ఇంఫాల్: జాతుల వైరంతో ఘర్షణలమయమైన మణిపూర్‌లో ఈసారి భద్రతా బలగాలు, కుకీ మిలిటెంట్లకు మధ్య పరస్పర కాల్పుల పర్వం కొనసాగుతోంది. తొలుత మయన్మార్ సరిహద్దులోని మోరె పట్టణంలో భద్రతా బలగాల పోస్ట్‌పై మిలిటెంట్లు దాడి చేయడంతో ఈ ఎదురుకాల్పులు మొదలయ్యాయి. గత ఏడాది అక్టోబర్‌లో మోరె సబ్‌డివిజనల్ పోలీస్ ఆఫీసర్ చంగ్‌థమ్ ఆనంద్‌ను కుకీ మిలిటెంట్లు హత్య చేసిన ఘటనలో మంగళవారం మోరె పట్టణంలో పోలీసులు ఇద్దరు అనుమానితులను అరెస్ట్‌చేశారు.
ఈ అరెస్ట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కొందరు మహిళల బృందం పోలీస్‌స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలోనే బుధవారం మోరె పట్టణంలోని భద్రతాబలగాల పోస్ట్‌పై కాల్పులు జరిపారు. రాకెట్ ఆధారిత గ్రనేడ్లు విసిరారు. బలగాల పోస్ట్ వద్ద వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. వెంటనే తేరుకున్న బలగాలు మిలిటెంట్లపై కాల్పులు జరిపాయి. మోరె పట్టణం సహా ఛికిమ్ గ్రామంలో, వార్డ్ నంబర్ ఏడులోనూ ఇలా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.
ఒక ఆలయం సమీపంలో మిలిటెంట్లు జరిపిన మెరుపుదాడిలో స్టేట్ పోలీస్ కమాండో వాంగ్‌కెమ్ సోమర్‌జిత్ మరణించారు. మరో చోట జరిపిన కాల్పుల్లో మరో పోలీస్ తఖెల్లబమ్ శైలేశ్వర్ ప్రాణాలు కోల్పోయారు. ఉద్రిక్తతల నేపథ్యంలో తెంగ్‌నౌపాల్ జిల్లాలో మణిపూర్ సర్కార్ కర్ఫ్యూను విధించింది. ఇద్దరు నిందితులను జ్యుడీషియల్ మేజి్రస్టేట్ తొమ్మిది రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగించారు.
హెలికాప్టర్లు ఇప్పించండి
రోడ్డు మార్గంలో బలగాల తరలింపు సమయంలో మిలిటెంట్ల మెరుపుదాడుల నేపథ్యంలో బలగాల తరలింపు, మొహరింపు, క్షతగాత్రుల తరలింపు, వైద్య సేవల కోసం హెలికాప్టర్లను ఇవ్వాలని కేంద్ర హోం శాఖను మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అభ్యరి్థంచింది. రాష్ట్రంలో మళ్లీ మొదలైన ఘర్షణలు, ఉద్రిక్తతలపై ముఖ్యమంత్రి బీరెన్æ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. తాజా ఉద్రిక్తతల్లో మయన్మార్ శక్తుల ప్రమేయం ఉండొచ్చని సీఎం అనుమానం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment