పనిచేసే కార్యాలయాలు, ఫ్యాక్టరీలు, విద్యాలయాలు వంటి సామూహిక సంస్థల్లో ప్రజల్లో ఉన్న సామాజిక వైవిధ్యం కనిపించాలంటారు పారిశ్రామిక దేశాల మేధావులు, రాజ్యాంగ నిపుణులు, న్యాయకోవిదులు. ప్రజాప్రతినిధులు. సమాజంలోని అన్ని వర్గాలు, జాతులు, మతాలు, రంగుల మనుషులు ఉంటే మంచిదని చెబుతారు.
విద్యనభ్యసించే స్కూళ్లు, కాలేజీల్లో అన్ని సామాజికవర్గాల విద్యార్థులు ఉంటే ఈ పిల్లల జ్ఞానం, వివేకం ఎక్కువ ఉంటాయని కూడా వారి అనుభవంలో తేలింది. అలాగే ఆఫీసులు, కర్మాగారాల్లో కూడా అన్ని జాతులు, వర్గాల ఉద్యోగులు ఉంటే వారి పనితీరు లేదా ఉత్పాదకత కాస్త ఎక్కువ ఉంటుందని అమెరికా, ఐరోపా దేశాల్లో రుజువైంది. అందుకే ‘అఫర్మేటివ్ యాక్షన్’, ‘పాజిటివ్ డిస్క్రిమినేషన్’ పేరిట పాశ్చాత్య దేశాల్లో (ఇండియాలో వివిధ స్థాయిల్లో కోటా లేదా రిజర్వేషన్ పేరుతో అమలు చేసే సామాజిక న్యాయ కార్యక్రమాల మాదిరిగా) అనేక పథకాలను ఎప్పటి నుంచో ప్రభుత్వాలు ఆచరణలో పెట్టాయి.
ముఖ్యంగా ప్రభుత్వం నడిపే లేదా సర్కారీ నిధుల సాయంతో నడిచే విద్యాసంస్థల్లో బడుగు వర్గాల విద్యార్థులకు కొంత శాతం సీట్లు కేటాయించి, వారికి ప్రవేశం కల్పిస్తున్నారు. రాష్ట్రాల్లో, కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు, ఐఐటీలు, ఐఐఎంలు వంటి ఉన్నత విద్యాసంస్థల్లో సైతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కోటాలు విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఓబీసీలకు కాస్త ఆలస్యంగా కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో 1990ల నుంచీ అమలవుతున్నాయి ఈ కోటాలు.
(చదవండి: అసలు ఐఐటీలో ఏముంటుంది? ఎందుకు చేర్పించాలి? ఏం నేర్చుకుంటారు?)
ఐఐటీలు, ఐఐఎంల సంఖ్యను గత పాతికేళ్లలో పెంచిన కేంద్ర ప్రభుత్వం అక్కడ అదివరకే ఎస్సీలు, ఎస్టీలకు ఉన్న కోటాలకు తోడుగా కొత్తగా ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించింది. కోటాలు ఉన్న సామాజిక వర్గాలకు సైతం తీవ్ర ఒత్తిడికి లోను చేసే పోటీ పరీక్షల ద్వారా ర్యాంకులు సంపాదిస్తేనే ఈ అత్యున్నత విద్యాసంస్థల్లో సీట్లు దొరుకుతాయి. ఈ క్రమంలో జేఈఈ, క్యాట్ వంటి తీవ్ర పోటీ ఉన్న ప్రవేశ పరీక్షలు రాసి కోటా ద్వారా ఐఐటీలు, ఐఐఎంలలో సీట్లు సాధించగానే సరిపోదు. అధ్యాపకవర్గంలో కూడా అన్నివర్గాలకు ప్రాతినిధ్యం లేకపోవడం, ఆయా సంస్థల పాలకవర్గాల్లో బడుగువర్గాల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ లేకపోవడం వల్ల గత పది పదిహేనేళ్లుగా అవాంఛనీయ పరిణామాలు సంభవిస్తున్నాయి.
డ్రాపవుట్లు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి!
కోటాల ద్వారా ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన బడుగువర్గాల విద్యార్థులు తమకు చదువు, పోటీతత్వానికి సంబంధించిన తగినంత కుటుంబ నేపథ్యం లేకపోవడం వల్ల అన్ని కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎంలలో చేరిన కొన్నేళ్లకే చదువులకు మధ్యలోనే స్వస్తి చెబుతూ ‘డ్రాపవుట్లు’గా మారుతున్నారు. 2018–2023 మధ్య ఇలా ఈ ఉన్నత విద్యాసంస్థల నుంచి కోర్సు మధ్యలోనే నిష్క్రమించిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు 19,000 దాటిపోయారని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ రాజ్యసభలో ఇటీవల సమాచారం అందించారు.
అలాగే, 2014–2021 మధ్య అన్ని సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్‌ఈఆర్‌లలో చదువుతున్న విద్యార్థుల్లో 122 మంది మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని పార్లమెంటుకు కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. తాము చేరిన విద్యాసంస్థల్లో రకరకాల ఒత్తిళ్లు తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్న ఈ విద్యార్థులంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు చెందినవారు కావడం విషాదకర వాస్తవం. కోటాల ద్వారా ప్రవేశం పొందిన బలహీనవర్గాల విద్యార్థులను ఆయా విద్యాసంస్థల్లో అన్ని విధాలుగా ఆదుకుంటూ, ఆసరగా ఉండే వ్యవస్థలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయం పార్లమెంటు ఉభయసభల సభ్యుల దృష్టికి వచ్చాక ప్రభుత్వం ఈ సమస్యపై తక్షణమే మనసు పెట్టి పరిష్కరించాల్సిన సమయం ఆసన్నమైంది.
(చదవండి: ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. రెండు నెలల్లో నాలుగు ఆత్మ హత్యలు.. ఐఐటీ చెన్నైలో ఏం జరుగుతోంది?)
-విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎంపీ
Comments
Please login to add a commentAdd a comment