central universities
-
తెలుగు వర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో నిలపాలి
నాంపల్లి (హైదరాబాద్): దేశంలో సంస్కృత, హిందీ, పాశ్చాత్య భాషలకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏర్పడినట్లుగా తెలుగు భాషకు కూడా జాతీయ స్థాయిలో ఒక విశ్వవిద్యాలయం ఏర్పడితే తప్ప తెలుగు భాషా, సంస్కృతిని విస్తృత స్థాయిలో భవిష్యత్ తరాలకు అందించలేమని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. శనివారం తెలుగు వర్సిటీ ఎన్టీఆర్ కళా మందిరంలో ఏర్పాటు చేసిన మండలి వెంకటకృష్ణారావు సంస్కృతీ పురస్కార ప్రదానోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలుగు వర్సిటీ ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. నగర శివార్లలోని బాచుపల్లిలో వందెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కాబోతున్న తెలుగు విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు తెలుగు భాషపై మక్కువ కలిగిన, భాషకు ఎనలేని కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని కోరారు. సభకు అధ్యక్షత వహించిన వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్‌రావు మాట్లాడుతూ... రాష్ట్ర తర తెలుగు సంస్థలకు తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాషా సంస్కృతి ఔన్నత్యాన్ని పెంచే సాహిత్యాన్ని అందజేయడమే కాకుండా ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకుని తెలుగు భాష, బోధన, పరివ్యాప్తికి కృషి చేస్తున్నదని అన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ... శాస్త్రీయ విజ్ఞానం మాతృ భాషలో విద్యార్థులకు అందుబాటులో ఉంచితే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. ఆత్మియ అతిథిగా హాజరైన మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ... ఉభయ తెలుగు రాష్ట్రాలలోని తెలుగు వారికన్నా ప్రవాసాంధ్రులకే తెలుగు భాషపై మక్కువ ఎక్కువని అన్నారు. జర్మనీ మాజీ ఎంపీ డాక్టర్ జి.రవీంద్ర కార్యక్రమంలో పాల్గొని తెలుగులో మాట్లాడి సభికులను ఆకట్టుకున్నారు. అంతర్జాతీయంగా తెలుగు భాషా సంస్కృతి, ఆధ్యాత్మిక వికాసానికి చిరస్మరణీయమైన సేవలందిస్తున్న లండన్‌లోని యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్తా) సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సత్య ప్రసాద్ కిల్లీకి మండలి వెంకట కృష్ణారావు సంస్కృతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి మండలి వెంకటకృష్ణారావు తెలుగు కేంద్రం సంచాలకులు ఆచార్య వై.రెడ్డి శ్యామల సమన్వయకర్తగా వ్యవహరించగా, సంస్థ కో ఆర్డినేటర్ డాక్టర్ విజయ్‌పాల్ పాత్లోత్ వందన సమర్పణ చేశారు. -
ఐఐటీల్లో ఆత్మహత్యలు ఎందుకు?
పనిచేసే కార్యాలయాలు, ఫ్యాక్టరీలు, విద్యాలయాలు వంటి సామూహిక సంస్థల్లో ప్రజల్లో ఉన్న సామాజిక వైవిధ్యం కనిపించాలంటారు పారిశ్రామిక దేశాల మేధావులు, రాజ్యాంగ నిపుణులు, న్యాయకోవిదులు. ప్రజాప్రతినిధులు. సమాజంలోని అన్ని వర్గాలు, జాతులు, మతాలు, రంగుల మనుషులు ఉంటే మంచిదని చెబుతారు. విద్యనభ్యసించే స్కూళ్లు, కాలేజీల్లో అన్ని సామాజికవర్గాల విద్యార్థులు ఉంటే ఈ పిల్లల జ్ఞానం, వివేకం ఎక్కువ ఉంటాయని కూడా వారి అనుభవంలో తేలింది. అలాగే ఆఫీసులు, కర్మాగారాల్లో కూడా అన్ని జాతులు, వర్గాల ఉద్యోగులు ఉంటే వారి పనితీరు లేదా ఉత్పాదకత కాస్త ఎక్కువ ఉంటుందని అమెరికా, ఐరోపా దేశాల్లో రుజువైంది. అందుకే ‘అఫర్మేటివ్ యాక్షన్’, ‘పాజిటివ్ డిస్క్రిమినేషన్’ పేరిట పాశ్చాత్య దేశాల్లో (ఇండియాలో వివిధ స్థాయిల్లో కోటా లేదా రిజర్వేషన్ పేరుతో అమలు చేసే సామాజిక న్యాయ కార్యక్రమాల మాదిరిగా) అనేక పథకాలను ఎప్పటి నుంచో ప్రభుత్వాలు ఆచరణలో పెట్టాయి. ముఖ్యంగా ప్రభుత్వం నడిపే లేదా సర్కారీ నిధుల సాయంతో నడిచే విద్యాసంస్థల్లో బడుగు వర్గాల విద్యార్థులకు కొంత శాతం సీట్లు కేటాయించి, వారికి ప్రవేశం కల్పిస్తున్నారు. రాష్ట్రాల్లో, కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు, ఐఐటీలు, ఐఐఎంలు వంటి ఉన్నత విద్యాసంస్థల్లో సైతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కోటాలు విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఓబీసీలకు కాస్త ఆలస్యంగా కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో 1990ల నుంచీ అమలవుతున్నాయి ఈ కోటాలు. (చదవండి: అసలు ఐఐటీలో ఏముంటుంది? ఎందుకు చేర్పించాలి? ఏం నేర్చుకుంటారు?) ఐఐటీలు, ఐఐఎంల సంఖ్యను గత పాతికేళ్లలో పెంచిన కేంద్ర ప్రభుత్వం అక్కడ అదివరకే ఎస్సీలు, ఎస్టీలకు ఉన్న కోటాలకు తోడుగా కొత్తగా ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించింది. కోటాలు ఉన్న సామాజిక వర్గాలకు సైతం తీవ్ర ఒత్తిడికి లోను చేసే పోటీ పరీక్షల ద్వారా ర్యాంకులు సంపాదిస్తేనే ఈ అత్యున్నత విద్యాసంస్థల్లో సీట్లు దొరుకుతాయి. ఈ క్రమంలో జేఈఈ, క్యాట్ వంటి తీవ్ర పోటీ ఉన్న ప్రవేశ పరీక్షలు రాసి కోటా ద్వారా ఐఐటీలు, ఐఐఎంలలో సీట్లు సాధించగానే సరిపోదు. అధ్యాపకవర్గంలో కూడా అన్నివర్గాలకు ప్రాతినిధ్యం లేకపోవడం, ఆయా సంస్థల పాలకవర్గాల్లో బడుగువర్గాల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ లేకపోవడం వల్ల గత పది పదిహేనేళ్లుగా అవాంఛనీయ పరిణామాలు సంభవిస్తున్నాయి. డ్రాపవుట్లు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి! కోటాల ద్వారా ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన బడుగువర్గాల విద్యార్థులు తమకు చదువు, పోటీతత్వానికి సంబంధించిన తగినంత కుటుంబ నేపథ్యం లేకపోవడం వల్ల అన్ని కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎంలలో చేరిన కొన్నేళ్లకే చదువులకు మధ్యలోనే స్వస్తి చెబుతూ ‘డ్రాపవుట్లు’గా మారుతున్నారు. 2018–2023 మధ్య ఇలా ఈ ఉన్నత విద్యాసంస్థల నుంచి కోర్సు మధ్యలోనే నిష్క్రమించిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు 19,000 దాటిపోయారని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ రాజ్యసభలో ఇటీవల సమాచారం అందించారు. అలాగే, 2014–2021 మధ్య అన్ని సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్ఈఆర్లలో చదువుతున్న విద్యార్థుల్లో 122 మంది మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని పార్లమెంటుకు కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. తాము చేరిన విద్యాసంస్థల్లో రకరకాల ఒత్తిళ్లు తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్న ఈ విద్యార్థులంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు చెందినవారు కావడం విషాదకర వాస్తవం. కోటాల ద్వారా ప్రవేశం పొందిన బలహీనవర్గాల విద్యార్థులను ఆయా విద్యాసంస్థల్లో అన్ని విధాలుగా ఆదుకుంటూ, ఆసరగా ఉండే వ్యవస్థలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయం పార్లమెంటు ఉభయసభల సభ్యుల దృష్టికి వచ్చాక ప్రభుత్వం ఈ సమస్యపై తక్షణమే మనసు పెట్టి పరిష్కరించాల్సిన సమయం ఆసన్నమైంది. (చదవండి: ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. రెండు నెలల్లో నాలుగు ఆత్మ హత్యలు.. ఐఐటీ చెన్నైలో ఏం జరుగుతోంది?) -విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ ఎంపీ -
సెంట్రల్ వర్సిటీల ఎంట్రన్స్‌లో ఇంటర్ వెయిటేజి రద్దు
సాక్షి, అమరావతి: కేంద్రీయ వర్సిటీల్లో ప్రవేశాలకు ఇంటర్ మార్కులకు ఎలాంటి వెయిటేజి ఉండదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వెల్లడించింది. కొన్ని సెంట్రల్ వర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ)పై యూజీసీ ఇటీవల పబ్లిక్ నోటీసు విడుదల చేస్తూ ఈ విషయాన్ని ప్రకటించింది. సీయూఈటీ పరిధిలోకి ఈసారి 45 సెంట్రల్ వర్సిటీలు ఉన్నాయి. ఇప్పటివరకు కొన్ని వర్సిటీలు ఇంటర్ మార్కులను కూడా వెయిటేజిగా తీసుకొంటున్నాయి. ఇకపై ఇంటర్ మార్కులకు వెయిటేజి ఉండదని, ఆయా వర్సిటీలు ఇంటర్మీడియట్‌ను అర్హత పరీక్షగా మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని యూజీసీ పేర్కొంది. ప్రవేశాలు పూర్తిగా సీయూఈటీలో అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటాయని స్పష్టంచేసింది. అయితే, యూనివర్సిటీలో ప్రవేశానికి ఇంటర్మీడియట్ అర్హత మార్కులను ఏ మేరకు తీసుకోవాలో ఆ వర్సిటీలే నిర్ణయించుకుంటాయి. అంటే విశ్వవిద్యాలయం నిర్ణయించిన అర్హత మార్కులు పొందిన విద్యార్థులకు మాత్రమే సీయూఈటీలో వచ్చిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్మీడియట్ (12వ తరగతి) మూల్యాంకన విధానం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా ఉండటం, కొన్ని రాష్ట్రాలు తమ విద్యార్థులకు మేలు చేసేలా ఎక్కువ మార్కులు వేస్తుండడం వల్ల వాటిని పరిగణనలోకి తీసుకోవడం సరికాదని యూజీసీ అభిప్రాయపడింది. ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలకూ సీయూఈటీతో ప్రవేశాలకు అవకాశం 2022–23 విద్యా సంవత్సరానికి సీయూఈటీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) 13 భాషల్లో నిర్వహిస్తుంది. హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, పంజాబీ, ఒడియా, ఇంగ్లిష్ భాషల్లో పరీక్ష ఉంటుంది. కేంద్రీయ విశ్వవిద్యాలయాలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలు కూడా సీయూఈటీని అనుసరించి ప్రవేశాలు నిర్వహించవచ్చని యూజీసీ పేర్కొంది. సీయూఈటీ ఆన్లైన్ దరఖాస్తులు ఏప్రిల్‌లో ఎన్టీఏ వెబ్సైట్లో ఉంచుతారు. పూర్తి నోటిఫికేషన్ ఎన్టీఏ విడుదల చేస్తుంది. సీయూఈటీలో మార్కుల ప్రాతిపదికగా ఎన్టీఏ మెరిట్ జాబితా విడుదల చేస్తుంది. వర్సిటీలు తమ రిజర్వేషన్ విధానాన్ని అనుసరిస్తూనే సీయూఈటీ మెరిట్ ఆధారంగా ప్రవేశాలు నిర్వహిస్తాయని యూజీసీ ప్రకటించింది. ఎన్సీఈఆర్టీ 12వ తరగతి పాఠ్యపుస్తకాల ఆధారంగా సీయూఈటీకి బహుళైచ్ఛిక విధానంలో ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షల్లో నెగెటివ్ మార్కులుంటాయి. తప్పుడు సమాధానాలకు మార్కుల్లో కోత పడుతుంది. -
అన్ని వర్సిటీల్లో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు
సాక్షి, అమరావతి: సెంట్రల్ యూనివర్సిటీలు సహా దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి నాలుగేళ్ల కాలపరిమితితో డిగ్రీ కోర్సులు అమలులోకి రానున్నాయి. నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం కేంద్రం ఈ మేరకు చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే దీనిపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)తోను, యూనివర్సిటీలతోను కేంద్ర విద్యాశాఖ చర్చించింది. దీనిపై తదుపరి ఏర్పాట్లకు యూజీసీకి ఆదేశాలు జారీచేసింది. దేశంలోని 45 సెంట్రల్ వర్సిటీల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే అమల్లో ఉన్న మూడేళ్ల కోర్సులతో పాటే ఈ కొత్త కోర్సులు కూడా అమల్లో ఉంటాయని యూజీసీ పేర్కొంది. 2013లో నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టినా వాటిలో కొంతవరకు మాత్రమే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉన్నాయి. ఇప్పుడు మరిన్ని మార్పులుచేసి నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సులకు వర్సిటీలు రూపకల్పన చేయనున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఈ కోర్సులు విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉండేలా ఈ కోర్సుల్లోకి బహుళ ప్రవేశ, నిష్క్రమణలకు అవకాశం కల్పించనున్నారు. అలాగే రెండేళ్ల పీజీ కోర్సులను ఇక నుంచి ఏడాది కాలపరిమితితో కూడా అందుబాటులోకి తేనున్నారు. ఈ కోర్సులను ఎలా రూపొందించుకోవాలన్న దానిపై ఆయా వర్సిటీలే సొంతంగా నిర్ణయించుకుంటాయి. మన రాష్ట్రంలో ముందే చేపట్టిన విద్యాసంస్కరణలు నాలుగేళ్ల డిగ్రీ కోర్సులకు మన రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాదిలోనే ఏర్పాట్లు చేయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉన్నత విద్యారంగ సంస్కరణలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నాలుగేళ్ల డిగ్రీ కోర్సులకు రూపకల్పన చేశారు. విద్యార్థులకు పూర్తిస్థాయి నైపుణ్యాలు అలవడేందుకు నాలుగేళ్లలో ఒక ఏడాది ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశారు. దీనికి యూజీసీ అనుమతికి ప్రతిపాదించినా ముందు సానుకూలత రాలేదు. తరువాత అదే విధానాన్ని కేంద్రం నూతన జాతీయ విద్యావిధానంలో పొందుపరిచింది. కేంద్రం నిర్ణయానికి ముందే రాష్ట్రంలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులకు శ్రీకారం చుట్టడం గమనార్హం. ఇదేకాకుండా పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్, ఉన్నతవిద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్లను కూడా మన రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేశారు. తరువాత కేంద్ర నూతన విద్యావిధానంలోనూ వీటినే పేర్కొనడం విశేషం. -
యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు ఏరీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను అధ్యాపకుల కొరత వేధిస్తోంది. తెలంగాణవ్యాప్తంగా 11 యూనివర్సిటీల్లో ఏకంగా 1,869 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండటం బోధనా ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆరు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లే లేకపోవడం సమస్య తీవ్రతకు అద్దంపడుతోంది. అధ్యాపకుల కొరత కొట్టొచ్చినట్టూ కన్పిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని అధ్యాపకుల ఖాళీలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 65 శాతం ఖాళీలున్నా ఏమాత్రం పట్టించుకోవట్లేదని విద్యారంగ నిపుణులు విమర్శిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దశాబ్దాల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ లాంటి వాటిలోనూ విద్యా ప్రమాణాలు పడిపోయి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ గుర్తింపు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీల ఉనికికే ప్రమాదం... రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పదేళ్లుగా అధ్యాపకుల నియామకం ప్రహసనంగా మారిందని, ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం, ఆపై కుంటి సాకులతో వాయిదా వేయడం పరిపాటిగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టు సిబ్బందితో కాలం వెళ్లదీసినా ఆశించిన ఫలితాలు ఆమడ దూరంలోనే ఉంటున్నాయి. విశ్వవిద్యాలయాల్లో ముఖ్య భూమిక పోషించే పరిశోధనలు సైతం ప్రొఫెసర్ల కొరతతో ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 2,837 మంజూరైన పోస్టులు ఉంటే అందులో 1,869 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. కేవలం 968 మంది (34.12 శాతం) రెగ్యులర్ ఆధ్యాపకులున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రొఫెసర్ల సంఖ్య 157కాగా ఇంకా 238 ఖాళీలున్నాయి. అలాగే 129 మంది అసోసియేట్ ప్రొఫెసర్లుంటే ఇంకా 781 ఖాళీలున్నాయి. వర్సిటీల్లో 682 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తుంటే మరో 850 ఖాళీలున్నాయి. మొత్తంగా 1,869 ఖాళీల్లో 1,061 పోస్టుల భర్తీకి సర్కార్ మూడేళ్ల క్రితమే ఆమోదం తెలిపినా ఇప్పటికీ కార్యాచరణకు నోచుకోలేదు. ఇదీ దుస్థితి... ►శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు, ఆర్జీయూకేటీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సి టీ, పొట్టి శ్రీరాములు తె లుగు యూనివర్సిటీ (మొ త్తం ఆరు)ల్లో ఒక్క ప్రొఫె సర్ కూడా లేరు. శాతవాహన, ఆర్జీయూకేటీ, బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీల్లో ఒక్క అసోసియేట్ ప్రొఫెసర్ కూడా లేరు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఒకే ఒక్క అసోసియేట్ ప్రొఫెసర్ ఉన్నారు. ►రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 61.65 శాతం ప్రొఫెసర్ పోస్టులు, 85.82 శాతం అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 55.48 శాతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ►ఉస్మానియా వర్సిటీలో సగానికిపైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉండగా కాకతీయ యూనివర్సిటీలో కేవలం ఒకే ఒక్క ప్రొఫెసర్ ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. ►జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో (జేఎన్ఏఎఫ్ఏయూ) ఉన్నది ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లే. -
12 సెంట్రల్ వర్సిటీలకు కొత్త వీసీలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని 12 సెంట్రల్ యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ల నియామకానికి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గురువారం ఆమోదం తెలిపారని విద్యా శాఖ తెలిపింది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ, జార్ఖండ్, కర్ణాటక, తమిళనాడు, గయాలోని దక్షిణ బిహార్, మణిపూర్ విశ్వవిద్యాలయం, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం, నార్త్–ఈస్టర్న్ హిల్ విశ్వవిద్యాలయం, బిలాస్పూర్ గురు ఘాసిదాస్ విశ్వవిద్యాల యాలకు వీసీల నియామకం జరిగింది. కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్స్‌లర్‌గా ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ సత్యనారాయణను నియమించారు. దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో మొత్తం 22 వైస్ ఛాన్సలర్ల పోస్టులు ఖాళీగా ఉన్నా యని, అందులో 12 పోస్టులకు నియామకాలను రాష్ట్రపతి ఆమోదం తెలిపారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం రాజ్యసభకు తెలిపారు. అయితే ప్రస్తుతం పూర్తిస్థాయి వీసీలు లేని సెంట్రల్ యూనివర్సిటీలలో బనారస్ హిందూ యూనివర్సిటీ , ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వంటి ప్రముఖ విద్యాసంస్థలు ఉన్నాయి. కొత్త వైస్ ఛాన్స్లర్లు వీరే.. హరియాణా సెంట్రల్ యూనివర్శిటీ- ప్రొఫెసర్ (డాక్టర్) తంకేశ్వర్ కుమార్ హిమాచల్ ప్రదేశ్ సెంట్రల్ యూనివర్శిటీ- ప్రొఫెసర్ సత్ ప్రకాష్ బన్సాల్ జమ్మూ సెంట్రల్ యూనివర్శిటీ - డాక్టర్ సంజీవ్ జైన్ జార్ఖండ్ సెంట్రల్ యూనివర్శిటీ - క్షితి భూçషణ్ దాస్ కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ - ప్రొఫెసర్ బట్టు సత్యనారాయణ తమిళనాడు సెంట్రల్ యూనివర్శిటీ - ప్రొఫెసర్ ముత్తుకలింగన్ కృష్ణన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ- డాక్టర్ బసుత్కర్ జె రావు దక్షిణ బిహార్ సెంట్రల్ యూనివర్శిటీ - ప్రొఫెసర్ కామేశ్వర్‌నాథ్ సింగ్ నార్త్–ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ- ప్రొఫెసర్ ప్రభాశంకర్ శుక్లా గురు ఘాసిదాస్ యూనివర్సిటీ - డాక్టర్ అలోక్ కుమార్ చక్రవల్ మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ- ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్ మణిపూర్ యూనివర్సిటీ - ప్రొఫెసర్ ఎన్. లోకేంద్ర సింగ్ -
సెంట్రల్ వర్సిటీల్లో యోగా శాఖలు
న్యూఢిల్లీ: ఆరు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో కొత్తగా యోగా డిపార్టుమెంట్‌ను ఏర్పాటుచేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్ఆర్డీ) శాఖ నిర్ణయించింది. లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా హెచ్ఆర్డీ శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ మంగళవారం ఈ విషయం చెప్పారు. ఇందిరాగాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ, హేమ్వతి నందన్ బహుగుణ గర్వాల్ యూనివర్సిటీ, విశ్వభారతి, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్, మణిపూర్ యూనివర్సిటీల్లో కొత్తగా యోగా శాఖలను ఏర్పాటుచేయనున్నారు. ఈ వర్సిటీల్లో యోగా శాఖల ఏర్పాటుకు యూజీసీ ఇప్పటికే అనుమతినిచ్చిందని సత్యపాల్ చెప్పారు. -
జెండాతో సమస్య పరిష్కారం!!
వ్యతిరేక, అనుకూల ప్రదర్శనలతో ఢిల్లీ వీధులను గత వారం రోజులుగా హోరెత్తించిన జేఎన్‌యూ వివాదానికి ఎట్టకేలకు ప్రభుత్వం పరిష్కారం కనుగొందని, యూనివర్సిటీ క్యాంపస్‌లో జెండా ఎగరవేసి విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని రగిలించడమే ప్రభుత్వం ఉత్తమ మార్గంగా భావించిందంటూ ట్విట్టర్లో ట్వీట్లు వెల్లువెత్తాయి. అన్ని సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రతిరోజు జాతీయ జెండాను ఎగురవేయాలని, ఆ జెండా 207 అడుగుల ఎత్తులో, బరువు 35 కిలోలు ఉండాలంటూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆదేశం మేరకు వీసీలు బుధవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా, ప్రతికూలంగాను ట్వీట్లు వెల్లువెత్తాయి. కొంతమంది తమదైన శైలిలో వ్యంగోక్తులు విసిరారు. 'విద్యార్థులు జెండా వందనంలో పాల్గొంటే వారు పాకిస్తానీయులు కాదని, భారతీయులేనని గుర్తించవచ్చు.. జెండాల తయారీకి కుట్టు మిషన్ కొట్టు పెట్టుకోవడానికి ఇదే అదను.. అలాగే జెండాపై అర్ణబ్ గోస్వామి చిత్రాన్ని అతికిస్తే బాగుంటుంది.. ఇది మోదీ సర్కార్ నయా జాతీయవాద మంత్రం. ఓ దళిత విద్యార్థి ఆత్మహత్య, జేఎన్‌యూ వివాదం దీని ముందు దిగదుడుపే... ఆరెస్సెస్‌ను కూడా ప్రతిరోజు జెండా ఎగరవేయమని చెబితే పోలా!...అయ్యో జెండాతో సమస్య పరిష్కారమయ్యాక మరో సమస్య ఏమిటి? రామ్‌దేవ్ బాబా యోగాను కూడా కంపల్సరీ చేస్తే బాగుంటుంది.....జెండా 207 అడుగులు ఎందుకుండాలంటే మనిషిలో 206 ఎముకలు ఉంటాయిగనక....ప్రతి టీవీ ఛానల్ కూడా రాత్రి తొమ్మిది గంటలకు జెండా వందన సమర్పణ చేసి జాతీయ గీతాన్ని ప్రసారం చేయాలనే నిబంధన తీసుకురావాలి'... ఇలా ట్వీట్లు చేశారు. -
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీయే బెస్ట్!
హైదరాబాద్: హెచ్ సీయూ( హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ)కి అరుదైన గౌరవం దక్కింది. దేశ వ్యాప్తంగా ఉన్న పలు కేంద్రీయ విశ్వ విద్యాలయాలను పక్కకు నెట్టి.. బెస్ట్ విజిటర్స్ అవార్డుకు ఎన్నికైంది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 4న రాష్ట్రపతి భవన్ లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ అవార్డును అందించనున్నారు. ఈ అవార్డు ఎంపికకు ఉత్తమ యూనివర్సిటీ, పరిశోధన, ఆధునీకరణ తదితర అంశాలను పరిశీలిస్తారు. దేశంలోని అన్ని సెంట్రల్ యూనివర్సిటీలకు రాష్ట్రపతే 'విజిటర్' కావడంతో ఆయన చేతుల మీదుగా అవార్డు అందిస్తారు. సెంట్రల్ యూనివర్సిటీ అవార్డులకు సంబంధించి ఫిబ్రవరి 4, 5 వ తేదీల్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్రపతి భవన్ ఫేస్ బుక్ లో తెలిపింది. ఆన్ లైన్ లో అన్ని యూనివర్సిటీల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి, వాటిలోంచి అత్యుత్తమమైన వాటిని ఎంపిక చేస్తారు. అలా హైదరబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈ అవార్డుకు ఎంపికైంది. -
అసాధారణ పరిస్థితుల్లోనే ఆర్డినెన్స్‌లు
కేంద్రానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సూచన చట్టాలు చేసేందుకు దగ్గరి దారిగా చూడొద్దని హితవు న్యూఢిల్లీ: మోదీ సర్కారు కుప్పలుతెప్పలుగా ఆర్డినెన్స్‌లు తీసుకువస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం కొన్ని అసాధారణ, ప్రత్యేక పరిస్థితుల్లోనే పార్లమెంట్ ప్రమేయం లేకుండా ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చే వెసులుబాటు కల్పించిందని, దీన్ని చట్టాలు చేయడానికి సులువైన మార్గంగా చూడొద్దని కేంద్రానికి సూచించారు. ఆర్డినెన్స్ వెసులుబాటును సాధారణ చట్టాలకు కూడా వర్తింపచేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఆర్డినెన్స్‌లు తీసుకురావడం, దానిపై విపక్షాలు గగ్గోలు పెట్టడం పరిపాటిగా మారిపోయిందని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు అన్ని పార్టీలు చర్చల ద్వారా ఒక పరిష్కారాన్ని కనుగొనాలని సూచించారు. సోమవారం కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల్లోని ఫ్యాకల్టీ, విద్యార్థులను ఉద్దేశించి రాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. పార్లమెంట్ ఆమోదంతో పనిలేకుండానే ప్రభుత్వం పలు ఆర్డినెన్స్‌లు తీసుకురావడంపై ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నపై సుదీర్ఘంగా మాట్లాడారు. ‘‘కొన్నిసార్లు చట్టాన్ని ఆమోదించుకోవడానికి అధికార పార్టీకి రాజ్యసభలో తగినంత మంది సభ్యులు ఉండకపోవచ్చు. అప్పుడు ఉభయ సభలను సమావేశపరిచి చట్టాన్ని ఆమోదించుకోవచ్చు. వాస్తవానికి ఇది కూడా క్లిష్టమే. 1952 నుంచి ఇప్పటిదాకా చూస్తే ఉభయ సభలను సమావేశపరిచి నాలుగుసార్లు మాత్రమే చట్టాలు ఆమోదించారు. కొన్ని ప్రత్యేక, అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఆర్డినెన్స్‌లు జారీ చేయడానికి రాజ్యాంగం అనుమతించింది. సాధారణ చట్టాలు చేయడానికి కూడా ఆర్డినెన్స్ మార్గాన్ని ఎంచుకోవడం సరికాదు’’ అని ప్రణబ్ పేర్కొన్నారు. ‘‘ఒక అంశాన్ని ప్రతిపక్షం వ్యతిరేకించవచ్చు, పూర్తిగా నిరాకరించవచ్చు. ఏదేమైనా ఆ సమస్యకు వివిధ మార్గాల ద్వారా పరిష్కారం కనుగొనడం రాజకీయ పార్టీల బాధ్యత’’ అని వ్యాఖ్యానించారు. భూసేకరణతోపాటు వివిధ కీలకాంశాలపై మోదీ సర్కారు ఏకంగా ఎనిమిది ఆర్డినెన్స్‌లు తీసుకువ చ్చిన నేపథ్యంలో ప్రణబ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భూసేకరణ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపే ముందు దాని ఆవశ్యకతపై ముగ్గురు సీనియర్ కేంద్రమంత్రుల నుంచి ప్రణబ్ వివరణ తీసుకున్న సంగతి తెలిసిందే. -
సర్టిఫికెట్లను సొంతంగా అటెస్ట్ చేసుకోవచ్చు
* ఐఐటీ, ఐఐఎం అభ్యర్థులకు తప్పనున్న తిప్పలు న్యూఢిల్లీ: ఐఐటీ, ఐఐఎం, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తమ సర్టిఫికెట్ల కాపీల ధ్రువీకరణకోసం గెజిటెట్ అధికారుల చుట్టూ తిరగాల్సిన తిప్పలు తప్పనున్నాయి. సర్టిఫికెట్ల కాపీలకు ఆ అధికారుల ధ్రువీకరణ అవసరం లేదని, వాటిని వారే సొంతంగా ధ్రువీకరించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అభ్యర్థులు సొంతంగా అటెస్ట్ చేసుకు న్న సర్టిఫికెట్లను స్వీకరించాలని ఆయా విద్యాసంస్థల్ని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆదేశించింది. ఆ సర్టిఫికెట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కోరిం ది. ఈ విధానం ప్రస్తుత విద్యా సంవత్సరంనుంచే అమల్లోకి వచ్చినట్లు ఆ శాఖ అధికారులు చెప్పారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను అడ్మిషన్ల సమయంలో అందజేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర స్థాయి సంస్థలు కూడా ఈ విధానాన్ని అనుసరించాలని కోరనున్నామన్నారు. సర్టిఫికెట్ల ధ్రువీకరణలో ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందుల నివారణకు స్వీయ ధ్రువీకరణ విధానాన్ని తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని సిబ్బంది, ప్రజా ఫిర్యాదుల శాఖ వివిధ మంత్రిత్వ శాఖలను కోరిన నేపథ్యంలో మానవ వనరుల అభివృద్ధిశాఖ పై నిర్ణయం తీసుకుంది. మార్కుల జాబితాలు వంటి కొన్ని సర్టిఫికెట్లను సొంతంగా అటెస్ట్ చేసుకునే విధానాన్ని పలు కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే అమల్లోకి తెచ్చాయి.