ఐఐటీలో చదివినా.. ఆఫర్లు రావట్లేదు!
ఐఐటీలో చదివినా.. ఆఫర్లు రావట్లేదు!
Published Wed, Dec 7 2016 8:46 AM | Last Updated on Tue, Aug 27 2019 4:36 PM
ఈసారి క్యాంపస్ రిక్రూట్‌మెంట్ల కోసం చాలా కంపెనీలు ఐఐటీలకు వెళ్లాయి. కానీ, గత సంవత్సరంతో పోలిస్తే ఆ కంపెనీలు ఇచ్చిన ఆఫర్లు మాత్రం చాలా తగ్గిపోయాయి. ఐఐటీ బాంబేలో గోల్డ్‌మన్ సాక్స్ కంపెనీ గత సంవత్సరం 16 మందిని తీసుకోగా, ఈసారి 13 మందినే తీసుకుంది. అలాగే బీసీజీ అనే కన్సల్టింగ్ సంస్థ గత సంవత్సరం తొమ్మిది మందికి అవకాశం ఇస్తే, ఈసారి నలుగురినే ఎంచుకుంది. ఈసారి ఎనలిటిక్స్ రంగం నుంచి ఎక్కువ ఆఫర్లు వచ్చాయంటున్నారు. గోల్డ్‌మన్ సాక్స్, జేపీ మోర్గాన్ లాంటి కంపెనీలు సాధారణంగా కోర్ ఫైనాన్స్ ప్రొఫైల్స్ నుంచే ఎక్కువ మందిని తీసుకుంటాయి. కానీ, ఈసారి వాళ్లు కూడా ఎనలిటిక్స్‌లోకే ఎక్కువగా తీసుకున్నారు. డచ్ బ్యాంక్, ఫ్లో ట్రేడర్స్ లాంటి కంపెనీలు మాత్రమే కోర్ ఫైనాన్స్ ఉద్యోగాలు ఆఫర్ చేశాయని, మిగిలినవి తీసుకున్నవే తక్కువైనా, అవి కూడా ఎనలిటిక్స్‌లోకే తీసుకున్నాయని ఓ విద్యార్థి చెప్పాడు.
ఈ తరహా కంపెనీలకు ఎక్కువగా ఫైనాన్స్ ఉద్యోగాల కోసమే వెళ్తారని, కానీ వాళ్లు కూడా సాఫ్ట్‌వేర్, కోడింగ్ విద్యార్థులను అడుగుతున్నారని మరో విద్యార్థి తెలిపాడు. ఏఎన్‌జడ్, యాక్సిస్, సిటీఫైనాన్స్ లాంటి బ్యాంకులు కూడా తమకు ఎక్కువగా ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లు అక్కర్లేదు గానీ ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు, స్టాటస్టికల్ మోడలింగ్ వచ్చినవాళ్లు కావాలంటున్నాయి. ఒక్కసారిగా ఆఫర్లు తగ్గిపోవడంతో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేసిన విద్యార్థులు నీరసించిపోయారు.
ఇక ఐఐటీ ఖరగ్‌పూర్‌లో కూడా బిగ్ డేటా ఎనలిటిక్స్ రంగంలో 10 శాతం వృద్ధి కనిపించింది. ఈ రోజుల్లో నిర్ణయాలు తీసుకోవాలంటే ఎక్కువగా డేటా ఎనలిటిక్స్ మీదే ఆధారపడుతున్నారని, నిర్ణయాలన్నింటికీ డేటాయే ఆధారమని ఓ ప్లేస్‌మెంట్ రిప్రజెంటేటివ్ తెలిపారు. ఇప్పుడు ఈ రంగంలో రిక్రూట్‌మెంట్లు బాగా పెరిగాయని, ఇంతకుముందు సాధారణ బిజినెస్ ఎనలిటిక్స్ రంగంలో మాత్రమే తీసుకునే సంస్థలు కూడా ఇప్పుడు డేటా ఎనలిటిక్స్ నిపుణుల కోసం చూస్తున్నాయన్నారు. దాంతోపాటు కోడింగ్ కూడా వచ్చి ఉంటే బంపర్ చాన్సులు వస్తున్నాయట. సాధారణంగా జేపీ మోర్గాన్ సంస్థ ఇన్నాళ్లూ కేవలం ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ రంగంలోనే ఉద్యోగాలు ఇచ్చేది గానీ, ఇప్పుడు మాత్రం అది కేవలం డేటా రోల్స్‌లోకి మాత్రమే తీసుకుంటోంది.
చాలా కంపెనీలు ఇప్పుడు డేటా ఎనలిటిక్స్ ప్రొఫైల్స్ కావాలనే అడుగుతున్నాయని, అందువల్ల విద్యార్థులు ఈ రంగంలో ఎక్కువగా దృష్టిపెట్టాలని ఐఐటీ మద్రాస్‌లో ప్లేస్‌మెంట్ ఇన్‌చార్జి అయిన ప్రొఫెసర్ మను సంతానం తెలిపారు. కంపెనీలు డేటా ఎనలిటిక్స్ రోల్స్ అడుగుతున్నాయని, కానీ విద్యార్థులకు దాని గురించే తెలియపోవడంతో రిక్రూట్‌మెంట్లు తగ్గాయని వివరించారు. ఐఐటీ రూర్కీలో కూడా ఇదే పరిస్థితి. అక్కడ కూడా రిక్రూట్‌మెంట్లు బాగా తగ్గిపోయాయి. వస్తున్న కంపెనీల సంఖ్య బాగానే పెరిగింది గానీ, వాళ్లు తీసుకుంటున్న విద్యార్థుల సంఖ్య మాత్రం బాగా తగ్గిందని అక్కడి ప్లేస్‌మెంట్ ఇన్చార్జి ప్రొఫెసర్ ఎన్‌పీ పాదీ చెప్పారు.
Advertisement