
న్యూఢిల్లీ/నాగపూర్: రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ సిబ్బంది క్రిమి సంహారక మందులు చల్లారు, రైతులు పళ్లాలు మోగించారు. పెద్దపెద్ద శబ్దాలు చేశారు. ఇదంతా ఎందుకనుకుంటున్నారా? పచ్చటి పంటలను, చెట్ల ఆకులను విందు భోజనంలా ఆరగిస్తున్న రాకాసి మిడతల దండును తరిమికొట్టడానికే. ఢిల్లీ, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో మిడతలు దాడి చేసే ప్రమాదం ఉందని సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మిడతలు త్వరలో బిహార్, ఒడిశాకు చేరుకోనున్నట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్‌ఏవో) హెచ్చరించింది.
మామిడి తోటలకు తీవ్ర నష్టం
మిడతలపై యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని హరియాణా వ్యవసాయ శాఖ అధికారి సంజీవ్ కౌశల్ చెప్పారు. మిడతల విషయంలో తాజా పరిస్థితిని సమీక్షించడానికి కర్ణాటక ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. గత నెలలో పాకిస్తాన్ నుంచి రాజస్తాన్‌లోకి ప్రవేశించిన మిడతలు ఇప్పటికే 90 వేల హెక్టార్లలో పంటలను తినేశాయి. ఇవి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోకి అడుగుపెట్టాయి. ఉత్తరప్రదేశ్‌లో క్రిమి సంహారక మందులు చల్లి, భారీ సంఖ్యలో మిడతలను హతమార్చారు. మహారాష్ట్రలోనూ పలు జిల్లాల్లో మిడతలు ప్రభావం చూపుతున్నాయి. ప్రధానంగా మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. భారత్‌లో మిడతల దాడి మరికొన్ని వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని ఎఫ్‌ఏవో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment