1,72,000 క్రితం నాటి నది ఆనవాళ్లు గుర్తింపు | Evidence Of Lost River in Thar Desert 172000 Years Ago Found | Sakshi
Sakshi News home page

థార్‌ ఎడారి గుండా ప్రవహించి కనుమరుగైన నది

Published Thu, Oct 22 2020 1:14 PM | Last Updated on Thu, Oct 22 2020 1:24 PM

Evidence Of Lost River in Thar Desert 172000 Years Ago Found - Sakshi

జైపూర్‌: ల‌క్షా డెభ్బై రెండు వేల(1,72,000) సంవత్సరాల క్రితం రాజస్తాన్‌లోని బిక‌నీర్ సమీపంలో ఉన్న సెంట్రల్‌ థార్ ఎడారి గుండా ప్రవహించి కాల ప్ర‌వాహంలో క‌నుమ‌రుగైన “న‌ది”ఆన‌వాళ్ల‌ను ప‌రిశోధ‌కులు తాజాగా ఆధారాలతో స‌హా క‌నుగొన్నారు. ఈ ప్రాంతంలో మాన‌వులు నివ‌సించేందుకు.. నాగరికత అభివృద్ధి చెందేందుకు ఈ న‌ది ఒక జీవనరేఖగా ఉండొచ్చ‌ని పరిశోధకులు అభిప్రాయప‌డ్డారు. జర్మనీలోని ది మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ సైన్స్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ, తమిళనాడులోని అన్నా విశ్వవిద్యాలయం, ఐఐఎస్ఈఆర్ కోల్‌కతా పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్య‌య‌నం చేశారు. ప‌రిశోధ‌న వివ‌రాలు క్వాటర్నరీ సైన్స్ రివ్యూస్ జర్నల్‌లో ప్రచురించ‌బ‌డ్డాయి. సెంట్రల్‌ థార్ ఎడారిలోని నల్ క్వారీలో అదేవిధంగా ఇత‌ర ప్రాంతాల్లో జ‌రిపిన ప‌రిశోధ‌న‌లు నది కార్యకలాపాల దశను సూచించాయి. ఇక ఈ అధ్యాయన ప్రకారం రాతియుగం నాటి మాన‌వులు ప్ర‌స్తుతం మనం ఎదుర్కొంటున్న దానికంటే భిన్నమైన థార్ ఎడారి ప్రకృతిలో నివసించినట్లు తెలుస్తోంది. క‌నుమ‌రుగైన న‌ది స‌మీప ఆధునిక న‌దికి 200 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న‌ట్లుగా పరిశోధనలో తేలింది. (చదవండి: వర్షం.. పర్వతాలను సైతం కదిలిస్తుందట!)

‘లుమినిసెన్స్‌ డేటింగ్‌’ ద్వారా
ఇక క‌నుమ‌రుగైన‌ న‌దీ స‌మాచారం గురించి నల్ గ్రామానికి సమీపంలోని క్వారీ నుండి వెల్ల‌డైన ఇసుక, కంకరల లోతైన నిక్షేపాన్ని ఈ బృందం అధ్యయనం చేసింది. అదేవిధంగా పరిశోధకులు వివిధ నిక్షేపాలను అధ్యయనం చేయడం ద్వారా వివిధ దశల నది కార్యకలాపాలను డాక్యుమెంట్ చేయగలిగారు. నది ఇసుకలోని క్వార్ట్జ్ గ్రేయిన్స్ ఎప్పుడు ఖ‌న‌నం అయ్యాయో తెలుసుకునేందుకు పరిశోధకులు ‘లుమినిసెన్స్ డేటింగ్’ అనే పద్ధతిని ఉపయోగిస్తారు. దీన్ని ఉప‌యోగించి ఫ్లూవియ‌ల్ నిక్షేపాల దిగువ‌న చాలా చురుకైన న‌ది వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన ఆధారాల‌ను గుర్తించిన‌ట్లు అచ్యుతన్ చెప్పారు. సుమారు 172 వేల సంవత్సరాల క్రితం నల్ వద్ద బలమైన నది కార్యకలాపాలు జరిగాయని ఫలితాలు సూచించాయన్నారు. సెంట్రల్ థార్ ఎడారి గుండా ప్రవహించే నది పాలియోలిథిక్ జనాభాకు లైఫ్ లైన్‌గా ఉందని.. వలసలకు ముఖ్యమైన కారిడార్‌గా ఉండేదని వారు తెలిపారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల అధ్య‌య‌నం కూడా థార్ ఎడారి గుండా ప్ర‌వ‌హించిన నది మార్గాల నెట్‌వర్క్‌ను చూపించిన‌ట్లు పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనాలు గతంలో నదులు, ప్రవాహాలు ఎక్కడ ప్రవహించాయో సూచించగలవే కానీ అవి ఎప్పటివి అన్న విషయం మాత్రం చెప్ప‌లేవ‌ని అన్నా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ హేమా అచ్యుతన్ అన్నారు. (చదవండి: గులాబీ రంగులోకి మంచు.. కారణం!)

థార్ ఎడారికి గొప్ప చరిత్ర ఉందని ప‌రిశోధ‌కులు తెలిపారు. రాతియుగ జనాభా ఈ అర్ధ-శుష్క ప్రకృతిలో మనుగడ సాగించడమే కాకుండా ఎలా అభివృద్ధి చెందిందో చూపించే అనేక రకాల సాక్ష్యాలను తాము వెలికితీస్తున్న‌ట్లు ది మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫ‌ర్ సైన్స్ ఆఫ్ హ్యూమన్ శాస్ర్త‌వేత్త‌ జింబోబ్ బ్లింక్‌హార్న్ తెలిపారు. చరిత్ర పూర్వంలోని కీలక కాలంలో నదీ వ్యవస్థలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు మ‌న‌కు చాలా తక్కువ వివరాలు మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయన్నారు. ఆఫ్రికా నుంచి భారతదేశానికి హోమో సేపియన్ల ప్రారంభ విస్తరణలతో ఈ న‌ది ముడిపడి ఉన్న‌ట్లుగా తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement