R.R
-
తమిళ నోట తెలుగు పాట
పండబారిన వెన్నెల రాత్రిలో, చేరదేశపు చెలులు దగ్గర ఉండగా, చక్కటి తెలుగు పాట పాడుతూ, సింధు నదిలో పడవ నడుపుదాం... దర్శకుడు జ్ఞాన రాజశేఖరన్- ‘భారతి’ పేరుతో ఒక జీవితచరిత్రను సినిమాగా తీయడానికి ముఖ్య కారణం, సుబ్రహ్మణ్యం భారతి భావనలు ఆయన్ని ఊపేయడం మాత్రమే కాదు; ప్రమాదవశాత్తూ, దురదృష్టవశాత్తూ కూడా, సుబ్రహ్మణ్య భారతి మరణించినప్పుడు కేవలం పద్నాలుగు మంది మాత్రమే అంత్యక్రియలకు హాజరయ్యారని తెలియడం కూడా! అదెలా జరిగిందో తెలియాలంటే, జీవితానికీ సాహిత్యానికీ ఉన్న సంబంధం ఏమిటో తెలియాలి. సాహిత్యాన్ని జీవితం, జీవితాన్ని సాహిత్యం పెనవేసుకున్న వైనం తెలియాలి.సుబ్రహ్మణ్య భారతి అసలు పేరు సుబ్బియ. ఐదేళ్లకే తల్లిని కోల్పోయాడు. నేర్చుకున్న సంగీతం ఒడిలో సేదతీరాడు. 11 ఏళ్ల వయసులోనే అపర గాంధర్వులనుకున్నవారితో సంగీతంలో పోటీపడ్డాడు. ఫలితంగా ‘భారతీయార్’ అన్న బిరుదునూ, దానిమీదుగానే ‘పేరు’నూ పొందాడు. అలౌకిక బీజాలు కనబడుతున్న కొడుకుని లౌకిక ప్రపంచంలోకి లాగడానికి పదహారేళ్లకే పెళ్లి జరిపించాడు తండ్రి. అయినా వివాహం బంధనం కాలేకపోయింది. కాశీ వెళ్లాడు భారతి. సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. లోకసంచారిగా బ్రిటిష్‌వారి పాలనలోని భారతదేశపు పేదరికాన్ని, అసమానతలను నగ్నంగా దర్శించాడు. దేశపుత్రుడిగా మాతృమూర్తికి స్వాతంత్య్రపు అంబరాల్ని తొడగాల్సిన బాధ్యతను గుర్తెరిగాడు. భారతమాతను తల్చుకుంటేనే అంతరాళాల్లో పొంగే ధైర్యాన్ని స్పృహించాడు. ‘కాలిపోయినా, బాధపడ్డా పదేపదే వందేమాతరం’ పాడదామన్నాడు. భారతి లక్ష్యాలు రెండు. మొదటిది స్వాతంత్య్రం పొందడం. రెండవది, స్వాతంత్య్రం అనంతరం మనల్ని మనం సంస్కరించుకోవడం. అందుకుగానూ ‘స్వదేశీ మిత్రన్’, ‘ఇండియా’ వంటి పత్రికలు నెలకొల్పాడు. కవిత్వం అల్లాడు. కథలు చెప్పాడు. వ్యాసాలు రాశాడు. కన్నన్ పాట్టు, కూయిల్ పాట్టు, పాప్ప పాట్టు లాంటి రచనలు చేశాడు. సమాజ స్థితినీ, గతినీ సజీవంగా చిత్రించాడు. కులాల మెట్లు కూలిపోవాలన్నాడు. మతాల అడ్డుగోడలు పడిపోవాలన్నాడు. జన హృదయ పరివర్తనను కాంక్షించాడు. ‘కాకీ, పిచ్చుకలదీ మన కులమే; సముద్రం, పర్వతం మన సమూహమే’ అన్నాడు. ‘మూర్ఖులు మాత్రమే మనుషుల మధ్య మంటలు పెడతా’రన్నాడు. అడ్డగోలు దేవుళ్ల ఉనికిని నిరసించాడు. ‘దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడూ ప్రతి జీవిలోనూ ఉన్నా’డన్నాడు. ‘ప్రేమతో మాత్రమే ఈ ప్రపంచం వర్ధిల్లగల’దని విశ్వసించాడు. వంద సంవత్సరాల క్రితమే లింగ వివక్షను ప్రశ్నించాడు. విద్యతోనే వికాసమని మహిళలకు ఉద్బోధించాడు. స్వయం సమృద్ధమైన సామ్యవాదాన్ని స్వప్నించాడు. ‘ప్రియురాలు తమిళంలో మాట్లాడితే అది జీవనదుల ఊట’ అంటూనే, ‘సుందర తెలుంగు నిఱ్ పాట్టి శైత్తు/ త్తోణిగ ళోట్టి విళైయాడి వరువోం’(పండబారిన వెన్నెల రాత్రిలో, చేరదేశపు చెలులు దగ్గర ఉండగా, చక్కటి తెలుగు పాట పాడుతూ, సింధు నదిలో పడవ నడుపుదాం’ అని భారతీయ హృదయాన్ని ఆవిష్కరించుకున్నాడు. ‘వెలుగే నీ కనులే చిట్టెమ్మా సూర్యచంద్రులే/ నల్లని నీ కనుపాపే చిట్టెమ్మా వానమేఘాలే’ అని పాడుకున్నాడు. ‘నిప్పులో చెయ్యిపెడితే నిన్ను ముట్టుకున్నట్లే ఉందేమిటి కృష్ణా’ అని పరవశించాడు. ‘కవిత రాసేవాడు కవి కాడు. కవిత్వాన్ని జీవితంగా జీవితాన్ని కవిత్వంగా చేసుకున్నవాడే కవి’ అన్నాడు భారతి. ఆయన కవిని మించిన సంస్కర్త. సంస్కర్తను మించిన కవి. జీవితాన్నీ సాహిత్యాన్నీ లౌక్యంగా వేరు చేయలేదు. ఆయనకు రెండూ ఒకటే. రైతులతో, కూలీలతో భుజాలు కలిపి తిరిగాడు. దళితులను ఆలింగనం చేసుకున్నాడు. స్వయంగా ‘హరిజనుడికి’ ఉపనయనం చేశాడు. తన కూతురు తంగమ్మను అదే వర్గంలో ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు. అదిగో, అప్పుడు, ఆయన దగ్గరివాళ్లందరికీ దూరమైపోయాడు. దగ్గరవడానికి ప్రయత్నించినవాళ్లు ఆ సమయంలో దూరంగా ఉండివుంటారు! దాంతో- నిత్యజీవితపు కోలాహలం నుంచి అనాసక్త స్థితికి వచ్చాడు. కవిత్వం రాసుకోవడం, పార్థసారథి కోవెలకు వెళ్లడం, అక్కడి ఏనుగుతో కాసేపు గడపడం చేస్తూవచ్చాడు. అయితే రోజూ ఆయనచేతి అరటిపళ్లను ప్రేమగా తినేంతగా మాలిమి అయిన ఆ ఏనుగే తొండంతో ఆయన్ని చుట్టి నేలకు కొట్టింది. ఒక వీరుడు మరణించకూడని చావు అది! కానీ వాస్తవం అది! అలా నలభయ్యో జన్మదినం కూడా చూడకుండా సుబ్రహ్మణ్య భారతి (11 డిసెంబర్ 1882- 11 సెప్టెంబర్ 1921) దుర్మరణం పాలయ్యాడు. ‘భారతి నిజంగా అగ్నిలాంటివాడు. జనం ఆ అగ్నిని తమ చేతుల్లో కొంతసేపే మోయగలరు తప్ప ఎల్లప్పుడూ కాదు. అగ్నిని కింద పడవేయాల్సిందే, పడవేశారు’ అంటాడు జ్ఞాన రాజశేఖరన్, ‘అంత్యక్రియలకు పద్నాలుగు మంది హాజరు’కు గల అప్పటి కారణాన్ని ఊహిస్తూ. కానీ, అదే అగ్ని నెమ్మదిగా హృదయాల్ని వెలిగించే దివ్వెలుగా రూపాంతరం చెందివుంటుంది! ఇక పడేయడం కాని పని! - ఆర్.ఆర్. -
సెల్ఫ్ హెల్ప్ గురు
ఎప్పుడూ మూడు ఉపన్యాసాలుంటాయి: నువ్వు సాధన చేసింది; నువ్వు ఇచ్చింది; నువ్వు ఇచ్చివుంటే బాగుండేదనుకున్నది. - డేల్ కార్నెగీ ‘నేర్చుకోవడం అనేది అంత ప్రధానం కాదు; నేర్చుకుంటుండగా నువ్వెలాంటి మనిషివిగా తయారవుతావన్నది అంతకంటే ముఖ్యం’ అంటాడు డేల్ కార్నెగీ. ఇరవయ్యో శతాబ్దపు తొలి అర్ధభాగంలో వ్యక్తిత్వ వికాసానికి తనదైన బాట పరిచిన కార్నెగీ తరచూ ఇలా చెప్పేవాడు: ‘నిన్ను నువ్వు ఇలా ప్రశ్నించుకో: నాకు ఇంతకంటే చెడు ఏం జరగ్గలుగుతుంది? ఆ చెడును అంగీకరించడానికి సిద్ధపడు. ఆ చెడునుంచి మెరుగవడానికి ప్రయత్నించు’. వ్యక్తిగతంగా కూడా డేల్ కార్నెగీ చాలా చెడ్డ పరిస్థితుల్లోంచే మెరుగవుతూ వచ్చాడు. ఈ భవిష్యత్ ‘సెల్ఫ్ హెల్ప్ గురు’... అమెరికాలో 1888 నవంబర్ 24న పేద రైతుకుటుంబంలో జన్మించాడు. వాళ్ల ఊరిని పక్కనున్న నది ఎప్పుడూ వరదల్తో ముంచెత్తేది. దానివల్ల కరువు ఉత్పన్నమయ్యేది. అప్పుల భారంతో వాళ్ల నాన్న ఒక దశలో ఆత్మహత్యకు కూడా సిద్ధపడ్డాడు. ‘సిగ్గుపడే పరిస్థితుల్లోకి నెట్టిన’ పేదరికాన్ని చిన్నారి డేల్ ఈసడించుకునేవాడు. అయితే అంతటి విపత్కర కాలంలోనూ సంసారాన్ని ఈదడానికి ధైర్యంగా నిలబడిన వాళ్ల అమ్మ వ్యక్తిత్వం అతడిని ముగ్ధుడిని చేసేది. బడికి గుర్రం మీద వెళ్లేవాడు డేల్. ఫీజులేని చోట చదివేవాడు. చదువుకుంటూ పొలం పనులు చేసేవాడు. ఆవుల పాలు పిండటానికి ఉదయం నాలుగింటికి లేచేవాడు. కాలేజీలో చదువుతున్నప్పుడు ఒకమ్మాయిని ప్రేమించానని చెబితే, ఆమె తిరస్కరించింది. దీనికి కచ్చితంగా తన పేదరికమే కారణమని బలంగా విశ్వసించాడు. తాను ఎప్పటికైనా ధనవంతుడినీ, గొప్పవాడినీ కావాలనీ గట్టిగా శపథం చేసుకున్నాడు. కాలం దాన్ని నిజం చేసింది కూడా! భుక్తి కోసం డేల్ కార్నెగీ కొన్నాళ్లు సేల్స్‌మన్‌గా పనిచేశాడు. మరికొన్నాళ్లు నటుడిగా ప్రయత్నించాడు. కొన్నిరోజులు పాఠాలు చెప్పాడు. అయితే, స్టేజీ మీద మాట్లాడాలంటే అందరూ భయపడటాన్ని గమనించిన కార్నెగీకి ‘పబ్లిక్ స్పీకింగ్’లోనే కెరీర్ కనబడింది. ‘ఎప్పుడూ మూడు ఉపన్యాసాలుంటాయి: నువ్వు సాధన చేసింది; నువ్వు ఇచ్చింది; నువ్వు ఇచ్చివుంటే బాగుండేదనుకున్నది’. తొలినాళ్లలో రాబడిలో 80 శాతం యజమానికి ఇచ్చే ఒప్పందం మీద ఒక హాల్‌ను అద్దెకు తీసుకున్నాడు. వికాస పాఠాలు బోధించడం మొదలుపెట్టాడు. ‘ఎదుటివారిని విమర్శించేముందు నీ లోపాల గురించి మాట్లాడు’. ‘మెరుగైనది ఎంతచిన్నదైనా అభినందించు; ప్రతి మెరుగైనదాన్నీ అభినందించు’. ‘నీదే తప్పయితే వెంటనే ఒప్పుకో; దృఢంగా ఒప్పుకో’. ‘మంచి శ్రోతవు కా; ఎదుటివారిని తమగురించి చెప్పుకునేలా ప్రోత్సహించు’. ‘వాదనలోంచి బయటపడే ఉచితమైన మార్గం ఏమిటంటే, అది లేకుండా చేసుకోవడమే!’ విద్యార్థులు, ఉద్యోగార్థులు, వ్యాపారులు, సంసారులు అన్న తేడా లేకుండా ఆయన తరగతులకు హాజరయ్యేవారు. వాళ్లను వాళ్లతోనే తమ సమస్యలకు పరిష్కారాలు వెతికించేవాడు. ‘ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు రాసుకో: సమస్య ఏమిటి? ఆ సమస్యకు కారణాలేమిటి? ఆ సమస్యకు ఉండదగిన పరిష్కారాలేమిటి? ఉన్నవాటిల్లో అత్యుత్తమ పరిష్కారం ఏమిటి?’ ‘అన్ని వాస్తవాలనీ సేకరించు; వాస్తవాలన్నింటినీ బేరీజు వేసుకుని ఒక నిర్ణయానికి రా; ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత, దానికనుగుణంగా నడుచుకో!’ కార్నెగీ వార్తాపత్రికలకు కాలమ్స్ రాసేవాడు. రేడియోలో షో నిర్వహించేవాడు. బాధల్ని అధిగమించడానికి సగటు సూత్రాన్ని ఉపయోగించమనేవాడు. అలాగే, తొలగించలేనిదానికి అంగీకారమే శరణ్యం అని చెప్పేవాడు. ఇవన్నీ తన సొంత ఆలోచనలేమీ కాదనీ, సోక్రటీస్, చెస్టర్‌ఫీల్డ్, జీసస్ నుంచి అరువు తెచ్చుకున్నవేననీ అనేవాడు. ‘అవే నచ్చకపోతే మరింక ఎవరివి వాడతావు?’ ఆయన పాఠాల్లో కొన్నింటిని క్రోడీకరించి, ‘పబ్లిక్ స్పీకింగ్: ఎ ప్రాక్టికల్ కోర్స్ ఫర్ బిజినెస్మెన్’ వెలువరించాడు. అయితే, కార్నెగీ పేరును ఖండం దాటించిన పుస్తకం మాత్రం ‘హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లూయెన్స్ పీపుల్’ (1937). దానికి ముందు ‘ది ఆర్ట్ ఆఫ్ గెటింగ్ అలాంగ్ విత్ పీపుల్’ అని పేరు పెట్టాడాయన. ప్రచురణకర్తల్ని ఆ టైటిల్ ఆకర్షించలేదు. పేరు మార్చి, విషయం చేర్చి, మళ్లీ ఇచ్చాడు. అయితే, గట్టిగా 30,000 కాపీలు పోతుందనుకున్నది, నెల లోపలే 3,33,000 ప్రతులు అమ్ముడుపోయింది. ‘ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యచకితుణ్ని’ అన్నాడు ఇంటర్వ్యూకు వచ్చిన విలేఖరితో. తర్వాత కోటిన్నర కాపీలు అమ్ముడుపోయింది. వివిధ భాషల్లోకి అనువాదమైంది. 1948లో ‘హౌ టు స్టాప్ వరీయింగ్ అండ్ స్టార్ట్ లివింగ్’ ప్రచురించాడు. ఆయన మొత్తం బోధనల్లోని సారాంశం ఇలా ఉంటుంది: ‘విమర్శ, నింద, ఫిర్యాదు తగవు’. ‘నిజాయితీగా ప్రశంసించు’. ‘నవ్వు’. ‘ఇతరుల మీద మనఃపూర్వక ఆసక్తిని చూపించు’. ‘ఇతరుల్ని అనుకరించకు’. ‘ఇతరులకోసం సంతోషాన్ని సృష్టించు’. ‘నీ కష్టాల్ని కాదు, నీ వరాల్ని లెక్కించుకో’. ‘పనిలోనే విశ్రాంతి తీసుకోవడం ఎలాగో నేర్చుకో’. ‘వాటి ప్రాధాన్యతా క్రమంలో పనుల్ని పూర్తిచేయి’. ‘నిన్ను నువ్వు కనుక్కో; నీలా ఉండు; ఈ భూమ్మీద నిన్ను పోలిన మనిషి మరొకరు లేరని గుర్తుంచుకో’. ఆయన చెప్పినవన్నీ మరెక్కడైనా విన్నట్టనిపిస్తోందా? అదే కార్నెగీ గొప్పతనం! - ఆర్.ఆర్. -
పక్షి ప్రేమికుడు
సత్వం చెబితే ఇది కూడా ఒక కథలాగే ఉంటుంది! అప్పుడు సాలీమ్ అలీకి పదేళ్లు. వేట తెలిసిన కుటుంబంలో పుట్టినవాడు కాబట్టి, ఇంట్లో ఎయిర్‌గన్ ఉంది. దాంతో ఆడుతూ, ఒకరోజు ఎగురుతున్న పిట్టను షూట్ చేశాడు. చూడ్డానికి అది మామూలు ఊరపిచ్చుక(స్పారో)లానే ఉంది. తీరా దగ్గరికెళ్తే కంఠం మీద పసుప్పచ్చ చార కనబడింది. దీని పేరేమిటి? వాళ్ల అంకుల్ అమీరుద్దీన్‌ను అడిగినా చెప్పలేకపోయాడు. ఆ అంకుల్ చేసిన మంచి పనేమిటంటే, పిల్లాడి కుతూహలాన్ని చంపేయకుండా, దగ్గర్లోనే ఉన్న ‘బాంబే నాచురల్ హిస్టరీ సొసైటీ’కి తీసుకెళ్లడం! సొసైటీ గౌరవ కార్యదర్శి డబ్ల్యు.ఎస్.మిల్లర్డ్ బాలుడి ఆసక్తికి ముచ్చటపడి వాళ్ల దగ్గరున్న స్టఫ్డ్ బర్డ్ శాంపిల్స్ చూపించాడు. తను చూసిన పిట్టలాంటిది అక్కడా ఉండటం సాలీమ్‌కు ఉత్సాహం కలిగించింది. ఆ ఘట్టమే ఆయన్ని తర్వాత్తర్వాత గొప్ప ఆర్నిథాలజిస్టుగా తీర్చిదిద్దింది. అందుకే తన ఆత్మకథకు ‘ద ఫాల్ ఆఫ్ ఎ స్పారో’ అని పేరు పెట్టుకున్నాడు. సాలీమ్ మొయిజుద్దీన్ అబ్దుల్ అలీ, వ్యవహారంలో సాలీమ్ అలీ(సలీం అలీ అని కొందరు రాసినా అసలు ఉచ్చారణ ఇదే!) 1896లో నవంబర్ 12న జన్మించాడు. బానే చదివేవాడుగానీ అంత శ్రద్ధ లేదు. అందువల్ల డిగ్రీదాకా రాలేదు. కుటుంబ మైనింగ్ వ్యాపారంలో భాగంగా బర్మా వెళ్లినప్పుడు, అక్కడి అడవుల్లో చూసిన మరిన్ని పిట్టలు ఆయనలోని పాత జిజ్ఞాసకు తిరిగి రెక్కలు తొడిగాయి. ఇక వాటి వెంటే ఎగరడానికి నిర్ణయించుకున్నాడు. అయితే, ఆసక్తి కన్నా కొన్నింటిని ‘విద్యార్హత’ నిర్ణయిస్తుంది కాబట్టి, ఆ అడ్డంకిని కూడా దాటాలనుకున్నాడు. జువాలజీతో బి.ఎ. హానర్స్ చేశాడు. అప్పటికి బీయస్సీ లేదు. బాంబే నాచురల్ హిస్టరీ సొసైటీలో క్లర్కుగా ఉద్యోగం పొందాడు. పెళ్లి చేసుకున్నాడు. మొదట్నుంచీ కూడా పక్షుల ప్రవర్తనను వాటి సహజ పరిసరాల్లో పరిశీలించాలనేది సాలీమ్ సంకల్పం. ఇది మామూలు విషయమే కదా అనిపించవచ్చు. కానీ స్వాతంత్య్రానికి పూర్వం, పక్షుల అధ్యయనమంటే వాటి కళేబరాలతో(టాక్సానమీ) ప్రయోగశాలల్లో చేసేదే! క్షేత్రాధ్యయనం తక్కువ. వేటగాళ్ల మీద ఆధారపడేవాళ్లు. అది సాలీమ్‌కు రుచించేది కాదు. మరింత అధ్యయనం కోసం, ఏడాది సెలవు తీసుకుని, జర్మనీ, ఇంగ్లండ్ వెళ్లాడు. తిరిగొచ్చేసరికి, సంస్థ నష్టాల్లో ఉన్న కారణంగా ఉద్యోగం పోయింది. కొంత ఊగిసలాట తర్వాత, తను ప్రేమించే రంగాన్నే ఉపాధిగా మలుచుకోవడమే సరైందని నిర్ణయించుకున్నాడు. ముందుగా ‘హైదరాబాద్ ఆర్నిథాలాజికల్ సర్వే’ను సంప్రదించాడు. పక్షుల అధ్యయనం చేసిపెట్టినందుకుగానూ ఇంత ప్రతిఫలం ముట్టజెప్పేట్టుగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆరు నెలల కాలానికి ఆరువేల రూపాయలు! వ్యక్తిగత ఖర్చులు తగ్గించుకోవడానికి, భార్య తెహ్మీనా అంగీకారంతో నగర శివార్లలోకి మారాడు. అది ఆయన్ని ప్రకృతికి మరింత దగ్గర చేసింది. బైనాక్యులర్స్, నోట్సు, పెన్సిల్‌తో బయలుదేరిపోయేవాడు. మైళ్లకొద్దీ ఎగిరిపోయేవీ, కనీసం కూడా ఎగరలేనివీ; ఆడపక్షి గుడ్లు పెట్టడం కోసం అందమైన గూళ్లు అల్లేవీ, ఏ ప్రత్యేక శ్రద్ధా తీసుకోకుండా గుడ్లుపెట్టేవీ; పుట్టినచోటే జీవితాంతం గడిపేవీ, రెక్కలు రాగానే వెనక్కి చూడకుండా ఎగిరిపోయేవీ; మనుషుల మీదే ఆధారపడి బతికేవీ, మనుషులు దగ్గరికొస్తే ప్రాణాలకు ముప్పున్నవీ... ఎన్నిరకాల పక్షులు! హైదరాబాద్ తర్వాత కొచ్చిన్, తిరువనంతపురం రాజ్యాల్లో ఈ సర్వే చేశాడు. తర్వాత గ్వాలియర్, ఇండోర్! అటుపై నీలగిరుల్లో తిరిగాడు. అఫ్గానిస్తాన్ కొండల్ని చుట్టాడు. కైలాస మానససరోవరం, హిమాలయాలు, భరత్పూర్, బస్తర్, రణ్ ఆఫ్ కచ్, లడఖ్... ఒంటెల మీదా, గుర్రాల మీదా, ఎడ్లబండ్లమీదా, కాలినడకనా... బొటనవేలంత చిన్నగావుండే తేనెపిట్ట, గుర్రప్పిల్లంత ఎత్తుండే నిప్పుకోడి; చలి ప్రాంతాల్లో పెరిగేది, వేడి ప్రదేశాల్లో మసిలేది; వంపు తిరిగిన ముక్కులూ, ఎర్రని మీసాలూ, తెల్లని బుగ్గలూ, దట్టమైన రంగులూ... ‘మన ప్రపంచంలోనే మరో ప్రపంచం’ అది! భారతదేశంలోనే 1200 జాతుల పక్షులున్నాయి. ఇవి ఎలా ఆహారం సేకరిస్తాయి, ఎలా జతను కూడతాయి, వాటి వన్నెలు, చిన్నెలు, ఈకలు, వాటికే ప్రత్యేకమైన ధ్వనులు... తన జీవితసారాన్ని ‘ద బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్’, ‘హాండ్‌బుక్ ఆఫ్ ద బర్డ్స్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్’(శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ కూడా కలుపుకొని)గా వెలువరించాడు సాలీమ్. ఆయన విశేషకృషికిగానూ ‘పద్మవిభూషణ్’తో గౌరవించింది భారత ప్రభుత్వం. పక్షుల్ని శాస్త్రీయ అవసరాలకోసం వేటాడ్డాన్ని ఆయన వ్యతిరేకించలేదు. అర్థరహితమైన హింసను మాత్రం పూర్తిగా నిరసించాడు. ఆ అభిప్రాయం అహింసలాంటి తాత్వికధారతో ముడిపడినది కాదు; పూర్తి పర్యావరణ హిత కారణాలవల్లే! వ్యక్తిగా కూడా ఆయన మతవిశ్వాసాలు పెద్దగా లేనివాడే! భక్తిని ప్రదర్శించడం ద్వారా తాము ఇతరులకన్నా నైతికంగా అధికులమనుకునే ధోరణిని చీదరించుకునేవాడు. పాల్ గెట్టీ అవార్డుద్వారా ఆయనకు 4 లక్షలు వచ్చినప్పుడు ఒక బంధువు అన్నమాట: ‘ఆ డబ్బులు ఎవరికన్నా విరాళంగా ఇచ్చేముందు, మూడు శుభ్రమైన ప్యాంట్లు కొనుక్కో’. - ఆర్.ఆర్. -
దేవుడి శత్రువు?
అక్టోబర్ 15న తత్వవేత్త నీషే జయంతి సత్వం:దేవుడు మరణించాడంటున్నాడంటే, నీషే దేవుణ్ని తిరస్కరిస్తున్నట్టా? దేవుణ్ని తొలగించుకున్నాక, దాన్ని పూరించే ఖాళీ ఏమిటి? ఇది అర్థం కాకే ప్రపంచానికి పిచ్చెక్కిపోతోంది. లేదా, ఇది అర్థమయ్యే దేవుణ్ని కొనసాగిస్తూ వస్తోందా? వ్యక్తి మనుగడలో దేవుడి పాత్ర ఏమిటి? ‘దేవుడు మరణించాడు’ అన్నాడు జర్మన్ తత్వవేత్త ఫ్రీడ్రిక్ నీషే. ఆయన ప్రధాన భాగస్వామ్యం ఉన్న అస్తిత్వవాద సిద్ధాంతం ప్రకారం, మనిషి జీవితంలో- ఏ మానవాతీత శక్తి ప్రమేయమూ లేదు. తలరాత అనేది అబద్ధం. మనిషి తన నిర్ణయాన్ని తానే తీసుకుంటాడు. తన జీవనశైలికి తానే బాధ్యుడవుతాడు. తన మంచికీ, చెడుకీ కర్త తనే! దేవుడు మరణించాడంటున్నాడంటే, నీషే దేవుణ్ని తిరస్కరిస్తున్నట్టా? దేవుణ్ని తొలగించుకున్నాక, దాన్ని పూరించే ఖాళీ ఏమిటి? ఇది అర్థం కాకే ప్రపంచానికి పిచ్చెక్కిపోతోంది. లేదా, ఇది అర్థమయ్యే దేవుణ్ని కొనసాగిస్తూ వస్తోందా? లేక, దేవుణ్ని చంపింది మనుషులే అని నిందిస్తున్నాడా నీషే? ఒక విశ్వాసానికి కట్టుబడలేని కపటాన్ని ఎద్దేవా చేస్తున్నాడా? దేవుడిని కేవలం ఒక ట్రోఫీగా మార్చిన తీరుకు నిరసన చెబుతున్నాడా? ఏ శుద్ధజలంలో మనల్ని శుభ్రపరుచుకుందామని అడుగుతున్నాడా? వివిధ పుస్తకాలుగా తన భావాల్ని వెల్లడించాడు నీషే. అందులో ‘థస్ స్పోక్ జరాతుష్ట్ర’ ముఖ్యమైనది. పూర్వపు మత, సాంఘిక విలువల శైథిల్యం ఆయన రచనల్లో కనబడుతుంది. జనం మందగా ఉండటాన్ని వెక్కిరిస్తాడు. మందకు ఒక పద్ధతంటూ ఉండదు. సమాజానిది కూడా ‘మంద’గమనమే! ఇక్కడ నీతి లేదు. జనం నమ్ముతున్న విలువలకు విలువ లేదు. విశ్వాసాలకు విశ్వసనీయత లేదు. ‘ఒంటెలాంటివాడు మనిషి. తనకు తానే మోకరిల్లి, తన భుజాల మీద అనవసరమైన బరువులు ఎక్కించుకుని, ఆ తరువాత బతుకు భారమైపోయిందని ఏడుస్తాడు’. ‘ఏది నువ్వు కాదో అదే దైవం, అదే ఆదర్శం’. తాను ఏమికాదో దాన్నే మోసుకు తిరుగుతాడు మనిషి. ‘నీలో విలయం తాండవిస్తేనేకానీ నర్తించే నక్షత్రానికి జన్మనివ్వలేవు’. విల్ టు పవర్, సూపర్ మాన్ భావనలు ప్రవేశపెట్టాడు నీషే. ఇప్పటి వ్యక్తిత్వ వికాస నిపుణుల భావనలుగా కనబడతాయివి. ప్రతి జీవి కూడా తానున్న స్థితిలోంచి, మరింత ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీనికి శక్తి కావాలి. అంతిమలక్ష్యం చేరుకోవడమన్నది ఆయా వ్యక్తుల శక్తి మీదే ఆధారపడివుంటుంది. పరిస్థితులతో పోరాడాలి. వాటిని అనుకూలంగా మార్చుకోవాలి. ఈ సంఘర్షణలో నిలబడేది వీరులు మాత్రమే. కాబట్టి బలమే సుగుణం. శక్తిహీనతే దుర్గుణం. ఏ సిద్ధాంతం ఉపయోగపడితే దాన్నే అనుసరించాలి. అప్పుడే నువ్వు సూపర్మాన్ కాగలవు, అన్నాడు. ఇక్కడే నీషే వివాదాస్పదం అయ్యాడు. ఆయన భావాల్ని నాజీలు తమకు అనువుగా మలుచుకుని ఆర్యన్ జాతి గొప్పదన్న ప్రచారం చేసుకున్నారు. నీషే బాల్యం అంతా మతవిశ్వాసాలు తీవ్రంగా ఉన్న పరిసరాల్లో గడిచింది. నాలుగేళ్ల వయసున్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. బాల్యమంతా తల్లి, అమ్మమ్మ, అత్తలు, చెల్లి... ఇలా ఆడవాళ్ల చుట్టూనే తిరిగింది. కానీ అసలైన స్త్రీ సాంగత్యం కావాల్సిన యౌవనంలో తిరస్కారానికే గురైనాడు. చిన్నతనం నుంచీ మూడీగా, బలహీనంగా ఉండేవాడు. ఒంటరిగా గడిపాడు. స్నేహితులు లేరు. కోరుకున్న స్త్రీని అందుకున్న అదృష్టం లేదు. తనలో లేని ‘సూపర్ మాన్’కు ఇవన్నీ ఊతం అయ్యాయా?పరస్పర విరుద్ధంగా ఉన్నట్టుగా తోస్తాడు నీషే. స్పష్టంగా ఏం చెప్పాడో ఒక కంక్లూజన్‌కు వచ్చినట్టు కనబడదు. ప్రపంచం ఇలా ఉండాలన్నాడా? ఇలా ఉందన్నాడా? మళ్లీ ఏ విధమైన గుడ్డినమ్మకాలు, చారిత్రక సంకెళ్లు లేని స్వేచ్ఛా ఆత్మ గురించి యోచించాడు. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్న మనిషినీ, కేవలం భయంలో, వాంఛలో మగ్గిపోయే మనిషినీ పట్టించాడు. భయమే మనిషిని బానిసను చేస్తుంది. ‘బానిస భావజాలంలో దయ, అణకువ, సహానుభూతి లాంటి పదాలుంటే, యజమాని నిఘంటువులో దర్పం, శక్తి, ఘనత లాంటివాటికే చోటుంటుంది. యజమాని ఘటనల్ని మంచికో చెడుకో దారితీసే పరిణామాలుగానే పరిగణిస్తాడు. బానిస అవే ఘటనల్ని మంచీ చెడూ ఉద్దేశాలుగా చూస్తాడు’. ‘సింహాసనం మీద ఎక్కడానికి అందరూ ఎగబడుతున్నారు. పిచ్చికాకపోతే అదేదో సంతోషం సింహాసనం మీద కూర్చునివున్నట్టు!’ ‘మంచివాళ్లని లేదు, చెడ్డవాళ్లని లేదు, రాజ్యంలో అందరూ విషం తాగినవాళ్లే. మంచివాళ్లని లేదు, చెడ్డవాళ్లని లేదు, అందరూ తమని కోల్పోయివున్నారు. ఈ నిదానమైన ఆత్మహత్యే జీవితంగా పరిగణించబడుతోంది’. ‘(అయితే) జీవితం ఏమీ పళ్లెంలో అందుకోవాల్సిన భోజనం కాదు. అది ఉత్తి అయోమయం, అర్థంపర్థం లేని గోల. దీనికి పరిపూర్ణత లేదు. ఇది అర్థమైతే ద్వేషం లేకుండా మనిషి జీవితాన్ని ఆమోదిస్తాడు’. బహుశా ఈ వాక్యంలో నీషే ఆత్మ నిక్షిప్తమైవుందేమో! విద్యార్థి దశలో ఉన్నప్పుడే సిఫిలిస్ బారినపడ్డాడు. శిరోభారం, గాస్ట్రిక్ పెయిన్స్, పైయోరియా, కళ్ల మసక బాధించాయి. తరువాత మతిస్థిమితం తప్పింది. మానసికంగా, శారీరకంగా దుర్బలుడయ్యాడు. దశాబ్దం పాటు తీవ్ర వేదన అనుభవించి 55 ఏళ్లకే మరణించాడు(1844-1900). ఎవరైనా ఆస్తికుడు ఇది దేవుడు విధించిన శిక్షే అంటే నీషే గట్టిగా నవ్వుతాడేమో! - ఆర్.ఆర్.