ఆర్థిక అనిశ్చితి, జాబ్ మార్కెట్‌లో పెరిగిన పోటీ వల్ల తగ్గుతున్న ప్లేస్‌మెంట్లు
కంపెనీలు ఇచ్చే ప్యాకేజీల్లోనూ హెచ్చుతగ్గులు
ఢిల్లీ ఐఐటీలో మాత్రమే స్థిరంగా ప్లేస్‌మెంట్ల కల్పన
ఐఐటీ నుంచి బయటకు వచ్చే వారిలో 5శాతం మంది సివిల్స్ వైపు మొగ్గు
తొలి తరం ఐఐటీల డేటా పరిశీలనలో వెల్లడి
సాక్షి, అమరావతి: దేశంలో ఇంజనీరింగ్ విద్యకు అత్యుత్తమ విద్యా సంస్థలుగా ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో క్షీణత కనిపిస్తోంది. సాంకేతిక రంగంలో మారుతున్న టెక్ ల్యాండ్‌స్కేప్, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, జాబ్ మార్కెట్‌లో పోటీ పడుతున్న ఐఐటీ గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
దేశంలోని తొలి తరం ఐఐటీల్లో 2018–19 నుంచి 2023–24 వరకు ప్లేస్‌మెంట్ డేటాను విశ్లేషిస్తే అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, రీసెర్చ్ ప్రోగ్రామ్‌లలో ఉద్యోగ ఆఫర్లు పొందుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. కాన్పూర్, ఖరగ్‌పూర్, రూర్కీ ఐఐటీల్లో ఏకంగా 5 నుంచి 16 శాతం ప్లేస్‌మెంట్లు తగ్గాయి. ఐఐటీ ఢిల్లీ ఒక్కటే ప్లేస్‌మెంట్ల కల్పనలో నిలకడగా ఉంది.
ఐఐటీల్లో చదువుతున్న వారిలో దాదాపు 80 శాతం మంది ఉద్యోగాలను పొందుతున్నారు. కేవలం 1.6 శాతం మంది మాత్రమే స్టార్టప్‌లను ప్రారంభిస్తున్నారు. దాదాపు 10 శాతం మంది ఉన్నత చదువుల కోసం, 5 శాతం మంది సివిల్ సర్వీసుల వైపు వెళుతున్నట్లు ఐఐటీ గౌహతి నిపుణులు వెల్లడించారు.
ప్యాకేజీల్లోనూ తగ్గుదల...
ఐఐటీ క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో ఉద్యోగాలు పొందినవారికి ఇచ్చే ప్యాకేజీల్లో తగ్గుదల కూడా విద్యార్థులను కలవరపెడుతోంది. ఐఐటీ కాన్పూర్‌లో సగటు వార్షిక జీతం 2020–21లో రూ.22.10 లక్షల నుంచి 2022–23లో రూ.25.90 లక్షలకి పెరిగింది.
అయితే 2023–24లో రూ.23.70 లక్షలకు తగ్గింది. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 2020–21లో వార్షిక సగటు వేతనం రూ.14 లక్షల నుంచి 2022–23లో రూ.18 లక్షలకు పెరిగింది. అయితే, 2023–24లో మళ్లీ రూ.17 లక్షలకు తగ్గింది. అదే ఐఐటీ బాంబేలో 2021–22లో రూ.21.50 లక్షలు నుంచి 2022–23లో రూ. 21.82 లక్షలకు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment