సాక్షి, అమరావతి: ఒకప్పుడు మనతోపాటు ఇళ్లల్లో జీవించిన పిచ్చుకలు చాలా ఏళ్లుగా కనిపించడం మానేశాయి. మనుషుల జీవన విధానం మారిపోవడం, వాతావరణ మార్పుల వల్ల పిచ్చుకలకు మనుషుల ఆవాసాల వద్ద స్థానం లేకుండాపోయింది. దీంతో అవి గ్రామాలకు తరలిపోయాయి. గతంలో పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా పెంకుటిళ్లు, తాటాకిళ్లు ఉండేవి. వాటి చూర్లలో పిచ్చుకలు గూళ్లు కట్టుకుని.. ఆ ఇంట్లో దొరికే గింజలు, చుట్టుపక్కల పొలాల్లో ఉండే క్రిమికీటకాలను తిని జీవించేవి. కాంక్రీట్ భవన నిర్మాణాలు మొదలయ్యాక చూర్లు కనుమరుగవడంతో పిచ్చుకలకు గూళ్లు పెట్టుకునే అవకాశం లేకుండాపోయింది. దీంతో అవి పల్లెలకు తరలిపోయాయి. అక్కడా వాటికి ఇప్పుడు అనువైన వాతావరణం లేకపోవడంతో చాలా తక్కువ సంఖ్యలోనే కనిపిస్తున్నాయి.
మన ఆహార అలవాట్లు ప్రభావం చూపాయి
కాంక్రీట్ భవనాలు పిచ్చుకలకు గూళ్లు లేకుండా చేస్తే మారిన మన ఆహార అలవాట్లు వాటికి ఆహార భద్రత లేకుండా చేశాయి. గతంలో గింజ ధాన్యాలు ఎక్కువగా ఉపయోగించే ప్రజలు ఇప్పుడు వాటిని తగ్గించేయడమే ఇందుకు కారణంగా గుర్తించారు. మరోవైపు పిచ్చుకలు పంట పొలాల్లో ఉండే క్రిమికీటకాలను తినేవి. తద్వారా పంటలకెంతో మేలు కలిగేది. ఇప్పుడు ఎరువులు, పురుగు మందులు ఎక్కువగా వాడటం వల్ల వాటి ప్రభావానికి పిచ్చుకలు మనలేకపోతున్నాయి. కాలుష్యం పెరగడం, వాతావరణంలో వస్తున్న మార్పులు వాటి మనుగడపై ప్రభావం చూపాయి. గతంలో లక్షల సంఖ్యలో కనిపించే పిచ్చుకల సంఖ్య ఇప్పుడు వేలకు తగ్గిపోయింది. 40 సంవత్సరాలకు ముందు పిచ్చుకల సంఖ్య బాగా ఎక్కువగా ఉండేది. ఆ తరువాత నుంచి క్రమంగా వాటి సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. గత 20 ఏళ్లలో పిచ్చుకల సంఖ్యలో తగ్గుదల లేదని ‘స్టేట్ ఆఫ్ ఈ–బర్డ్’ నివేదిక స్పష్టం చేస్తోంది.
దేశంలో 5 జాతులు
ప్రపంచంలో 26 రకాల పిచ్చుక జాతులుండగా.. వాటిలో ఐదు రకాలు మాత్రమే మన దేశంలో కనిపిస్తాయి. అవి స్పానిష్ స్పారో (పాసర్ హిస్పానియోలెన్సిస్), సింద్ స్పారో (పాసర్ ఫిర్‌హనాటస్), రస్సెట్ స్పారో (పాసర్ రుటిలాన్స్), యూరేషియన్ ట్రీ స్పారో (పాసర్ మొంటానస్), హౌస్ స్పారో (స్పాసర్ డొమెస్టికస్). మన ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించేవి హౌస్ స్పారోస్ జాతి పిచ్చుకలే. ఇవి సగటున 15 సెంటీమీటర్ల పొడవుంటాయి. 24 నుంచి 40 గ్రాముల బరువు ఉంటాయి.
అంతరించిపోలేదు..తగ్గాయంతే!
పిచ్చుకలు అంతరించిపోలేదు కానీ.. వాటి సంఖ్య బాగా తగ్గిపోయింది. జీవించడానికి, గూళ్లు పెట్టుకోవడానికి అనువుగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పిచ్చుకలు ఉంటున్నాయి. నగరాల్లో అన్నీ భవనాలే కావడం వల్ల గూళ్లు పెట్టుకునే ఆస్కారం లేదు. అందుకే వాటికి అనువైన ప్రాంతాలకు వెళ్లిపోయాయి. రేడియేషన్ వల్ల పిచ్చుకలు తగ్గిపోయాయనడానికి సైంటిఫిక్‌గా ఎటువంటి నిరూపణలు లేవు. పర్యావరణ సమతుల్యతలో పిచ్చుకలు ఎంతో కీలకం. వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది.
– రాజశేఖర్ బండి, ప్రిన్సిపల్ కో–ఆర్డినేటర్,ఐఐఎస్‌ఈఆర్
Comments
Please login to add a commentAdd a comment