Manipur Horror Incident: Women Paraded Naked Caught On Camera - Sakshi
Sakshi News home page

మణిపూర్‌లో కీచకపర్వం: మహిళలను నగ్నంగా ఊరేగించి.. ఆపై గ్యాంగ్‌రేప్‌!

Published Thu, Jul 20 2023 8:04 AM | Last Updated on Thu, Jul 20 2023 1:18 PM

Manipur Incident: Women Paraded Naked Allegedly Gang Raped - Sakshi

ఇంఫాల్‌/ఢిల్లీ: అల్లర్లలో అట్టుడికిపోతున్న మణిపూర్‌లో కీచక పర్వం వెలుగుచూసింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. ఆపై పంట పొలాల్లోకి లాక్కెల్లి కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కెమెరాల సాక్షిగా ఇది జరగ్గా.. ఈ ఘోరానికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సహా పలువురు రాజకీయ నేతలు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

మణిపూర్‌లో తాజాగా ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన దృశ్యాలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. సాయం కోసం వాళ్లు కేకలు పెడుతుంటే.. చుట్టూ ఉన్న మూక వాళ్లను ఇష్టానుసారం తాకుకూ వేధించడం అందులో ఉంది. ఆపై వాళ్లను పక్కనే ఉన్న పొలాల్లోకి లాక్కెళ్తూ మరో వీడియో వైరల్‌ అయ్యింది.  అయితే ఆపై ఆ ఇద్దరిపై సామూహిక అత్యాచారం జరిగిందని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి.  

రాజధాని ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్పోక్పి జిల్లా పరిధిలో మే 4వ తేదీన ఇది జరిగిందని ఐటీఎల్‌ఎఫ్‌ (ఆదివాసీ గిరిజన నేతల సంఘం) ఆరోపిస్తోంది. అయితే.. పోలీసులు మాత్రం ఇది వేరే చోట జరిగిందని.. ఎఫ్‌ఐఆర్‌ మాత్రం కాంగ్పోక్పిలో నమోదు అయ్యిందని అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో.. ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ స్పందించారు. హైప్రొఫైల్‌ కేసుగా దీనిని దర్యాప్తు చేపట్టాలని మణిపూర్‌ పోలీస్‌ శాఖను ఆదేశించారు.

అంతకు ముందు కేంద్ర శిశు మహిళా సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఘటనపై.. భయంకరమైన ఘటన అని ట్వీట్‌ చేశారామె. ఘటనపై సీఎం బీరెన్‌, మణిపూర్‌ సీఎస్‌తో మాట్లాడినట్లు తెలుస్తోంది. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుని శిక్షించాలని.. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె వాళ్లను కోరినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన నిందితులను గుర్తించామని.. వీలైనంత త్వరగా వాళ్లను పట్టుకుంటామని మణిపూర్‌ పోలీస్‌ శాఖ ప్రకటించింది. బాధితులు కుకీ తెగ మహిళలుగా తెలుస్తోంది.  

ఈ ఘటనకు ఒక్కరోజు ముందు నుంచే మణిపూర్‌ రణరంగంగా మారడం ప్రారంభమైందన్నది తెలిసిందే. గిరిజన హోదా కోరుతూ మెయితీలు చేస్తున్న విజ్ఞప్తులు.. అక్కడి కుకీ గిరిజనులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి.. మానప్రాణాలు పోతున్నాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి.. అపహరణ, గ్యాంగ్‌రేప్‌తో పాటు హత్యానేరాల కింద కేసులు నమోదు చేసినట్లు మణిపూర్‌ పోలీస్‌ శాఖ వెల్లడించింది. మరోవైపు పలువురు రాజకీయ నేతలు సైతం ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 

ట్విటర్‌లో వీడియోలు తొలగింపు.. చర్యలు?
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను కొందరు నగ్నంగా ఊరేగిస్తూ.. ఇష్టానుసారం తాకుతూ ఉరేగించిన వీడియో ట్విటర్‌ను కుదిపేసింది. వాళ్లపై సామూహిక అత్యాచారమూ జరిగిందన్న ఆరోపణలతో యావత్‌ దేశం భగ్గుమంది. రాజకీయ, సినీ ప్రముఖులు సైతం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 
  
ఈ క్రమంలో.. ఘటనలకు వీడియోలను తొలగించాలని ట్విటర్‌ను కేంద్రం ఆదేశించినట్లు తెలుస్తోంది. శాంతి భద్రతలు, ఇతర కారణాల దృష్ట్యా వీడియోను తొలగించాలని ట్విటర్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాలను కేంద్రం ఆదేశించింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని.. భారత చట్టాలకు అనుగుణంగా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌ వ్యవహరించాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ట్విటర్‌పై చర్యలకు ఉపక్రమించిబోతున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement