ఘర్షణల సమయంలో తప్ప సాధారణ పరిస్థితుల్లో ఎప్పుడూ వార్తలకెక్కని ఈశాన్య భారతం ఇంకా కుదుటపడలేదని మణిపూర్‌లో సోమవారం రెండు సాయుధ బృందాల మధ్య చోటుచేసుకున్న కాల్పుల ఉదంతం తెలియజెబుతోంది. ఈ కాల్పుల్లో 13 మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఏడునెలల క్రితం అక్కడ మొదలైన తెగల ఘర్షణల్లో ఇంతవరకూ 175 మంది మరణించారని, 50,000 మంది నిరాశ్రయులయ్యారని గణాంకాలు చెబుతున్నాయి.
సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆ రాష్ట్రంలో పర్యటించి ఎక్కడెక్కడ మారణకాండ జరిగిందో, తాజా పరిస్థితులు ఎలా వున్నాయో వివరిస్తూ నివేదిక సమర్పించింది. దానిపై సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి పలు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఇంతలోనే తాజా ఉదంతం చోటుచేసుకుంది. మే 3 నుంచి వరస బెట్టి జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్నీ కాదు. రాష్ట్రంలో మెజారిటీగా వున్న మెయితీలకూ, కుకీ–చిన్‌లకూ మధ్య తలెత్తిన ఘర్షణలు ఏ స్థాయికి చేరాయంటే మహిళలపై గుంపులు దాడిచేసి వారిని వివస్త్రలను చేయటం, నగ్నంగా వూరేగించి అత్యాచారాలకు తెగబడటం యథేచ్ఛగా సాగాయి.
ఇక గృహదహనాలు, ఇతర ఆస్తుల ధ్వంసం వంటివి సరేసరి. ఘర్షణల సందర్భంగా పోలీస్ స్టేషన్లపై, సాయుధ రిజర్వ్ బెటాలియన్ స్థావరాలపై గుంపులు దాడులకు దిగి వేలాది తుపాకులు, రాకెట్ లాంచర్లు, లక్షల తూటాలు అపహరించారు. ఆయుధాలు అప్పగించినవారిపై ఎలాంటి చర్యలూ తీసుకోబోమని ప్రభుత్వం హామీ ఇచ్చినా వీటిల్లో వెనక్కొచ్చినవి స్వల్పం.
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు చక్కర్లు కొట్టడం పర్యవసానంగా హింసాత్మక ఘటనలు మొదలుకాగా, అటు తర్వాత జరిగిందంతా ప్రధాన స్రవంతి మీడియా నిర్వాకమని ఎడిటర్స్ గిల్డ్ నిజనిర్ధారణ కమిటీ ఆరోపించింది. అది ‘మెయితీ మీడియా’గా మారి పక్షపాతం ప్రదర్శించిందన్నది ఆ కమిటీ అభియోగం. ఆ తర్వాత కమిటీ సభ్యులపై మణిపూర్ సర్కారు కేసులు పెట్టడం, ఆ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించటం వేరే కథ.
రాష్ట్రంలోని 90 శాతం ప్రాంతాలు ఇప్పుడు ప్రశాంతంగా వున్నాయని బీరేంద్ర సింగ్ ప్రకటించి నెల్లాళ్లయింది. అయినా అడపా దడపా ఘర్షణల వార్తలు వస్తూనే వున్నాయి. సోమవారం నాటి ఉదంతం ఈమధ్యకాలంలో పెద్దది. మరణించినవారంతా ఎవరో, ఎక్కడివారో అధికారులు ఇంకా తేల్చలేదు. ఘటన జరిగిన ప్రాంతానికి భద్రతా బలగాల శిబిరం 10 కిలోమీటర్ల దూరంలో వున్నదంటే ఇన్ని నెలల మారణకాండ నుంచి ప్రభుత్వం నేర్చుకున్నదేమీ లేదన్నమాట.
హింసాత్మక ఘట నల సంఖ్య తగ్గిందని అధికారులు సంబరపడుతూవుండొచ్చు. కానీ కనబడని హింస పీడిస్తూనే వుంది. సమాజం మొత్తం రెండుగా చీలిపోయింది. మెయితీలు, కుకీలు గతంలో మాదిరి స్వేచ్ఛగా సంచరించలేకపోతున్నారు. నెలల తరబడి సాగిన హింస పర్యవసానంగా ఆప్తుల్ని కోల్పోయి, ఎంతో విధ్వంసం చోటుచేసుకుని భవిష్యత్తు అగమ్యగోచరంగా వున్నచోట అంతా బాగున్నదని చెప్పటం పరిహాసాస్పదం అవుతుంది.
కుటుంబాల్ని పోషించుకోవటానికీ, చదువుకోవటానికీ, ఇతరేతర వ్యాపకాల కోసం వెళ్లటానికీ స్వేచ్ఛ లేని ప్రశాంతత వల్ల సాధారణ పౌరులకు ఒరిగేదేముంటుంది? ప్రభుత్వ యంత్రాంగం సమగ్రమైన, అత్యవసరమైన చర్యలు తీసుకొనేవరకూ ఇదంతా సాధ్య పడదు. ముఖ్యంగా ఎక్కడికక్కడ రెండు తెగల నుంచి బాధ్యతాయుత వ్యక్తుల్ని గుర్తించి కమిటీలు ఏర్పాటుచేసి సామరస్యత సాధించే దిశగా ప్రయత్నిస్తే వేరుగా వుండేది.
ఇంటర్నెట్ సేవలు పునరుద్ధ రించిన 24 గంటల్లోగానే తాజా ఉదంతం చోటుచేసుకోవటం ఆందోళన కలిగించే అంశం. ఏడు నెలల హింసలో ప్రాణాలు కోల్పోయినవారికి సంబంధించిన 88 గుర్తు తెలియని మృతదేహాలు ఏడు నెలలుగా ఇంఫాల్‌లోని రెండు ఆస్పత్రుల శవాల గదుల్లో పడివున్నాయి. రెండు తెగలవారూ భయం భయంగా బతుకుతున్న వర్తమానంలో తమ తమ గ్రామాలొదిలి ఇంఫాల్ వరకూ పోవటం, ఆ మృతదేహాలను గుర్తించటం సాధ్యమేనా? హింస కొనసాగుతున్న కాలంలోనూ, ఆ తర్వాతా తమ వారి జాడ తెలియటం లేదని చెప్పినవారు అనేకులున్నారు.
వీరిలో అనేకులు కుకీలు కాగా, మెయితీ తెగకు చెందినవారు కూడా వున్నారు. ఆ మృతదేహాలు కల్లోలం సృష్టించటానికి మయన్మార్ నుంచి వచ్చినవారికి సంబంధించినవేనని అధికారులు చెబుతున్నా అందుకు వారి దగ్గర కచ్చితమైన సాక్ష్యా ధారాలు లేవు. ఆదివాసీ నేతల ఫోరం 22 మంది కుకీల జాడ తెలియటం లేదని ఆ మధ్య ప్రకటించింది. గుర్తుతెలియని మృతదేహాల్లో ఇలా అదృశ్యమైనవారివే అధికంగా వుండొచ్చు. ఇక ఎవరి కోసమూ వేచిచూడకుండా ఈ మృతదేహాలను ఖననం చేయాలని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించటం మణిపూర్‌లో విషాదస్థితికి అద్దం పడుతోంది.
ఈపాటికే శాంతి సాధనకు తగిన చర్యలు తీసుకునివుంటే, బాధిత వర్గాల్లో భరోసా కల్పించి నట్టయితే ‘గుర్తు తెలియని మృతదేహాల’ సమస్య వుండేదే కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. హింసాత్మక ఘటనలకు కారకులైనవారినీ, ఇప్పటికీ ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నవారినీ గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటే శాంతియుత పరిస్థితులను ఏర్పర్చటం తేలికవుతుంది.
ఈనాటికీ ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించటం లేదని, అది మెయితీల పట్ల మెతగ్గా వుంటున్నదని ఆది వాసీ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలకు తావు లేకుండా చేసినప్పుడే తమ వారి మృత దేహాలను గుర్తించి, సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించటం బాధిత కుటుంబాలకు సాధ్యమవుతుంది. ఆ దిశగా చర్యలు తీసుకోవటం మణిపూర్ సర్కారు బాధ్యత.
ఇంకా చల్లారని మణిపూర్
Published Wed, Dec 6 2023 4:37 AM | Last Updated on Wed, Dec 6 2023 4:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment