ఇంఫాల్: మణిపుర్‌లో శాంతి మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. కాస్తంత ప్రశాంతత నెలకొన్నట్టుందనుకొనేలోగా కథ మొదటి కొచ్చింది. కల్లోలిత ఈశాన్య రాష్ట్రం మళ్లీ దాడులు మొదలయ్యాయి. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మాటల యుద్ధంతో రాజకీయాలు వేడెక్కాయి.
ఈ క్రమంలో మణిపూర్ హింసను అణచివేయడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపిస్తూ, ఈ విషయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జోక్యం చేసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే గురువారం రాత్రి లేఖ రాశారు.
రాష్ట్రపతికి రాసిన రెండు పేజీల లేఖలో.. కేంద్ర మరియు మణిపూర్ ప్రభుత్వాలపై ప్రజలకు నమ్మకం పోయిందని కాంగ్రెస్ చీఫ్ ఆరోపించారు, హింసాత్మక రాష్ట్రాన్ని సందర్శించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు నిరాకరిస్తున్నారనేది ఎవరికి అర్థం కాని విషయమని అన్నారు.
‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో పరిస్థితులు అదుపుతప్పాయి. ఈ సంక్షోభాన్ని నివారించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. చట్టబద్దమైన పాలన లేకపోవడం వల్ల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. ఇది జాతీయ భద్రతకు రాజీ, దేశ పౌరుల ప్రాథమిక హక్కులను అణిచివేతకు దారితీస్తుంది. .లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గత 18 నెలల్లో మూడుసార్లు మణిపూర్‌ను సందర్శించారు నేను కూడా స్వయంగా రాష్ట్రాన్ని సందర్శించాను’ అని ఖర్గే అన్నారు.
దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కౌంటర్ ఇచ్చారు. ఖర్గే ఆరోపణలను తిప్పికొడుతూ.. మైతేయి, కుకీ వర్గాల మధ్య చెలరేగిన హింసాకాండపై కాంగ్రెస్ నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. అవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని విమర్శలు గుప్పించారు.
గతంలో కేంద్రంలో, మణిపూర్‌లో ఇలాంటి సమస్యలను వ్యవహరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దీని పర్యవసానాలు నేటికీ అనుభవిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. విదేశీ మిలిటెంట్ల అక్రమ వలసలను మీ ప్రభుత్వం చట్టబద్ధం చేయడమే కాకుండా, అప్పటి హోం మంత్రి పి. చిదంబరం వారితో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కాంగ్రెస్ చీఫ్ మరచిపోయినట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment