ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌కు స్థల పరిశీలన
శ్రీకాళహస్తి, ఏర్పేడు : ఏర్పేడు మండలంలోని మేర్లపాక, పంగూరు, జంగాలపల్లె, చింతలపాళెం, తిరుపతికి సమీపం లోని సూరప్ప కశంలోని ప్రభుత్వ భూముల్లో ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌ల ఏర్పాటుకు గురువారం రాష్ట్ర మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గంటా శ్రీనివాసరావుతోపాటు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు.
కేంద్రబృందం సభ్యులు భాస్కర్‌మూర్తి(ఐఐటీ చెన్నై), యూబీ దేశాయ్(ఐఐటీ హైదరాబాద్), నీలం సహాని (ఐఏఎస్, రాష్ట్ర ప్రిన్సిపల్ కార్యదర్శి ఉన్నత విద్యాశాఖ), శైలేంద్రశర్మ (సీపీడబ్యూడీ రాష్ట్ర చీఫ్ ఇంజినీర్), ప్రవీణ్‌ప్రకాష్ (సాంకేతిక విద్యా నిపుణులు), వినోద్‌సింగ్(ఐఐటీ నిపుణులు) ఆయా ప్రాంతాల్లో కలియతిరిగారు.
భూములు బాగానే ఉన్నాయని.. అయితే అటవీప్రాంతంకావడంతో క్రూరమృగాలతో ఇబ్బందులు వస్తాయనే అంశంపై చర్చించా రు. మంత్రులు మాట్లాడుతూ భూములపైభాగంలో సోమశిల-స్వర్ణముఖి కాలువ పనులు జరుగుతున్నాయన్నారు. మరోవైపు రేణిగుంట విమానాశ్రయం, మన్నవరం ఎన్బీపీపీఎల్ ప్రాజెక్టు, చెన్నై, కృష్ణపట్నం, దుగ్గిరాజుపట్నం ఓడరేవులు, రాష్ట్ర రాజధాని విజయవాడకు రోడ్డు, రైలు రవాణామార్గలు ఈ ప్రాంతానికి ఎన్నికిలోమీటర్ల దూరంలో ఉన్నాయనే అంశాలపై చర్చించారు.
అనంతరం భూముల వివరాలు తెలియజేయాలని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌కు సూచించారు. ఆయన మేర్లపాక లో 440 ఎకరాలు, పంగూరులో 366, చింతలపాళ్లెంలో 758, పాగాలిలోని 559, పల్లంలోని 929 ఎకరాల భూములున్నాయన్నారు. కేంద్ర బృందంతో తి రుపతి ఎమ్మెల్యే వెంకటరమణ , జిల్లా జాయింట్ కలెక్టర్ భరత్‌గుప్త, తిరుపతి ఆర్డీవో రంగయ్య ఉన్నారు.