Grasshopper
-
అరుదైన ‘మిడత’
కోస్గి: నారాయణపేట జిల్లా కోస్గి మండలం బొల్వోన్‌పల్లి శివారులోని ఓ పొలంలో గులాబీరంగులో గొల్లభామ (మిడత) కనిపించింది. ఆదివారం ముశ్రీఫా జెడ్పీహెచ్ఎస్ సైన్స్ క్లబ్ విద్యార్థి మహేష్ ఈ కీటకాన్ని గుర్తించి ఉపాధ్యాయుడు మల్లేశానికి చెప్పారు. కాగా, అర్థో పోడా వర్గానికి చెందిన ఆర్చిలిమమ్ వల్గెర్ అనే శాస్త్రీయ నామంతో పిలిచే గడ్డి మైదానాల మిడతల్లో జన్యు ఉత్పరివర్తనాల ప్రభావంతో చాలా అరుదుగా ఇలా గులాబీరంగు సంతరించుకుంటాయని ఉపాధ్యాయుడు తెలిపారు. ఇలాంటి గులాబీ రంగు మిడతలు మొదటిసారి అమెరికాలోని టెక్సాస్, ఆస్టిన్లోని ఓక్‌హిల్ ప్రాంతంలో గుర్తించారన్నారు. -
ఒడిశాపై మిడతల దాడి?
భువనేశ్వర్/నాగ్‌పూర్: మిడతలు దాడి చేసే అవకాశం ఉండటంతో ఒడిశాలోని తొమ్మిది జిల్లాల్లోని రైతులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ సరిహద్దుల్లోని ఈ జిల్లాల్లో మిడతల దాడికి అవకాశం ఉందనీ, పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపింది. మిడతల దండుపై కీటకనాశినులను పిచికారీ చేసేందుకు టెండర్లు పిలవాలని కూడా ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశం నిర్ణయించింది. సోమవారమే పొరుగున ఉన్న చత్తీస్‌గఢ్‌లోకి మిడతలు ప్రవేశించిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. డ్రోన్లతో మందుల పిచికారీ పంటలకు తీవ్ర నష్టం కలిగించే మిడతలను ఎదుర్కొనేందుకు డ్రోన్లను ఉపయోగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కీటక నాశినులను డ్రోన్లతో పిచికారీ చేయనున్నట్లు వ్యవసాయ మంత్రి దాదా భుసే తెలిపారు. నాగ్‌పూర్ జిల్లాలోని భేటీసుర్లా ప్రాంతంలో మిడతలను గుర్తించి, 500 లీటర్ల కీటకనాశినులను పిచికారీ చేయించామని చెప్పారు.రానున్న శుక్రవారం నుంచి డ్రోన్ల సాయంతో మందులను పిచికారీ చేస్తామన్నారు. గత నెల 25న విదర్భలోని నాగ్‌పూర్ ప్రాంతంలో లక్షల సంఖ్యలో మిడతలు పంటపొలాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. -
కరోనా వేళ వణికిస్తున్న మిడతల దండు
-
మిడతల దండుపై దండయాత్ర
న్యూఢిల్లీ/నాగపూర్: రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ సిబ్బంది క్రిమి సంహారక మందులు చల్లారు, రైతులు పళ్లాలు మోగించారు. పెద్దపెద్ద శబ్దాలు చేశారు. ఇదంతా ఎందుకనుకుంటున్నారా? పచ్చటి పంటలను, చెట్ల ఆకులను విందు భోజనంలా ఆరగిస్తున్న రాకాసి మిడతల దండును తరిమికొట్టడానికే. ఢిల్లీ, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో మిడతలు దాడి చేసే ప్రమాదం ఉందని సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మిడతలు త్వరలో బిహార్, ఒడిశాకు చేరుకోనున్నట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏవో) హెచ్చరించింది. మామిడి తోటలకు తీవ్ర నష్టం మిడతలపై యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని హరియాణా వ్యవసాయ శాఖ అధికారి సంజీవ్ కౌశల్ చెప్పారు. మిడతల విషయంలో తాజా పరిస్థితిని సమీక్షించడానికి కర్ణాటక ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. గత నెలలో పాకిస్తాన్ నుంచి రాజస్తాన్‌లోకి ప్రవేశించిన మిడతలు ఇప్పటికే 90 వేల హెక్టార్లలో పంటలను తినేశాయి. ఇవి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోకి అడుగుపెట్టాయి. ఉత్తరప్రదేశ్‌లో క్రిమి సంహారక మందులు చల్లి, భారీ సంఖ్యలో మిడతలను హతమార్చారు. మహారాష్ట్రలోనూ పలు జిల్లాల్లో మిడతలు ప్రభావం చూపుతున్నాయి. ప్రధానంగా మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. భారత్‌లో మిడతల దాడి మరికొన్ని వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని ఎఫ్ఏవో వెల్లడించింది. -
మిడతల దాడి.. పొంచి ఉన్న ముప్పు
-
ముంచుకొస్తున్న కొత్త విపత్తు..
కరోనా మహమ్మారితో అలుపెరగని యుద్ధం చేస్తుండగానే ‘ఉంఫన్’ రాష్ట్రంలో అలజడి రేపింది. తుపాను విపత్తును సమర్థంగా ఎదుర్కొని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలోనే రాష్ట్రానికి కొత్త విపత్తు సంకేతాలు వస్తున్నాయి. పంటలకు అపార నష్టం కలిగించే మిడతల దండు రాష్ట్రం వైపు దూసుకు వస్తోంది. మిడతల దండు దాడితో వ్యవసాయ ఉత్పాదనలు భారీగా దెబ్బ తింటాయి. దీంతో రాష్ట్ర సమగ్ర ఆర్థిక పురోగతిపై తీవ్ర ప్రభావం పడుతుంది. రబీ సాగు పూర్తయి పంట సిద్ధంగా ఉంది. త్వరలో ఖరీఫ్ సాగు ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితుల్లో మిడతల దండు రాక..పంటలకు అపాయమని నిపుణులు అభిప్రాయ పడుతుండడంతో రైతాంగం బెంబేలెత్తుతోంది. భువనేశ్వర్: రాష్ట్రానికి మరో కొత్త విపత్తు ముంచుకొస్తోంది. మిడతల దండు దాడి చేసి పంటల్ని నాశనం చేసే ముప్పు పొంచి ఉంది. వాతావరణంలో మార్పుల నేపథ్యంలో మిడతలు విజృంభిస్తాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. మిడతల దాడిని ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన క్రిమి సమూహ దాడిగా పరిగణిస్తున్నారు. తూర్పు ఆఫ్రికా నుంచి పాకిస్థాన్ మీదుగా మిడతల దండు ప్రయాణం ప్రారంభమైంది. దేశంలోని రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల్లో పంటలకు అపారంగా నష్టం కలిగించాయి. ఢిల్లీ దిశగా మిడతల దండు పయనిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఆ సమూహం చొరబడే ప్రమాదం పొంచి ఉన్నట్లు సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. వణికిస్తున్న రాకాసి మిడతలు వృక్ష సంపదకు ప్రమాదం గాలిలో ఎగిరే క్రిమి జాతి మిడతల సమూహం. సాధారణంగా ఏటా జులై నుంచి అక్టోబరు మధ్య వీటి ప్రయాణం ప్రారంభమవుతుంది. వేగవంతమైన గాలులతో నిత్యం 150 కిలోమీటర్ల దూరం నిరవధికంగా ఎగురుతాయి. దారి పొడవునా లభించే ఆకులు, పువ్వులు, పండ్లు, గింజలు, చెట్టు బెరడు అత్యంత వేగంగా ఆరగించి అక్కడనే ముసురుకుని బసచేస్తాయి. దీంతో వృక్ష సంపద, ఉద్యాన పంటలు అపారంగా దెబ్బ తినే ప్రమాదం పొంచి ఉంది. వీటి సంతతి వృద్ధి చెందితే మానవాళి తీవ్రంగా ప్రభావితమవుతుంది. పగటి పూట ఇవి గాలితో పయనిస్తాయి. సాయంత్రం పంట పొలాల గమ్యానికి చేరుతాయి. ప్రధానంగా కోతకు సిద్ధమైన పంటల్ని ప్రధాన ఆహారంగా స్వీకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. (జైపూర్‌లో మిడతల దండు) మిడతల దాడితో ముప్పు రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు మిడతల దాడి జరిగిన దాఖలాలు లేనట్లు ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ (ఓయూఏటీ) డీన్ లలిత్ మోహన్ గొడొనాయక్ తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మిడతల సమూహం దాడి చేసే ఆస్కారం ఉండడంతో ముందస్తు జాగ్రత్త అవసరమని ఆయన హితవు పలికారు. మిడతల దాడి రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తుంది. పరోక్షంగా ఆర్థిక రంగం బలహీన పడుతుంది. స్థానిక ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ విభాగం ఈ విపత్తు నుంచి బయట పడేందుకు కొన్ని ముందస్తు నివారణ జాగ్రత్తలు జారీ చేసింది. మిడతల దాడి నుంచి పంటలకు నష్టం వాటిల్లకుండా చేసేందుకు అనుబంధ వర్గాల నిపుణులు రాష్ట్ర రైతాంగానికి అనుక్షణం సముచిత సలహాలు, సంప్రదింపులతో మార్గదర్శకంగా నిలవాలని రాష్ట్ర వ్యవసాయ, రైతు సాధికారత విభాగం మంత్రి డాక్టర్ అరుణ్ కుమార్ సాహు పిలుపునిచ్చారు. ఓయూఏటీ జారీ చేసిన సూచనలు 5 శాతం వేప గింజల గుజ్జుతో (ఎన్ఎస్కేఈ) 200 లీటర్ల ద్రవ మిశ్రమం పిచికారీ చేయడం ప్రాథమిక నివారణ చర్య. 1 ఎకరం విస్తీర్ణంలో 1 లీటరు వేప గింజల గుజ్జు–300 పీపీఎస్ 200 లీటర్ల నీటిలో కలిపి మద్యాహ్నం పిచికారీ చేయాలి. 200 లీటర్ల నీటిలో 400 మిల్లీ లీటర్ల ప్రొఫెనోఫాస్ 50 ఈసీ కలిపిన మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. డబ్బాలు, పాత్రలు వాయించి చప్పుడు చేయడం మిడతల దాడి నివారణకు మరో ఉపాయం. ముళ్ల కంచెతో రువ్వుతూ మిడతల సమూహాన్ని పారదోలాలి. చెట్లకు చుట్టుముట్టిన మిడతల సమూహం తొలగింపుకు చెట్ల కింద పాలిథిన్ షీటు పరిచి కొమ్మల్ని ఊపడంతో నేల రాలతాయి. వీటిని కిరసనాయిలు మిశ్రమ నీటిలో పోసి దూరంగా పారబోయాలి. తరచూ జారీ చేసే వ్యవసాయ సూచనల్ని క్రమం తప్పకుండా ఆచరించాలి. -
వణికిస్తున్న రాకాసి మిడతలు
రాకాసి మిడతలు విశ్వరూపం దాల్చుతున్నాయి. ఇథియోపియా, సోమాలియా వంటి తూర్పు ఆఫ్రికా దేశాల నుంచి పెద్ద గుంపులు గుంపులుగా ఖండాలు దాటి వస్తూ పంటలకు పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి. మిడతల దండును ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ ఫిబ్రవరిలోనే ఎమర్జెన్సీ ప్రకటించింది. అక్కడి నుంచి మిడతల దండు మన దేశంలోకి ప్రవేశించాయి. రాజస్థాన్, గుజరాత్, పంజా»Œ లతో పాటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో కూడా పంటలను నమిలేస్తున్నాయి. రాజస్థాన్‌లోని 18 జిల్లాల్లో, మధ్యప్రదేశ్‌లో 12 జిల్లాల్లో పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. రాజస్థాన్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లోనే 2.05 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతం రాకాసి మిడతల దండు దాడికి గురైనట్లు అంచనా. రాజస్థాన్‌లోనే 5 లక్షల హెక్టార్లలో పంటలను మిడతలు స్వాహా చేస్తున్నాయి. ముందుకు విస్తరిస్తున్నాయి. ఈ రాష్ట్రాలకు మిడతల తాకిడి కొత్తేమీ కాదు. అయితే, ఈ ఏడాది సాధారణంగా కన్నా కొన్ని వారాలు ముందుగానే విరుచుకుపడటంతో చేతికి వచ్చే దశలో రబీ పంటలు ధ్వంసమయ్యాయి. గత 27 ఏళ్లలో ఎరుగనంత ఎక్కువ బెడద ఇప్పుడు ముంచుకొచ్చిందని నిపుణులు చెబుతున్నారు. పళ్లాలు, ఇతర పాత్రలు, డబ్బాలను మోగించడం, పెద్దగా శబ్దాలు చేస్తూ మిడతల దండును పారదోలి పొలాల్లోని పంటలను కాపాడుకోవాల్సిందిగా అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ట్రాక్టర్ స్ప్రేయర్లతో, అగ్నిమాపక యంత్రాలతో ప్రభుత్వాలు పురుగుమందులు పిచికారీ చేయిస్తున్నాయి. అయితే, 2.5–3 కిలోమీటర్ల పొడవైన కోట్లాది మిడతల గుంపు పంటల మీద దాడి చేస్తున్నందున డ్రోన్లను రంగంలోకి దింపడం అవసరమని కేంద్ర వ్యవసాయ–రైతు సంక్షేమ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. హర్యానాలోని ఫరీదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్లాంట్ ప్రొటెక్షన్ క్వారంటైన్ అండ్ స్టోరేజ్ డైరెక్టరేట్‌కు మిడతల దండు నియంత్రణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. దేశంలో ఇప్పటి వరకు వ్యవసాయంలో డ్రోన్లను వినియోగించడం చట్టవిరుద్ధం. అయితే, మిడతల విపత్తును ఎదుర్కొనేందుకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేస్తూ కేంద్ర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీచేసింది. మిడతలు పగటి పూట ప్రయాణం చేసి రాత్రి పూట చెట్లు చేమలు పంటలపై వాలుతాయి. ఆ సమయంలో పురుగుమందులు పిచికారీ చేస్తున్నారు. మన దేశంలోకి సాధారణంగా పాకిస్తాన్ మీదుగా మిడతల దండు దాడి చేస్తూ ఉంటుంది. అయితే, ఈ సంవత్సరం తీవ్రత చాలా రెట్లు ఎక్కువగా ఉంది. దీంతో రెండో వైపు నుంచి కూడా మిడతల ముప్పు ఉండొచ్చని భావిస్తున్నారు. తూర్పు ఆఫ్రికా నుంచి హిందూమహా సముద్రం మీదుగా నేరుగా భారత ద్వీపకల్పంలోని తెలుగు రాష్ట్రాలు సహా అనేక ఇతర రాష్ట్రాలపైనా మిడతల దండు దాడికి దిగవచ్చని అధికారవర్గాలు హెచ్చరిస్తున్నాయి. జూలైలోగా భారత్ వైపు మరిన్ని మిడతల గుంపులు కదిలి వచ్చే అవకాశం ఉందని ఆహార వ్యవసాయ సంస్థ సూచిస్తోంది. -
జైపూర్‌లో మిడతల దండు
జైపూర్: రాజస్తాన్ రాజధాని జైపూర్ నగరవాసులకు సోమవారం వింత అనుభవం ఎదురైంది. మిడతల దండు దాడి చేసి ఇళ్ల గోడలు, చెట్లపై తిష్టవేశాయి. ఆకులను తినేశాయి. స్థానికులు వాటిని వెళ్లగొట్టడానికి పళ్లాలతో బిగ్గరగా శబ్దాలు చేశారు. అధికారులు చెట్లపై క్రిమిసంహార మందులు చల్లారు. అనంతరం అవి దౌసా జిల్లా వైపు వెళ్లిపోయాయి. రాజస్తాన్‌లో 18 జిల్లాల్లో మిడతల బెడద తీవ్రంగా ఉందని, ఆహారం కోసం ఇతర ప్రాంతాల వైపు వలస వెళ్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఓంప్రకాశ్ చెప్పారు. -
రాకాసి మిడతలు.. ముంచుకొస్తున్న ముప్పు!
పులి మీద పుట్రలా కరోనా మహమ్మారికి తోడు మరో ఉపద్రవం ముంచుకువస్తోంది. కరోనాతో సతమతమవుతున్న ఆఫ్రికా, ఆసియా దేశాలపై ఈ వేసవిలో మరో పిడుగు పడబోతోందా? లక్షలాది ఎకరాల్లో పంట పొలాలపై రాకాసి మిడతల దండు ఒకటి, రెండు నెలల్లో విరుచుకుపడి ఆహార భద్రతకు ముప్పు తెచ్చిపెట్టే పెను ప్రమాదం పొంచి ఉందా? అవుననే అంటున్నారు ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) నిపుణులు. ఇప్పటికే ఆహార కొరత, కరోనా మహమ్మారితో సతమతమవుతున్న తూర్పు ఆఫ్రికా దేశాల్లో గత పాతికేళ్లలో ఎన్నడూ ఎరుగనంత భీకరంగా రాకాసి మిడతల దండు ఇప్పుడు విలయాన్ని సృష్టిస్తోంది. కొద్ది నెలల క్రితం మిడతల దండు విజృంభించడంతో ఇథియోపియా, సోమాలియా, పాకిస్తాన్‌తోపాటు మన దేశంలోనూ లక్షలాది ఎకరాల్లో నోటికాడికి వచ్చిన పంటలు ధ్వంసమయ్యాయి. అప్పట్లో రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో 3,70,000 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. తెలంగాణలోని సిద్ధిపేట, మెదక్ జిల్లాల్లోనూ వేలాది ఎకరాల్లో మొక్కజొన్న తదితర పంటలు నాశనమయ్యాయి. అప్పట్లో కొద్ది రోజుల్లోనే సమసిపోయిన ఈ సమస్య తూర్పు ఆఫ్రికా దేశాలను కొద్ది నెలల్లోనే భీకర రూపం దాల్చి మళ్లీ చుట్టుముట్టింది. రెండో దశలో ఇథియోపియా, కెన్యా, సోమాలియా దేశాల్లో అంతకు ముందుకన్నా 20 రెట్లు ఎక్కువ సంఖ్యలో మిడతల దండు విజృంభిస్తున్నది. ఇలాగే ఉంటే వచ్చే జూన్ నాటికి మిడతల సంఖ్య 400 రెట్లు పెరిగిపోతుందని, సుమారు 60 దేశాలకు నష్టం చేకూర్చవచ్చని ఎఫ్.ఎ.ఓ. నిపుణుల అంచనా. అయితే, కరోనా మహమ్మారి లాక్డౌన్ మధ్య ఆఫ్రికా దేశాలు మిడతల దండును అరికట్టలేకపోతున్నాయి. ఫలితంగా ఇథియోపియాలో లక్షల హెక్టార్లలో టెఫ్ అనే చిరుధాన్యం, ఉల్లి పంటలు ఇప్పటికే పూర్తిగా నాశనం అయ్యాయి. మిడతల దండును అరికట్ట లేని పరిస్థితుల్లో రానున్న ఒకటి, రెండు నెలల్లో అనేక ఆఫ్రికా, ఆసియా దేశాల్లో పంటలకు పెనునష్టం జరగనుంది. ఆఫ్రికా దేశాల నుంచి బయలుదేరే మిడతల దండు జూన్ నాటికి భారత్‌లో పంజాబ్, హర్యానాలతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లోనూ చుట్టుముట్టి పంటలకు నష్టం కలిగించే ముప్పు పొంచి ఉందని తాజా నివేదికలో ఎఫ్.ఎ.ఓ. హెచ్చరించింది. – పంతంగి రాంబాబు, సాగుబడి భారత్‌కు రెండు వైపుల నుంచి ముప్పు పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో పుట్టిన మిడతల దండు రెండు వలస దారుల్లో భారత్‌పై దాడి చేసే అవకాశం ఉంది. ఎమెన్, బహ్రెయిన్, కువైట్, ఖతార్, ఇరాన్, సౌదీ అరేబియా, పాకిస్తాన్ భూభాగం మీదుగా భారత్‌లోని పంజాబ్, హర్యానాల్లో పంట పొలాలపై మే, జూన్ మాసాల్లో మిడతల దండు దాడి చేసే ప్రమాదం ఉందని ఎఫ్.ఎ.ఓ. హెచ్చరిస్తోంది. అదేవిధంగా, ఇథియోపియా, సోమాలియా దేశాల నుంచి హిందూ మహా సముద్రం మీదుగా దక్షిణ భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్ సహా తూర్పు, పశ్చిమ తీరంలోని వివిధ రాష్ట్రాల్లో మిడతల దండు దాడి చేసి పంటలను తీవ్రంగా నష్టపరిచే అవకాశం ఉందని ఎఫ్.ఎ.ఓ. తాజా నివేదికలో హెచ్చరించింది. ఎడారి మిడతలు.. 8 తూర్పు ఆఫ్రికా దేశాల్లో (కెన్యా, ఇథియోపియా, సోమాలియా, జిబౌటి, ఉగాండ, టాంజానియా, సూడాన్, ఎరిట్రియ) పంటలు, మొక్కలు, చెట్లకు పెనుముప్పుగా పరిణమించాయి. ఇథియోపియా, సోమాలియాలలో గత పాతికేళ్లుగా ఎన్నడూ లేనంత ఎక్కువగా ఆహార, ఆదాయ భద్రతకు గొడ్డలిపెట్టుగా మారాయి. కెన్యా.. 70 ఏళ్లలో ఎరుగనంత ఎక్కువగా మిడతల బెడదను ఎదుర్కొంటున్నది. ఆఫ్రికా దేశాల నుంచి మన దేశానికి మిడతల దండు పయనించే అవకాశం ఉన్న మార్గాలను సూచిస్తూ ఎఫ్.ఎ.ఓ. రూపొందించిన చిత్రం 10 లక్షల హెక్టార్లలో గుడ్లు కరువు కాటకాలతో నిరంతరం అల్లాడే ఈ తూర్పు ఆఫ్రికా దేశాల్లో గతేడాది అక్టోబర్‌లో భారీ వర్షాల తర్వాత ఎడారి మిడతలు గుడ్లు పెట్టి సంతతిని తామరతంపరగా వృద్ధి చెయ్యటం మొదలు పెట్టాయి. 8 దేశాల్లో 10 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో గుడ్లు పెట్టి సంతతిని పెంచుకుంటున్నాయి. ఇది నూర్పిడి సీజన్ కావడంతో రైతులు అల్లాడుతున్నారు. ఆహార , ఆదాయ భద్రతకు ముప్పు వచ్చిపడింది. మూక శక్తితోనే విధ్వంసం ఎడారి మిడత ప్రవర్తన ఒంటరిగా ఉన్నప్పుడు సాధారణంగానే ఉంటుంది. అప్పుడు పంటలకు వీటి వల్ల బెడద ఉండదు. కానీ, ఎక్కువ సంఖ్యలో ఒక చోట చేరినప్పుడు విధ్వంసకర మూక శక్తిగా ప్రవర్తిస్తాయి. మిడతల దండు ప్రవర్తనలోనే కాదు.. వాటి రంగు, రూపంలో కూడా మార్పులు వస్తాయి. రోజూ తనంత తిండి! మిడత రోజూ తన బరువుతో సమానమైనంత ఆకులు, అలములు, గింజలు ఆహారంగా తింటుంది. మిడతల దండు అనేక కిలోమీటర్ల వెడల్పున విస్తరించి ఉండవచ్చు. ఒక చదరపు కిలోమీటరు విస్తరించి ఉండే మిడతల దండులో 4–5 కోట్ల వరకు మిడతలు ఉంటాయి. ఇవి ఒక్క రోజులో 35 వేల మంది మనుషులు తినేంత ఆహారాన్ని తినేస్తాయి. ఈ దండు నేల వాలిందంటే ఆయా ప్రాంతాల్లో పంటలు, గడ్డి, ఆకులు పచ్చదనం అంతా ఇట్టే ఖాళీ అయిపోతుంది. ఆహార పంటలతోపాటు పచ్చిక బయళ్లను కూడా మిడతల దండు ఆరగించేస్తుంది. అడవులకూ బెడద పొంచి ఉంది. జీవన కాలం 3 నెలలు ఎడారి మిడత జీవిత కాలం సాధారణంగా 3 నెలలు. అయితే, చల్లని వాతావరణంలో 6 నెలలు కూడా జీవిస్తుంది. ఎడారి ప్రాంతాల్లో సైతం నెలకు 2.5 ఎం.ఎం. వర్షపాతం వరుసగా రెండు నెలల్లో కురిస్తే చాలు మిడతల దండు సంతతి వృద్ధికి సరిపోతుంది. తగిన తేమ ఉన్న ఇసుక నేలల్లో 2–4 అంగుళాల లోతున మిడత గుడ్లు పెడుతుంది. ఒక మిడత 80 నుంచి 160 గుడ్లను గంపగుత్తగా పెడుతుంది. చదరపు మీటరు స్థలంలో వందలాది మిడతలు గుడ్లు పెడతాయి. గుడ్ల లో నుంచి రెండు వారాల్లో పిల్లలు బయటకు వస్తాయి. 4–6 వారాల్లో రెక్కలు సంతరించుకొని ఎగర గలుగుతాయి. ఆ దశలో మిడతల దండులో చేరుతుంది. అప్పటి నుంచి 3–4 వారాలు యాక్టివ్‌గా ఉండిన తర్వాత మిడత గుడ్లు పెడుతుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే గుడ్లు పెట్టిన తర్వాత చనిపోతుంది. అడ్డుకునేదెలా? వాతావరణ మార్పుల నేపథ్యంలో అకాల వర్షాలతో ఏర్పడే అనువైన వాతావరణమే మిడతల దండు విజృంభించడానికి కారణమని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. పురుగులు మందు చల్లి సంతతిని అరికట్టే ప్రయత్నం చేయటం తప్ప అరికట్టేందుకు మరో మార్గమేదీ లేదంటున్నారు. ఆఫ్రికాలో రెండు రకాల (Schistocerca gregaria, Locusta migratoria) మిడతలు సమస్యాత్మకంగా తయారయ్యాయి. శక్తివంతమైన పురుగుమందులను మనుషులతోను, విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్ల తోను పిచికారీ చేయిస్తున్నారు. పురుగులను అరికట్టే మెటార్హిజియం శిలీంధ్రం (Metarhizium sp.) చల్లుతున్నారు. అయితే, శిలీంధ్రం వృద్ధి చెంది మిడతలను మట్టుబెట్టడానికి 7 నుంచి 14 రోజుల వ్యవధి అవసరం అవుతుంది. చెద పురుగులు, స్కరబ్ బీటిల్స్‌పై ఈ శిలీంధ్రం ప్రతికూల ప్రభావం చూపుతున్నదని అంటున్నారు. మిడతలపై పురుగుల మందు పిచికారీ -
60 దేశాలకు మిడతల బెడద
మిడతల దండు దాడి చేసిందంటే ఆ పంట పొలం పని నిమిషాల్లో అయిపోయినట్టే. మిడతల దండు పంటలపై విరుచుకు పడుతుండటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎడారులకు దగ్గరగా ఉన్న రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో పంటలకు మిడతల బెడద ఎక్కువ. అయితే, అప్పుడప్పుడూ తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాల్లోనూ మిడతల దండు పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. కొద్ది నెలల క్రితం సిద్ధిపేట, మెదక్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మిడతల దండు పంటలను నాశనం చేసింది. లక్షలాది మిడతలు ఒక్కుదుటన ముఖ్యంగా మొక్కజొన్న తదితర పంటలను ధ్వంసం చేసింది. నిమిషాల్లోనే కంకులు, ఆకులను నమిలేశాయి. కొన్ని వందల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పురుగుమందులు పిచికారీ చేసే సమయం కూడా లేకుండా పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా, ఉత్తర గుజరాత్, రాజస్థాన్‌లో కనీసం 9 వేల హెక్టార్లలో రబీ పంటలను మిడతల దండు నమిలేసినట్లు అధికారులు తేల్చారు. గోధుమ, ఆవ, ఆముదం, జీలకర్ర తదితర పంటలు సాగు చేసే రైతులకు రూ. 5 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని అంచనా. మూడింట ఒక వంతు కన్నా ఎక్కువ పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ. 7 వేల చొప్పున పరిహారం చెల్లించడానికి గుజరాత్, రాజస్థాన్ ప్రభుత్వాలు సన్నద్ధమవుతున్నాయి. మిడతల దండు బెడద ఉన్నది భారత దేశానికి మాత్రమే కాదు. ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆసియాలలో 60 దేశాలు ఈ సమస్యతో సతమతమవుతున్నాయి. 200 ఎం.ఎం. కన్నా తక్కువ వర్షపాతం ఉండే ఎడారి ప్రాంతాల్లో ఈ మిడతల దండు సంతతిని పెంపొందించుకుంటూ దగ్గర్లోని దేశాల్లో పంటలను ఆశిస్తూ ఉంటాయి. ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో మిడతలు విజృంభిస్తూ గాలులతో పాటు అతి తక్కువ సమయంలోనే దూరప్రాంతాలకు పయనిస్తూ ఉంటాయి. మిడతల దండు గంటకు 5 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులతోపాటు సరిహద్దులు దాటి పయనిస్తుంది. మిడతల దండు మెరుపు దాడులను పురుగుమందులతోనే కొంతమేరకు ఎదుర్కోగలమని వ్యవసాయ శాఖ చెబుతోంది. ఏయే దేశాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏ యే నెలల్లో ఏయే దేశాల్లో మిడతలు విజృంభిస్తాయి? అనే సమాచారంతో కూడిన ముందస్తు హెచ్చరికలను ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్న ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) ప్రతి నెలా విడుదల చేస్తూ ఉంటుంది. మిడతల దండు బెడదపై పాకిస్తాన్, భారత్ ప్రభుత్వాలను ఎఫ్.ఎ.ఓ. గత డిసెంబర్ మూడో వారంలో అప్రమత్తం చేసింది. మిడతల దండు వల్ల మనుషులకు, పశువులకు హాని లేదు. -
గతేడాది కత్తెర పురుగు.. ఇప్పుడు మిడతలు
సాక్షి, మెదక్: రైతులను ప్రకృతి పగబట్టినట్లుంది. సకాలంలో వర్షాలు లేవు. దీనికి తోడుగా వందల అడుగుల లోతులో ఉన్న నీటికోసం అడుగడుగునా బోర్లువేసి భద్రంగా నీటి చుక్కలను కాపాడుకొని సాగుచేసిన పంటలు చేతికందే సమయంలోనే చెజారిపోతున్నాయి. మక్క పంటను గతేడాది కత్తెర పురుగు నాశనం చేయగా.. ఈసారి మిడతల దండు విరచుకుపడుతోంది. జిల్లాలో ఇప్పటికే 4 వేల ఎకరాల్లో పంటను పీల్చి పిప్పి చేశాయి. కనీసం పశువుల మేతకు కూడా పనికిరాకుండా చేస్తున్న మిడతలు అంటేనే రైతులు హడలెత్తిపోతున్నారు. పంటలను పరిశీలించిన వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు, అధికారులు నామమాత్రంగా మందులు స్ప్రే చేయాలని సూచించారే తప్ప.. మరేమీ చేయలేమని చేతులెత్తేశారు. నిన్నా మొన్నటి వరకు మొక్కజొన్న పంటను కత్తెర పురుగు ధ్వంసం చేయగా అనేక ఇబ్బందులు పడి దాని బారి నుంచి బయట పడ్డారోలేదో..? మళ్లీ మిడతల బెడద పట్టుకుంది. పంట చేతికందే సమయంలో పంటలపై మిడతలు దాడిచేసి పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్న పంటను పూర్తిగా ధ్వంసం చేసిన మిడతలు: పంటను తింటున్న మిడతలు జిల్లాలో ఈ యేడు వర్షాధార పంటగా జిల్లా వ్యాప్తంగా సుమారు 39 వేల హెక్టార్లలో మొక్కజొన్న పంటను సాగు చేశారు. అడపాదడప కురిసిన వర్షాలతోనే మొక్కజొన్న పంటను సాగు చేయగా ఆగస్టులో ఏకంగా 15రోజుల పాటు వర్షాలు కురవకపోవడంతో సాగుచేసిన మొక్కజొన్న పంటలో సగం మేర ఎండిపోయింది. మిగిలిన సగం పంటకు సైతం నిన్నా మొన్నటి వరకు కత్తెర పురుగు ఆశించటంతో దాని నివారణకు తలకు మించిన భారంతో పలురకాల మందులను స్ప్రే చేసి కొంతమేర దాని నుంచి ఉపశమనం పొందారో లేదో మళ్లీ మిడతలు మొక్కజొన్న చేలను ధ్వసం చేస్తున్నాయి. ఎకరాల కొద్దిపంటలను రోజుల వ్యవధిలోనే తింటున్నాయి. ఆరుగాలం కష్టపడి పంటలను సాగుచేస్తే మరో 20 రోజుల్లో పంటచేతికి అందుతుందనగా మిడతలు పంటను కళ్లముందే నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మొక్కజొన్నకు అన్నీ గండాలే... మొక్కజొన్న పంటను సాగుచేయాలంటే పెద్ద గగనమనే చెప్పాలి. పంటసాగుచేసిన నుంచి మొదలుకుని చేతికందే వరకు అనేక రకాల కష్టాలు పడాల్సిందే ఈ యేడు ముందుగా కత్తెర పురుగు వచ్చింది. దాన్ని నివారించగానే రాత్రి అయిందంటే చాలు అడవి పందులు వచ్చి పంటచేళ్లను తినేస్తున్నాయి. పగటి వేళలో కోతుల గుంపులు వచ్చి అందిన కాడికి ధ్వంసం చేస్తుండగా తాజాగా మిడతల గుంపులు వచ్చి మళ్లీ మొక్కజొన్నను తినేస్తున్నాయి. గడియ గడియకు ఇబ్బందులు పడుతూ పంటలను పండించేందుకు అన్నదాతలు పడుతున్న కష్టాలు అంతా ఇంతకావు. పంట చేతికందుతుందా లేదా అంటూ ఆవేదన చెందుతున్నారు. -
మిడతే బంగారమాయెరా!
చెట్టూ చేమా ఉన్నచోట ఆరుబయట ఎగిరెగిరి పడే మిడతలను ఎవరు పట్టించుకుంటారని తీసిపారేయకండి. మేలిరకం మిడతలకు ఎంత ధర పలుకుతుందో తెలుసుకున్నారంటే కళ్లు తేలేస్తారు. పోరాట పటిమగల మేలిరకం మిడతలు గరిష్ఠంగా 50 వేల యువాన్లు (రూ.4.89 లక్షలు) వరకు పలుకుతున్నాయి. మిడతల నాణ్యతను బట్టి, రకాలను బట్టి మన కరెన్సీ లెక్కల్లో చెప్పుకోవాలంటే ఒక్కో మిడత కనీసం వంద రూపాయలు మొదలుకొని కొన్ని రకాలు వేలకు వేల రూపాయల మేరకు ధర పలుకుతాయి. మిడతలేంటి..? బంగారానికి మించిన ధర పలకడమేంటని ఆశ్చర్యపోతున్నారా..? మరి చైనాలో అంతే! ఎందుకలా? అంటారా? మనకు కోడిపందేలు మామూలైనట్లే చైనాలో మిడతల పందేలు చాలా మామూలు. చైనా దేశమంతటా ఇదే పద్ధతి కాదు గాని, షాన్డాంగ్ ప్రావిన్స్‌లో సిదియాన్ పట్టణంలోను, పరిసర ప్రాంతాల్లోను మిడతల పందేలు మహా రంజుగా సాగుతుంటాయి. ఇదేదో ఈనాటి వినోదం కాదు. టాంగ్ వంశ పాలకుల హయాంలో క్రీస్తుశకం ఏడో శతాబ్ది నుంచి ఈ ప్రాంతంలో మిడతల పందేలు కొనసాగుతున్నాయి. రాచరికం అంతరించి కమ్యూనిస్టు పాలన మొదలైన తర్వాత కూడా ఇవి ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. మావో హయాంలో మిడతల పందేలపై నిషేధం విధించినా, ఇవి ఏమాత్రం అంతరించ లేదు. అయినా పందెం రాయుళ్లను నిషేధాజ్ఞలు ఆపగలవా? మన దేశంలో సంక్రాంతి సీజన్లో కోడి పందేలు జరిగినట్లే చైనాలో ఏటా ఆగస్టులో మిడతల పందేలు జరుగుతుంటాయి. పందేలకు కావలసిన మిడతలు సరఫరా చేసేందుకు ఈ సీజన్లో కొందరు మిడతలు పట్టడమే వ్యాపకంగా పెట్టుకుంటారు. కుటుంబాలకు కుటుంబాలే మిడతలు పట్టే పనిలో బిజీ బిజీగా ఉంటారు. సీజన్ పూర్తయ్యే సరికి సగటున ఒక్కో కుటుంబం కేవలం మిడతల విక్రయాల ద్వారానే లక్ష యువాన్ల (రూ.9.78 లక్షలు) వరకు సంపాదిస్తుంటారు. పందేలు పూర్తయ్యాక మిడతలనేం చేసుకుంటారని అంటారా..? మనోళ్లు కోడిపందేల తర్వాత వాటిని ఏం చేసుకుంటారో చైనా వాళ్లు మిడతలను కూడా అదే చేసుకుంటారు. గెలిచినా, ఓడినా ఎలాంటి మిడతైనా చివరకు పలారం కావాల్సిందే! -
కలెక్టర్‌కు తెచ్చిన ఉప్మాలో మిడత
మహబూబ్ నగర్ : తనకు తెచ్చిన అల్పాహారంలో మితడను చూసిన ఓ జిల్లా కలెక్టర్ విస్తుపోయారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శినికి తీసుకొచ్చిన ఉప్మాలో మిడత దర్శనం ఇచ్చింది. దాంతో హోటల్ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివరాల్లోకి వెళితే పొదుపు భవనంలో నివాసం ఉంటున్న కలెక్టర్‌కు నిన్న ఉదయం స్థానిక గురుప్రసాద్ హోటల్ నుంచి ఉప్మాను పార్శిల్‌గా తీసుకొచ్చారు. తెచ్చిన పార్శిల్‌ను తెరిచిన కలెక్టర్... అందులో మిడత పురుగు కనిపించటంతో ఒకింత షాక్‌కు గురయ్యారు. వెంటనే హోటల్ యాజమాన్యపై చర్యలు తీసుకోవటంతో పాటు, సీజ్ చేయాలని ఆదేశించారు. రంగంలోకి దిగిన అధికారులు హోటల్ ను తనిఖీ చేసి ఉప్మాను హైదరాబాద్‌లోని ఫుడ్ ఇన్విస్టిగేషన్ ల్యాబ్‌కు పరీక్ష నిమిత్తం పంపించారు. ఇక కలెక్టర్‌కు పంపిన ఉప్మాలోనే మిడత ఉంటే, ఇక సామాన్యులకు ఏయే పురుగులు వస్తున్నాయోననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.