అసాధారణ పరిస్థితుల్లోనే ఆర్డినెన్స్‌లు
- కేంద్రానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సూచన
- చట్టాలు చేసేందుకు దగ్గరి దారిగా చూడొద్దని హితవు
న్యూఢిల్లీ: మోదీ సర్కారు కుప్పలుతెప్పలుగా ఆర్డినెన్స్‌లు తీసుకువస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం కొన్ని అసాధారణ, ప్రత్యేక పరిస్థితుల్లోనే పార్లమెంట్ ప్రమేయం లేకుండా ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చే వెసులుబాటు కల్పించిందని, దీన్ని చట్టాలు చేయడానికి సులువైన మార్గంగా చూడొద్దని కేంద్రానికి సూచించారు. ఆర్డినెన్స్ వెసులుబాటును సాధారణ చట్టాలకు కూడా వర్తింపచేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం ఆర్డినెన్స్‌లు తీసుకురావడం, దానిపై విపక్షాలు గగ్గోలు పెట్టడం పరిపాటిగా మారిపోయిందని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు అన్ని పార్టీలు చర్చల ద్వారా ఒక పరిష్కారాన్ని కనుగొనాలని సూచించారు. సోమవారం కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల్లోని ఫ్యాకల్టీ, విద్యార్థులను ఉద్దేశించి రాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. పార్లమెంట్ ఆమోదంతో పనిలేకుండానే ప్రభుత్వం పలు ఆర్డినెన్స్‌లు తీసుకురావడంపై ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నపై సుదీర్ఘంగా మాట్లాడారు.
‘‘కొన్నిసార్లు చట్టాన్ని ఆమోదించుకోవడానికి అధికార పార్టీకి రాజ్యసభలో తగినంత మంది సభ్యులు ఉండకపోవచ్చు. అప్పుడు ఉభయ సభలను సమావేశపరిచి చట్టాన్ని ఆమోదించుకోవచ్చు. వాస్తవానికి ఇది కూడా క్లిష్టమే. 1952 నుంచి ఇప్పటిదాకా చూస్తే ఉభయ సభలను సమావేశపరిచి నాలుగుసార్లు మాత్రమే చట్టాలు ఆమోదించారు. కొన్ని ప్రత్యేక, అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఆర్డినెన్స్‌లు జారీ చేయడానికి రాజ్యాంగం అనుమతించింది. సాధారణ చట్టాలు చేయడానికి కూడా ఆర్డినెన్స్ మార్గాన్ని ఎంచుకోవడం సరికాదు’’ అని ప్రణబ్ పేర్కొన్నారు.
‘‘ఒక అంశాన్ని ప్రతిపక్షం వ్యతిరేకించవచ్చు, పూర్తిగా నిరాకరించవచ్చు. ఏదేమైనా ఆ సమస్యకు వివిధ మార్గాల ద్వారా పరిష్కారం కనుగొనడం రాజకీయ పార్టీల బాధ్యత’’ అని వ్యాఖ్యానించారు. భూసేకరణతోపాటు వివిధ కీలకాంశాలపై మోదీ సర్కారు ఏకంగా ఎనిమిది ఆర్డినెన్స్‌లు తీసుకువ చ్చిన నేపథ్యంలో ప్రణబ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భూసేకరణ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపే ముందు దాని ఆవశ్యకతపై ముగ్గురు సీనియర్ కేంద్రమంత్రుల నుంచి ప్రణబ్ వివరణ తీసుకున్న సంగతి తెలిసిందే.