ప్రపంచ పిచ్చుకల దినోత్సవం 2024: చరిత్ర, థీమ్ , ప్రాముఖ్యత
"ఐ లవ్ స్పారోస్" ఈ ఏడాది థీమ్
ఆ బుజ్జి పిట్టల్ని కాపాడుకుందాం
ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 20న జరుపుకుంటారు. పొద్దున్నే మన కిటికీ దగ్గరో, పెరడులోని చెట్టుపైనో పిచ్చుక కిచకిచలు వింటూ ఆనందంగా కళ్లు తెరిచిన క్షణాలు గుర్తున్నాయా? ఆ మధుర స్వరాలు గుర్తున్నాయా అని అనుకోవడంలోనే నానాటికి కనుమరుగైపోతున్న పిచ్చుకల పరిస్థితి అర్థం అవుతుంది. అందుకే వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ, పిచ్చుకల పరిరక్షణపై అవగాహన పెంచడానికి ప్రపంచ పిచ్చుకల దినోత్సవం జరుపుకుంటాం.
వరల్డ్ స్పారో డేని 2010లో నేచర్ ఫరెవర్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. ప్రతీ ఏడాది ఏదో ఒక ధీమ్ ఉంటుంది. "ఐ లవ్ స్పారోస్" ఇదే. ప్రపంచ పిచ్చుక దినోత్సవం 2024 అధికారిక థీమ్. ఇది పిచ్చుకలు, మనుషుల మధ్య ప్రేమను, పర్యావరణ పరిరక్షణలో పిచ్చుకల బాధ్యతను గుర్తు చేస్తుంది. పిచ్చుకలను రక్షించడం అంటే మనల్ని మనల్ని కాపాడుకోవడమే. హాయి గొలిపే, ఉత్సాహపరిచే పిచ్చుకల కిలకిలారావాలు రాబోయే తరాలకు అందించిన వారమవుతాం.
పదివేల సంవత్సరాలుగా పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ముఖ్యపాత్ర పోషించిన చిన్ని జీవి పిచ్చుక. పిచ్చుకల సంఖ్య తగ్గిపోవడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల్లో ఇవి కనిపించడం లేదు.నగరీకరణ, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విపరీతంగా చెట్లను నరికివేయడం, ఎక్కడబడితే అక్కడ సెల్ టవర్ల నిర్మాణం తదితర కారణాలు పిచ్చుకల పాలిట పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయి.
పిచ్చుకలు-వాస్తవాలు
ప్రపంచవ్యాప్తంగా 60 రకాల పిచ్చుక జాతులు ఉన్నాయి. పిచ్చుకలు స్వతహాగా స్వతంత్రంగా ఉంటాయి. సొంతంగా అందమైన గూళ్ళను నిర్మించుకుంటాయి. పిచ్చుకల సగటు వయస్సు 4 నుండి 5 సంవత్సరాలు,
పిచ్చుకలు చూడ్డానికి బుల్లిపిట్లలే కానీ, పర్యావరణ వ్యవస్థలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. బుజ్జి బుజ్జి ముక్కులతో తెగులు కీటకాలను ఏరిపారేసి (తినేసి), మొక్కల్ని తెగుళ్లు, చీడపీడలనుంచి కాపాడతాయి. మొక్కల పెరుగుదలకు సహాయపడే విత్తనాలను వ్యాప్తి చేస్తాయి.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) నివేదిక ప్రకారం, భారతదేశంలోని దక్షిణ ప్రాంతంలో వీటి సంఖ్య దాదాపు 80 శాతం తగ్గింది. తీర ప్రాంతాల్లో 70 నుంచి 80 వరకు తగ్గగా, ఇతర ప్రాంతాల్లో 20 శాతం తగ్గుదల కనిపించింది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) పిచ్చుకను అంతరించిపోతున్న జాతిగా (రెడ్ లిస్ట్) పేర్కొంది. కొన్ని పట్టణ ప్రాంతాల్లో 99 శాతం వరకు వీటి సంఖ్య తగ్గిపోవడం గమనార్హం.
అందుకే బాల్కనీల్లో, ఇంటి పెరడులో వాటి కోసం కాసిన్ని నీళ్లు పెడదాం. బర్డ్ ఫీడర్‌ను ఉంచి వాటిల్లో కొన్ని బియ్యం గింజలు, లేదంటే మనకు అందుబాటులో ఉన్న ఇతర తృణధాన్యాల్ని వాటికి ఆహారంగా అందిద్దాం.హే పిచ్చుక..గూడు కట్టుకో అని ఆహ్వానిద్దాం!
Comments
Please login to add a commentAdd a comment