ఇంపాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో భారీ మొత్తంలో ఆయుధ సామాగ్రిని ఆర్మీ, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దట్టమైన అటవీ ఎగువ ప్రాంతాల్లో సోదాలు చేపట్టి మందుగుండు సామగ్రితో సహా అనేక అక్రమ ఆయుధాలను పట్టుకున్నారు.
మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ జిల్లాలో 21 సెప్టెంబర్ 2024న భారత సైన్యం, మణిపూర్ పోలీసులు సంయుక్తంగా రెండు జాయింట్ ఆపరేషన్లు చేపట్టారు. ఈ క్రమంలో భారీ మొత్తంలో ఆయుధాలను, మందుగుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మొదటి ఆపరేషన్‌లో, చురచంద్‌పూర్ జిల్లాలోని థాంగ్‌జింగ్ రిడ్జ్‌లోని దట్టమైన అటవీ ఎగువ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా రెండు 9 ఎంఎం పిస్టల్స్, రెండు పిస్టల్ మ్యాగజైన్లు, ఒక సింగిల్ బ్యారెల్ రైఫిల్, రెండు స్థానికంగా తయారు చేసిన రాకెట్లు, ఒక లాంగ్ రేంజ్ మోర్టార్, రెండు మీడియం రేంజ్ మోర్టార్లు, నాలుగు మోర్టార్ బాంబులు, 9 ఎంఎం మందుగుండు సామగ్రి, 6.2 కిలోల గ్రేడ్-2 పేలుడు పదార్థాలు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
రెండో ఆపరేషన్‌లో భాగంగా తౌబాల్, ఇంఫాల్ తూర్పు జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న చాంగ్బీ గ్రామంలో సోదాలు నిర్వహించగా.. రెండు కార్బైన్ మెషిన్ గన్‌లు, రెండు పిస్టల్స్, సింగిల్ బ్యారెల్ గన్, 9 గ్రెనేడ్‌లు, చిన్న ఆయుధాల మందుగుండు సామగ్రితో సహా అనేక అక్రమ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక, స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తదుపరి విచారణ, చట్టపరమైన చర్యల కోసం మణిపూర్ పోలీసులకు అప్పగించారు.
ఇదిలా ఉండగా..గత ఏడాది మే నుంచి మణిపూర్‌లో మెయిటీ, కుకీ వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మణిపూర్‌లో జరిగిన హింసాత్మక ఘటనల కారణంగా 200 మందికి పౌరులు మృత్యువాత పడ్డారు. వేలాది మంది ప్రజలు ఆశ్రయం కోల్పోయారు. ఇక, తాజాగా మిలిటెంట్లు ఇప్పుడు ప్రత్యర్థి వర్గానికి చెందిన గ్రామాలను లక్ష్యంగా చేసుకోవడానికి డ్రోన్లు, అధునాతన రాకెట్లతో దాడులు చేస్తున్నారు. ఇప్పటికే మణిపూర్‌లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కొద్దిరోజులు క్రితమే విద్యార్థులు రాజ్‌భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
ఇది కూడా చదవండి: దేశాన్ని విడదీయడానికి కూడా వెనుకాడరు: రాహుల్‌పై కంగన మండిపాటు
Comments
Please login to add a commentAdd a comment