దేవుడి శత్రువు? | German philosopher Friedrich Nietzsche birthday on oct 15th | Sakshi
Sakshi News home page

దేవుడి శత్రువు?

Published Sun, Oct 12 2014 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM

దేవుడి శత్రువు?

దేవుడి శత్రువు?

అక్టోబర్ 15న తత్వవేత్త నీషే జయంతి
సత్వం:దేవుడు మరణించాడంటున్నాడంటే, నీషే దేవుణ్ని తిరస్కరిస్తున్నట్టా? దేవుణ్ని తొలగించుకున్నాక, దాన్ని పూరించే ఖాళీ ఏమిటి? ఇది అర్థం కాకే ప్రపంచానికి పిచ్చెక్కిపోతోంది. లేదా, ఇది అర్థమయ్యే దేవుణ్ని కొనసాగిస్తూ వస్తోందా?
 
వ్యక్తి మనుగడలో దేవుడి పాత్ర ఏమిటి? ‘దేవుడు మరణించాడు’ అన్నాడు జర్మన్ తత్వవేత్త ఫ్రీడ్రిక్ నీషే. ఆయన ప్రధాన భాగస్వామ్యం ఉన్న అస్తిత్వవాద సిద్ధాంతం ప్రకారం, మనిషి జీవితంలో- ఏ మానవాతీత శక్తి ప్రమేయమూ లేదు. తలరాత అనేది అబద్ధం. మనిషి తన నిర్ణయాన్ని తానే తీసుకుంటాడు. తన జీవనశైలికి తానే బాధ్యుడవుతాడు. తన మంచికీ, చెడుకీ కర్త తనే!
 
దేవుడు మరణించాడంటున్నాడంటే, నీషే దేవుణ్ని తిరస్కరిస్తున్నట్టా? దేవుణ్ని తొలగించుకున్నాక, దాన్ని పూరించే ఖాళీ ఏమిటి? ఇది అర్థం కాకే ప్రపంచానికి పిచ్చెక్కిపోతోంది. లేదా, ఇది అర్థమయ్యే దేవుణ్ని కొనసాగిస్తూ వస్తోందా? లేక, దేవుణ్ని చంపింది మనుషులే అని నిందిస్తున్నాడా నీషే? ఒక విశ్వాసానికి కట్టుబడలేని కపటాన్ని ఎద్దేవా చేస్తున్నాడా? దేవుడిని కేవలం ఒక ట్రోఫీగా మార్చిన తీరుకు నిరసన చెబుతున్నాడా? ఏ శుద్ధజలంలో మనల్ని శుభ్రపరుచుకుందామని అడుగుతున్నాడా?
 
వివిధ పుస్తకాలుగా తన భావాల్ని వెల్లడించాడు నీషే. అందులో ‘థస్ స్పోక్ జరాతుష్ట్ర’ ముఖ్యమైనది. పూర్వపు మత, సాంఘిక విలువల శైథిల్యం ఆయన రచనల్లో కనబడుతుంది. జనం మందగా ఉండటాన్ని వెక్కిరిస్తాడు. మందకు ఒక పద్ధతంటూ ఉండదు. సమాజానిది కూడా ‘మంద’గమనమే! ఇక్కడ నీతి లేదు. జనం నమ్ముతున్న విలువలకు విలువ లేదు. విశ్వాసాలకు విశ్వసనీయత లేదు. ‘ఒంటెలాంటివాడు మనిషి. తనకు తానే మోకరిల్లి, తన భుజాల మీద అనవసరమైన బరువులు ఎక్కించుకుని, ఆ తరువాత బతుకు భారమైపోయిందని ఏడుస్తాడు’. ‘ఏది నువ్వు కాదో అదే దైవం, అదే ఆదర్శం’. తాను ఏమికాదో దాన్నే మోసుకు తిరుగుతాడు మనిషి. ‘నీలో విలయం తాండవిస్తేనేకానీ నర్తించే నక్షత్రానికి జన్మనివ్వలేవు’.
 
విల్ టు పవర్, సూపర్ మాన్ భావనలు ప్రవేశపెట్టాడు నీషే. ఇప్పటి వ్యక్తిత్వ వికాస నిపుణుల భావనలుగా కనబడతాయివి. ప్రతి జీవి కూడా తానున్న స్థితిలోంచి, మరింత ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీనికి శక్తి కావాలి. అంతిమలక్ష్యం చేరుకోవడమన్నది ఆయా వ్యక్తుల శక్తి మీదే ఆధారపడివుంటుంది. పరిస్థితులతో పోరాడాలి. వాటిని అనుకూలంగా మార్చుకోవాలి. ఈ సంఘర్షణలో నిలబడేది వీరులు మాత్రమే. కాబట్టి బలమే సుగుణం. శక్తిహీనతే దుర్గుణం. ఏ సిద్ధాంతం ఉపయోగపడితే దాన్నే అనుసరించాలి. అప్పుడే నువ్వు సూపర్‌మాన్ కాగలవు, అన్నాడు. ఇక్కడే నీషే వివాదాస్పదం అయ్యాడు. ఆయన భావాల్ని నాజీలు తమకు అనువుగా మలుచుకుని ఆర్యన్ జాతి గొప్పదన్న ప్రచారం చేసుకున్నారు.
 
నీషే బాల్యం అంతా మతవిశ్వాసాలు తీవ్రంగా ఉన్న పరిసరాల్లో గడిచింది. నాలుగేళ్ల వయసున్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. బాల్యమంతా తల్లి, అమ్మమ్మ, అత్తలు, చెల్లి... ఇలా ఆడవాళ్ల చుట్టూనే తిరిగింది. కానీ అసలైన స్త్రీ సాంగత్యం కావాల్సిన యౌవనంలో తిరస్కారానికే గురైనాడు. చిన్నతనం నుంచీ మూడీగా, బలహీనంగా ఉండేవాడు. ఒంటరిగా గడిపాడు. స్నేహితులు లేరు. కోరుకున్న స్త్రీని అందుకున్న అదృష్టం లేదు. తనలో లేని ‘సూపర్ మాన్’కు ఇవన్నీ ఊతం అయ్యాయా?పరస్పర విరుద్ధంగా ఉన్నట్టుగా తోస్తాడు నీషే. స్పష్టంగా ఏం చెప్పాడో ఒక కంక్లూజన్‌కు వచ్చినట్టు కనబడదు.

ప్రపంచం ఇలా ఉండాలన్నాడా? ఇలా ఉందన్నాడా? మళ్లీ ఏ విధమైన గుడ్డినమ్మకాలు, చారిత్రక సంకెళ్లు లేని స్వేచ్ఛా ఆత్మ గురించి యోచించాడు. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్న మనిషినీ, కేవలం భయంలో, వాంఛలో మగ్గిపోయే మనిషినీ పట్టించాడు. భయమే మనిషిని బానిసను చేస్తుంది. ‘బానిస భావజాలంలో దయ, అణకువ, సహానుభూతి లాంటి పదాలుంటే, యజమాని నిఘంటువులో దర్పం, శక్తి, ఘనత లాంటివాటికే చోటుంటుంది. యజమాని ఘటనల్ని మంచికో చెడుకో దారితీసే పరిణామాలుగానే పరిగణిస్తాడు. బానిస అవే ఘటనల్ని మంచీ చెడూ ఉద్దేశాలుగా చూస్తాడు’.
 
‘సింహాసనం మీద ఎక్కడానికి అందరూ ఎగబడుతున్నారు. పిచ్చికాకపోతే అదేదో సంతోషం సింహాసనం మీద కూర్చునివున్నట్టు!’ ‘మంచివాళ్లని లేదు, చెడ్డవాళ్లని లేదు, రాజ్యంలో అందరూ విషం తాగినవాళ్లే. మంచివాళ్లని లేదు, చెడ్డవాళ్లని లేదు, అందరూ తమని కోల్పోయివున్నారు. ఈ నిదానమైన ఆత్మహత్యే జీవితంగా పరిగణించబడుతోంది’.
 
‘(అయితే) జీవితం ఏమీ పళ్లెంలో అందుకోవాల్సిన భోజనం కాదు. అది ఉత్తి అయోమయం, అర్థంపర్థం లేని గోల. దీనికి పరిపూర్ణత లేదు. ఇది అర్థమైతే ద్వేషం లేకుండా మనిషి జీవితాన్ని ఆమోదిస్తాడు’. బహుశా ఈ వాక్యంలో నీషే ఆత్మ నిక్షిప్తమైవుందేమో!
 
విద్యార్థి దశలో ఉన్నప్పుడే సిఫిలిస్ బారినపడ్డాడు. శిరోభారం, గాస్ట్రిక్ పెయిన్స్, పైయోరియా, కళ్ల మసక బాధించాయి. తరువాత మతిస్థిమితం తప్పింది. మానసికంగా, శారీరకంగా దుర్బలుడయ్యాడు. దశాబ్దం పాటు తీవ్ర వేదన అనుభవించి 55 ఏళ్లకే మరణించాడు(1844-1900). ఎవరైనా ఆస్తికుడు ఇది దేవుడు విధించిన శిక్షే అంటే నీషే గట్టిగా నవ్వుతాడేమో!
 - ఆర్.ఆర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement