్లు తయారుచేసేందుకు వర్క్‌షాప్స్‌ను ఏర్పాటు చేసి యువతరంలో అవగాహన కల్పిస్తున్నాడు. పాఠశాలలు, కార్పొరేట్ ఆఫీసులు, గృహసముదాయాలలో ఇప్పటి వరకు రెండున్నర లక్షలకు పైగా వర్క్‌షాపులను నిర్వహించారు. ‘ఆధునిక ఇళ్ల నిర్మాణాలు పిచ్చుకలకు చోటు కల్పించని విధంగా ఉంటున్నాయి. మన పూర్వీకులు ఇంటి పై కప్పు పైన, వాకిళ్లలో గింజలు, పప్పులు ఆరబెట్టుకునేవారు. అవి పిచ్చుకలను ఆకర్షించేవి. ఇప్పుడు.. అన్నీ ప్యాకెట్లలో కొంటున్నాం. బయట గింజలు ఆరబెట్టే పరిస్థితులే లేవు. పిచ్చుకల అదృశ్యానికి ఇది కూడా కారణం’ అంటారు రాకేష్. గూడు కోసం గోడు ఆహార గొలుసులో పక్షులది ప్రధాన పాత్ర. పత్తి, ఎండిన ఆకులు, గడ్డి వంటి వ్యర్థాలను గూళ్లుగా ఉపయోగించుకుంటాయి అవి. అందువల్ల వాటి ఉనికి తప్పనిసరి. పిచ్చుకుల ఉనికి అవసరాన్ని చెప్పే వర్క్‌షాప్‌కు హాజరయ్యే వ్యక్తుల సంఖ్యను చూసుకొని వారితో కలిసి వెదురుకర్రలు, గడ్డి, దారాలు, జనపనార సంచులు, రీ సైకిల్ టెట్రాప్యాక్‌లు వంటి పరికరాలతో పిచ్చుకగూళ్లు నిర్మించడానికి పూనుకుంటాడు రాకేష్. వాటిని అందరికీ పంచుతాడు. దీనికి ముందు కొబ్బరి చిప్పలు, వార్తాపత్రికలు, జనపనార సంచులు.. మొదలై వాటితో పిచ్చుక గూళ్లను తయారు చేయడానికి రోజుల తరబడి ట్రయల్స్ వేసి, విఫలమయ్యాడు రాకేష్. అనేక గూళ్ల నిర్మాణాలు చేయగా 2012లో ఒక గూడు ఆకారం వచ్చింది. దానినే ఇప్పుడు అందరికీ నేర్పిస్తున్నాడు. ‘ఢిల్లీలో మయూర్ విహార్ ప్రాంతంలో వంతెన కింద గూడు కట్టుకోవడానికి పిచ్చుకల బృందం ప్రయత్నిస్తున్నట్లు గుర్తించాను. మరుసటి రోజు కొంతమంది కార్మికులు గూడు ఉన్న రంధ్రం వద్ద సిమెంట్ చేయడం చూశాను. వాళ్లను అడిగితే ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి అడగమని పంపించారు. ఆఫీసర్ని చాలా ఒప్పించిన తర్వాత అక్కడ గూళ్లు ఏర్పాటు చేయడానికి అనుమతి వచ్చింది. గూళ్లను ఏర్పాటు చేయడంతో కొద్ది రోజుల్లోనే అక్కడకు చాలా పిచ్చుకలు వచ్చాయి’ అని సంబరంగా ఆ సంఘటనను గుర్తుచేసుకుంటారు రాకేష్. పిచ్చుకలను కాపాడాలనే అతని అంకితభావానికి లండన్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్ (2008) అంతర్జాతీయ గ్రీన్ ఆపిల్ అవార్డుతో సహా పలు ప్రశంసాపత్రాలను అందచేసింది. గూళ్లను చేత్తో తయారు చేసే అతి ఎక్కువ వర్క్‌షాప్‌లను నిర్వహించినందుకు ఈ ఏడాది లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్‌లో చేరారు రాకేష్ఖత్రీ. -
కనుమరుగవుతున్నాయి.. కాపాడుకుంటే మేలు
సాక్షి, కెరమెరి(ఆసిఫాబాద్): భూమిపై జీవించే హక్కు ప్రతి ప్రాణికి ఉంది. మానవ మనుగడకు జీవజాతుల అవసరం కీలకం. చీమ, పేడపురుగు, సీతాకోక చిలుక, నక్క, ఉడుము, కాకి, గబ్బిలం ఇలా ఎన్నో జీవులు ప్రత్యేకంగానో.. పరోక్షంగానో.. మానవ ప్రయోజనకారులు . మారుతన్న జీవన విధానంతో జీవ వైవిధ్యానికి కీడు కలిగిస్తోంది. కొన్ని జాతులు వేట గాళ్ల బారీన పడి కనుమరుగవుతుంటే... మరికొన్ని సహజంగా క్షీణదశకు చేరుకుంటున్నాయి. మితిమీరిన రసాయనాల వాడకం, ఆధునిక సమాచారల వ్యవస్థలతో కొన్ని జీవజాతులు కనుమరుగవుతున్నాయి. అందుకే అంతాకలిసి వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. మాయమవుతున్న ఉడుములు..! ఉడుములు అన్ని ప్రాంతాల్లోనూ సంచరిస్తుంటాయి. వీటిని శాస్త్రీయంగా వెరానస్ బెంగా లెన్సిస్ అంటారు. ఇవి సుమారు మూడున్నర కిలోల బరువు వరకు ఉంటాయి. భూమిలో బొరియాలు చేసి గుడ్లు పెట్టి వాటిని మట్టితో కప్పి వేయడం వీటి ప్రత్యేకత. ఇవి పంటలకు హానీ చేసే కీటకాలను ఆహారంగా తీసుకొని ప్రయోజనకారిగా ఉంటాయి. వీటి మాంసం నడుంనొప్పులను తగ్గిస్తుందనే ఓ నమ్మకం ప్రచారంలో ఉంది. దీంతో వేటగాళ్లు వీటికి ఉచ్చులు వేసి పట్టుకొని విక్రయిస్తుంటారు. తూనిగలు కనుమరుగు... గుండ్రటి తల.. పొడవాటి రెక్కలు.. తోక చిన్నరకం హెలికాప్టర్ ఉండే తూనిగలను చూస్తే అందరికీ ముచ్చటేస్తోంది. చిన్నప్పుడు ప్రతీ ఒక్కరూ వాటితో ఆడుకునే ఉంటారు. ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకున్న వెంటనే తూనిగలు గుంపులుగుంపులు చేరి గాల్లో ఎగురుతు కనిపిస్తాయి. నిజానికి ఇవి కీటకాలను తినే మాంసాహారులు వీటి జీవితంలో తక్కువ కాలం నీటిలో సయాడ్ అనే లార్వా రూపంలో ఉంటూ దోమగుడ్లను ఆహారంగా తీసుకొని దోమల నివారణకు ఉపయోగపడుతుంటాయి. ఫైడా తూనిగలు దోమలను, పంటలకు నష్టం కలిగించే శుత్రు పురుగులను తిని రైతులకు మేలు చేస్తాయి. రసాయాన ఎరువులు, పురుగు మందులు నీటి కాలుష్యంతో ప్రస్తుతం తూనిగలు కనుమరుగవుతున్నాయి. వాన పాముల.. భూమి పుత్రులు..! వానపాములు భూమిని సారవంతం చేస్తాయి. కొన్ని వేల సంఖ్యలో భూమి పై పొరల్లో ఉండి కంపోస్టును తయారు చేస్తాయి. ఇవి నేలలో బొరియాలు చేయడంతో నీటిని నిల్వ చేసుకునే శక్తి పెరుగుతోంది. వానపాము విషర్జకంలో నత్రజని సహజంగా ఉంటుంది. ప్రస్తుతం రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకం పెరిగి నేలలో వానపాములు చనిపోతున్నాయి. దీంతో నేలకు అవసరమయ్యే జీవద్రవం అందక గట్టిపడి పోతున్నాయి. కూలుతున్న పిచ్చుక గూడు.. ! గూడు కట్టుకోవడం అన్ని పక్షులది ఒక తీరైతే పిచ్చుకల గూడుది మరో ప్రత్యేకత. ఇవి ఇంజనీరింగ్ ప్రతిభ మాదరిగా.. ఈత, తుమ్మ, తాటి చెట్ల కొమ్మలకు చివరన గూల్లు కట్టుకుంటాయి. ఒకటే పొడవు ఉన్న గడ్డి పోచలను ముక్కున కరచి తెచ్చుకుని అత్యంత నైపుణ్యంతో గూళ్లను కట్టి ఆడపక్షిని ఆకర్శిస్తాయి. గూడు లోపల వెచ్చగా ఉండడంతో వాన వచ్చిన తడవక పోవడం దీని ప్రత్యేకత. ఇవి కూడ కీటకాలను అదుపులో ఉంచుతాయి. గుంట నక్క జిత్తులేవి..? ఇప్పటికే మన పరిసరాల్లో తోడేలు కనిపించడం లేదు. ఇక జిత్తులతో అందరిని అబ్బుర పరిచే టక్కులమారి గుంటనక్క ఆపదలో పడిపోయింది. వీటిని శాస్త్రియంగా ఉల్ప్స్ బెంగాలెన్సిస్ అంటారు. ఇవి భూమి లోపల రెండు నుంచి మూడు భూమి లోతులో గుంటలు చేసుకుని జీవిస్తాయి. చిన్న జంతువులు ఎలుకలు, పందికొక్కులు, పీతలు, కీటకాలను ఆహారంగా తీసుకొని వ్యవసాయ రంగానికి సహాకరిస్తాయి. రెల్లు దుబ్బలు వంటి వాటి ఆవాసాలను నాశనం చేయడం, పురుగుల మందుల ప్రభావంతో ఈ జాతి అంతరించి పోతుంది. -
దైవ సంకల్పంలోని ఆంతర్యమే వేరు
ఒక పిచ్చుక తల దాచుకోవడం కోసం ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంది. ఎంతో శ్రమకోర్చి ఒక్కొక్క పుల్లనూ నోట కరచుకొచ్చి చక్కని గూడు నిర్మించుకుంది. హాయిగా అందులో నివసించ సాగింది. కొన్నాళ్ళు అలా సంతోషంగా గడిచిపోయింది. కాని ఒక రోజు అకస్మాత్తుగా గాలి దుమారం వచ్చి గూడు చెదిరిపోయింది. పిచ్చుక బజారుపాలయింది. అనేక రోజులపాటు, ఎంతగానో కష్టపడి, ఇష్టంగా, అందంగా కట్టుకున్న తన కలలసౌధం చూస్తూ చూస్తూనే క్షణాల్లో చెల్లా చెదురయ్యేసరికి పిచ్చుకకు దుఃఖం పొంగుకొచ్చింది.తన రెక్కల కష్టమంతా తుఫాను పాలవడంతోఎంతగానో దుఖిస్తూ..‘దేవా..!ఎంతో కష్టపడి ఒక్కొక్క పుల్లనూ సమీకరించి చిన్నఇల్లు కట్టుకుంటే, నువ్వు తుఫానును పంపించి నా ఇల్లు కూల్చేశావే.. నేను మళ్ళీ గూడు కట్టుకోవాలంటే ఎంత కష్టమో గదా.. నన్నెందుకు ఇలా చేశావు.. నీకిది న్యాయమా.?’అంటూ దైవంతో మొరపెట్టుకుంది. అప్పుడు దైవం ఇలా అన్నాడు.‘ఓసి పిచ్చిమొఖమా..! నీ ప్రాణాలు రక్షించడానికే అలా చేయవలసి వచ్చింది. నువ్వు గూడు కట్టుకొని హాయిగా పడుకున్నావు.. కాని ఒక పాము నిన్ను కాటేసి, నీ పిల్లల్ని తినెయ్యడానికి నీ గూటివైపు వస్తుండడంతో, నేను చిన్నపాటి గాలిని పంపించాను. దాంతో నీ గూడు చెదిరి నువ్వు ఎగిరిపొయ్యావు. నీ ప్రాణాలు రక్షించబడ్డాయి. లేకపోతే పాముకు ఫలహారమయ్యేదానివి.’ అన్నాడు దైవం.పిచ్చుకకు అసలు విషయం అర్థమై వినమ్రతతో దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంది.అల్లాహ్ కరుణామయుడు. ఆయన కారుణ్యం భూమ్యాకాశాలను పరివేష్టించి ఉంది. ఒక్కొక్కసారి ఆయన మనకేదో నష్టం చేశాడు అనిపిస్తుంది. కాని అందులోనే మన మేలుందన్న విషయం మనకు తెలియదు. మనకు ఎందులో మేలుందో, ఎందులో కీడుందో మనల్ని సృష్టించిన వాడికే బాగా తెలుసు. కనుక లాభం కలిగినా, నష్టం కలిగినా దైవం తరఫునే అని, అందులోనే మన శ్రేయం దాగుందని గ్రహించాలి. ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
మా ఇంటికి రండర్రా
రోజూ రండర్రా, నేను సాయంత్రాలు పార్కుకీ వస్తున్నానని మా ఇంటికి రాకుండా ఉండకండి. మీ ఇంటిల్లిపాదినీ తీసుకురండి, మీ ఫ్రెండ్స్‌కి కూడా ఆంటీ పిలుస్తున్నారని మీ పిచ్చుక్ పిచ్చుక్ భాషలో చెప్పండి, కాసేపు కబుర్లాడుకుందాం. ఱైఱైఱై మంటూ రెండు మినీ ట్రక్కులు నల్లటి పెట్రోలు బుసలొదులుకుంటూ పక్కన్నుంచి శరవేగంతో వెళ్లిపోయాయి. ఏంటో అంత రాచకార్యం వీళ్లకి? పవిటకొంగుని ముక్కుకడ్డెట్టుకుని, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నెమ్మదిగా ఫుట్‌పాత్ ఎక్కాను. పక్కనున్న పార్కులో కాసేపు తాజా గాలి పీల్చుకొద్దామని వెళ్లడమంటే రెండు మెయిన్‌రోడ్లు క్రాస్ చెయ్యాల్సిన పని. రెండుసార్లు పద్మవ్యూహంలో ఇరుక్కోవడమే! రోజుకో గంట నడిచి గూడు జాగ్రత్తగా చేరానంటే ఆ రోజు పల్నాటి యుద్ధం గెలిచినంత సంబరం! రానున్న కాలంలో ఈ ఫుట్‌పాత్ కాన్సెప్ట్ కూడా ఉండదేమో అని భయం వేస్తుంది. పక్క సందులోకెళ్లాలన్నా, రోడ్డు దాటాలన్నా ఆటోలో వెళ్లే పరిస్థితి వస్తుందేమో!‘‘నడవండి ఆంటీ, మీరు డెయిలీ ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే వాకింగు మానకండి. ఏభై ఐదు కిలోలు ఉండాల్సిన వాళ్లు ఎనభై ఐదు కిలోల పైన ఉన్నారు. కనీసం ముప్ఫై కిలోలైనా తగ్గకపోతే కాళ్ల నొప్పులూ, కీళ్ల నొప్పులూ అని మున్ముందు చాలా బాధపడ్తారు. ‘ఒబేసిటీ ఈస్ ఏన్ ఓపెన్ ఇన్విటేషన్ ఫర్ మెనీ డిసీసెస్’ అని ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదా!‘ అన్నాడు కిరీట్.‘‘ఓ ఆరు నెలలు డైట్ కంట్రోల్ చేసి, ఓ గంట బ్రిస్క్ వాక్ చేస్తే దీపికా పడుకోన్ లానో, రకుల్ ప్రీత్ లానో అయిపోతారని స్మైల్ చేస్తూ చెప్పాడు. కిరీట్ ఇప్పుడు ‘ఎంబీబిఎస్’ మూడో సం.లో ఉన్నాడు. చిన్నప్పుడు నన్ను ‘లావాంటీ, లావాంటీ‘ అని పిలిచేవాడు. వీడికి వేళాకోళం ఎక్కువైందని బాగా మందలించేదాన్ని. ఫాక్టే కదా అని అప్పుడప్పుడు ఊరుకునేదాన్ని! వాడి ప్రాణానికి నేనేనుగులా కనిపించేదాన్నో ఏమో! వాళ్ల అమ్మ స్మిత సన్నగా చిన్నగా వెల్లుల్లి పాయలా ఉండేదప్పుడు. నన్ను వదినా, వదినా అంటూ ఇప్పటికీ ఎంతో ఆప్యాయంగా పలుకరిస్తుంది. ఎంతో కాలంనుంచీ ఇరుగుపొరుగిళ్లల్లో ఉంటున్నాం. అవసరానికి చేదోడు వాదోడుగా ఉంటుంది స్మిత.కిరీట్ వాళ్ల నాన్న గారికి ఈ మధ్యనే నీ రీప్లేస్మైంట్ సర్జరీ అయ్యింది. పాపం వాడు నేనిబ్బంది పడకూడదనే సదుద్దేశంతో జాగ్రత్త పడమని చెబుతున్నాడు. ఓవర్ వెయిటు ప్రాణాల మీదకొస్తోంది. ఎక్సర్సైజ్, వాకింగ్, డైటింగ్ తప్ప ఇంకో ఆప్షనేముందీ? ఎక్కడికెళ్లినా లావుగా ఉన్నవాళ్లు సెంటర్ ఆఫ్ అట్రాక్షనో లేక డిస్ట్రాక్షనో అవుతారు. పీత కష్టాలు పీతవన్నట్టు వాళ్ల బాధలు వీళ్లవి. నించుంటే ఆయాసం, కూర్చుంటే ఆయాసం. ఓ మంచి డ్రెస్ వేసుకుందామంటే సైజులు రావు. విసుగొచ్చేస్తుంది. నాలో నేను మాట్లాడుకుంటూ ప్రశాంతంగా ఉన్న పార్కులోని సిమెంటు బెంచీ మీద కాసేపు రెస్టు తీసుకుని, ఆ బూట్లవతల పెట్టి, ఓ పదిహేను నిమిషాలు ప్రాణాయామం చేసి, ఆ ఆకుపచ్చని చల్లటి మఖ్మల్ లాంటి గడ్డి మీద ఓ అరగంట నడిచి ఏదో పరధ్యానంలోకి వెళ్లిపోతున్నప్పుడు ఓ చిట్టి పిట్ట చిట్టి ముక్కుతో నా పాదం పొడిచింది. ఏదో తీక్షణంగా గింజలు కామోసు వెత్తుక్కుంటోంది. ఎంత నాజూకుగా ఉందో! దీనికి డైటింగు, వాకింగు, లివింగు అన్నీ ఇక్కడే! కాలుష్యంతో విషపూరితమైన మన పరిసరాల మధ్య ఈ చిన్నారి పిచ్చుకలు గూళ్లెక్కడ కట్టుకుంటున్నాయో? పసిగుడ్లనెలా వాటి పొదుగుల్లో పెట్టుకుని కాపాడుకుంటున్నాయో? వాటి కన్న బిడ్డల ఆకలి ఎలా తీరుస్తున్నాయో? పిచ్చితల్లుల ప్రేమ ఏమని వర్ణించగలం? మనలా.. నరాల నొణికించే చలిని కాచుకోవడానికి హీటర్లా? వానల్లో పొడిగా ఉండేందుకు గొడుగులా? సూరీడు సెగలనడ్డుకుందుకు ఏసీలా? ఈ మాత్రం పార్కులింకా ఉన్నాయి కాబట్టి ఈ జీవరాశులకు నిలువనీడ ఉంటోంది. చెట్టుని, పుట్టని నమ్ముకున్న చిట్టి పొట్టి పిట్టలు, పావురాళ్లు, రామచిలుకలు, చిన్ని చీమలు, కాకమ్మలు, మైనాలు ఎన్నెన్నో రకాల పక్షులు. పొట్టకోసం పుట్టెడు గింజల కోసం ఎన్నెన్ని పాట్లో, ఎన్నెన్ని అగచాట్లో! కొద్దిపాటి జీవితంలో ఎంత సుఖదుఖ్కాలెదుర్కుంటాయో? మనలానే అవీ వాటి కష్టసుఖాలను ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటాయా! ఈ మూగజీవులు శాంతంగా ఎంత ప్రసవ వేదన భరిస్తాయో. ఈ చిన్ని ప్రపంచంలో మన నేస్తం కోసం మన ఇళ్ల లోగిళ్లలోకి వచ్చి వాలే ఈ బుజ్జి సందెళ్లకు ఆహ్వానం పలకాలని మా వాళ్లందరికీ చెబుతూనే ఉంటాను.పొట్టి ముక్కుతో, పొడుగు తోకతో, చిన్ని బొజ్జతో, హరివిల్లు రంగులు రంగరించుకొని వినువీధులలోని నీలిమేఘాలలో యవ్వనం, కారుమేఘాలలో ముసలితనం చవి చూచి నేలరాలిపోయే ఈ నేస్తాలు మనముందుకొచ్చిన క్షణం మనకెంత సంతోషాన్ని ఇస్తాయో! ఏదో నాలో నేను ఆ పిట్టలతో సంభాషించడం అలవాటైంది. కాసేపు వాటితో కబుర్లాడుతూ, హాయిగా ఊపిరితిత్తుల నిండా ఫ్రెష్‌గా గాలి పీల్చుకుంటూ, అవీ మనతోపాటు ఈ భూమ్మీద జీవనం సాగిస్తున్నందుకు ఎంతగానో సంతోషపడుతుంటాను. రోజూ మా ఇంటికొచ్చే పక్షులని చూసి ‘‘ఎందుకర్రా, చిన్నారి పిచ్చుకలూ? రోజూ నా బాల్కనీలో వాలతారు? మీకూ నాకూ ఏదో జన్మలో సంబంధమున్నట్టు పిచ్చాపాటీ పెడ్తారు? పర్లేదులే, మీకు నాలుగ్గింజలు నేను ప్రేమతో పెడతాను, రోజూ రండర్రా, నేను సాయంత్రాలు పార్కుకీ వస్తున్నానని మా ఇంటికి రాకుండా ఉండకండి. మీ ఇంటిల్లిపాదినీ తీసుకురండి, మీ ఫ్రెండ్స్‌కి కూడా ఆంటీ పిలుస్తున్నారని మీ పిచ్చుక్ పిచ్చుక్ భాషలో చెప్పండి, కాసేపు కబుర్లాడుకుందాం. అఫ్కోర్స్ నా ఇంటికన్నా మీ ఇల్లే మేలు! కానీ మా ఇంటికి మీరొస్తే నాకెంతో ఉల్లాసంగా ఉంటుంది. మీకు రోడ్లు క్రాస్ చేసే పనీలేదు, ఫుట్‌పాత్‌ల గొడవ అసలే లేదు. చుట్టంచూపుగా అయినా రోజూరండి. మీరాక కోసం ఎదురుచూస్తూ వుంటాను. – సత్యశ్రీ నండూరి ►‘‘ఓ ఆరు నెలలు డైట్ కంట్రోల్ చేసి, ఓ గంట బ్రిస్క్ వాక్ చేస్తే దీపికా పడుకోన్ లానో, రకుల్ ప్రీత్ లానో అయిపోతారని స్మైల్ చేస్తూ చెప్పాడు కిరీట్. ఇప్పుడు ‘ఎంబీబిఎస్’ మూడో సం.లో ఉన్నాడు. చిన్నప్పుడు నన్ను ‘లావాంటీ, లావాంటీ‘ అని పిలిచేవాడు. -
పిచ్చుకపై ప్రేమాస్త్రం
‘పిచ్చుకపై బ్రహ్మాస్త్రం’ అనే మాట పురాణాల్లో ఉంది. దాన్ని మనం నిజం చేసేశాం! పిచ్చుకపై ఇంత ఇసుక, కంకర, సిమెంట్ వేస్తున్నాం. మన గూడు కోసం పిచ్చుక గూళ్లనుకొట్టేస్తున్నాం. పిచ్చుకపై మనం వేస్తున్న ఈ అమానుషాస్త్రాన్ని, పిచ్చుక జాతిపై తనకున్నప్రేమ అనే అస్త్రంతో తిప్పికొడుతున్నారు మహేష్ అనే పక్షి ప్రేమికుడు. ఊర పిచ్చుక.. ఒకప్పుడు మన ఆవాసాలలో కిలకిలరావాలతో తిరుగాడిన మానవ స్నేహజీవి. మన లోగిళ్లలో.. చూరులలో.. గూళ్లు కట్టుకుని సంతతిని వృద్ధి చేసుకుంటూ ఉండేవి. మానవాళికి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించేవి. అలాంటి పిచ్చుక ఇప్పుడు చాలా చోట్ల అదృశ్యమై.. దేశంలో అంతరించే జాతుల జాబితాలో చేరింది. ఐయూసీఎన్(ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) వారు రెడ్ లిస్ట్‌లో చేర్చారంటేనే వాటి మనుగడ ఏ స్థాయికి పడిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన వీరా మహేష్ కృత్రిమ ఆవాసాల ద్వారా పిచ్చుకల ‘వృద్ధి సంరక్షణ’లపై 2014 నుంచి పరిశోధన చేస్తున్నారు. మార్చి 20 ‘వరల్డ్ స్పారో డే’ సందర్భంగా పిచ్చుకల ఆవాసాల ఏర్పాటు అవసరం గురించి మహేష్ ‘ఫ్యామిలీ’తో మాట్లాడారు. పిచ్చుకకు ప్లేస్ ముఖ్యం పదేళ్ల క్రితం 2009లో కొత్తగా నిర్మించిన మా ఇంటికి ఒక పిచ్చుకల జంట వచ్చింది. వాటి కోసం ఒక అట్టపెట్టెతో చేసిన గూడును స్లాబుకు దగ్గరగా అమర్చాను. ఏడాది తరువాత ఒక సాయంత్రం తల్లి పిచ్చుక పిల్లలకు ఆహారాన్ని అందించడం గమనించాను! పిచ్చుకలు గూడు బయటికి వెళ్లిన తరువాత పరిశీలిస్తే ఆ గూడులోనే ఆరు గూళ్లు ఉన్నాయి. ఒక్కొక్క గూటినుంచి కనీసం రెండు పిల్లలు వచ్చినా సంవత్సర కాలంలో పన్నెండు పిల్లలు వస్తాయి. ఇలా ఆలోచిస్తే పిచ్చుకలు గూళ్లు నిర్మించుకోవడానికి స్థలం ఎంతో అవసరం అని అర్ధమైంది. ఈ ఆలోచనతోనే నా ప్రయాణాన్ని ప్రారంభించాను. 2012లో చెక్కలతో గూళ్లను తయారుచేసి మా ప్రాంతంలో స్థానికుల సహకారంతో వాళ్ల వాళ్ల ఇళ్ల వద్ద ఏర్పాటు చేశాను. క్రమంగా జంగారెడ్డిగూడెం పట్టణం చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించాను. ప్రస్తుతం పట్టణంలో 400 వరకు కృత్రిమ గూళ్లను ఏర్పాటు చేయగలిగాను. మొదటగా వివిధ ఆకృతులలో చెక్క గూళ్లను నిర్మించి పెట్టాను. వాటిల్లో ప్రధానంగా పిచ్చుకలు ఆవాసం పొందిన గూటిని ప్రామాణికంగా తీసుకున్నాను. ఈ ప్రామాణిక గూళ్లకు పిచ్చుకలు త్వరగా ఆకర్షితమై వాటిలోకి చేరాయి. ఈ గూటిలో కాకులకు పిచ్చుకల పిల్లలు అందవు. వివిధ జాతుల చేరికకు వీలు కలగదు. ఒకసారి చిలుకలు, గోరింకలు లోపలికి చేరేందుకు విఫలయత్నం చేయడం చూశాను. ఇక ఈ గూళ్లలో పిచ్చుకలు వాటి పిల్లలకు ఆహారం అందించడం తేలిక. పిచ్చుకల వృద్ధికి అదో ప్లస్ పాయింట్. దాదాపు గూళ్లన్నీ నిండాయి! గూళ్లను ఏర్పాటు చేసిన తరువాత ప్రతీ సంవత్సరం జనవరి చివరి వారంలో ప్రతి గూడును పరిశీలిస్తూ సర్వే చేస్తున్నాను. గూళ్లకు పిచ్చుకలు చేరాయా లేదా, వాటి రాకపోకలు, సంతాన వృద్ధి, ఇతర పక్షుల వల్ల వాటికి కలిగే ఇబ్బందులు.. తదితర సమాచారాన్ని వాటిని ఏర్పాటు చేసిన వారి నుంచి తెలుసుకుంటాను. అలా 2019 జనవరి వరకు 413 గూళ్లను ఏర్పాటు చేశాను. వీటిలో జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏర్పాటు చేసిన గూళ్లు 340 కాగా, పిచ్చుకలు ఆవాసాలకు వినియోగించిన గూళ్లు 329. సంవత్సరానికి ఈ గూళ్ల కారణంగా సరాసరిన 2 నుంచి 3 పిల్లలతో పిచ్చుక సంతానం వృద్ధి చెందినట్లు గుర్తించాను’’ అని చెప్పారు మహేష్.మహేష్ ప్రయత్నం కారణంగా గతంలో పోల్చితే ప్రస్తుతం జంగారెడ్డిగూడెంలోని ఉప్పలమెట్ట, హైస్కూల్ ప్రాంతం, అయ్యన్నకాలనీ, రాజులకాలనీలలో పిచ్చుక సంఖ్యలో వృద్ధి కనిపిస్తోంది. ఉప్పలమెట్ట ప్రాంతంలో పదుల సంఖ్యలో ఉండే పిచ్చుకలు నేడు సుమారు 300 వరకు ఉన్నాయి. ‘‘ప్రకృతి సమతౌల్యానికి జీవ వైవిధ్యం తప్పనిసరి. మానవ మనుగడలో భాగమైన పిచ్చుకను సంరక్షించుకుంటే పంటలకు పురుగు మందుల అవసరాలే మనకు ఉండవు’’ అంటారు మహేష్. – డి.వి.భాస్కరరావు, సాక్షి, జంగారెడ్డిగూడెం పక్షి ప్రేమికుడు.. పరిశోధకుడు వీరా మహేష్ ఎమ్మెస్సీ జంతుశాస్త్రం చదివారు. ప్రస్తుతం కృత్రిమ ఆవాసాల ద్వారా పిచ్చుకలపై పీహెచ్డీ చేస్తున్నారు. బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీలో పరిశోధకునిగా కూడా మహేష్‌కు అనుభవం ఉంది. పక్షి సమూహాలపై వివిధ ప్రాంతాల్లో పరిశోధన చేశారు. కలివి కోడిపై పరిశోధన, పక్షుల వలసలపై పరిశోధన చేశారు. పిచ్చుకలు, ఆవాసాలు తదితర విషయాలపై మహేష్ రాసిన పరిశోధనాత్మక పత్ర వ్యాస వివరణ ఎన్టీఎస్సీ 2018లో జాతీయ స్థాయిలో ఎంపికైంది. ఆవాసాలు లేకనే అదృశ్యం ఆధునిక ఒరవడిలో పట్టణాల నుంచి గ్రామాల వరకు శాశ్వత గృహాలు కాంక్రీట్ శ్లాబులతో నిర్మితమవుతున్నందున పిచ్చుక జాతికి గూడు నిర్మించుకోవడానికి అనుకూలమైన తాటాకిళ్లు, పెంకుటిళ్లు కనుమరుగువుతున్నాయి. దాంతో గూళ్లు పెట్టుకునే సదుపాయం తగ్గిపోయింది. సంతానోత్పత్తికి అవకాశం లేకుండా పోయింది. పిచ్చుక జాతిని నిలబెట్టడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం కృత్రిమ ఆవాసాలు ఏర్పాటు చేయడం. సమస్యను ముందుగానే గుర్తించి మన ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటే, అవి గూడును కట్టుకోగలుగుతాయి. దీని వల్ల పిచ్చుక జాతి వృద్ధి చెందే అవకాశాలు మెరుగవుతాయి. -
కొంగలు, పిచ్చుకలు ఏ జాతయ్యా?
ఆ చీకట్లో గొడ్లసావిడి దగ్గరకు వచ్చి పెద్ద పెద్దగా అరుస్తున్నాడు పెద్దయ్య.‘‘రేయ్...గొడ్లకు నీళ్లు పెట్టారా లేదా?’’ఎటు నుంచి సమాధానం వినిపించడం లేదు.కాస్త ముందుకు వెళ్లి అక్కడున్న వ్యక్తిని చూసి...‘‘అదేమిటి ఉలుకూపలుకూ లేకుండా నిల్చున్నావు. ఎవరో అనుకుని నేను దడుచుకుచచ్చాను’’ అన్నాడు పెద్దయ్య.ఎల్లయ్య ముఖంలో విషాదం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.‘‘ఎందుకురా అలా ఉన్నావు?’’ అని అడగక ముందే... ‘‘నా పిల్ల కనబడటం లేదయ్యా’’ అన్నాడు. పిల్ల అంటే ఆయన కూతురు.‘‘పొద్దున్నే లేచి పొరుగూరి సంబంధం చూస్తానన్నావు!’’ అడిగాడు పెద్దాయన.‘‘అది ఉన్న ఊళ్లోనే మొగుడ్ని వెదుక్కుంది సామి’’ బాధగా అన్నాడు ఎల్లయ్య.‘‘ఉన్న ఊర్లోనే మొగుడ్ని వెదుక్కుందా? దాన్ని లేవదీసుకుపోయింది ఎవడో చెప్పు చెట్టుకు కట్టేసి చెప్పుతో కొడతాను’’ కోపంగా అన్నాడు పెద్దాయన.అతడు ఎవరో చెప్పకుండా ఎల్లయ్య మౌనముద్ర దాల్చాడు. ఆ మౌనంలో ఏదో భయం ఉంది.‘‘చెప్పరా?’’ అని గద్దించాడు పెద్దాయన.‘‘సామి! నా నోటి నుంచి ఆ మాట ఎలా చెప్పాలి?’’ అంటూనే ‘‘మీ మేనల్లుడు సిట్టయ్యండి. వాళ్లిద్దరూ కలిసి తిరగడం ఊరందరికీ తెలుసు. నా బిడ్డ వట్టి పిచ్చిదయ్యా. దానికి అన్నెంపున్నెం తెలియదు. అది పారిపోయి నెలతప్పి ఇంటికొస్తే ....’’ ఏడుపు ఆపుకుంటూ మనసులోని బాధని వెళ్లగక్కాడు ఎల్లయ్య.పెద్దయ్య కళ్లలో ఆశ్చర్యం.‘‘చొక్కాయికి బొత్తాలు కూడా పెట్టుకోలేని వెధవ అంత పెద్దవాడయ్యాడా. ఎల్లయ్యా...అలాంటిది ఏం జరగదు. నీ బిడ్డ భద్రంగా ఇల్లు చేరుతుంది పో’’ అంటూ పారిపోయిన జంటను వెదకడానికి బయలుదేరాడు పెద్దాయన. ‘‘ఒరేయ్ పుల్లయ్యా...’’ ‘‘ఏంటయ్యా ఇలా వచ్చారు?’’ ‘‘ఎల్లయ్య కూతురు కనిపించడం లేదు...’’ ‘‘దానికి మీరెందుకయ్యా నేను వెదుకుతాను’’పుల్లయ్య మాటతో సమాధానపడని పెద్దయ్య శరభయ్య ఇంటికి వెళ్లి...‘‘అరే శరభయ్యా...నీ స్నేహితుడు చిట్టయ్య ఆ ఎల్లయ్య కూతురిని ఎక్కడికి తీసుకెళ్లాడో చెప్పు’’ అని గద్దించాడు.‘‘నాకు తెలియదు’’ అని బుకాయించబోయాడు శరభయ్య.‘‘నరికిపోగులు పెడతాను’’ అని పెద్దాయన అరిచేసరికి శరభయ్య వణుకుతూ...‘‘యేటి పక్కకు తీసుకెళ్లాడయ్యా...అంతకుమించి నాకు ఏమీ తెలియదు’’ అని చెప్పాడు.‘‘అక్కడ లేకపోతే నీ సంగతి చెబుతా’’ అని బుసలు కొడుతూ యేటి దగ్గరికి బయలుదేరాడు పెద్దాయన.అక్కడేవో శబ్దాలు వినిపిస్తున్నాయి.‘‘చిట్టెయ్య...మీ మామ వస్తున్నాడు. దోనెలో దాక్కోండి...’’ అంటుంది గౌరి.పెద్దాయన దగ్గరకు రాగానే...‘‘ఈ యేళ ఇక్కడున్నరేమిటీ?’’ అడిగింది గౌరి.‘‘నేను అదే అడుగుతున్నాను. ఈ యేళ నీకు ఇక్కడేం పని?’’ గట్టిగా అడిగాడు పెద్దాయన.గౌరీ ఏదో చెప్పబోయిందిగానీ...అది అక్షరాలా అబద్ధమని తెలిసిపోతూనే ఉంది.గౌరి చెంప చెళ్లుమనిపించి....‘‘ఎవర్నే దోనెలో సాగనంపుతున్నావు? గుట్టుగా ఏరు దాటించి కాపురం చేయించడానికి అక్కడ ఏమైనా మేడ కట్టించావా!’’ అని గర్జించాడు పెద్దాయన.‘‘నన్ను ఏమైనా చేసుకోండి. నాకు బాధ లేదు. నన్ను కొట్టు చంపు...కానీ వాళ్లిద్దరినీ మొగుడు పెళ్లాలుగా అంగీకరిస్తేనే ఒడ్డుకు వస్తారు. లేకపోతే యేట్లో కొట్టుకుపోనీ.... వదలవయ్యా తాడు’’ అన్నది గౌరి.గౌరి మాటలు పట్టించుకోకుండా దోనె తాడును ఒడ్డు వైపు బలంగా లాగుతున్నాడు పెద్దాయన.అయినా గౌరి నోరు ఆగలేదు.‘‘వయసులో ఉన్నవాడు తనకు ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకుంటే ఏమిటి తప్పు? వరుసైందని, డబ్బు చాలా ఉందని ఎవరినో ఒకరిని చేసుకుని బతికినంత కాలం వాన్ని ఏడ్వమంటావా.’’ అన్నది.గౌరి వైపు కోపంగా చూశాడు పెద్దాయన.‘‘నీకెందుకయ్యా ఉలుకు’’ అని గట్టిగా అంది గౌరి. పెద్దాయన కోపం నషాళానికి ఎక్కింది.‘‘ఏయ్ నోర్మోయ్...కడుపు చేత్తో పట్టుకుని తిరిగేవాళ్లకు కుటుంబ గౌరవం గురించి ఏం తెలుసే..’’ అని అరిచాడు. పెద్దయ్య మాటలకు గౌరి నొచ్చుకుంది.‘‘అవునయ్యా...మేము బతుకుదెరువు కోసం వొచ్చినోళ్లమే. పూరి గుడిసెలో పడుకున్నా, ఏటి ఒడ్డున పడుకున్నా పడుకోగానే నిద్ర పట్టే జాతయ్యా మాది. అంబలి తాగినా, జొన్న కూడు తిన్నా, మట్టి తిన్నా సరే...మళ్లీ ఆకలేసే జాతయ్యా మాది.కొంగలు, పిచ్చుకలు ఏ జాతయ్యా?అవి సంతోషంగా బతకడం లేదా!ఇంకా నయం రామచిలక,ఊరపిచ్చుక,గూడకొంగ అని జాతులు విడదీయలేదు. నీ కోపం కంటే ఏటి కోపం ఎక్కువ. తాడు వదిలేయ్’’ ఆవేశంగా అంది.‘ఏ వేదంబు పఠించె లూత?’ అన్నట్లు గౌరి ఏ వేదాలూ చదవలేదు. ఏ పుస్తకాలూ చదవలేదు. అక్షరజ్ఞానం లేని అమ్మాయి ఎంత లోతుగా మాట్లాడింది!యువజంట ఒడ్డుకు వచ్చి పెద్దాయన కాళ్ల మీద పడ్డారు. కోపంతో కత్తి పైకి లేపాడు పెద్దాయన. కానీ అప్పుడు ఆయన అంతరాత్మ చెవిలో ఇలాగొణికింది:‘‘ఏమాయ్య...నువ్వు నీ పెళ్లాంతో ఎలాగూ సుఖంగా లేవు. వాళ్లనైనా సుఖంగా కాపురం చేసుకోనివ్వు’’అంతే.. పెద్దయ్య బెట్టు చెదిరింది. అప్పుడే సన్నగా వర్షపు చినుకులు మొదలయ్యాయి.ఆచిన్నిచినుకుల్లో పెద్దాయన కోపం చల్లారి పోయింది. అతని పెదాలపై సన్నని నవ్వు. ఆ నవ్వు ఎన్నో చెబుతున్నట్టుగా ఉంది.‘చిన్నదానివైనా పెద్ద మాటలు చెప్పి చీకట్లో ఉన్న నన్ను వెలుగులోకి తీసుకువచ్చావు’అప్పటి వరకు మంటలా చెలరేగిపోయిన పెద్దాయన మంచులా చల్లబడటంతో గౌరి కళ్లు చెమర్చాయి.‘‘నువ్వెంత కటువుగా మాట్లాడినా నీది చిన్నపిల్లాడి మనసు. రెండు మేకకూనలు వీడిపోతేనే బాధపడతావు...సిన్న పిల్లలు విడిపోతే ఊరుకుంటావా! ప్రాణాలు తీసే యముడి దగ్గర పాశం ఉంటుంది. శివుడి దగ్గర పాశం ఉంటుంది. నువ్వు శివుడివయ్యా...’’ పెద్దాయనను ఆకాశానికెత్తుతూఅన్నది గౌరి సంతోషంగా. -
పిచ్చుకపై బ్రహ్మాస్త్రం
రాయవరం (మండపేట): పిట్ట కొంచెం..కూత ఘనం అన్నట్టు పిడికెడంత కూడా లేని పిట్ట నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయనడంలో సందేహం లేదు. తను నివసించేందుకు గూడు నిర్మించుకోవడంలో ఓ ఇంజినీరుతో పాటు గొప్ప శ్రామికుడు కనిపిస్తాడు. పిల్లల సంరక్షణలో మాటలకందని మాతృత్వం కనిపిస్తోంది. కిచకిచమనే వాటి రాగాలు ఎంతో వినసొంపుగా ఉంటాయి. ఏక దాంపత్య వ్రతం ఆచరించడంలో పిచ్చుకలే ఆదర్శం. అధిక సంతానోత్పత్తి సామర్థ్యం వీటి సొంతం. ఎంతో విశిష్టత కలిగిన పిచ్చుక జాతి అంతరించే ప్రమాదం పొంచి ఉంది. కారణాలనేకం.. ‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం’ అనే సామెత నిజంగా వాటి పాలిట అక్షరసత్యమవుతోందని పలువురు పర్యావరణ ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు. పెరిగిపోతున్న ఇంధన కాలుష్యం, గృహ నిర్మాణాల్లో చోటు చేసుకున్న అధునాతన మార్పులు, వృక్ష సంపద తగ్గిపోవడం, వ్యవసాయంలో విరివిగా రసాయన మందుల వినియోగం, గ్రామాల్లో, పట్టణాల్లో సెల్‌టవర్లు ఏర్పాటు చేయడం తదితర కారణాలతో పిచ్చుకలు అంతరించిపోతున్నాయి. రైతులు తాము పండించిన తొలి ధాన్యాన్ని పిచ్చుకలకు పెడితే శుభసూచకమని భావించేవారు. ఇవి ఎక్కువుగా పంట పొలాల్లో చిక్కుడు, టమోట ఇతర పంటలపై ఉండే పేనుబంక పురుగులను తినడానికి ఇష్టపడతాయి. రేడియేషన్ వల్ల వాటి మనుగడకు ముప్పు వాటిల్లింది. ప్రస్తుతం 80 శాతం వరకు పిచ్చుకలు అంతరించి పోయినట్టు పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. పూర్వం గోనె సంచుల్లో ధాన్యం నిల్వ చేయగా, పిచ్చుకలు వాటిని పొడుచుకుని తినేవి. రైతులు కూడా పిచ్చుకల కోసం వరిని కుచ్చులుగా కట్టి ఇంటి చూరులకు వేలాడదీసేవారు. ఇప్పుడు గొడౌన్లు, ప్లాస్టిక్ కంటైనర్లలో ధాన్యం నిల్వలు చేయడంతో వాటికి తిండి గింజలు దొరకడం లేదు. వ్యవసాయంలో వాడుతున్న రసాయన మందుల వల్ల వాటి నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతోంది. పలు రకాల కారణాలతో 26 రకాలకు పైగా ఉండే పిచ్చుకల్లో ఇప్పుడు కేవలం ఐదారు రకాలు మాత్రమే మనుగడ సాగిస్తున్నట్టు జంతుప్రేమికులు చెబుతున్నారు. దాంపత్య జీవితానికి విలువ.. పిచ్చుకలు దాంపత్య జీవితానికి చాలా విలువనిస్తాయి. 85 శాతం పిచ్చుకలు బతికినంత కాలం ఒకే ఆడపిచ్చుకతో కలిసి ఉంటాయి. దీన్ని సైన్స్ పరంగా మోనోగాసన్ అంటారని పక్షి శాస్త్ర నిపుణులు తెలిపారు. కేవలం 15శాతం పిచ్చుకలు మాత్రమే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆడ పిచ్చుకలతో కలిసి జీవిస్తాయి. సృష్టిలో అధిక సంతానోత్పత్తిని విస్తారంగా చేయగలిగే సామర్థ్యం వీటి సొంతం. ఏడాదికి మూడు, నాలుగు సార్లు గుడ్లు పెడతాయి. వీటి జీవితకాలం 20 నుంచి 23 ఏళ్లు. మనుగడ ప్రమాదకరం పిచ్చుకల మనుగడ ప్రమాదకరంగా ఉంది. వేసవి కాలంలో పిచ్చుకలకు డాబాలపై నీళ్లు, ఆహారం ఏర్పాటు చేయాలి. గుబురుగా ఉన్న చెట్లకు మాత్రమే గూళ్లు కడతాయి. సెల్ టవర్ల రేడియేషన్ వీటి జీవనంపై ప్రభావం చూపుతోంది. ప్రతి ఒక్కరు పిచ్చుకలను కాపాడేందుకు ఎవరి స్థాయిలో వారు ప్రయత్నం చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలి.– జక్కంపూడి గోవిందు,జంతుశాస్త్ర అధ్యాపకుడు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, రావులపాలెం -
పిచ్చుకేదీ! పెంకుటిల్లేదీ!
పిచ్చుకలు అడవిలోనైతే నాలుగైదేళ్లు బతుకుతాయి. సిటీల్లోనైతే.. చెప్పలేం! ఎవరి గింజల్ని వాళ్లు వెతుక్కోడానికి పరుగులు తీస్తున్న నగరాల్లో.. పిచ్చుకల కోసం ఇంటి ముందు కంకులు వేలాడదీసేవాళ్లెవరు? మట్టి పాత్రలో వాటికి నీళ్లు పెట్టేవాళ్లెవరు? పెంకుటిళ్ల లాగే పిచ్చుకల ఆయుషూ తీరిపోతోంది! ఈ జనరేషన్ పిల్లలు కొన్నింటిని చూడ్డం అదృష్టం. వాటిల్లో పిచ్చుకను చూడ్డం ఒక అదృష్టం. పిచ్చుకలు పూర్తిగా అదృశ్యం అయిపోలేదు. ఇంకా అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నాయి. అయితే, వాటిని ఆగి చూసే అదృష్టమే మనకు ఉండడం లేదు. నేడు అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం. పిచ్చుకలను చూడలేకపోయినా, పిచ్చుకల గురించి మాట్లాడుకోడానికి ఒక సందర్భం. ఐదే ఐదు విషయాలు చెప్పుకుని ఎవరి పనుల్లోకి వాళ్లం ఎగిరిపోదాం! 01. పిచ్చుకల ఈకలపై ఉండే రంగులను బట్టి అవి ఆడో మగో చెప్పేస్తారు రైతులు. వీపు మీద గోధుమ రంగు ఈకలుంటే అవి ఆడవి. ఎరుపు రంగు ఈకలు ఉంటే అవి మగవి. గోధుమ అంటే పూర్తి గోధుమ, ఎరుపంటే పూర్తి ఎరుపు కాదు. నలుపు చారలు కూడా మిక్స్ అయి ఉంటాయి. మీ దగ్గర్లో రైతు ఎవరైనా ఉంటే ఆయన్ని అడగండి. మరికొన్ని కొండ గుర్తులు చెప్తారు. రైతుని గుర్తుపట్టడం ఎలా అని మాత్రం అడక్కండి.. ప్లీజ్. 02. చాలా పక్షుల్లాగే పిచ్చుకలు కూడా గుంపు జీవులు. ఒంటరిగా ఉండవు. ఒకవేళ ఏ పిచ్చుకైనా ఒంటరిగా కనిపించిందంటే.. అది దారి తప్పి వచ్చిందనే. మీ దగ్గర గుబురుగా ఉండే చెట్టు ఉంటే, సాయంత్రం చీకటి పడుతుండగా గమనించండి. మీ చుట్టుపక్కల ఉండే పిచ్చుకలన్నీ ఆ గుబుర్లలో చేరి కిచకిచమని ఆవేళ్టి కబుర్లు చెప్పుకుంటూ కనిపిస్తాయి. 03. పిచ్చుకలు నీటి జీవులు కాదు. అయితే నీటిలో వేగంగా ఈదగలవు. ఏదైనా ప్రమాదం రాబోతోందని పసిగట్టగానే వేరే దారి లేనప్పుడు అవి నీటి దారిలోనైనా ఎస్కేప్ అవుతాయి. 04. పిచ్చుకలు సాధారణంగా ‘ఇది నా అడ్డా’ అని గిరి గీసుకుని ఉండవు. అయితే తమ గూడును కాపాడుకోడానికి మాత్రం చేతులు మడిచి ఫైటింగ్‌కి వస్తాయి. 05. గూళ్లను కట్టే బాధ్యత మగ పిచ్చుకలదే. అలా కడుతున్నప్పుడు.. అవి ఆడ పిచ్చుకలను ఆకర్షించడానికి ఓ లుక్ ఇస్తాయి.. ‘చూశావా, ఎలా కడుతున్నానో’ అని!! -
కిలకిలలు..
జంగారెడ్డిగూడెం రూరల్ :శబ్ద కాలుష్యం, రేడియేషన్ ప్రభావంతో చెట్టుకొకటి, పుట్టకొకటిగా చెల్లాచెదురైపోయిన పిచ్చుకమ్మలు ఇదిగో ఇలా అక్కడక్కడ కనువిందుచేస్తున్నాయి. చావైనా.. బతుకైనా కలిసే అన్నట్టుగా ఒకే చెట్టుకు గూడులల్లుకుని గుంపులుగా జీవిస్తున్నాయి. కిలకిలరావాలతో సందడి చేస్తున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం కేకేఎం ఎర్రకాలువ జలాశయం గట్లపై ఇదిగో ఇలా ఆవాసాలు ఏర్పాటు చేసుకుని కనువిందు చేస్తున్నాయి. -
వొదిలెళ్లిన జోళ్లు
కథ: ఈమధ్య ఈ జోళ్లంటే ఎందుకో ఆసక్తి పెరిగిపోయింది. అవి ఏమి మాట్లాడుకుంటున్నాయో వినాలనే ఆసక్తి. అయినా చెప్పులేం మాట్లాడుకుంటాయి నా పిచ్చి కాకపోతే. ‘‘జోళ్లు మాట్లాడుకోవటం ఏమిటి? నాతో అంటే అన్నారు కాని, ఇంకెవ్వరితో అనకండి. మీకు పిచ్చి పట్టిందని వాళ్లకు తెలిసిపోతుంది’’ అనింది మా ఆవిడ. అంటే నేను పిచ్చివాడినని మా ఆవిడ ఫిక్స్ అయినట్టుంది. ఇక తనతో ఈ విషయం మాట్లాడటం దండగ అనిపించింది. నాలాగే మా తాత ఉండేవాడంట. కాదు కాదు ఆయనలాగే నేను ఉన్నానంటేనే నాకు ఇష్టం. చిన్నప్పుడు నాకు మా తాతే అన్నీ. ఆయన చెప్పిన చిట్టి చిట్టి కథలు అన్నీ జ్ఞాపకాలే. అసలు చిక్కంతా ఎక్కడ వచ్చిందంటే, ఆ జోళ్ల మూలంగానే. ఓసారి సెలవలకు మా అమ్మమ్మ వాళ్ల వూరికి వెళ్లా. ఏమీ తోచక పాత అల్మరా సర్దుతుంటే మా తాత వాడిన జోళ్లు కనబడ్డాయి. చూడగానే తెలియని అనుభూతి. గుర్తుగా వుంటాయిలే అని నాతో పాటే తెచ్చుకున్నా. అక్కడి నుండి మొదలైంది అసలు కథ. ఎర్రటి ముదురు రంగు తోలు, దాని చుట్టూ తెల్లటి దారంతో కుట్టిన అంచు, బాగా వాడిన తరువాత పుట్టే అందం, ఒక మూలన పడేసిన మా ఆవిడ నిర్లక్ష్యం... వాటి మాటెవ్వరు పట్టించుకోని తీరులో అవి అక్కడే ఉంటాయి. ఆ జోళ్లను చూసినప్పుడల్లా ఏవో గుసగుసలు వినిపిస్తుంటాయి. నిజమే ఏదో గుసగుస. నాకు అర్థం కాని గుసగుస. కాని ఎవరితో చెప్పను! ఎవరితో అన్నా వీడికి పిచ్చిపట్టిందంటూ గొడవ చేస్తారని భయం. ఏది నమ్మినా, నమ్మకపోయినా ఒక మనిషి పిచ్చివాడంటే ఇట్టే నమ్మేస్తుంది లోకం. ఈమధ్య ఈ జోళ్లంటే ఎందుకో ఆసక్తి పెరిగిపోయింది. అవి ఏమి మాట్లాడుకుంటున్నాయో వినాలనే ఆసక్తి. అయినా చెప్పులేం మాట్లాడుకుంటాయి నా పిచ్చి కాకపోతే. ఒకసారి మా అమ్మమ్మను అడిగా: ‘‘అమ్మమ్మ... తాతయ్య ఏం చేసేవాడు?’’ అని. అమ్మమ్మకు ప్రశ్న వేస్తే చేస్తున్న పని ఆపి చేతులు కొంగుకు తుడుచుకుంటుంది. ఆ రోజు కూడా అలానే తుడుచుకుంటూ ‘‘మాట్లాడేవాడ్రా’’ అంది. ‘‘ఏంటీ... మాట్లాడటం కూడా ఒక పనా?’’ అన్నాను ఆశ్చర్యపోతూ. ‘‘మరి?’’ అని కొనసాగించింది. ‘‘ఆయన తాను పండించిన పైరుతో మాట్లాడేవాడు. తాను నడిచే దారితో మాట్లాడేవాడు. తాను చేతిలో పెట్టుకున్న బెల్లం ముద్దను మా రాముడికి, అంటే ఒక కర్రెద్దులే, దానికి తినిపిస్తూ మాట్లాడేవాడు. పువ్వుతో మాట్లాడేవాడు. పెరట్లో గుమ్మడి పిందె కనిపిస్తే దానితో మాట్లాడేవాడు. ఇప్పుడెక్కడివి? తెచ్చిన వడ్లరాశిని గాదెలో నింపుతున్నప్పుడు పిచ్చుకలు ఎన్ని వచ్చేవని? వాటితో మాట్లాడేవాడు. ఆఖరుగా నాతో మాట్లాడేవాడు. అట్టా... ఆయన మాట్లాడటం వింటుంటే మాట్లాడటం కూడా ఇంత మంచిపనా? అనిపించేది’’ అంది. నేను కుతూహలంగా ‘‘ఇంకా...?’’ అన్నాను. మా అమ్మమ్మ చాలా దయగా నవ్వి, ‘‘అన్నీ నేనే చెప్పేస్తే నువ్వేం తెలుసుకుంటావురా సన్నాసి’’ అంది. ఆ తర్వాత నేను తాత గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఏమీ తెలియలేదు. కనీసం ఈ చెప్పులైనా ఎంతోకొంత చెప్పకపోవా...? అని నా పిచ్చి. రోజురోజుకు ఈ జోళ్ల మీద ఆసక్తి మరీ ఎక్కువైపోతుంది. ఆఫీస్‌కు వెళ్తూ బ్యాగ్‌లో పెట్టుకొని వెళ్తున్నా. ఎప్పుడు ఖాళీ దొరికినా జోళ్ల గుసగుస వినడమే. అప్పటికే ఆఫీస్‌లో అందరూ నాకు ఏమైందన్నట్టుగానే కొత్తగా వింతగా చూస్తున్నారు. ఇంట్లో పడుకునేటప్పుడు పక్కలో పెట్టుకొని పడుకుంటున్నా. దుప్పటి ముసుగుతన్ని నేను, నా పక్కలో జోళ్లు. రాత్రంతా ఒకటే ఆశ. చెవులు రెండు రిక్కించి మరీ వినడం. ఏదో గుసగుస అర్థం కాదు. నా పద్ధతి చూసి మా ఆవిడ నాతో మాట్లాడటం పూర్తిగా మానేసింది. రోజులు గడుస్తున్నాయ్. ఆ రోజు ఎందుకో జోళ్లు తొడుక్కోవాలి అనిపించి, నా రెండు కాళ్లకు తొడిగి చూసుకున్నా, అంతే! నాలో తెలియని ఉత్సాహం, ఉద్వేగం...రెండు అడుగులు వేశానంతే. ఈ ప్రపంచాన్ని చుట్టానన్న తృప్తి. నాలుగో అడుగుకు శరీరం అంతా చాలా తేలికగా గాల్లో ఎగురుతున్నట్టుంది. గాల్లో ఎగురుతున్నట్టు కాదు గాల్లోనే ఉన్నా. గాలిపటంలా గాలి ఎటు వీస్తే అటు ఎగురుతున్నా. ఎక్కడికో వెళ్తున్నా. అంతుచిక్కడం లేదు. దూరంగా నున్నగా కొండలు కనబడుతున్నాయి. ఆ కొండల నడుమ నారింజ రంగులో ఉదయిస్తున్న సూర్యుడు. ఒకదాని మీద ఒకటి వెండి పరుపులా పరుచుకొని ఉన్న మేఘాలు. మేఘాల అంచులు నారింజ రంగుతో కొత్త సరిగ చీర అంచుల్లా ఉన్నాయి. నారింజ వర్ణంలో కనిపించేంత మేర పరుచుకున్న నీళ్లు... ఒక అద్భుతం... చూసి తీరాల్సిందే. దట్టంగా పొగమంచు కప్పుకొని ఉంది. కనుచూపు మేరలో మనుషులు గాని, ఇళ్లు గాని ఏమీ లేవు. బహుశ అడవిలో ఉన్నట్టున్నా. నెమ్మదిగా అక్కడ దిగా. చుట్టూ మహావృక్షాలు మంచును చీలుస్తూ. చెట్టుకు వేలాడుతున్న ఊడలు. దూరంగా మినుక్ మినుక్మంటూ ఏదో వెలుగు. అటువైపుగా నడిచా. దగ్గరికి వచ్చేసరికి మంటలా అనిపించింది. అది చలిమంటలా ఉంది. ఎవరో మనుషులు కూడా ఉన్నట్టున్నారు, నలుగురు మనుషులు. ఒక ఆడ, మగ, ఇద్దరు పిల్లలు చలిమంట చుట్టూ కూర్చొని ఉన్నారు. పిల్లలేమో దబ్బపళ్లలా భలే ఉన్నారు. మగ మనిషేమో తల ఎత్తకుండా చలిమంట వైపు చూస్తున్నాడు, ఆడ మనిషేమో లేచి ఇంట్లోకెళ్లి ఓ బుట్టతో వచ్చింది. ఆ బుట్టలో ఏవో కాగితాల్లా ఉన్నాయి. చలిమంట కోసం లావుంది. పిల్లలిద్దరికీ గుప్పెడు గుప్పెడు కాగితాలిచ్చింది. వాళ్లేమో ఇష్టంగా మంటలో వేస్తున్నారు. కొద్దిగా దగ్గరికి వచ్చి చూశా. అంతే! ఆశ్చర్యం... ఆమె బుట్ట నిండా డబ్బుల నోట్లు. కుటుంబం అంతా ఇష్టంగా కాలుస్తున్నారు. వీళ్లు చేస్తున్న పనికి నాకు నోట మాట రావడం లేదు. తెలతెలవారుతోంది. నలుగురూ లేచి ఇంట్లోకి వెళ్లారు. వాళ్లు నన్ను గమనించినట్టు లేరు. ఇల్లు కూడా భలే వింతగా ఉంది. తలుపులు లేవు, కిటికీలకు ఊచలు లేవు. చూస్తే పేకలతో కట్టిన ఇల్లులా ఉంది. సూర్యుడు ఒకే ఊపులో అలా పైకి లేచాడు. చుట్టూ పచ్చదనం చిక్కటి ఆకుల వనంలా ఉంది. వాటి మధ్యలో అక్కడక్కడా పేకలతో కట్టిన ఇళ్లు. ఇక్కడ మనుషులంతా ఒకే వర్ణం... నారింజ రంగు. మనలా నలుపు, తెలుపు, చామనచాయ వర్ణాలు కాదు. అందరూ ఒకటే వర్ణం... నారింజ రంగు. మనుషులు కూడా ఆరు అడుగుల ఎత్తు, గాజుకళ్లు లాంటి కళ్లు. ఆడవాళ్లు అయితే అదొక తెలియని అందం. పిల్లలైతే దబ్బపళ్లలా ఉన్నారు. అదేమి విచిత్రమో, అందరూ నారింజ రంగు వర్ణంలో ఉన్నారు. ఆడా మగ అందరూ ప్రకృతితో మిళితమైన పనులు చేస్తున్నారు. ఒకడు నాగలి పట్టి దుక్కి దున్నుతున్నాడు. కొంతమంది ఆడాళ్లు నాట్లు వేస్తున్నారు. ఇద్దరేమో ఆవుల్ని తోలుకెళ్తున్నారు. తెల్లని ఆవుల మంద ఆకుపచ్చని వనంలో కళ్లు మిరిమిట్లు గొలుపుతోంది. ఆ ఆవులతో ఒకడేదో మాట్లాడుతున్నాడు. అదీ వాడితో మాట్లాడుతోంది. ఏంటి విచిత్రం! ఒకడు చెట్లెక్కి పండ్లు కోస్తున్నాడు. చూడ్డానికి ఆ పండ్లు మెరుస్తూ భలే వింతగా ఉన్నాయి. పిల్లలందరూ అరుగు మీద కూర్చున్న పేదరాసి పెద్దమ్మ చెప్పే కథలు వింటున్నారు. ఇద్దరేమో మట్టిని కువ్వలా పేర్చి, చెరోపక్క కూర్చొని చుకుచుకు పుల్ల ఆట ఆడుతున్నారు. ఆడపిల్లలేమో జట్టుగా కూర్చొని అచ్చంగాయ్ ఆడుతున్నారు. ఇంతలో జుయ్య్మంటూ ఒక సీతాకోకచిలుక ఒక బుడ్డోడిని వీపునేసుకొని పువ్వుపై వాలి, తేనె లాగి వాడి నోట్లో పోస్తోంది. నేనేమో ఈ వింతలన్నీ వింతగా చూస్తుండిపోయా. మరికాసేపటికి సూర్యుడు నడినెత్తి మీదకొచ్చాడు. అందరూ హాయిగా చెట్ల నీడలో వంట చేసే కార్యక్రమం మొదలెట్టారు. పిల్లలేమో ఆకుకూరలు, కాయగూరలు అవీ ఇవీ కోసుకొని వస్తున్నారు. ఆడ, మగ అందరూ కలిసి భోజనాలు వండేదానికి సిద్ధం అవుతున్నారు. ఊరందరికీ సరిపడ పెద్ద బానలో బియ్యం వేస్తున్నారు. పిల్లలు తెచ్చిన కూరగాయలను పేదరాసి పెద్దమ్మ, వయసు పైబడినవాళ్లు కడిగి ముక్కలు కోస్తున్నారు. ఆడ, మగ అందరూ కలిసి భోజనాలు తయారుచేశారు. బాదంచెట్టు ఆకుల్లా పెద్దగా ఉన్నాయి... వాటిల్లో పెట్టుకొని భోజనాలు చేశారు. మళ్లీ ఎవరి పనులకు వాళ్లు వెళ్లారు. సాయంత్రానికి ఏటిగట్టు మీద వయసు కుర్రాళ్లు చేరి ఈతలు కొడుతున్నారు. ఒక్కొక్కరు ఆకాశం అంత ఎత్తు ఎగిరి దూకుతున్నారు. వయసుకొచ్చిన కన్నెపిల్లలేమో ధైర్యంగా అబ్బాయిల ముందు నుంచే నీళ్లు తోడుకెళ్తున్నారు. పిల్లలేమో పిల్లకాలువ దగ్గర కాగితపు పడవలొదులుతున్నారు... అదీ ఎందుకూ పనికిరాని పచ్చనోట్లతో! చీకటిపడుతున్న వేళ అందరూ ఇళ్లకు చేరారు. ఆడాళ్లేమో దీపాలు వెలిగించారు. ఇంతలో కొందరు పిల్లలు ఆకాశం పెకైగిరి చందమామను అందుకున్నారు. అందులో ఒకడు చందమామలో ఉండే కుందేలును చెవులతో పట్టుకున్నాడు. వాడ్ని అందరూ భుజాలపై మోస్తూ కిందకు దిగారు. చంటిపిల్లలను ఎత్తుకొన్న అమ్మలేమో ఆకాశం నుంచి నక్షత్రాలను చేత్తో పట్టుకొని చంటాళ్లకు చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారు. నక్షత్రాల వెలుగుకి తల్లి, పిల్లాడు వెండి వెలుగులో మెరుస్తున్నారు. ఊరంతా ఒక దగ్గర చేరి చలిమంట వేసుకున్నారు. అందరూ తెచ్చిన పచ్చనోట్లతో మంటను వెలిగించారు. ఒక్కొక్క నోటు చాలాసేపు మండుతోంది. ఆ వెలుగులో ఒక స్వరం... ఒక అలజడి... ఒక ఉద్రేకం... ఎవరిదో ఒక గొంతు కాదు కాదు కొన్ని వేల గొంతులు... అది ఒక సామూహిక బృందగాన సమ్మోహనం... ఆ పాటే నన్ను తలకిందుల చేస్తోంది. నాకు ఆ పాట అర్థం కావట్లేదు. కాని వెన్నెలంతా చినుకులై వర్షంలా కారుతోంది. నాలో తెలియని ఆవేదనంతా తడిసి చల్లారిపోయింది. అందరూ పాటలు పాడుకొని, ఎవరిళ్లకి వారు వెళ్లారు. నేను మాత్రం వెన్నెల వానలో తడుస్తూనే ఉన్నా. మెలకువ రాగానే కళ్లు నలుపుకొని చూశా. బెడ్ లైట్ కాంతిలో అంతా ప్రశాంతంగా ఉంది. కాళ్లవైపు చూసుకున్నా. కాళ్లకి జోళ్లు లేవు. మూలగా చూశా. అవి అక్కడే ఉన్నాయి. ఈ మధ్య నాకు పిచ్చి ముదిరిందని మా ఆవిడ పక్క రూమ్‌లో పడుకుంటోంది. టైమ్ చూస్తే 5.30 అయ్యింది. జోళ్ల గుసగుసలు ఏమైనా వినబడుతాయేమోనని జోళ్ల దగ్గరకు వెళ్లా. అంతా నిశ్శబ్దంగా ఉంది. తెలవారబోతోంది. పొగ మంచు. ఇంట్లో నుంచి బయటకువచ్చా. అంతా నిర్మానుష్యంగా ఉంది. మంచుని చీల్చుకు కనబడుతున్న కాంతి. మసగ్గా టీ బంక్‌లా ఉంది... చుట్టూ నలుగురు ఉన్నారు. నేను టీ తాగాలని జేబులో చూశా. డబ్బులు లేవు. డబ్బు లేకుంటే ఈ లోకంలో ఏదీ నీ సొంతం కాదు... ఆఖరికి టీ కూడా, అని మనసులో అనుకుంటూ నడుస్తున్నా. తెల్లారింది. అలా నడుచుకుంటూ సిగ్నల్ దగ్గర ఆగా. ట్రాఫిక్ పెరిగింది. సిగ్నల్ పడింది. నేను నడుచుకుంటూ రోడ్ క్రాస్ చేస్తుండగా, ఆగిన బెంజ్ కార్. అందులో సూట్ వేసుకొని కూర్చున్న బిజినెస్‌మ్యాన్. కార్ పక్కనే బైక్‌పైన భార్య, భర్త ఆఫీసులకు లాగుంది. పక్కనే స్కూటీపై ముఖానికి స్కార్ఫ్ కట్టుకున్న పదహారేళ్ల ఆడపిల్ల కాలేజ్‌కి వెళ్తున్నట్టుంది. చివరగా పిల్లలందరినీ కుక్కిన ఓ పసుపురంగు స్కూల్ వ్యాన్. నేను రోడ్డు దాటాను. సిగ్నల్ పడింది అంతే. రణ గొణ ధ్వనుల మధ్య కొన్ని వేల ఆర్తనాదాలు. ఇవేవి వినబడట్లేదు నాకు. ఎక్కడో... ఒక స్వరం... ఒక అలజడి... ఒక ఉద్రేకం... ఎవరిదో ఒక గొంతు కాదు కాదు కొన్ని వేల గొంతులు... అది ఒక సామూహిక బృందగాన సమ్మోహనం... ఆశగా అడుగులు వేస్తున్నా... ఆయన వొదిలెళ్లిన జోళ్లతో... ఇంతలో కొందరు పిల్లలు ఆకాశం పెకైగిరి చందమామను అందుకున్నారు. అందులో ఒకడు చందమామలో ఉండే కుందేలును చెవులతో పట్టుకున్నాడు. వాడ్ని అందరూ భుజాలపై మోస్తూ కిందకు దిగారు. - మహి బెజవాడ