మనిషి తన సౌకర్యం కోసం ప్రకృతి సమతుల్యతకు విఘాతం కలిగిస్తూనే ఉంటాడు. ప్రకృతి సహనంతో ఓర్చుకుంటూ, అప్పుడప్పుడూ విలయం రూపంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటుంది. మొత్తంగా తనను తాను సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ‘మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు’... అని పిచ్చుకలు ఆవేదన చెందుతున్న సమయంలో ప్రకృతి ఓ అమ్మాయి మనసును కదిలించింది. ఆమె ఇప్పుడు పక్షి ప్రేమికురాలైంది. తన ఇంటిని పక్షులకు విలాసంగా మార్చింది. తాను పక్షి ప్రేమికురాలిగా మారిన సందర్భాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు మంచాల హరిణి.
అడవికి దాహం వేసింది!
‘‘అప్పుడు నేను బీబీఏ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నాను. అమ్మా నాన్న, నేను, అక్క అందరం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న మా పెద్ద నానమ్మ వాళ్ల ఊరికి వెళ్తున్నాం. నిర్మల్ దాటి కడెం మీదుగా అడవిలో ప్రయాణిస్తున్నాం. మే నెల కావడంతో ఎండ తీవ్రంగా ఉంది. చెట్ల మొదళ్లు ఎండిపోయి వానల కోసం ఎదురు చూస్తున్నాయి. ఓ పక్షి మా కళ్ల ముందే చెట్టుకొమ్మ మీద నుంచి జారి నేల మీద పడింది. కొద్ది సెకన్లపాటు రెక్కలు కొట్టుకున్నాయి.
కారాపి వెళ్లి చూశాం, పక్షిని చేతుల్లోకి తీసుకుని మా దగ్గరున్న నీటిని చల్లి, తాగించడానికి ప్రయత్నించాం. కానీ ఆ పక్షి అప్పటికేప్రాణాలు వదిలేసింది. ఆ చిన్నప్రాణికి ఎన్ని నీళ్లు కావాలి, ఆ గుక్కెడు నీళ్లు లేకనే కదాప్రాణం పోయిందని చాలా బాధేసింది. ఆ దృశ్యం పదే పదే కళ్ల ముందు మెదలసాగింది. ఇలాగ ఒక్కో వేసవికి ఎన్ని పక్షులుప్రాణాలు కోల్పోతున్నాయో కదా... అనిపించింది. ఏదైనా చేయాలనిపించింది. కానీ ఏం చేయాలనేది వెంటనే స్ఫురించ లేదు.
పిచ్చుకలు వచ్చాయి!
పక్షులకు నీటికోసం ఇంటిముందు చిన్న పాత్రలో నీటిని పెట్టడం మొదలు పెట్టాను. పావురాలు ఇతర పక్షుల కంటే పిచ్చుకలే ఎక్కువగా రాసాగాయి. దాంతో పర్మినెంట్ సొల్యూషన్ కోసం ఆలోచించిస్తున్నప్పుడు పిచ్చుకల సైజ్‌ని కూడా దృష్టిలో పెట్టుకుని ఫీడర్ బాక్స్ డిజైన్ చేశాను. ఇందుకోసం ఇంటర్‌నెట్‌లో చాలా సెర్చ్ చేశాను. మహారాష్ట్ర, నాసిక్‌లోని ప్లాస్టిక్ వస్తువులను తయారు చేసే ఫ్యాక్టరీ వాళ్లతో మాట్లాడి నాక్కావలసిన డిజైన్‌ను వివరించాను.
వాళ్లు రఫ్ తయారు చేసి వాట్సాప్‌లో పంపించేవారు. ప్లాస్టిక్ డబ్బాకు కిటికీల్లాగ ఓపెన్‌గా ఉంచి చిన్న ప్లాస్టిక్ రాడ్‌ను పెట్టించాను. పక్షి ఆ రాడ్ మీద నిలబడి, తెరిచి ఉన్న కిటికీలో ముక్కు పెట్టి గింజలను తింటుంది. నీటి కోసం డబ్బా కింద సాసర్ పెట్టించాను. నాకు సంతృప్తి కలిగే వరకు డిజైన్‌ను మారుస్తూ చేసిచ్చారు వాళ్లు. ఐదేళ్ల కిందట ఇదే తొలి డిజైన్. మొదట వంద పీస్‌లు చేయించి బంధువులు, స్నేహితులకిచ్చాను. తర్వాత అందరూ అడుగుతుండడంతో పెద్ద మొత్తంలో చేయిస్తున్నాం.
తాతయ్య పేరుతో ‘మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా అందరికీ పంచుతున్నాం. ఒక మంచి పని చేయడం, అది కూడా మా తాతయ్య పేరుతో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికి రెండువేలకు పైగా ఇలాంటి డబ్బాలను పంచాను. ఇప్పుడు నేను యూఎస్‌లో పీజీ చేస్తున్నాను. నేను మొదలు పెట్టిన పనిని మా నాన్న కొనసాగిస్తున్నారు. మా చేతిమీదుగా ఈ బర్డ్ ఫీడర్ బాక్స్‌లు అటు ఆదిలాబాద్, నాందేడ్ వరకు, ఇటు హైదరాబాద్, సూర్యాపేట, గుంటూరుకు కూడా చేరాయి.
ఈ బాక్స్ కావాలని ఎవరడిగినా వాళ్ల అడ్రస్ పంపిస్తే చాలు కొరియర్ చార్జ్‌లు కూడా మేమే భరించి ఉచితంగా పంపిస్తాం. వంద మాటలు చెప్పడం కంటే ఒక మంచి పని చేయడం మేలని నమ్ముతాను. ఐదేళ్ల నుంచి ఈ పని చేస్తున్నప్పటికీ నేను ఎక్కడా ప్రచారం చేసుకోలేదు. ఐ లవ్ స్పారోస్ అనేది ఈ ఏడాది వరల్డ్ స్పారో డే (మార్చి 20)సందర్భంగా ప్రపంచం ఇచ్చిన పిలుపు. కానీ నేను పిచ్చుకలను ప్రేమించడం ఎప్పుడో మొదలైంది. నేను అందరినీ కోరుకునేది ఒక్కటే. ఆ చిన్నప్రాణుల కోసం రోజూ ఓ లీటరు నీటిని పెడదాం’’ అన్నారు మంచాల హరిణి.
చుక్క నీరుంటే చాలు!
గుప్పెట్లో పట్టుకుంటే నిండా గుప్పెడంత కూడా ఉండదు. పిచ్చుకంతప్రాణం, రేడియేషన్ బారిన పడి అల్లాడిపోతోంది. అభివృద్ధి పేరుతో మనిషి చేసే అరాచకానికి భయపడిపోతోంది. మనిషి కంటపడకుండా పారిపోతోంది. ఏకంగా ఈ భూమ్మీద నుంచే మాయమైపోదామనుకుంటోంది. మనసున్న మనిషి కరవైన నేల మీద తనకు మనుగడ లేదని ఊరు వదిలి పారిపోయింది. అడవుల బాట పట్టి ఏ చెట్టుకొమ్మనో తనను తాను దాచుకుంటూ నీటిచుక్క కోసం వెతుక్కుంటోంది. మనిషి మనసులో ఆర్ద్రత, గుండెలో తడి ఉందని తెలిసిన పిచ్చుక మళ్లీ రెక్కలు టపటపలాడిస్తోంది.
వందలాది బంధుగణంతో నిజామాబాద్‌లో మంచాల హరిణి ఇంటి ముందు కొలువుదీరింది. ఈ మాత్రం ఆలంబన దొరికితే చాలు... కిచకిచలతో ఊరంతటికీ వీనులవిందు చేస్తానంటోంది పిచ్చుక.
– వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment