Bird lover
-
పిచ్చుకా క్షేమమా
మనిషి తన సౌకర్యం కోసం ప్రకృతి సమతుల్యతకు విఘాతం కలిగిస్తూనే ఉంటాడు. ప్రకృతి సహనంతో ఓర్చుకుంటూ, అప్పుడప్పుడూ విలయం రూపంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటుంది. మొత్తంగా తనను తాను సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ‘మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు’... అని పిచ్చుకలు ఆవేదన చెందుతున్న సమయంలో ప్రకృతి ఓ అమ్మాయి మనసును కదిలించింది. ఆమె ఇప్పుడు పక్షి ప్రేమికురాలైంది. తన ఇంటిని పక్షులకు విలాసంగా మార్చింది. తాను పక్షి ప్రేమికురాలిగా మారిన సందర్భాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు మంచాల హరిణి. అడవికి దాహం వేసింది! ‘‘అప్పుడు నేను బీబీఏ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. అమ్మా నాన్న, నేను, అక్క అందరం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న మా పెద్ద నానమ్మ వాళ్ల ఊరికి వెళ్తున్నాం. నిర్మల్ దాటి కడెం మీదుగా అడవిలో ప్రయాణిస్తున్నాం. మే నెల కావడంతో ఎండ తీవ్రంగా ఉంది. చెట్ల మొదళ్లు ఎండిపోయి వానల కోసం ఎదురు చూస్తున్నాయి. ఓ పక్షి మా కళ్ల ముందే చెట్టుకొమ్మ మీద నుంచి జారి నేల మీద పడింది. కొద్ది సెకన్లపాటు రెక్కలు కొట్టుకున్నాయి. కారాపి వెళ్లి చూశాం, పక్షిని చేతుల్లోకి తీసుకుని మా దగ్గరున్న నీటిని చల్లి, తాగించడానికి ప్రయత్నించాం. కానీ ఆ పక్షి అప్పటికేప్రాణాలు వదిలేసింది. ఆ చిన్నప్రాణికి ఎన్ని నీళ్లు కావాలి, ఆ గుక్కెడు నీళ్లు లేకనే కదాప్రాణం పోయిందని చాలా బాధేసింది. ఆ దృశ్యం పదే పదే కళ్ల ముందు మెదలసాగింది. ఇలాగ ఒక్కో వేసవికి ఎన్ని పక్షులుప్రాణాలు కోల్పోతున్నాయో కదా... అనిపించింది. ఏదైనా చేయాలనిపించింది. కానీ ఏం చేయాలనేది వెంటనే స్ఫురించ లేదు. పిచ్చుకలు వచ్చాయి! పక్షులకు నీటికోసం ఇంటిముందు చిన్న పాత్రలో నీటిని పెట్టడం మొదలు పెట్టాను. పావురాలు ఇతర పక్షుల కంటే పిచ్చుకలే ఎక్కువగా రాసాగాయి. దాంతో పర్మినెంట్ సొల్యూషన్ కోసం ఆలోచించిస్తున్నప్పుడు పిచ్చుకల సైజ్‌ని కూడా దృష్టిలో పెట్టుకుని ఫీడర్ బాక్స్ డిజైన్ చేశాను. ఇందుకోసం ఇంటర్నెట్లో చాలా సెర్చ్ చేశాను. మహారాష్ట్ర, నాసిక్‌లోని ప్లాస్టిక్ వస్తువులను తయారు చేసే ఫ్యాక్టరీ వాళ్లతో మాట్లాడి నాక్కావలసిన డిజైన్‌ను వివరించాను. వాళ్లు రఫ్ తయారు చేసి వాట్సాప్‌లో పంపించేవారు. ప్లాస్టిక్ డబ్బాకు కిటికీల్లాగ ఓపెన్‌గా ఉంచి చిన్న ప్లాస్టిక్ రాడ్‌ను పెట్టించాను. పక్షి ఆ రాడ్ మీద నిలబడి, తెరిచి ఉన్న కిటికీలో ముక్కు పెట్టి గింజలను తింటుంది. నీటి కోసం డబ్బా కింద సాసర్ పెట్టించాను. నాకు సంతృప్తి కలిగే వరకు డిజైన్‌ను మారుస్తూ చేసిచ్చారు వాళ్లు. ఐదేళ్ల కిందట ఇదే తొలి డిజైన్. మొదట వంద పీస్‌లు చేయించి బంధువులు, స్నేహితులకిచ్చాను. తర్వాత అందరూ అడుగుతుండడంతో పెద్ద మొత్తంలో చేయిస్తున్నాం. తాతయ్య పేరుతో ‘మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా అందరికీ పంచుతున్నాం. ఒక మంచి పని చేయడం, అది కూడా మా తాతయ్య పేరుతో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికి రెండువేలకు పైగా ఇలాంటి డబ్బాలను పంచాను. ఇప్పుడు నేను యూఎస్‌లో పీజీ చేస్తున్నాను. నేను మొదలు పెట్టిన పనిని మా నాన్న కొనసాగిస్తున్నారు. మా చేతిమీదుగా ఈ బర్డ్ ఫీడర్ బాక్స్‌లు అటు ఆదిలాబాద్, నాందేడ్ వరకు, ఇటు హైదరాబాద్, సూర్యాపేట, గుంటూరుకు కూడా చేరాయి. ఈ బాక్స్ కావాలని ఎవరడిగినా వాళ్ల అడ్రస్ పంపిస్తే చాలు కొరియర్ చార్జ్‌లు కూడా మేమే భరించి ఉచితంగా పంపిస్తాం. వంద మాటలు చెప్పడం కంటే ఒక మంచి పని చేయడం మేలని నమ్ముతాను. ఐదేళ్ల నుంచి ఈ పని చేస్తున్నప్పటికీ నేను ఎక్కడా ప్రచారం చేసుకోలేదు. ఐ లవ్ స్పారోస్ అనేది ఈ ఏడాది వరల్డ్ స్పారో డే (మార్చి 20)సందర్భంగా ప్రపంచం ఇచ్చిన పిలుపు. కానీ నేను పిచ్చుకలను ప్రేమించడం ఎప్పుడో మొదలైంది. నేను అందరినీ కోరుకునేది ఒక్కటే. ఆ చిన్నప్రాణుల కోసం రోజూ ఓ లీటరు నీటిని పెడదాం’’ అన్నారు మంచాల హరిణి. చుక్క నీరుంటే చాలు! గుప్పెట్లో పట్టుకుంటే నిండా గుప్పెడంత కూడా ఉండదు. పిచ్చుకంతప్రాణం, రేడియేషన్ బారిన పడి అల్లాడిపోతోంది. అభివృద్ధి పేరుతో మనిషి చేసే అరాచకానికి భయపడిపోతోంది. మనిషి కంటపడకుండా పారిపోతోంది. ఏకంగా ఈ భూమ్మీద నుంచే మాయమైపోదామనుకుంటోంది. మనసున్న మనిషి కరవైన నేల మీద తనకు మనుగడ లేదని ఊరు వదిలి పారిపోయింది. అడవుల బాట పట్టి ఏ చెట్టుకొమ్మనో తనను తాను దాచుకుంటూ నీటిచుక్క కోసం వెతుక్కుంటోంది. మనిషి మనసులో ఆర్ద్రత, గుండెలో తడి ఉందని తెలిసిన పిచ్చుక మళ్లీ రెక్కలు టపటపలాడిస్తోంది. వందలాది బంధుగణంతో నిజామాబాద్‌లో మంచాల హరిణి ఇంటి ముందు కొలువుదీరింది. ఈ మాత్రం ఆలంబన దొరికితే చాలు... కిచకిచలతో ఊరంతటికీ వీనులవిందు చేస్తానంటోంది పిచ్చుక. – వాకా మంజులారెడ్డి -
బర్డ్ అంబులెన్స్
చండీగఢ్‌కు చెందిన మన్జిత్సింగ్ ఒక ప్రైవేట్ స్కూల్లో డ్రాయిగ్ టీచర్. పర్యావరణ కార్యకర్త. పక్షుల ప్రేమికుడు. ఏదో పనికోసం పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ పట్టణానికి వెళ్లిన సింగ్ అక్కడ ఒకచోట ఒక దృశ్యాన్ని చూశాడు. స్వీపర్ ఊడుస్తున్న చెత్తలో చనిపోయిన పావురం కనిపించింది. ‘ఎలా చనిపోయింది?’ అని అడిగాడు సింగ్. కరెంట్‌షాక్‌కు గురై చనిపోయినట్లు చెప్పింది ఆమె. ‘ఇలా చాలా పావురాలు చనిపోతాయి’ అని కూడా చెప్పింది. ఈ సంఘటనను సింగ్ మరిచిపోలేకపోయాడు. ఆ సమయంలో రెండు నిర్ణయాలు తీసుకున్నాడు. ఒకటి...వ్యాధులు వ్యాపించకుండా చనిపోయిన పక్షులను ఖననం చేయడం, రెండు...ప్రమాదం బారిన పడిన పక్షులకు చికిత్స అందించడం. దీని కోసం తన సైకిల్‌ను ‘బర్డ్ అంబులెన్స్’గా మార్చి వీధులు తిరుగుతుంటాడు సింగ్. ‘మీకు సమీపంలో పక్షులు ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడి ఉంటే దయచేసి నాకు వెంటనే ఫోన్ చేయండి’ అంటూ వీధుల్లో కరపత్రాలు పంచుతుంటాడు. ‘ఖాళీ సమయంలో పెయింటింగ్స్ వేసి వాటి ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. కాని నాకు అది ఇష్టం లేదు. ఏ మాత్రం సమయం దొరికినా పక్షుల బాగు కోసం ఉపయోగిస్తాను’ అంటున్నాడు మన్జిత్సింగ్. -
పిచ్చుకపై ప్రేమాస్త్రం
‘పిచ్చుకపై బ్రహ్మాస్త్రం’ అనే మాట పురాణాల్లో ఉంది. దాన్ని మనం నిజం చేసేశాం! పిచ్చుకపై ఇంత ఇసుక, కంకర, సిమెంట్ వేస్తున్నాం. మన గూడు కోసం పిచ్చుక గూళ్లనుకొట్టేస్తున్నాం. పిచ్చుకపై మనం వేస్తున్న ఈ అమానుషాస్త్రాన్ని, పిచ్చుక జాతిపై తనకున్నప్రేమ అనే అస్త్రంతో తిప్పికొడుతున్నారు మహేష్ అనే పక్షి ప్రేమికుడు. ఊర పిచ్చుక.. ఒకప్పుడు మన ఆవాసాలలో కిలకిలరావాలతో తిరుగాడిన మానవ స్నేహజీవి. మన లోగిళ్లలో.. చూరులలో.. గూళ్లు కట్టుకుని సంతతిని వృద్ధి చేసుకుంటూ ఉండేవి. మానవాళికి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించేవి. అలాంటి పిచ్చుక ఇప్పుడు చాలా చోట్ల అదృశ్యమై.. దేశంలో అంతరించే జాతుల జాబితాలో చేరింది. ఐయూసీఎన్(ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) వారు రెడ్ లిస్ట్‌లో చేర్చారంటేనే వాటి మనుగడ ఏ స్థాయికి పడిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన వీరా మహేష్ కృత్రిమ ఆవాసాల ద్వారా పిచ్చుకల ‘వృద్ధి సంరక్షణ’లపై 2014 నుంచి పరిశోధన చేస్తున్నారు. మార్చి 20 ‘వరల్డ్ స్పారో డే’ సందర్భంగా పిచ్చుకల ఆవాసాల ఏర్పాటు అవసరం గురించి మహేష్ ‘ఫ్యామిలీ’తో మాట్లాడారు. పిచ్చుకకు ప్లేస్ ముఖ్యం పదేళ్ల క్రితం 2009లో కొత్తగా నిర్మించిన మా ఇంటికి ఒక పిచ్చుకల జంట వచ్చింది. వాటి కోసం ఒక అట్టపెట్టెతో చేసిన గూడును స్లాబుకు దగ్గరగా అమర్చాను. ఏడాది తరువాత ఒక సాయంత్రం తల్లి పిచ్చుక పిల్లలకు ఆహారాన్ని అందించడం గమనించాను! పిచ్చుకలు గూడు బయటికి వెళ్లిన తరువాత పరిశీలిస్తే ఆ గూడులోనే ఆరు గూళ్లు ఉన్నాయి. ఒక్కొక్క గూటినుంచి కనీసం రెండు పిల్లలు వచ్చినా సంవత్సర కాలంలో పన్నెండు పిల్లలు వస్తాయి. ఇలా ఆలోచిస్తే పిచ్చుకలు గూళ్లు నిర్మించుకోవడానికి స్థలం ఎంతో అవసరం అని అర్ధమైంది. ఈ ఆలోచనతోనే నా ప్రయాణాన్ని ప్రారంభించాను. 2012లో చెక్కలతో గూళ్లను తయారుచేసి మా ప్రాంతంలో స్థానికుల సహకారంతో వాళ్ల వాళ్ల ఇళ్ల వద్ద ఏర్పాటు చేశాను. క్రమంగా జంగారెడ్డిగూడెం పట్టణం చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించాను. ప్రస్తుతం పట్టణంలో 400 వరకు కృత్రిమ గూళ్లను ఏర్పాటు చేయగలిగాను. మొదటగా వివిధ ఆకృతులలో చెక్క గూళ్లను నిర్మించి పెట్టాను. వాటిల్లో ప్రధానంగా పిచ్చుకలు ఆవాసం పొందిన గూటిని ప్రామాణికంగా తీసుకున్నాను. ఈ ప్రామాణిక గూళ్లకు పిచ్చుకలు త్వరగా ఆకర్షితమై వాటిలోకి చేరాయి. ఈ గూటిలో కాకులకు పిచ్చుకల పిల్లలు అందవు. వివిధ జాతుల చేరికకు వీలు కలగదు. ఒకసారి చిలుకలు, గోరింకలు లోపలికి చేరేందుకు విఫలయత్నం చేయడం చూశాను. ఇక ఈ గూళ్లలో పిచ్చుకలు వాటి పిల్లలకు ఆహారం అందించడం తేలిక. పిచ్చుకల వృద్ధికి అదో ప్లస్ పాయింట్. దాదాపు గూళ్లన్నీ నిండాయి! గూళ్లను ఏర్పాటు చేసిన తరువాత ప్రతీ సంవత్సరం జనవరి చివరి వారంలో ప్రతి గూడును పరిశీలిస్తూ సర్వే చేస్తున్నాను. గూళ్లకు పిచ్చుకలు చేరాయా లేదా, వాటి రాకపోకలు, సంతాన వృద్ధి, ఇతర పక్షుల వల్ల వాటికి కలిగే ఇబ్బందులు.. తదితర సమాచారాన్ని వాటిని ఏర్పాటు చేసిన వారి నుంచి తెలుసుకుంటాను. అలా 2019 జనవరి వరకు 413 గూళ్లను ఏర్పాటు చేశాను. వీటిలో జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏర్పాటు చేసిన గూళ్లు 340 కాగా, పిచ్చుకలు ఆవాసాలకు వినియోగించిన గూళ్లు 329. సంవత్సరానికి ఈ గూళ్ల కారణంగా సరాసరిన 2 నుంచి 3 పిల్లలతో పిచ్చుక సంతానం వృద్ధి చెందినట్లు గుర్తించాను’’ అని చెప్పారు మహేష్.మహేష్ ప్రయత్నం కారణంగా గతంలో పోల్చితే ప్రస్తుతం జంగారెడ్డిగూడెంలోని ఉప్పలమెట్ట, హైస్కూల్ ప్రాంతం, అయ్యన్నకాలనీ, రాజులకాలనీలలో పిచ్చుక సంఖ్యలో వృద్ధి కనిపిస్తోంది. ఉప్పలమెట్ట ప్రాంతంలో పదుల సంఖ్యలో ఉండే పిచ్చుకలు నేడు సుమారు 300 వరకు ఉన్నాయి. ‘‘ప్రకృతి సమతౌల్యానికి జీవ వైవిధ్యం తప్పనిసరి. మానవ మనుగడలో భాగమైన పిచ్చుకను సంరక్షించుకుంటే పంటలకు పురుగు మందుల అవసరాలే మనకు ఉండవు’’ అంటారు మహేష్. – డి.వి.భాస్కరరావు, సాక్షి, జంగారెడ్డిగూడెం పక్షి ప్రేమికుడు.. పరిశోధకుడు వీరా మహేష్ ఎమ్మెస్సీ జంతుశాస్త్రం చదివారు. ప్రస్తుతం కృత్రిమ ఆవాసాల ద్వారా పిచ్చుకలపై పీహెచ్డీ చేస్తున్నారు. బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీలో పరిశోధకునిగా కూడా మహేష్‌కు అనుభవం ఉంది. పక్షి సమూహాలపై వివిధ ప్రాంతాల్లో పరిశోధన చేశారు. కలివి కోడిపై పరిశోధన, పక్షుల వలసలపై పరిశోధన చేశారు. పిచ్చుకలు, ఆవాసాలు తదితర విషయాలపై మహేష్ రాసిన పరిశోధనాత్మక పత్ర వ్యాస వివరణ ఎన్టీఎస్సీ 2018లో జాతీయ స్థాయిలో ఎంపికైంది. ఆవాసాలు లేకనే అదృశ్యం ఆధునిక ఒరవడిలో పట్టణాల నుంచి గ్రామాల వరకు శాశ్వత గృహాలు కాంక్రీట్ శ్లాబులతో నిర్మితమవుతున్నందున పిచ్చుక జాతికి గూడు నిర్మించుకోవడానికి అనుకూలమైన తాటాకిళ్లు, పెంకుటిళ్లు కనుమరుగువుతున్నాయి. దాంతో గూళ్లు పెట్టుకునే సదుపాయం తగ్గిపోయింది. సంతానోత్పత్తికి అవకాశం లేకుండా పోయింది. పిచ్చుక జాతిని నిలబెట్టడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం కృత్రిమ ఆవాసాలు ఏర్పాటు చేయడం. సమస్యను ముందుగానే గుర్తించి మన ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటే, అవి గూడును కట్టుకోగలుగుతాయి. దీని వల్ల పిచ్చుక జాతి వృద్ధి చెందే అవకాశాలు మెరుగవుతాయి. -
వైరల్ వీడియో: ‘ఐ లవ్ యూ బేబీస్’
వాషింగ్టన్, అమెరికా : తల్లి, పిల్లల ప్రేమానురాగాలు, ఆప్యాయతలు మనుషులకే కాదు సృష్టిలోని జీవులన్నింటిలోనూ ఉంటాయి. అమెరికాలో సోమవారం జరిగిన ఓ సంఘటన ఈ విషయాన్ని మరోసారి చాటి చెప్పింది. పక్షి ప్రేమికురాలు హాగ్కు తాను పెంచుకుంటున్న మాటల చిలుక పిల్లలతో ఆడుకోవడం మహా సరదా. ఎప్పటిలానే సోమవారం చిలుక పిల్లలతో ఆట మొదలుపెట్టిన హాగ్ ఆశ్చర్యకరమైన సంఘటన ఎదురైంది. పొడిపొడి మాటలను మాత్రమే పలికే హాగ్ చిలుక పిల్లలకు ‘ఐ లవ్ యూ బేబీస్’ అని చెప్పింది. పిల్లల నోటికి ఆహారాన్ని అందిస్తూ తల్లి చిలుక వాటిని ముద్దాడుతున్న ఈ అరుదైన సన్నివేశాల్ని హాగ్ రహస్యంగా కెమెరాలో బంధించింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. దాదాపు లక్షా ముప్పైవేల మంది ఆ పక్షుల ప్రేమానురాగాల్ని చూసి మురిసిపోయారు. -
పక్షి ప్రేమికుడు
సత్వం చెబితే ఇది కూడా ఒక కథలాగే ఉంటుంది! అప్పుడు సాలీమ్ అలీకి పదేళ్లు. వేట తెలిసిన కుటుంబంలో పుట్టినవాడు కాబట్టి, ఇంట్లో ఎయిర్‌గన్ ఉంది. దాంతో ఆడుతూ, ఒకరోజు ఎగురుతున్న పిట్టను షూట్ చేశాడు. చూడ్డానికి అది మామూలు ఊరపిచ్చుక(స్పారో)లానే ఉంది. తీరా దగ్గరికెళ్తే కంఠం మీద పసుప్పచ్చ చార కనబడింది. దీని పేరేమిటి? వాళ్ల అంకుల్ అమీరుద్దీన్‌ను అడిగినా చెప్పలేకపోయాడు. ఆ అంకుల్ చేసిన మంచి పనేమిటంటే, పిల్లాడి కుతూహలాన్ని చంపేయకుండా, దగ్గర్లోనే ఉన్న ‘బాంబే నాచురల్ హిస్టరీ సొసైటీ’కి తీసుకెళ్లడం! సొసైటీ గౌరవ కార్యదర్శి డబ్ల్యు.ఎస్.మిల్లర్డ్ బాలుడి ఆసక్తికి ముచ్చటపడి వాళ్ల దగ్గరున్న స్టఫ్డ్ బర్డ్ శాంపిల్స్ చూపించాడు. తను చూసిన పిట్టలాంటిది అక్కడా ఉండటం సాలీమ్‌కు ఉత్సాహం కలిగించింది. ఆ ఘట్టమే ఆయన్ని తర్వాత్తర్వాత గొప్ప ఆర్నిథాలజిస్టుగా తీర్చిదిద్దింది. అందుకే తన ఆత్మకథకు ‘ద ఫాల్ ఆఫ్ ఎ స్పారో’ అని పేరు పెట్టుకున్నాడు. సాలీమ్ మొయిజుద్దీన్ అబ్దుల్ అలీ, వ్యవహారంలో సాలీమ్ అలీ(సలీం అలీ అని కొందరు రాసినా అసలు ఉచ్చారణ ఇదే!) 1896లో నవంబర్ 12న జన్మించాడు. బానే చదివేవాడుగానీ అంత శ్రద్ధ లేదు. అందువల్ల డిగ్రీదాకా రాలేదు. కుటుంబ మైనింగ్ వ్యాపారంలో భాగంగా బర్మా వెళ్లినప్పుడు, అక్కడి అడవుల్లో చూసిన మరిన్ని పిట్టలు ఆయనలోని పాత జిజ్ఞాసకు తిరిగి రెక్కలు తొడిగాయి. ఇక వాటి వెంటే ఎగరడానికి నిర్ణయించుకున్నాడు. అయితే, ఆసక్తి కన్నా కొన్నింటిని ‘విద్యార్హత’ నిర్ణయిస్తుంది కాబట్టి, ఆ అడ్డంకిని కూడా దాటాలనుకున్నాడు. జువాలజీతో బి.ఎ. హానర్స్ చేశాడు. అప్పటికి బీయస్సీ లేదు. బాంబే నాచురల్ హిస్టరీ సొసైటీలో క్లర్కుగా ఉద్యోగం పొందాడు. పెళ్లి చేసుకున్నాడు. మొదట్నుంచీ కూడా పక్షుల ప్రవర్తనను వాటి సహజ పరిసరాల్లో పరిశీలించాలనేది సాలీమ్ సంకల్పం. ఇది మామూలు విషయమే కదా అనిపించవచ్చు. కానీ స్వాతంత్య్రానికి పూర్వం, పక్షుల అధ్యయనమంటే వాటి కళేబరాలతో(టాక్సానమీ) ప్రయోగశాలల్లో చేసేదే! క్షేత్రాధ్యయనం తక్కువ. వేటగాళ్ల మీద ఆధారపడేవాళ్లు. అది సాలీమ్‌కు రుచించేది కాదు. మరింత అధ్యయనం కోసం, ఏడాది సెలవు తీసుకుని, జర్మనీ, ఇంగ్లండ్ వెళ్లాడు. తిరిగొచ్చేసరికి, సంస్థ నష్టాల్లో ఉన్న కారణంగా ఉద్యోగం పోయింది. కొంత ఊగిసలాట తర్వాత, తను ప్రేమించే రంగాన్నే ఉపాధిగా మలుచుకోవడమే సరైందని నిర్ణయించుకున్నాడు. ముందుగా ‘హైదరాబాద్ ఆర్నిథాలాజికల్ సర్వే’ను సంప్రదించాడు. పక్షుల అధ్యయనం చేసిపెట్టినందుకుగానూ ఇంత ప్రతిఫలం ముట్టజెప్పేట్టుగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆరు నెలల కాలానికి ఆరువేల రూపాయలు! వ్యక్తిగత ఖర్చులు తగ్గించుకోవడానికి, భార్య తెహ్మీనా అంగీకారంతో నగర శివార్లలోకి మారాడు. అది ఆయన్ని ప్రకృతికి మరింత దగ్గర చేసింది. బైనాక్యులర్స్, నోట్సు, పెన్సిల్‌తో బయలుదేరిపోయేవాడు. మైళ్లకొద్దీ ఎగిరిపోయేవీ, కనీసం కూడా ఎగరలేనివీ; ఆడపక్షి గుడ్లు పెట్టడం కోసం అందమైన గూళ్లు అల్లేవీ, ఏ ప్రత్యేక శ్రద్ధా తీసుకోకుండా గుడ్లుపెట్టేవీ; పుట్టినచోటే జీవితాంతం గడిపేవీ, రెక్కలు రాగానే వెనక్కి చూడకుండా ఎగిరిపోయేవీ; మనుషుల మీదే ఆధారపడి బతికేవీ, మనుషులు దగ్గరికొస్తే ప్రాణాలకు ముప్పున్నవీ... ఎన్నిరకాల పక్షులు! హైదరాబాద్ తర్వాత కొచ్చిన్, తిరువనంతపురం రాజ్యాల్లో ఈ సర్వే చేశాడు. తర్వాత గ్వాలియర్, ఇండోర్! అటుపై నీలగిరుల్లో తిరిగాడు. అఫ్గానిస్తాన్ కొండల్ని చుట్టాడు. కైలాస మానససరోవరం, హిమాలయాలు, భరత్పూర్, బస్తర్, రణ్ ఆఫ్ కచ్, లడఖ్... ఒంటెల మీదా, గుర్రాల మీదా, ఎడ్లబండ్లమీదా, కాలినడకనా... బొటనవేలంత చిన్నగావుండే తేనెపిట్ట, గుర్రప్పిల్లంత ఎత్తుండే నిప్పుకోడి; చలి ప్రాంతాల్లో పెరిగేది, వేడి ప్రదేశాల్లో మసిలేది; వంపు తిరిగిన ముక్కులూ, ఎర్రని మీసాలూ, తెల్లని బుగ్గలూ, దట్టమైన రంగులూ... ‘మన ప్రపంచంలోనే మరో ప్రపంచం’ అది! భారతదేశంలోనే 1200 జాతుల పక్షులున్నాయి. ఇవి ఎలా ఆహారం సేకరిస్తాయి, ఎలా జతను కూడతాయి, వాటి వన్నెలు, చిన్నెలు, ఈకలు, వాటికే ప్రత్యేకమైన ధ్వనులు... తన జీవితసారాన్ని ‘ద బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్’, ‘హాండ్‌బుక్ ఆఫ్ ద బర్డ్స్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్’(శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ కూడా కలుపుకొని)గా వెలువరించాడు సాలీమ్. ఆయన విశేషకృషికిగానూ ‘పద్మవిభూషణ్’తో గౌరవించింది భారత ప్రభుత్వం. పక్షుల్ని శాస్త్రీయ అవసరాలకోసం వేటాడ్డాన్ని ఆయన వ్యతిరేకించలేదు. అర్థరహితమైన హింసను మాత్రం పూర్తిగా నిరసించాడు. ఆ అభిప్రాయం అహింసలాంటి తాత్వికధారతో ముడిపడినది కాదు; పూర్తి పర్యావరణ హిత కారణాలవల్లే! వ్యక్తిగా కూడా ఆయన మతవిశ్వాసాలు పెద్దగా లేనివాడే! భక్తిని ప్రదర్శించడం ద్వారా తాము ఇతరులకన్నా నైతికంగా అధికులమనుకునే ధోరణిని చీదరించుకునేవాడు. పాల్ గెట్టీ అవార్డుద్వారా ఆయనకు 4 లక్షలు వచ్చినప్పుడు ఒక బంధువు అన్నమాట: ‘ఆ డబ్బులు ఎవరికన్నా విరాళంగా ఇచ్చేముందు, మూడు శుభ్రమైన ప్యాంట్లు కొనుక్కో’. - ఆర్.ఆర్.