IISER
-
ఇప్పుడు దేశానికి ఇది అవసరం: నిర్మలా సీతారామన్
ఇంధన వినియోగాన్ని, దిగుమతులను తగ్గించుకోవాలని పలువురు నేతలు చెబుతూనే ఉన్నారు. దీని ప్రత్యామ్నాయంగా గ్రీన్ ఎనర్జీ ఉపయోగించుకోవాలి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్ధికమంత్రి 'నిర్మలా సీతారామన్' భోపాల్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) 11వ స్నాతకోత్సవంలో ప్రస్తావించారు.పునరుత్పాదక ఇంధన నిల్వలపై పరిశోధనలు ముమ్మరం చేయాలని సైన్స్ కమ్యూనిటీకి నిర్మలా సీతారామన్ విజ్ఞప్తి చేశారు. శిలాజ ఇంధనం నుంచి పునరుత్పాదక శక్తికి మారడానికి చాలా డబ్బు అవసరం అవుతుంది. అయితే దీనికి నిధులు ఇంకా రావాల్సి ఉందని ఆమె అన్నారు.భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి పునరుత్పాదక ఇంధన వనరులు చాలా అవసరం. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. దేశం గ్రీన్ ఎనర్జీ నిల్వలో అగ్రగామిగా ఉంది. కానీ సౌర శక్తిని నిల్వ చేసుకోవడానికి కావలసిన బ్యాటరీలు ప్రస్తుతం మనదగ్గర లేదు. వాటిని అభివృద్ధి చేయాల్సి ఉంది.ఇదీ చదవండి: ఫోన్ పే, గూగుల్ పేకు గట్టి పోటీ.. సిద్దమవుతున్న భీమ్సౌర శక్తిని నిల్వ చేసుకోవడానికి కావలసిన బ్యాటరీలు అందుబాటులోకి వచ్చే వరకు.. శిలాజ ఇంధనాలపైన ఆధారపడాలి. పెట్టుబడుల కోసం దేశం వేచి చూడదు, కాబట్టి శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణలు చేయాలి. అప్పుడే భారత్ మరింత వేగంగా ముందుకు వెళ్ళడానికి సాధ్యమవుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు. -
ఐఐటీల్లో ఆత్మహత్యలు ఎందుకు?
పనిచేసే కార్యాలయాలు, ఫ్యాక్టరీలు, విద్యాలయాలు వంటి సామూహిక సంస్థల్లో ప్రజల్లో ఉన్న సామాజిక వైవిధ్యం కనిపించాలంటారు పారిశ్రామిక దేశాల మేధావులు, రాజ్యాంగ నిపుణులు, న్యాయకోవిదులు. ప్రజాప్రతినిధులు. సమాజంలోని అన్ని వర్గాలు, జాతులు, మతాలు, రంగుల మనుషులు ఉంటే మంచిదని చెబుతారు. విద్యనభ్యసించే స్కూళ్లు, కాలేజీల్లో అన్ని సామాజికవర్గాల విద్యార్థులు ఉంటే ఈ పిల్లల జ్ఞానం, వివేకం ఎక్కువ ఉంటాయని కూడా వారి అనుభవంలో తేలింది. అలాగే ఆఫీసులు, కర్మాగారాల్లో కూడా అన్ని జాతులు, వర్గాల ఉద్యోగులు ఉంటే వారి పనితీరు లేదా ఉత్పాదకత కాస్త ఎక్కువ ఉంటుందని అమెరికా, ఐరోపా దేశాల్లో రుజువైంది. అందుకే ‘అఫర్మేటివ్ యాక్షన్’, ‘పాజిటివ్ డిస్క్రిమినేషన్’ పేరిట పాశ్చాత్య దేశాల్లో (ఇండియాలో వివిధ స్థాయిల్లో కోటా లేదా రిజర్వేషన్ పేరుతో అమలు చేసే సామాజిక న్యాయ కార్యక్రమాల మాదిరిగా) అనేక పథకాలను ఎప్పటి నుంచో ప్రభుత్వాలు ఆచరణలో పెట్టాయి. ముఖ్యంగా ప్రభుత్వం నడిపే లేదా సర్కారీ నిధుల సాయంతో నడిచే విద్యాసంస్థల్లో బడుగు వర్గాల విద్యార్థులకు కొంత శాతం సీట్లు కేటాయించి, వారికి ప్రవేశం కల్పిస్తున్నారు. రాష్ట్రాల్లో, కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు, ఐఐటీలు, ఐఐఎంలు వంటి ఉన్నత విద్యాసంస్థల్లో సైతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కోటాలు విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఓబీసీలకు కాస్త ఆలస్యంగా కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో 1990ల నుంచీ అమలవుతున్నాయి ఈ కోటాలు. (చదవండి: అసలు ఐఐటీలో ఏముంటుంది? ఎందుకు చేర్పించాలి? ఏం నేర్చుకుంటారు?) ఐఐటీలు, ఐఐఎంల సంఖ్యను గత పాతికేళ్లలో పెంచిన కేంద్ర ప్రభుత్వం అక్కడ అదివరకే ఎస్సీలు, ఎస్టీలకు ఉన్న కోటాలకు తోడుగా కొత్తగా ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించింది. కోటాలు ఉన్న సామాజిక వర్గాలకు సైతం తీవ్ర ఒత్తిడికి లోను చేసే పోటీ పరీక్షల ద్వారా ర్యాంకులు సంపాదిస్తేనే ఈ అత్యున్నత విద్యాసంస్థల్లో సీట్లు దొరుకుతాయి. ఈ క్రమంలో జేఈఈ, క్యాట్ వంటి తీవ్ర పోటీ ఉన్న ప్రవేశ పరీక్షలు రాసి కోటా ద్వారా ఐఐటీలు, ఐఐఎంలలో సీట్లు సాధించగానే సరిపోదు. అధ్యాపకవర్గంలో కూడా అన్నివర్గాలకు ప్రాతినిధ్యం లేకపోవడం, ఆయా సంస్థల పాలకవర్గాల్లో బడుగువర్గాల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ లేకపోవడం వల్ల గత పది పదిహేనేళ్లుగా అవాంఛనీయ పరిణామాలు సంభవిస్తున్నాయి. డ్రాపవుట్లు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి! కోటాల ద్వారా ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన బడుగువర్గాల విద్యార్థులు తమకు చదువు, పోటీతత్వానికి సంబంధించిన తగినంత కుటుంబ నేపథ్యం లేకపోవడం వల్ల అన్ని కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎంలలో చేరిన కొన్నేళ్లకే చదువులకు మధ్యలోనే స్వస్తి చెబుతూ ‘డ్రాపవుట్లు’గా మారుతున్నారు. 2018–2023 మధ్య ఇలా ఈ ఉన్నత విద్యాసంస్థల నుంచి కోర్సు మధ్యలోనే నిష్క్రమించిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు 19,000 దాటిపోయారని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ రాజ్యసభలో ఇటీవల సమాచారం అందించారు. అలాగే, 2014–2021 మధ్య అన్ని సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్ఈఆర్లలో చదువుతున్న విద్యార్థుల్లో 122 మంది మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని పార్లమెంటుకు కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. తాము చేరిన విద్యాసంస్థల్లో రకరకాల ఒత్తిళ్లు తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్న ఈ విద్యార్థులంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు చెందినవారు కావడం విషాదకర వాస్తవం. కోటాల ద్వారా ప్రవేశం పొందిన బలహీనవర్గాల విద్యార్థులను ఆయా విద్యాసంస్థల్లో అన్ని విధాలుగా ఆదుకుంటూ, ఆసరగా ఉండే వ్యవస్థలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయం పార్లమెంటు ఉభయసభల సభ్యుల దృష్టికి వచ్చాక ప్రభుత్వం ఈ సమస్యపై తక్షణమే మనసు పెట్టి పరిష్కరించాల్సిన సమయం ఆసన్నమైంది. (చదవండి: ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. రెండు నెలల్లో నాలుగు ఆత్మ హత్యలు.. ఐఐటీ చెన్నైలో ఏం జరుగుతోంది?) -విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ ఎంపీ -
అవిగో.. అరుదైన పక్షులు! నల్ల బాజా, గోధుమ రంగు గుడ్ల గూబ, ఎలుక గద్ద పక్షి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలు అరుదైన పక్షి జాతుల్ని బర్డ్ వాచర్స్ గుర్తించారు. గోధుమ రంగు అడవి గుడ్ల గూబ(బ్రౌన్ వుడ్ ఓల్), ఎలుక గద్ద(కామన్ బజార్డ్), నల్ల బాజా(బ్లాక్ బాజా) వంటి అరుదైన పక్షులు కనిపించాయి. తిరుపతి ఐఐఎస్ఈఆర్ విద్యార్థులు సుదీర్ఘకాలం తర్వాత నల్ల బాజాను గుర్తించగా, రాజమండ్రిలో బర్డ్ వాచర్ మోహన్ శ్రీకర్ గోధుమ రంగు అడవి గుడ్ల గూబను రికార్డు చేశారు. విజయవాడలో ఎలుక గద్ద పక్షి రాష్ట్రంలో రెండోసారి రికార్డయింది. రాష్ట్ర వ్యాప్తంగా 8 రకాల గుడ్ల గూబలు రికార్డయ్యాయి. ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకు 4 రోజులపాటు ఐఐఎస్ఈఆర్ ఆధ్వర్యంలో వరుసగా నాలుగో సంవత్సరం రాష్ట్రంలో గ్రేట్ బ్యాక్ యార్డ్ బర్డ్ కౌంట్‌గా పిలిచే ప్రపంచ పక్షుల గణన నిర్వహించారు. గణనలో దేశం వ్యాప్తంగా 1,067 జాతుల పక్షులు నమోదవగా, మన రాష్ట్రం 313 జాతుల్ని నమోదు చేసి దేశంలో 12వ స్థానంలో నిలిచింది. బర్డ్ వాచర్లు పక్షులను గమనించి వాటి ఫొటోలను సిటిజన్ సైన్స్ పోర్టల్ ఈబర్డ్లో నమోదు చేశారు. గణనలో 84 మంది బర్డ్ వాచర్స్.. తిరుపతి ఐఐటీ, ఐఐఎస్ఈఆర్ తిరుపతి, తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్, ఏలూరు సీఆర్ఆర్ మహిళా కళాశాల, విశాఖపట్నం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ సహా రాష్ట్రంలోని పలు క్యాంపస్‌లు ఈ గణనలో పాల్గొన్నాయి. 2013లో తొలిసారి రాష్ట్రంలో గ్రేట్ బ్యాక్ యార్డ్ బర్డ్ కౌంట్ జరగ్గా అప్పుడు 300కి పైగా జాతుల పక్షుల్ని నమోదు చేశారు. ఐఐఎస్ఈర్ తిరుపతి విద్యార్థులు, పరిశోధకులు ఈ గణనలో తిరుపతి పరిసరాల్లో 120 జాతుల పక్షుల్ని నమోదు చేయడం విశేషం. విజయవాడ నేచర్ క్లబ్లో ఉన్న పలువురు వైద్యులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, కొందరు సిటిజన్లు ఒక గ్రూపుగా ఏర్పడి విజయవాడ పరిసరాల్లో 60 రకాల పక్షులను నమోదు చేశారు. ఒంగోలుకు చెందిన ఇద్దరు వైద్యులు ప్రకాశం జిల్లా ప్రాంతంలో 100 జాతులకు పైగా పక్షుల్ని రికార్డు చేశారు. రాజమండ్రి బర్డ్ నేచర్ ఫోటోగ్రఫీ గ్రూపు సభ్యులుగా ఉన్న డాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల నుంచి 200 జాతుల పక్షులను రికార్డు చేశారు. విశాఖపట్నంలో స్థానిక ఎన్జీఓలు డబుల్య్సీటీఆర్ఈ, ఈసీసీటీలు అటవీ శాఖతో కలిసి బర్డ్ వాక్‌లు నిర్వహించి 180 జాతుల పక్షులను నమోదు చేశారు. అనంతపురంలో 160 రకాల పక్షులు, కొల్లేరు పక్షుల అభయారణ్యంలో 90 రకాల పక్షులు నమోదయ్యాయి. మొత్తం 84 మంది బర్డ్ వాచర్స్ ఈ గణనలో పాల్గొన్నారు. పక్షి శాస్త్రవేత్తలు, పరిశోధకులకంటె ఎక్కువగా సాధారణ ప్రజలు ఈ గణనలో పాల్గొనడం విశేషం. 65 శాతం పక్షులు నమోదయ్యాయి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 490 జాతుల పక్షులు రికార్డవగా.. ఈ గణనలో వాటిలో 65 శాతం పక్షులు నమోదయ్యాయి. ఎక్కువ మందిని ప్రకృతికి అనుసంధానం చేయడం, పక్షులను చూడాలనే అభిరుచితో ఉన్న వారిని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ గణన ఏటా నిర్వహిస్తున్నారు. ఈ ఫలితాలు ప్రాథమికంగా ఇచ్చినవే. కాగా, బర్డ్ కౌంట్ ఇండియా త్వరలో తుది ఫలితాలను వెల్లడిస్తుంది. – బండి రాజశేఖర్, ఐఐఎస్ఈఆర్ సిటిజన్ సైంటిస్ట్ ప్రకాశం జిల్లాలో పక్షుల సమాచారాన్ని అన్వేషిస్తున్నాం.. నా సహోద్యోగి డాక్టర్ శ్రావణ్‌కుమార్(బర్డ్ వాచర్)తో కలిసి ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పక్షుల్ని రికార్డు చేశాను. పెళ్లూరు సమీపంలోని గడ్డి భూముల్లో కొంగలు, పెలికాన్లు, పెయింటెడ్, ఓపెన్ బిల్ స్కార్ట్లను ఎక్కువగా గమనించాము. దర్శి సమీపంలో ఈజిప్టియన్ వల్చర్, హనీ బజార్డ్, బ్లాక్ కైట్ పక్షుల్ని నమోదు చేశాం. ప్రకాశం జిల్లాలోని పక్షుల గురించి మరింత సమాచారాన్ని అన్వేషించడానికి ప్రయత్నిస్తున్నాం. – డాక్టర్ రామాంజినాయక్, బర్డ్ వాచర్, ఒంగోలు -
ఐఐఎస్ఈఆర్ రెండో స్నాతకోత్సవం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తిరుపతిలో ఏర్పాటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) రెండో స్నాతకోత్సవం (కాన్వొకేషన్) బుధవారం హైబ్రిడ్ మోడ్ (ఆఫ్‌లైన్, ఆన్లైన్)లో నిర్వహించారు. ఐఐఎస్ఈఆర్ నెలకొల్పి ఈ ఏడాదికి ఆరేళ్లు పూర్తి చేసుకుంది. సంస్థలోని రెండో బ్యాచ్ (2016 బ్యాచ్) విద్యార్థులు ఐదేళ్ల బీఎస్–ఎంఎస్ డిగ్రీ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కాన్వొకేషన్లో వారికి డిగ్రీలను ప్రదానం చేశారు. కోవిడ్ కారణంగా హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సెనేట్ సభ్యులు, ఇతరులు పరిమిత సంఖ్యలో ప్రత్యక్షంగా హాజరవ్వగా, మిగతావారు ఆన్లైన్లో భాగస్వాములయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్ ప్రొఫెసర్ కె.విజయ్‌రాఘవన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు, తల్లిదండ్రులనుద్దేశించి ప్రసంగిస్తూ.. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, అప్పుడే మానవజాతి భవిష్యత్‌లోనూ సజావుగా మనుగడ సాగించగలుగుతుందని చెప్పారు. మానవజాతి పరిణామం, భూగోళంపై మనుగడకు సంబంధించిన అంశాలను ఆయన వివరించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ముంబై ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సైంటిస్టు, ఐఐఎస్ఈఆర్ చైర్మన్ ప్రొఫెసర్ జేబీ జోషి మాట్లాడుతూ.. విద్యార్థులు సానుకూల దృక్పథం, నైపుణ్యాలు అలవరచుకుని బాధ్యతతో ముందుకు వెళ్లాలని సూచించారు. విద్యార్థులు ఇక్కడ సముపార్జించిన జ్ఞానంతో సమాజానికి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా పరిశోధనలు సాగించాలని ఆయన ఆకాంక్షించారు. ఐఐఎస్ఈఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.ఎన్.గణేశ్ సంస్థ సాధించిన అకడమిక్, రీసెర్చ్ ప్రగతిని నివేదించారు. కాన్వొకేషన్లో 64 మంది విద్యార్థులు బీఎస్–ఎంఎస్ డిగ్రీలు పొందగా, ఒకరు బీఎస్ డిగ్రీని అందుకున్నారు. అత్యధిక సీజీపీఏ సాధించిన వీసీ తమరాయి వల్లీకి గోల్డ్‌మెడల్, ఓంకార్ వినాయక్ నిప్పణికర్, వీణా శంకర్ అద్వానీలకు సిల్వర్ మెడల్‌లను ప్రకటించారు. భాబేష్కుమార్ త్రిపాఠికి 2021 బెస్ట్ గ్రాడ్యుయేట్ బహుమతిని అందించారు. -
మీ సెల్ ఫోన్ పగిలినా దానంతట అదే అతుక్కుంటే?
కోల్‌కతా: మీ సెల్ ఫోన్ నేలపై పడి పగిలినా దానంతటదే తిరిగి అతుక్కుంటే? వినేందుకు జానపద సినిమాల్లో ఘటనలాగా అనిపిస్తోంది కదా! కానీ ఈ అద్భుతాన్ని నిజం చేసే దిశగా దేశీయ సైంటిస్టులు కీలకమైన ముందడుగు వేశారు. కనురెప్పపాటులో తనంతట తాను రిపేరు చేసుకునే మెటీరియల్‌ను ఐఐఎస్ఈఆర్ కోల్‌కతా, ఐఐటీ ఖరగ్‌పూర్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనితో స్వీయరిపేర్లు చేసుకునే ఎల్రక్టానిక్ గాడ్జెట్లు మనిషి చేతికి వస్తాయి. ఈ ప్రయోగ వివరాలను తాజాగా యూఎస్‌కు చెందిన సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. ఇప్పటికే కొన్నిరకాల సెల్ఫ్ హీలింగ్ మెటీరియల్స్ ఏరోస్పేస్, ఆటోమేషన్ రంగంలో అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా తాము రూపొందించిన ఉత్పత్తి గతంలో వాటి కన్నా పదిరెట్లు గట్టిగా ఉందని సైంటిస్టులు చెప్పారు. అందుబాటులో ఉన్న మెటీరియల్స్‌కు తమంత తాము రిపేరయ్యేందుకు వెలుతురో, వేడో కావాల్సివస్తుండేది. తాజా మెటీరియల్ సొంతగా ఉత్పన్నమయ్యే ఎలక్ట్రిక్ చార్జితో రిపేరు చేసుకుంటుందని ఐఐటీ ప్రొఫెసర్ భాను భూషణ్ కతువా చెప్పారు. పరిశోధనలో తెలుగువాడు నూతన సెల్ఫ్ రిపేర్ మెటీరియల్ రూపకల్పనలో ఐఐఎస్ఈఆర్ కోల్‌కతా ప్రొఫెసర్ సి. మల్లారెడ్డి కీలకపాత్ర పోషించారు. సరికొత్త తరగతికి చెందిన ఘనపదార్ధాల ఉత్పత్తికిగాను, మల్లారెడ్డి, ఆయన బృందానికి 2015లో ప్రతిష్ఠాత్మక స్వర్ణజయంతి ఫెలోషిప్‌ను పొందారు. ఈయనతో పాటు మరో సైంటిస్టు నిర్మాల్యఘోష్ సైతం ఇదే సంస్థలో పనిచేస్తున్నారు. ఒత్తిడి ఎదురైనప్పుడు ఎలక్ట్రిక్ చార్జిలను సృష్టించే పదార్ధాలే పీజో ఎలక్ట్రిక్ పదారాలు. ఈ చార్జిని ఉపయోగించుకొని స్పటికాలు తిరిగి యథాతధ రూపాన్ని పొందుతాయి. జీవ కణాల్లో రిపేరింగ్ మెకానిజం ఆధారంగా కొత్త పదార్ధం పనిచేస్తుంది. దీన్ని మెబైల్ స్క్రీన్ల నుంచి ఎల్ఈడీ స్క్రీన్ల వరకు అన్ని రకాల ఎల్రక్టానిక్ వస్తువులకు వాడవచ్చని సైంటిస్టులు చెప్పారు. -
కిలకిలారావాలు పెరిగాయి !
సాక్షి, అమరావతి: జీవవైవిధ్యానికి ప్రతీకలుగా భావించే పక్షుల ఉనికి దేశంలో సంతృప్తికరంగా ఉంది. అక్కడక్కడా కొన్ని ప్రాంతాలు మినహా ఎక్కువ చోట్ల పక్షుల వైవిధ్యం బాగానే ఉన్నట్లు వెల్లడైంది. సాధారణంగా కనిపించే గోరింక, కాకి వంటి వాటితోపాటు కొన్నిచోట్ల అరుదైన పక్షులు కూడా కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని పక్షి ప్రేమికులంతా కలిసి నిర్వహించే గ్రేట్ బ్యాక్ యార్డ్ బర్డ్ కౌంట్ (పక్షుల సందర్శన) సర్వేలో ఈ అంశం స్పష్టమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 12–15 తేదీల్లో ఈ సర్వే జరిగింది. మన దేశంలో బర్డ్ కౌంట్ ఆఫ్ ఇండియా పోర్టల్, మన రాష్ట్రంలో తిరుపతి ఐఐఎస్ఈఆర్ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) ఈ సర్వేను సమన్వయం చేశాయి. సర్వే నివేదికను ఇటీవలే బర్డ్ కౌంట్ ఇండియా పోర్టల్ విడుదల చేసింది. బర్డ్ కౌంట్ సర్వేలో పక్షులను రికార్డు చేస్తున్న బర్డ్ వాచర్లు 2,954 బర్డ్ వాచర్లు.. 17 వేల గంటలు దేశంలో 965 రకాల పక్షి జాతులను ఈ సర్వేలో రికార్డు చేశారు. దేశంలో ఉన్న మొత్తం పక్షి జాతుల్లో ఇవి 72 శాతం. 2,954 బర్డ్ వాచర్లు 17 వేల గంటలు పరిశీలించి వీటిని రికార్డు చేశారు. రికార్డు చేసిన పక్షి జాతుల సంఖ్య ప్రకారం ఈ సర్వేలో ఈ సారి ఇండియా రెండో స్థానంలో నిలిచింది. 1,189 పక్షి జాతుల్ని రికార్డు చేసి కొలంబియా మొదటి స్థానంలో నిలిచింది. 2020 సంవత్సరంలో జరిగిన సర్వేలో ఇండియా నాలుగో స్థానంలో ఉంది. గతం కంటె ఈ సారి ఎక్కువ సంఖ్యలో బర్డ్ వాచర్స్ పాల్గొనడంతో ఎక్కువ జాతులు రికార్డయ్యాయి. దేశంలో ఉత్తరాఖండ్‌లో అత్యధికంగా 426 పక్షి జాతులు, పశ్చిమ బెంగాల్లో 401, కర్నాటకలో 366 జాతుల్ని ఈ సర్వేలో రికార్డు చేశారు. మన రాష్ట్రంలో 57 మంది బర్డ్ వాచర్లు 295 పక్షి జాతుల్ని రికార్డు చేశారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం పక్షి జాతుల్లో ఇవి 60 శాతం. గత సంవత్సరం జరిగిన సర్వేలో 279 పక్షి జాతుల్ని కనుగొన్నారు. ఈ సారి మన రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ఎక్కువగా 180 జాతులు రికార్డయ్యాయి. తర్వాతి స్థానాల్లో తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లా నుంచి ఎక్కువ మంది బర్డ్ వాచర్స్ పాల్గొన్నారు. ఈ సారి ఐఐటీ తిరుపతి, ఎస్వీయూ, ఆంధ్రా యూనివర్సిటీ వంటి 13 విద్యా సంస్థలు కూడా సర్వేలో పాల్గొన్నాయి. కర్నూలులో అరుదైన పక్షి జాతులు ఈ సారి సర్వేలో కర్నూలు జిల్లాలో రెండు అరుదైన పక్షి జాతులు నమోదు కావడం విశేషం. ప్రపంచంలో అత్యధిక ఎత్తులో ఎగిరే తెల్ల పెద్ద బాతుతో పాటు మంగోలియా, సైబీరియా నుంచి వచ్చే పొట్టి చెవుల గుడ్ల గూబను కర్నూలులో రికార్డు చేశారు. ఇక, రాష్ట్రంలో సాధారణంగా కనిపించే కాకి, సంటి కొంగ, గోరింక, నల్ల ఏట్రింత, నల్ల కాకి, చిలుక, పావురం, నల్ల గద్ద, పికిలి పిట్టలే సర్వేలో ఎక్కువగా నమోదయ్యాయి. దేశంలోని దక్షిణాది ప్రాంతమంతటా కాకి, గోరింక, నల్ల ఏట్రింత పక్షులు ఎక్కువగా కనిపించాయి. అద్భుతంగా శబ్దాలు చేసే ఈల గంటె పిట్టను కూడా ఈ సర్వేలో నమోదు చేశారు. పర్యావరణ మార్పుల్ని మొదట గుర్తించేది పక్షులే జీవ వైవిధ్యం ఎలా ఉందో తెలుసుకోవడంలో పక్షులు కీలకం. పర్యావరణంలో జరిగే మార్పుల్ని మొదట గుర్తించేది అవే. బర్డ్ వాచింగ్ వల్ల మన పర్యావరణం, వాతావరణ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఎన్ని జాతుల పక్షులున్నాయో తెలుస్తుంది. బర్డ్ వాచింగ్ కమ్యూనిటీలు పెద్దఎత్తున ఏర్పడి సర్వే చేస్తే పూర్తి స్థాయిలో వాస్తవ పరిస్థితి తెలుసుకునే అవకాశం ఉంటుంది. – బండి రాజశేఖర్, సిటిజన్ సైన్స్ కోఆర్డినేటర్, ఐఐఎస్ఈఆర్ -
పల్లెకు పోయింది పిచ్చుకమ్మ!
సాక్షి, అమరావతి: ఒకప్పుడు మనతోపాటు ఇళ్లల్లో జీవించిన పిచ్చుకలు చాలా ఏళ్లుగా కనిపించడం మానేశాయి. మనుషుల జీవన విధానం మారిపోవడం, వాతావరణ మార్పుల వల్ల పిచ్చుకలకు మనుషుల ఆవాసాల వద్ద స్థానం లేకుండాపోయింది. దీంతో అవి గ్రామాలకు తరలిపోయాయి. గతంలో పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా పెంకుటిళ్లు, తాటాకిళ్లు ఉండేవి. వాటి చూర్లలో పిచ్చుకలు గూళ్లు కట్టుకుని.. ఆ ఇంట్లో దొరికే గింజలు, చుట్టుపక్కల పొలాల్లో ఉండే క్రిమికీటకాలను తిని జీవించేవి. కాంక్రీట్ భవన నిర్మాణాలు మొదలయ్యాక చూర్లు కనుమరుగవడంతో పిచ్చుకలకు గూళ్లు పెట్టుకునే అవకాశం లేకుండాపోయింది. దీంతో అవి పల్లెలకు తరలిపోయాయి. అక్కడా వాటికి ఇప్పుడు అనువైన వాతావరణం లేకపోవడంతో చాలా తక్కువ సంఖ్యలోనే కనిపిస్తున్నాయి. మన ఆహార అలవాట్లు ప్రభావం చూపాయి కాంక్రీట్ భవనాలు పిచ్చుకలకు గూళ్లు లేకుండా చేస్తే మారిన మన ఆహార అలవాట్లు వాటికి ఆహార భద్రత లేకుండా చేశాయి. గతంలో గింజ ధాన్యాలు ఎక్కువగా ఉపయోగించే ప్రజలు ఇప్పుడు వాటిని తగ్గించేయడమే ఇందుకు కారణంగా గుర్తించారు. మరోవైపు పిచ్చుకలు పంట పొలాల్లో ఉండే క్రిమికీటకాలను తినేవి. తద్వారా పంటలకెంతో మేలు కలిగేది. ఇప్పుడు ఎరువులు, పురుగు మందులు ఎక్కువగా వాడటం వల్ల వాటి ప్రభావానికి పిచ్చుకలు మనలేకపోతున్నాయి. కాలుష్యం పెరగడం, వాతావరణంలో వస్తున్న మార్పులు వాటి మనుగడపై ప్రభావం చూపాయి. గతంలో లక్షల సంఖ్యలో కనిపించే పిచ్చుకల సంఖ్య ఇప్పుడు వేలకు తగ్గిపోయింది. 40 సంవత్సరాలకు ముందు పిచ్చుకల సంఖ్య బాగా ఎక్కువగా ఉండేది. ఆ తరువాత నుంచి క్రమంగా వాటి సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. గత 20 ఏళ్లలో పిచ్చుకల సంఖ్యలో తగ్గుదల లేదని ‘స్టేట్ ఆఫ్ ఈ–బర్డ్’ నివేదిక స్పష్టం చేస్తోంది. దేశంలో 5 జాతులు ప్రపంచంలో 26 రకాల పిచ్చుక జాతులుండగా.. వాటిలో ఐదు రకాలు మాత్రమే మన దేశంలో కనిపిస్తాయి. అవి స్పానిష్ స్పారో (పాసర్ హిస్పానియోలెన్సిస్), సింద్ స్పారో (పాసర్ ఫిర్హనాటస్), రస్సెట్ స్పారో (పాసర్ రుటిలాన్స్), యూరేషియన్ ట్రీ స్పారో (పాసర్ మొంటానస్), హౌస్ స్పారో (స్పాసర్ డొమెస్టికస్). మన ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించేవి హౌస్ స్పారోస్ జాతి పిచ్చుకలే. ఇవి సగటున 15 సెంటీమీటర్ల పొడవుంటాయి. 24 నుంచి 40 గ్రాముల బరువు ఉంటాయి. అంతరించిపోలేదు..తగ్గాయంతే! పిచ్చుకలు అంతరించిపోలేదు కానీ.. వాటి సంఖ్య బాగా తగ్గిపోయింది. జీవించడానికి, గూళ్లు పెట్టుకోవడానికి అనువుగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పిచ్చుకలు ఉంటున్నాయి. నగరాల్లో అన్నీ భవనాలే కావడం వల్ల గూళ్లు పెట్టుకునే ఆస్కారం లేదు. అందుకే వాటికి అనువైన ప్రాంతాలకు వెళ్లిపోయాయి. రేడియేషన్ వల్ల పిచ్చుకలు తగ్గిపోయాయనడానికి సైంటిఫిక్‌గా ఎటువంటి నిరూపణలు లేవు. పర్యావరణ సమతుల్యతలో పిచ్చుకలు ఎంతో కీలకం. వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. – రాజశేఖర్ బండి, ప్రిన్సిపల్ కో–ఆర్డినేటర్,ఐఐఎస్ఈఆర్ -
జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్లు 21.75 లక్షలు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) తదితర విద్యా సంస్థల్లోకి ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్‌కు ఈ విద్యా సంవత్సరంలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. గడువు ముగిసే సమయానికి 21,75,183 మంది అభ్యర్థులు జేఈఈ మెయిన్స్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఈ విద్యా సంవత్సరంలో జేఈఈలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా జేఈఈ పరీక్షలను 4 దశల్లో నిర్వహించే విధానం వల్ల విద్యార్థులు దీన్నొక అవకాశంగా మల్చుకోవడానికి పెద్ద ఎత్తున ఉత్సాహం చూపించారని తాజా రిజిస్ట్రేషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు దేశ వ్యాప్తంగా ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నాలుగేసి రోజుల చొప్పున ఉదయం, సాయంత్రం 2 సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈసారి జేఈఈ మెయిన్స్‌ను ఇంగ్లిష్తో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, గుజరాతీ, ఒడియా, బెంగాలీ, మరాఠీ, పంజాబీ, ఉర్దూ, అస్సామి భాషల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ప్రాంతీయ భాషల్లో ప్రశ్నపత్రాలు ఆ భాషతో పాటు ఆంగ్లంలో కూడా ఉంటాయి. çఇప్పటివరకు 21 లక్షల మంది రిజిస్టర్ అవ్వగా, వారిలో 1,49,597 మంది 10 స్థానిక భాషల్లో పరీక్షలు రాసేందుకు మొదటిసారి ఆప్షన్ ఇచ్చినట్లు ఎన్టీఏ గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో సగం మంది హిందీని ఎంచుకున్నారు. గుజరాతీలో రాసేందుకు 44,094 మంది, బెంగాలీలో రాసేందుకు 24,841 మంది ఆప్షన్లు ఇచ్చారు. అయితే అత్యధికులు ఆంగ్లంలోనే పరీక్ష రాసేందుకు ఆప్షన్ ఇవ్వడం గమనార్హం. మొదటి దశ పరీక్షకు 6.6 లక్షల మంది దరఖాస్తు జేఈఈ మెయిన్స్‌ను నాలుగు దశల్లో నిర్వహించేందుకు నిర్ణయించడంతో అభ్యర్థులు వారికి నచ్చిన దశలో పరీక్ష రాయనున్నారు. తొలిదశ పరీక్షలకు 6,61,761 మంది దరఖాస్తు చేశారు. కొందరు నాలుగు దఫాలు రాయడానికి దరఖాస్తు చేయగా, కొందరు ఒకటి, రెండు దఫాల్లో పరీక్షలు రాసేందుకు వీలుగా దరఖాస్తు చేశారు. -
బెజవాడ పరిసరాల్లో అరుదైన వన్యప్రాణులు
సాక్షి, అమరావతి: విజయవాడ పరిసర ప్రాంతాల్లో పలు కొత్త వన్యప్రాణుల ఉనికి పర్యావరణవేత్తల్లో ఆశలు చిగురింపజేస్తోంది. వాతావరణ మార్పులు, కరువవుతున్న పచ్చదనంతో జీవవైవిధ్యం దెబ్బతిన్న పరిస్థితుల్లోనూ కృష్ణా జిల్లాలో కొండపల్లి అటవీ ప్రాంతం, మరికొన్నిచోట్ల అరుదైన వన్యప్రాణుల్ని గుర్తించారు. ఇంతవరకు ఈ ప్రాంతంలో ఎప్పుడూ చూడని కొత్త రకం చుంచు (మద్రాస్ ట్రీష్రూ), ఐదు చారల తాటి ఉడత, పెద్ద రెక్కల గద్ద (స్టెప్పీ ఈగిల్)ను ఐఐఎస్ఈఆర్ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) కనుగొంది. కొన్నేళ్ల నుంచి కొండపల్లి రిజర్వు ఫారెస్టులోని మూలపాడు అటవీ ప్రాంతంలో జీవవైవిధ్యం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ ఉన్న చెట్లు, వాతావరణం వల్ల అటవీ ప్రాంతం అభివృద్ధి చెందడంతో వన్యప్రాణుల మనుగడ పెరిగింది. ఈ నేపథ్యంలోనే పలు కొత్త వన్యప్రాణుల ఉనికి బయటపడినట్లు ఐఐఎస్ఈఆర్ అంచనా వేస్తోంది. పెద్ద రెక్కల గద్ద (స్టెప్పీ ఈగిల్) శీతాకాలంలో భారత ఉపఖండంలో అరుదుగా కనిపించే అతిపెద్ద గద్ద ఇది. మధ్య ఆసియా, మంగోలియా నుంచి చలికాలంలో ఈ పెద్ద రెక్కల గద్దలు మనదేశానికి వస్తాయి. అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉంది ఈ గద్ద. ఇటీవల విజయవాడ రూరల్ మండలం అంబాపురంలో ఒక వ్యక్తి పొలంలో దీన్ని ఫొటో తీయడంతో వీటి ఉనికి బయటపడింది. ఇవికాకుండా శీతాకాలంలో పలు వలస పక్షులు ఈ ప్రాంతానికి ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. వాటిలో అరుదుగా ఉండే కోకిల, పలు రకాల గద్దలు కూడా ఉన్నాయి. కొత్త రకం చుంచు (మద్రాస్ ట్రీష్రూ) కృష్ణా జిల్లా మూలపాడు సీతాకోక చిలుకల పార్కులో సెప్టెంబర్ 10న దీన్ని గుర్తించారు. కీటకాలు, విత్తనాలు తిని జీవించే ఈ చుంచు జాతి ప్రాణులు రాతి ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. ఉడతల మాదిరిగా ఉండే ఇవి నడుస్తున్నప్పుడు తోకపైకి వంగి ఉంటుంది. 1850లో నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల మధ్య కొండల్లో మొదటిసారిగా వీటిని కనుగొన్నారు. అంతకుముందు విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లా అటవీ ప్రాంతాల్లోనూ సంచరించినట్లు గుర్తించారు. ఐదు చారల తాటి ఉడుత మన ఇళ్ల వద్ద కనిపించే సాధారణ ఉడుత శరీరంపై మూడు చారలు మాత్రమే ఉంటాయి. ఐదు చారల తాటి ఉడుతలున్నా అవి అంతరించిపోయినట్లు భావించారు. కానీ సెప్టెంబర్ 10న మూలపాడు అడవిలో, 11న విజయవాడ రూరల్ మండలం నున్న సమీపంలో వీటిని గుర్తించారు. ఈ ప్రాంతంలో వీటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కొత్త జాతులు చాలా ఉన్నాయి మూలపాడు ప్రాంతంలో జీవవైవిధ్యం బాగుండటంతో కొత్త వన్యప్రాణులు ఇక్కడ కనిపిస్తున్నాయి. విజయవాడ పరిసరాల్లో ఇప్పటివరకు 630 జాతుల (పక్షులు, కీటకాలు, సాలె పురుగులు, క్షీరదాలు మొదలైనవి)ను రికార్డు చేశాం. 260కి పైగా పక్షి జాతుల సమాచారం మా వద్ద ఉంది. ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువ జీవజాతులు ఉన్నాయని భావిస్తున్నాం. ఐఐఎస్ఈఆర్ బయాలజీ విభాగం, దులీప్ మాథై నేచర్ కన్జర్వేషన్ ట్రస్ట్ సహకారంతో తిరుపతి, విజయవాడలో సర్వే చేస్తున్నాం. – రాజశేఖర్ బండి, సిటిజన్ సైన్స్ కో–ఆర్డినేటర్, ఐఐఎస్ఈఆర్ -
1,72,000 క్రితం నాటి నది ఆనవాళ్లు గుర్తింపు
జైపూర్: లక్షా డెభ్బై రెండు వేల(1,72,000) సంవత్సరాల క్రితం రాజస్తాన్‌లోని బికనీర్ సమీపంలో ఉన్న సెంట్రల్ థార్ ఎడారి గుండా ప్రవహించి కాల ప్రవాహంలో కనుమరుగైన “నది”ఆనవాళ్లను పరిశోధకులు తాజాగా ఆధారాలతో సహా కనుగొన్నారు. ఈ ప్రాంతంలో మానవులు నివసించేందుకు.. నాగరికత అభివృద్ధి చెందేందుకు ఈ నది ఒక జీవనరేఖగా ఉండొచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. జర్మనీలోని ది మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ సైన్స్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ, తమిళనాడులోని అన్నా విశ్వవిద్యాలయం, ఐఐఎస్ఈఆర్ కోల్‌కతా పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనం చేశారు. పరిశోధన వివరాలు క్వాటర్నరీ సైన్స్ రివ్యూస్ జర్నల్‌లో ప్రచురించబడ్డాయి. సెంట్రల్ థార్ ఎడారిలోని నల్ క్వారీలో అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో జరిపిన పరిశోధనలు నది కార్యకలాపాల దశను సూచించాయి. ఇక ఈ అధ్యాయన ప్రకారం రాతియుగం నాటి మానవులు ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న దానికంటే భిన్నమైన థార్ ఎడారి ప్రకృతిలో నివసించినట్లు తెలుస్తోంది. కనుమరుగైన నది సమీప ఆధునిక నదికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లుగా పరిశోధనలో తేలింది. (చదవండి: వర్షం.. పర్వతాలను సైతం కదిలిస్తుందట!) ‘లుమినిసెన్స్ డేటింగ్’ ద్వారా ఇక కనుమరుగైన నదీ సమాచారం గురించి నల్ గ్రామానికి సమీపంలోని క్వారీ నుండి వెల్లడైన ఇసుక, కంకరల లోతైన నిక్షేపాన్ని ఈ బృందం అధ్యయనం చేసింది. అదేవిధంగా పరిశోధకులు వివిధ నిక్షేపాలను అధ్యయనం చేయడం ద్వారా వివిధ దశల నది కార్యకలాపాలను డాక్యుమెంట్ చేయగలిగారు. నది ఇసుకలోని క్వార్ట్జ్ గ్రేయిన్స్ ఎప్పుడు ఖననం అయ్యాయో తెలుసుకునేందుకు పరిశోధకులు ‘లుమినిసెన్స్ డేటింగ్’ అనే పద్ధతిని ఉపయోగిస్తారు. దీన్ని ఉపయోగించి ఫ్లూవియల్ నిక్షేపాల దిగువన చాలా చురుకైన నది వ్యవస్థకు సంబంధించిన ఆధారాలను గుర్తించినట్లు అచ్యుతన్ చెప్పారు. సుమారు 172 వేల సంవత్సరాల క్రితం నల్ వద్ద బలమైన నది కార్యకలాపాలు జరిగాయని ఫలితాలు సూచించాయన్నారు. సెంట్రల్ థార్ ఎడారి గుండా ప్రవహించే నది పాలియోలిథిక్ జనాభాకు లైఫ్ లైన్‌గా ఉందని.. వలసలకు ముఖ్యమైన కారిడార్‌గా ఉండేదని వారు తెలిపారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల అధ్యయనం కూడా థార్ ఎడారి గుండా ప్రవహించిన నది మార్గాల నెట్‌వర్క్‌ను చూపించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనాలు గతంలో నదులు, ప్రవాహాలు ఎక్కడ ప్రవహించాయో సూచించగలవే కానీ అవి ఎప్పటివి అన్న విషయం మాత్రం చెప్పలేవని అన్నా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ హేమా అచ్యుతన్ అన్నారు. (చదవండి: గులాబీ రంగులోకి మంచు.. కారణం!) థార్ ఎడారికి గొప్ప చరిత్ర ఉందని పరిశోధకులు తెలిపారు. రాతియుగ జనాభా ఈ అర్ధ-శుష్క ప్రకృతిలో మనుగడ సాగించడమే కాకుండా ఎలా అభివృద్ధి చెందిందో చూపించే అనేక రకాల సాక్ష్యాలను తాము వెలికితీస్తున్నట్లు ది మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ సైన్స్ ఆఫ్ హ్యూమన్ శాస్ర్తవేత్త జింబోబ్ బ్లింక్‌హార్న్ తెలిపారు. చరిత్ర పూర్వంలోని కీలక కాలంలో నదీ వ్యవస్థలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు మనకు చాలా తక్కువ వివరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. ఆఫ్రికా నుంచి భారతదేశానికి హోమో సేపియన్ల ప్రారంభ విస్తరణలతో ఈ నది ముడిపడి ఉన్నట్లుగా తెలిపారు. -
ఐఐటీ, ఐఐఎస్ఈఆర్కు స్థల పరిశీలన
శ్రీకాళహస్తి, ఏర్పేడు : ఏర్పేడు మండలంలోని మేర్లపాక, పంగూరు, జంగాలపల్లె, చింతలపాళెం, తిరుపతికి సమీపం లోని సూరప్ప కశంలోని ప్రభుత్వ భూముల్లో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్ల ఏర్పాటుకు గురువారం రాష్ట్ర మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గంటా శ్రీనివాసరావుతోపాటు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. కేంద్రబృందం సభ్యులు భాస్కర్మూర్తి(ఐఐటీ చెన్నై), యూబీ దేశాయ్(ఐఐటీ హైదరాబాద్), నీలం సహాని (ఐఏఎస్, రాష్ట్ర ప్రిన్సిపల్ కార్యదర్శి ఉన్నత విద్యాశాఖ), శైలేంద్రశర్మ (సీపీడబ్యూడీ రాష్ట్ర చీఫ్ ఇంజినీర్), ప్రవీణ్‌ప్రకాష్ (సాంకేతిక విద్యా నిపుణులు), వినోద్‌సింగ్(ఐఐటీ నిపుణులు) ఆయా ప్రాంతాల్లో కలియతిరిగారు. భూములు బాగానే ఉన్నాయని.. అయితే అటవీప్రాంతంకావడంతో క్రూరమృగాలతో ఇబ్బందులు వస్తాయనే అంశంపై చర్చించా రు. మంత్రులు మాట్లాడుతూ భూములపైభాగంలో సోమశిల-స్వర్ణముఖి కాలువ పనులు జరుగుతున్నాయన్నారు. మరోవైపు రేణిగుంట విమానాశ్రయం, మన్నవరం ఎన్బీపీపీఎల్ ప్రాజెక్టు, చెన్నై, కృష్ణపట్నం, దుగ్గిరాజుపట్నం ఓడరేవులు, రాష్ట్ర రాజధాని విజయవాడకు రోడ్డు, రైలు రవాణామార్గలు ఈ ప్రాంతానికి ఎన్నికిలోమీటర్ల దూరంలో ఉన్నాయనే అంశాలపై చర్చించారు. అనంతరం భూముల వివరాలు తెలియజేయాలని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌కు సూచించారు. ఆయన మేర్లపాక లో 440 ఎకరాలు, పంగూరులో 366, చింతలపాళ్లెంలో 758, పాగాలిలోని 559, పల్లంలోని 929 ఎకరాల భూములున్నాయన్నారు. కేంద్ర బృందంతో తి రుపతి ఎమ్మెల్యే వెంకటరమణ , జిల్లా జాయింట్ కలెక్టర్ భరత్‌గుప్త, తిరుపతి ఆర్డీవో రంగయ్య ఉన్నారు.