సత్యప్రసాద్‌కు పురస్కారాన్ని అందజేస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ. చిత్రంలో బోయినపల్లి వినోద్‌కుమార్, మండలి బుద్ధప్రసాద్ తదితరులు
నాంపల్లి (హైదరాబాద్): దేశంలో సంస్కృత, హిందీ, పాశ్చాత్య భాషలకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏర్పడినట్లుగా తెలుగు భాషకు కూడా జాతీయ స్థాయిలో ఒక విశ్వవిద్యాలయం ఏర్పడితే తప్ప తెలుగు భాషా, సంస్కృతిని విస్తృత స్థాయిలో భవిష్యత్ తరాలకు అందించలేమని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. శనివారం తెలుగు వర్సిటీ ఎన్టీఆర్ కళా మందిరంలో ఏర్పాటు చేసిన మండలి వెంకటకృష్ణారావు సంస్కృతీ పురస్కార ప్రదానోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలుగు వర్సిటీ ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు.
నగర శివార్లలోని బాచుపల్లిలో వందెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కాబోతున్న తెలుగు విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు తెలుగు భాషపై మక్కువ కలిగిన, భాషకు ఎనలేని కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని కోరారు. సభకు అధ్యక్షత వహించిన వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్‌రావు మాట్లాడుతూ... రాష్ట్ర తర తెలుగు సంస్థలకు తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాషా సంస్కృతి ఔన్నత్యాన్ని పెంచే సాహిత్యాన్ని అందజేయడమే కాకుండా ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకుని తెలుగు భాష, బోధన, పరివ్యాప్తికి కృషి చేస్తున్నదని అన్నారు.
విశిష్ట అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ... శాస్త్రీయ విజ్ఞానం మాతృ భాషలో విద్యార్థులకు అందుబాటులో ఉంచితే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. ఆత్మియ అతిథిగా హాజరైన మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ... ఉభయ తెలుగు రాష్ట్రాలలోని తెలుగు వారికన్నా ప్రవాసాంధ్రులకే తెలుగు భాషపై మక్కువ ఎక్కువని అన్నారు. జర్మనీ మాజీ ఎంపీ డాక్టర్ జి.రవీంద్ర కార్యక్రమంలో పాల్గొని తెలుగులో మాట్లాడి సభికులను ఆకట్టుకున్నారు.
అంతర్జాతీయంగా తెలుగు భాషా సంస్కృతి, ఆధ్యాత్మిక వికాసానికి చిరస్మరణీయమైన సేవలందిస్తున్న లండన్‌లోని యునైటెడ్ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్తా) సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సత్య ప్రసాద్ కిల్లీకి మండలి వెంకట కృష్ణారావు సంస్కృతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి మండలి వెంకటకృష్ణారావు తెలుగు కేంద్రం సంచాలకులు ఆచార్య వై.రెడ్డి శ్యామల సమన్వయకర్తగా వ్యవహరించగా, సంస్థ కో ఆర్డినేటర్ డాక్టర్ విజయ్‌పాల్ పాత్లోత్ వందన సమర్పణ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment