
ఇంఫాల్: మణిపూర్‌లో మళ్లీ హింసాత్మక ఘర్షణలు మొదలయ్యాయి. సాయుధ కుకి మిలిటెంట్లు ప్రత్యర్థి మైతి వర్గానికి చెందిన ఎనిమిది కొండ ప్రాంత గ్రామాలపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఇద్దరు చనిపోగా, 10 మంది వరకు గాయపడినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. కక్చింగ్ జిల్లాలో మిలిటెంట్లు శనివారం అర్ధరాత్రి మైతీ వర్గానికి చెందిన వారి 80 ఇళ్లకు నిప్పుపెట్టారు. దీంతో, గ్రామస్తులు భయంతో ఇళ్లు వదిలి తలోదిక్కుకు పారిపోయారు.
సుగ్నులో పోలీసులు, మిలిటెంట్ల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక పోలీసు చనిపోయారు. సుగ్ను, సెరౌ ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో ఒకరు చనిపోగా పది మంది గాయపడ్డారు. బిష్ణుపూర్ జిల్లాలో కుకి మిలిటెంట్లు మైతీ వర్గం ప్రజలకు చెందిన 30 ఇళ్లకు నిప్పుపెట్టారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అధికారులు నిషేధాజ్ఞల సడలింపు సమయాన్ని 11 గంటల నుంచి 6 గంటలకు కుదించారు. కుకీలు దాడులు చేస్తున్నా భద్రతా బలగాలు పట్టించుకోవడం లేదంటూ ఇంఫాల్ వెస్ట్ జిల్లా ఫయెంగ్ గ్రామానికి చెందిన మహిళలు నిరసనకు దిగారు.
40 మంది తీవ్రవాదులు హతం
రాష్ట్రంలో పౌరులపై కాల్పులకు దిగుతూ, ఇళ్లకు నిప్పుపెడుతున్న 40 మంది తీవ్రవాదులను ఇప్పటి వరకు బలగాలు చంపినట్లు ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ తెలిపారు. ‘రాష్ట్రంలో జరుగుతున్నది జాతుల మధ్య వైరం కాదు. కుకి మిలటెంట్లు, భద్రతా బలగాలకు మధ్య జరుగుతున్న పోరు’గా ఆయన అభివర్ణించారు. షెడ్యూల్ తెగ(ఎస్‌టీ) హోదా విషయమై రాష్ట్రంలో ఈ నెల 3వ తేదీ నుంచి కుకి, మైతి వర్గాల మధ్య మొదలైన ఘర్షణల్లో 75 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment