పక్షి ప్రేమికుడు | Salim ali bird lover | Sakshi
Sakshi News home page

పక్షి ప్రేమికుడు

Published Sun, Nov 9 2014 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM

పక్షి ప్రేమికుడు

పక్షి ప్రేమికుడు

సత్వం
 
 చెబితే ఇది కూడా ఒక కథలాగే ఉంటుంది! అప్పుడు సాలీమ్ అలీకి పదేళ్లు. వేట తెలిసిన కుటుంబంలో పుట్టినవాడు కాబట్టి, ఇంట్లో ఎయిర్‌గన్ ఉంది. దాంతో ఆడుతూ, ఒకరోజు ఎగురుతున్న పిట్టను షూట్ చేశాడు. చూడ్డానికి అది మామూలు ఊరపిచ్చుక(స్పారో)లానే ఉంది. తీరా దగ్గరికెళ్తే కంఠం మీద పసుప్పచ్చ చార కనబడింది. దీని పేరేమిటి? వాళ్ల అంకుల్ అమీరుద్దీన్‌ను అడిగినా చెప్పలేకపోయాడు. ఆ అంకుల్ చేసిన మంచి పనేమిటంటే, పిల్లాడి కుతూహలాన్ని చంపేయకుండా, దగ్గర్లోనే ఉన్న ‘బాంబే నాచురల్ హిస్టరీ సొసైటీ’కి తీసుకెళ్లడం! సొసైటీ గౌరవ కార్యదర్శి డబ్ల్యు.ఎస్.మిల్లర్డ్ బాలుడి ఆసక్తికి ముచ్చటపడి వాళ్ల దగ్గరున్న స్టఫ్డ్ బర్డ్ శాంపిల్స్ చూపించాడు. తను చూసిన పిట్టలాంటిది అక్కడా ఉండటం సాలీమ్‌కు ఉత్సాహం కలిగించింది. ఆ ఘట్టమే ఆయన్ని తర్వాత్తర్వాత గొప్ప ఆర్నిథాలజిస్టుగా తీర్చిదిద్దింది. అందుకే తన ఆత్మకథకు ‘ద ఫాల్ ఆఫ్ ఎ స్పారో’ అని పేరు పెట్టుకున్నాడు.
 
సాలీమ్ మొయిజుద్దీన్ అబ్దుల్ అలీ, వ్యవహారంలో సాలీమ్ అలీ(సలీం అలీ అని కొందరు రాసినా అసలు ఉచ్చారణ ఇదే!) 1896లో నవంబర్ 12న జన్మించాడు. బానే చదివేవాడుగానీ అంత శ్రద్ధ లేదు. అందువల్ల డిగ్రీదాకా రాలేదు. కుటుంబ మైనింగ్ వ్యాపారంలో భాగంగా బర్మా వెళ్లినప్పుడు, అక్కడి అడవుల్లో చూసిన మరిన్ని పిట్టలు ఆయనలోని పాత జిజ్ఞాసకు తిరిగి రెక్కలు తొడిగాయి. ఇక వాటి వెంటే ఎగరడానికి నిర్ణయించుకున్నాడు. అయితే, ఆసక్తి కన్నా కొన్నింటిని ‘విద్యార్హత’ నిర్ణయిస్తుంది కాబట్టి, ఆ అడ్డంకిని కూడా దాటాలనుకున్నాడు. జువాలజీతో బి.ఎ. హానర్స్ చేశాడు. అప్పటికి బీయస్సీ లేదు. బాంబే నాచురల్ హిస్టరీ సొసైటీలో క్లర్కుగా ఉద్యోగం పొందాడు. పెళ్లి చేసుకున్నాడు.
 
మొదట్నుంచీ కూడా పక్షుల ప్రవర్తనను వాటి సహజ పరిసరాల్లో పరిశీలించాలనేది సాలీమ్ సంకల్పం. ఇది మామూలు విషయమే కదా అనిపించవచ్చు. కానీ స్వాతంత్య్రానికి పూర్వం, పక్షుల అధ్యయనమంటే వాటి కళేబరాలతో(టాక్సానమీ) ప్రయోగశాలల్లో చేసేదే! క్షేత్రాధ్యయనం తక్కువ. వేటగాళ్ల మీద ఆధారపడేవాళ్లు. అది సాలీమ్‌కు రుచించేది కాదు. మరింత అధ్యయనం కోసం, ఏడాది సెలవు తీసుకుని, జర్మనీ, ఇంగ్లండ్ వెళ్లాడు. తిరిగొచ్చేసరికి, సంస్థ నష్టాల్లో ఉన్న కారణంగా ఉద్యోగం పోయింది.
 
కొంత ఊగిసలాట తర్వాత, తను ప్రేమించే రంగాన్నే ఉపాధిగా మలుచుకోవడమే సరైందని నిర్ణయించుకున్నాడు. ముందుగా ‘హైదరాబాద్ ఆర్నిథాలాజికల్ సర్వే’ను సంప్రదించాడు. పక్షుల అధ్యయనం చేసిపెట్టినందుకుగానూ ఇంత ప్రతిఫలం ముట్టజెప్పేట్టుగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆరు నెలల కాలానికి ఆరువేల రూపాయలు! వ్యక్తిగత ఖర్చులు తగ్గించుకోవడానికి, భార్య తెహ్మీనా అంగీకారంతో నగర శివార్లలోకి మారాడు. అది ఆయన్ని ప్రకృతికి మరింత దగ్గర చేసింది.
 
బైనాక్యులర్స్, నోట్సు, పెన్సిల్‌తో బయలుదేరిపోయేవాడు. మైళ్లకొద్దీ ఎగిరిపోయేవీ, కనీసం కూడా ఎగరలేనివీ; ఆడపక్షి గుడ్లు పెట్టడం కోసం అందమైన గూళ్లు అల్లేవీ, ఏ ప్రత్యేక శ్రద్ధా తీసుకోకుండా గుడ్లుపెట్టేవీ; పుట్టినచోటే జీవితాంతం గడిపేవీ, రెక్కలు రాగానే వెనక్కి చూడకుండా ఎగిరిపోయేవీ; మనుషుల మీదే ఆధారపడి బతికేవీ, మనుషులు దగ్గరికొస్తే ప్రాణాలకు ముప్పున్నవీ... ఎన్నిరకాల పక్షులు!
 
హైదరాబాద్ తర్వాత కొచ్చిన్, తిరువనంతపురం రాజ్యాల్లో ఈ సర్వే చేశాడు. తర్వాత గ్వాలియర్, ఇండోర్! అటుపై నీలగిరుల్లో తిరిగాడు. అఫ్గానిస్తాన్ కొండల్ని చుట్టాడు. కైలాస మానససరోవరం, హిమాలయాలు, భరత్‌పూర్, బస్తర్, రణ్ ఆఫ్ కచ్, లడఖ్... ఒంటెల మీదా, గుర్రాల మీదా, ఎడ్లబండ్లమీదా, కాలినడకనా... బొటనవేలంత చిన్నగావుండే తేనెపిట్ట, గుర్రప్పిల్లంత ఎత్తుండే నిప్పుకోడి; చలి ప్రాంతాల్లో పెరిగేది, వేడి ప్రదేశాల్లో మసిలేది; వంపు తిరిగిన ముక్కులూ, ఎర్రని మీసాలూ, తెల్లని బుగ్గలూ, దట్టమైన రంగులూ... ‘మన ప్రపంచంలోనే మరో ప్రపంచం’ అది! భారతదేశంలోనే 1200 జాతుల పక్షులున్నాయి. ఇవి ఎలా ఆహారం సేకరిస్తాయి, ఎలా జతను కూడతాయి, వాటి వన్నెలు, చిన్నెలు, ఈకలు, వాటికే ప్రత్యేకమైన ధ్వనులు... తన జీవితసారాన్ని ‘ద బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్’, ‘హాండ్‌బుక్ ఆఫ్ ద బర్డ్స్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్’(శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ కూడా కలుపుకొని)గా వెలువరించాడు సాలీమ్. ఆయన విశేషకృషికిగానూ ‘పద్మవిభూషణ్’తో గౌరవించింది భారత ప్రభుత్వం.
 
పక్షుల్ని శాస్త్రీయ అవసరాలకోసం వేటాడ్డాన్ని ఆయన వ్యతిరేకించలేదు. అర్థరహితమైన హింసను మాత్రం పూర్తిగా నిరసించాడు. ఆ అభిప్రాయం అహింసలాంటి తాత్వికధారతో ముడిపడినది కాదు; పూర్తి పర్యావరణ హిత కారణాలవల్లే! వ్యక్తిగా కూడా ఆయన మతవిశ్వాసాలు పెద్దగా లేనివాడే! భక్తిని ప్రదర్శించడం ద్వారా తాము ఇతరులకన్నా నైతికంగా అధికులమనుకునే ధోరణిని చీదరించుకునేవాడు.
 
పాల్ గెట్టీ అవార్డుద్వారా ఆయనకు 4 లక్షలు వచ్చినప్పుడు ఒక బంధువు అన్నమాట: ‘ఆ డబ్బులు ఎవరికన్నా విరాళంగా ఇచ్చేముందు, మూడు శుభ్రమైన ప్యాంట్లు కొనుక్కో’.
 
- ఆర్.ఆర్.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement