బెజవాడ పరిసరాల్లో అరుదైన వన్యప్రాణులు | Rare wild Animals In the vicinity of Bejawada | Sakshi
Sakshi News home page

బెజవాడ పరిసరాల్లో అరుదైన వన్యప్రాణులు

Published Sun, Nov 1 2020 3:31 AM | Last Updated on Sun, Nov 1 2020 3:31 AM

Rare wild Animals In the vicinity of Bejawada - Sakshi

అరుదైన పెద్ద రెక్కల గద్ద

సాక్షి, అమరావతి: విజయవాడ పరిసర ప్రాంతాల్లో పలు కొత్త వన్యప్రాణుల ఉనికి పర్యావరణవేత్తల్లో ఆశలు చిగురింపజేస్తోంది. వాతావరణ మార్పులు, కరువవుతున్న పచ్చదనంతో జీవవైవిధ్యం దెబ్బతిన్న పరిస్థితుల్లోనూ కృష్ణా జిల్లాలో కొండపల్లి అటవీ ప్రాంతం, మరికొన్నిచోట్ల అరుదైన వన్యప్రాణుల్ని గుర్తించారు. ఇంతవరకు ఈ ప్రాంతంలో ఎప్పుడూ చూడని కొత్త రకం చుంచు (మద్రాస్‌ ట్రీష్రూ), ఐదు చారల తాటి ఉడత, పెద్ద రెక్కల గద్ద (స్టెప్పీ ఈగిల్‌)ను ఐఐఎస్‌ఈఆర్‌ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌) కనుగొంది. కొన్నేళ్ల నుంచి కొండపల్లి రిజర్వు ఫారెస్టులోని మూలపాడు అటవీ ప్రాంతంలో జీవవైవిధ్యం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ ఉన్న చెట్లు, వాతావరణం వల్ల అటవీ ప్రాంతం అభివృద్ధి చెందడంతో వన్యప్రాణుల మనుగడ పెరిగింది. ఈ నేపథ్యంలోనే పలు కొత్త వన్యప్రాణుల ఉనికి బయటపడినట్లు ఐఐఎస్‌ఈఆర్‌ అంచనా వేస్తోంది. 

పెద్ద రెక్కల గద్ద (స్టెప్పీ ఈగిల్‌) 
శీతాకాలంలో భారత ఉపఖండంలో అరుదుగా కనిపించే అతిపెద్ద గద్ద ఇది. మధ్య ఆసియా, మంగోలియా నుంచి చలికాలంలో ఈ పెద్ద రెక్కల గద్దలు మనదేశానికి వస్తాయి. అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉంది ఈ గద్ద. ఇటీవల విజయవాడ రూరల్‌ మండలం అంబాపురంలో ఒక వ్యక్తి పొలంలో దీన్ని ఫొటో తీయడంతో వీటి ఉనికి బయటపడింది. ఇవికాకుండా శీతాకాలంలో పలు వలస పక్షులు ఈ ప్రాంతానికి ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. వాటిలో అరుదుగా ఉండే కోకిల, పలు రకాల గద్దలు కూడా ఉన్నాయి.  


కొత్త రకం చుంచు (మద్రాస్‌ ట్రీష్రూ)
కృష్ణా జిల్లా మూలపాడు సీతాకోక చిలుకల పార్కులో సెప్టెంబర్‌ 10న దీన్ని గుర్తించారు. కీటకాలు, విత్తనాలు తిని జీవించే ఈ చుంచు జాతి ప్రాణులు రాతి ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. ఉడతల మాదిరిగా ఉండే ఇవి నడుస్తున్నప్పుడు తోకపైకి వంగి ఉంటుంది. 1850లో నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల మధ్య కొండల్లో మొదటిసారిగా వీటిని కనుగొన్నారు. అంతకుముందు విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లా అటవీ ప్రాంతాల్లోనూ సంచరించినట్లు గుర్తించారు. 

ఐదు చారల తాటి ఉడుత
మన ఇళ్ల వద్ద కనిపించే సాధారణ ఉడుత శరీరంపై మూడు చారలు మాత్రమే ఉంటాయి. ఐదు చారల తాటి ఉడుతలున్నా అవి అంతరించిపోయినట్లు భావించారు. కానీ సెప్టెంబర్‌ 10న మూలపాడు అడవిలో, 11న విజయవాడ రూరల్‌ మండలం నున్న సమీపంలో వీటిని గుర్తించారు. ఈ ప్రాంతంలో వీటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. 

కొత్త జాతులు చాలా ఉన్నాయి
మూలపాడు ప్రాంతంలో జీవవైవిధ్యం బాగుండటంతో కొత్త వన్యప్రాణులు ఇక్కడ కనిపిస్తున్నాయి. విజయవాడ పరిసరాల్లో ఇప్పటివరకు 630 జాతుల (పక్షులు, కీటకాలు, సాలె పురుగులు, క్షీరదాలు మొదలైనవి)ను రికార్డు చేశాం. 260కి పైగా పక్షి జాతుల సమాచారం మా వద్ద ఉంది. ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువ జీవజాతులు ఉన్నాయని భావిస్తున్నాం. ఐఐఎస్‌ఈఆర్‌ బయాలజీ విభాగం, దులీప్‌ మాథై నేచర్‌ కన్జర్వేషన్‌ ట్రస్ట్‌ సహకారంతో తిరుపతి, విజయవాడలో సర్వే చేస్తున్నాం. 
– రాజశేఖర్‌ బండి, సిటిజన్‌ సైన్స్‌ కో–ఆర్డినేటర్, ఐఐఎస్‌ఈఆర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement