జెండాతో సమస్య పరిష్కారం!!
వ్యతిరేక, అనుకూల ప్రదర్శనలతో ఢిల్లీ వీధులను గత వారం రోజులుగా హోరెత్తించిన జేఎన్‌యూ వివాదానికి ఎట్టకేలకు ప్రభుత్వం పరిష్కారం కనుగొందని, యూనివర్సిటీ క్యాంపస్‌లో జెండా ఎగరవేసి విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని రగిలించడమే ప్రభుత్వం ఉత్తమ మార్గంగా భావించిందంటూ ట్విట్టర్‌లో ట్వీట్లు వెల్లువెత్తాయి.
అన్ని సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రతిరోజు జాతీయ జెండాను ఎగురవేయాలని, ఆ జెండా 207 అడుగుల ఎత్తులో, బరువు 35 కిలోలు ఉండాలంటూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆదేశం మేరకు వీసీలు బుధవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా, ప్రతికూలంగాను ట్వీట్లు వెల్లువెత్తాయి. కొంతమంది తమదైన శైలిలో వ్యంగోక్తులు విసిరారు.
'విద్యార్థులు జెండా వందనంలో పాల్గొంటే వారు పాకిస్తానీయులు కాదని, భారతీయులేనని గుర్తించవచ్చు.. జెండాల తయారీకి కుట్టు మిషన్ కొట్టు పెట్టుకోవడానికి ఇదే అదను.. అలాగే జెండాపై అర్ణబ్ గోస్వామి చిత్రాన్ని అతికిస్తే బాగుంటుంది.. ఇది మోదీ సర్కార్ నయా జాతీయవాద మంత్రం. ఓ దళిత విద్యార్థి ఆత్మహత్య, జేఎన్‌యూ వివాదం దీని ముందు దిగదుడుపే... ఆరెస్సెస్‌ను కూడా ప్రతిరోజు జెండా ఎగరవేయమని చెబితే పోలా!...అయ్యో జెండాతో సమస్య పరిష్కారమయ్యాక మరో సమస్య ఏమిటి? రామ్‌దేవ్ బాబా యోగాను కూడా కంపల్సరీ చేస్తే బాగుంటుంది.....జెండా 207 అడుగులు ఎందుకుండాలంటే మనిషిలో 206 ఎముకలు ఉంటాయిగనక....ప్రతి టీవీ ఛానల్ కూడా రాత్రి తొమ్మిది గంటలకు జెండా వందన సమర్పణ చేసి జాతీయ గీతాన్ని ప్రసారం చేయాలనే నిబంధన తీసుకురావాలి'... ఇలా ట్వీట్లు చేశారు.