అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు
కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు
ఖమ్మంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, హైదరాబాద్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్/సాక్షిప్రతినిధి, ఖమ్మం/కవాడిగూడ: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్‌ను అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది.
ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో మంగళవారం అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, హైదరాబాద్ జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, వరంగల్, సిద్దిపేట జిల్లా కేంద్రాల్లో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌తోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రాల్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం జిల్లా కలెక్టరేట్లకు ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు అక్కడ కలెక్టర్‌ను కలిసి అమిత్ షాను బర్తరఫ్ చేయాలంటూ వినతిపత్రాలు ఇచ్చాయి.
కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలి: భట్టి
భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి.. ఆ రాజ్యాంగాన్నే ఉల్లంఘించిన కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రపతి రద్దు చేయాలని భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు. ఖమ్మంలో ర్యాలీ అనంతరం భట్టి మాట్లాడుతూ.. రాజ్యాంగంపై ప్రమాణం చేసి.. అందుకు అనుగుణంగా పాలన అందించకుంటే ఏ ప్రభుత్వా న్ని అయినా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గుర్తించదన్నారు.
భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనగలుగుతోందంటే అందుకు రాజ్యాంగం, దాన్ని అందించిన అంబేడ్కరే కారణమని పేర్కొన్నారు. అలాంటి అంబేడ్కర్‌ను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన అమిత్ షా రాజీనామా కోరడం అందరి నైతిక హక్కు అని భట్టి చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.
బీజేపీ ముసుగు తొలగిపోయింది: టీపీసీసీ చీఫ్
బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై అమిత్‌షా వ్యాఖ్యలతో బీజేపీ పార్టీ ముసుగు తొలగిపోయిందన్నారు. రాజ్యాంగంపై నమ్మకమున్న ప్రతి పౌరునికి అమిత్ షా మాటలు బాధ కలిగించాయన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీకి అంబేడ్కర్‌పై ఎంత ద్వేషం ఉందో బయటపడిందని ఏఐసీసీ నేత కొప్పుల రాజు అన్నారు. హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీగణేష్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment