ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మరోసారి రగులుతోంది. భద్రతా బలగాల పహారాలో కొంతకాలం దాడులు ఆగినా.. తాజాగా మళ్లీ హింస చెలరేగింది. కుకీలు, మైతీ తెగల మధ్య వైరంతో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మణిపూర్‌లోని లోయ ప్రాంతాల్లో ఆదివారం జరిగిన నిరసనలు,. హింసాత్మక ఘటనల్లో ఒకరు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. ఆందోళన కారులను చెదరగొట్టే క్రమంలో జిరిబామ్ జిల్లాలో భద్రతాదళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 20యేళ్ల అతౌబా మృతిచెందాడు. బాబుపరా వద్ద రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
బాబుపరా ప్రాంతంలో పలు పార్టీలకు చెందిన కార్యాలయాలపై ఆందోళనకారులు దాడులు చేశారు. జిరిబామ్ పోలీస్ స్టేషన్‌కు 500 మీటర్ల దూరంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల్లోకి చొరబడిన ఆందోళనకారులు.. ఫర్నీచర్‌ను ఎత్తుకెళ్లి, ఆఫీసులను తగలబెట్టారు. దీంతో శాంతి భద్రతలకోసం భద్రతా దళాలు మోహరించడంతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతోంది.
చదవండి: బీజేపీలో చేరనున్న ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్ గహ్లోత్
మరోవైపు మణిపూర్‌లో పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు(సోమవారం) అధికారులతో సమావేశం కానున్నారు. హోం మంత్రిత్వ శాఖలోని ఈశాన్య విభాగానికి చెందిన సీనియర్ అధికారులు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), అస్సాం రైఫిల్స్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
ఇదిలా ఉండగా కుకీ మిలిటెంట్లు ఇటీవల జిరిబామ్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో 11 మంది కుకీలు మృత్యువాతపడ్డారు. అనంతరం ఆరుగురు మైతీ వర్గానికి చెందిన వారిని మిలిటంట్లు బందీలుగా చేసి తీసుకెళ్లారు. వారి మృతదేహాలు లభ్యం కావడంతో జిరిబామ్ జిల్లాలో హింస చెలరేగింది. దీంతో దాదాపు 7 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి కర్ఫ్యూ విధించారు అధికారులు.
Comments
Please login to add a commentAdd a comment