పిచ్చుకపై బ్రహ్మాస్త్రం | Sparrows extinction In Cell Tower Radiations | Sakshi
Sakshi News home page

పిచ్చుకపై బ్రహ్మాస్త్రం

Published Fri, May 11 2018 12:24 PM | Last Updated on Fri, May 11 2018 12:24 PM

Sparrows extinction In Cell Tower Radiations - Sakshi

పిచ్చుకలు

రాయవరం (మండపేట): పిట్ట కొంచెం..కూత ఘనం అన్నట్టు పిడికెడంత కూడా లేని పిట్ట నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయనడంలో సందేహం లేదు. తను నివసించేందుకు గూడు నిర్మించుకోవడంలో ఓ ఇంజినీరుతో పాటు గొప్ప శ్రామికుడు కనిపిస్తాడు. పిల్లల సంరక్షణలో మాటలకందని మాతృత్వం కనిపిస్తోంది. కిచకిచమనే వాటి రాగాలు ఎంతో వినసొంపుగా ఉంటాయి. ఏక దాంపత్య వ్రతం ఆచరించడంలో పిచ్చుకలే ఆదర్శం. అధిక సంతానోత్పత్తి సామర్థ్యం వీటి సొంతం. ఎంతో విశిష్టత కలిగిన పిచ్చుక జాతి అంతరించే ప్రమాదం పొంచి ఉంది.

కారణాలనేకం..
‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం’ అనే సామెత నిజంగా వాటి పాలిట అక్షరసత్యమవుతోందని పలువురు పర్యావరణ ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు. పెరిగిపోతున్న ఇంధన కాలుష్యం, గృహ నిర్మాణాల్లో చోటు చేసుకున్న అధునాతన మార్పులు, వృక్ష సంపద తగ్గిపోవడం, వ్యవసాయంలో విరివిగా రసాయన మందుల వినియోగం, గ్రామాల్లో, పట్టణాల్లో సెల్‌టవర్లు ఏర్పాటు చేయడం తదితర కారణాలతో పిచ్చుకలు అంతరించిపోతున్నాయి.  రైతులు తాము పండించిన తొలి ధాన్యాన్ని పిచ్చుకలకు పెడితే శుభసూచకమని భావించేవారు. ఇవి ఎక్కువుగా పంట పొలాల్లో చిక్కుడు, టమోట ఇతర పంటలపై ఉండే పేనుబంక పురుగులను తినడానికి ఇష్టపడతాయి. రేడియేషన్‌ వల్ల వాటి మనుగడకు ముప్పు వాటిల్లింది.  ప్రస్తుతం 80 శాతం వరకు పిచ్చుకలు అంతరించి పోయినట్టు పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు.
పూర్వం గోనె సంచుల్లో ధాన్యం నిల్వ చేయగా, పిచ్చుకలు వాటిని పొడుచుకుని తినేవి. రైతులు కూడా పిచ్చుకల కోసం వరిని కుచ్చులుగా కట్టి ఇంటి చూరులకు వేలాడదీసేవారు. ఇప్పుడు గొడౌన్లు, ప్లాస్టిక్‌ కంటైనర్లలో ధాన్యం నిల్వలు చేయడంతో వాటికి తిండి గింజలు దొరకడం లేదు. వ్యవసాయంలో వాడుతున్న రసాయన మందుల వల్ల వాటి నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతోంది. పలు రకాల కారణాలతో 26 రకాలకు పైగా ఉండే పిచ్చుకల్లో ఇప్పుడు కేవలం ఐదారు రకాలు మాత్రమే మనుగడ సాగిస్తున్నట్టు జంతుప్రేమికులు చెబుతున్నారు.

దాంపత్య జీవితానికి విలువ..
పిచ్చుకలు దాంపత్య జీవితానికి చాలా విలువనిస్తాయి. 85 శాతం పిచ్చుకలు బతికినంత కాలం ఒకే ఆడపిచ్చుకతో కలిసి ఉంటాయి. దీన్ని సైన్స్‌ పరంగా మోనోగాసన్‌ అంటారని పక్షి శాస్త్ర నిపుణులు తెలిపారు. కేవలం 15శాతం పిచ్చుకలు మాత్రమే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆడ పిచ్చుకలతో కలిసి జీవిస్తాయి. సృష్టిలో అధిక సంతానోత్పత్తిని విస్తారంగా చేయగలిగే సామర్థ్యం వీటి సొంతం. ఏడాదికి మూడు, నాలుగు సార్లు గుడ్లు పెడతాయి. వీటి జీవితకాలం 20 నుంచి 23 ఏళ్లు.

మనుగడ ప్రమాదకరం
పిచ్చుకల మనుగడ ప్రమాదకరంగా ఉంది. వేసవి కాలంలో పిచ్చుకలకు డాబాలపై నీళ్లు, ఆహారం ఏర్పాటు చేయాలి. గుబురుగా ఉన్న చెట్లకు మాత్రమే గూళ్లు కడతాయి. సెల్‌ టవర్ల రేడియేషన్‌ వీటి జీవనంపై ప్రభావం చూపుతోంది. ప్రతి ఒక్కరు పిచ్చుకలను కాపాడేందుకు ఎవరి స్థాయిలో వారు ప్రయత్నం చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలి.– జక్కంపూడి గోవిందు,జంతుశాస్త్ర అధ్యాపకుడు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, రావులపాలెం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement