పులి మీద పుట్రలా కరోనా మహమ్మారికి తోడు మరో ఉపద్రవం ముంచుకువస్తోంది. కరోనాతో సతమతమవుతున్న ఆఫ్రికా, ఆసియా దేశాలపై ఈ వేసవిలో మరో పిడుగు పడబోతోందా? లక్షలాది ఎకరాల్లో పంట పొలాలపై రాకాసి మిడతల దండు ఒకటి, రెండు నెలల్లో విరుచుకుపడి ఆహార భద్రతకు ముప్పు తెచ్చిపెట్టే పెను ప్రమాదం పొంచి ఉందా? అవుననే అంటున్నారు ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) నిపుణులు. ఇప్పటికే ఆహార కొరత, కరోనా మహమ్మారితో సతమతమవుతున్న తూర్పు ఆఫ్రికా దేశాల్లో గత పాతికేళ్లలో ఎన్నడూ ఎరుగనంత భీకరంగా రాకాసి మిడతల దండు ఇప్పుడు విలయాన్ని సృష్టిస్తోంది.
కొద్ది నెలల క్రితం మిడతల దండు విజృంభించడంతో ఇథియోపియా, సోమాలియా, పాకిస్తాన్‌తోపాటు మన దేశంలోనూ లక్షలాది ఎకరాల్లో నోటికాడికి వచ్చిన పంటలు ధ్వంసమయ్యాయి. అప్పట్లో రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో 3,70,000 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. తెలంగాణలోని సిద్ధిపేట, మెదక్ జిల్లాల్లోనూ వేలాది ఎకరాల్లో మొక్కజొన్న తదితర పంటలు నాశనమయ్యాయి. అప్పట్లో కొద్ది రోజుల్లోనే సమసిపోయిన ఈ సమస్య తూర్పు ఆఫ్రికా దేశాలను కొద్ది నెలల్లోనే భీకర రూపం దాల్చి మళ్లీ చుట్టుముట్టింది.
రెండో దశలో ఇథియోపియా, కెన్యా, సోమాలియా దేశాల్లో అంతకు ముందుకన్నా 20 రెట్లు ఎక్కువ సంఖ్యలో మిడతల దండు విజృంభిస్తున్నది. ఇలాగే ఉంటే వచ్చే జూన్ నాటికి మిడతల సంఖ్య 400 రెట్లు పెరిగిపోతుందని, సుమారు 60 దేశాలకు నష్టం చేకూర్చవచ్చని ఎఫ్.ఎ.ఓ. నిపుణుల అంచనా. అయితే, కరోనా మహమ్మారి లాక్‌డౌన్ మధ్య ఆఫ్రికా దేశాలు మిడతల దండును అరికట్టలేకపోతున్నాయి. ఫలితంగా ఇథియోపియాలో లక్షల హెక్టార్లలో టెఫ్ అనే చిరుధాన్యం, ఉల్లి పంటలు ఇప్పటికే పూర్తిగా నాశనం అయ్యాయి. మిడతల దండును అరికట్ట లేని పరిస్థితుల్లో రానున్న ఒకటి, రెండు నెలల్లో అనేక ఆఫ్రికా, ఆసియా దేశాల్లో పంటలకు పెనునష్టం జరగనుంది. ఆఫ్రికా దేశాల నుంచి బయలుదేరే మిడతల దండు జూన్ నాటికి భారత్‌లో పంజాబ్, హర్యానాలతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లోనూ చుట్టుముట్టి పంటలకు నష్టం కలిగించే ముప్పు పొంచి ఉందని తాజా నివేదికలో ఎఫ్.ఎ.ఓ. హెచ్చరించింది. – పంతంగి రాంబాబు, సాగుబడి
భారత్‌కు రెండు వైపుల నుంచి ముప్పు
పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో పుట్టిన మిడతల దండు రెండు వలస దారుల్లో భారత్‌పై దాడి చేసే అవకాశం ఉంది. ఎమెన్, బహ్రెయిన్, కువైట్, ఖతార్, ఇరాన్, సౌదీ అరేబియా, పాకిస్తాన్ భూభాగం మీదుగా భారత్‌లోని పంజాబ్, హర్యానాల్లో పంట పొలాలపై మే, జూన్ మాసాల్లో మిడతల దండు దాడి చేసే ప్రమాదం ఉందని ఎఫ్.ఎ.ఓ. హెచ్చరిస్తోంది. అదేవిధంగా, ఇథియోపియా, సోమాలియా దేశాల నుంచి హిందూ మహా సముద్రం మీదుగా దక్షిణ భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్ సహా తూర్పు, పశ్చిమ తీరంలోని వివిధ రాష్ట్రాల్లో మిడతల దండు దాడి చేసి పంటలను తీవ్రంగా నష్టపరిచే అవకాశం ఉందని ఎఫ్.ఎ.ఓ. తాజా నివేదికలో హెచ్చరించింది. ఎడారి మిడతలు.. 8 తూర్పు ఆఫ్రికా దేశాల్లో (కెన్యా, ఇథియోపియా, సోమాలియా, జిబౌటి, ఉగాండ, టాంజానియా, సూడాన్, ఎరిట్రియ) పంటలు, మొక్కలు, చెట్లకు పెనుముప్పుగా పరిణమించాయి. ఇథియోపియా, సోమాలియాలలో గత పాతికేళ్లుగా ఎన్నడూ లేనంత ఎక్కువగా ఆహార, ఆదాయ భద్రతకు గొడ్డలిపెట్టుగా మారాయి. కెన్యా.. 70 ఏళ్లలో ఎరుగనంత ఎక్కువగా మిడతల బెడదను ఎదుర్కొంటున్నది.
ఆఫ్రికా దేశాల నుంచి మన దేశానికి మిడతల దండు పయనించే అవకాశం ఉన్న మార్గాలను సూచిస్తూ ఎఫ్.ఎ.ఓ. రూపొందించిన చిత్రం
10 లక్షల హెక్టార్లలో గుడ్లు
కరువు కాటకాలతో నిరంతరం అల్లాడే ఈ తూర్పు ఆఫ్రికా దేశాల్లో గతేడాది అక్టోబర్‌లో భారీ వర్షాల తర్వాత ఎడారి మిడతలు గుడ్లు పెట్టి సంతతిని తామరతంపరగా వృద్ధి చెయ్యటం మొదలు పెట్టాయి. 8 దేశాల్లో 10 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో గుడ్లు పెట్టి సంతతిని పెంచుకుంటున్నాయి. ఇది నూర్పిడి సీజన్ కావడంతో రైతులు అల్లాడుతున్నారు. ఆహార , ఆదాయ భద్రతకు ముప్పు వచ్చిపడింది.
మూక శక్తితోనే విధ్వంసం
ఎడారి మిడత ప్రవర్తన ఒంటరిగా ఉన్నప్పుడు సాధారణంగానే ఉంటుంది. అప్పుడు పంటలకు వీటి వల్ల బెడద ఉండదు. కానీ, ఎక్కువ సంఖ్యలో ఒక చోట చేరినప్పుడు విధ్వంసకర మూక శక్తిగా ప్రవర్తిస్తాయి. మిడతల దండు ప్రవర్తనలోనే కాదు.. వాటి రంగు, రూపంలో కూడా మార్పులు వస్తాయి.
రోజూ తనంత తిండి!
మిడత రోజూ తన బరువుతో సమానమైనంత ఆకులు, అలములు, గింజలు ఆహారంగా తింటుంది. మిడతల దండు అనేక కిలోమీటర్ల వెడల్పున విస్తరించి ఉండవచ్చు. ఒక చదరపు కిలోమీటరు విస్తరించి ఉండే మిడతల దండులో 4–5 కోట్ల వరకు మిడతలు ఉంటాయి. ఇవి ఒక్క రోజులో 35 వేల మంది మనుషులు తినేంత ఆహారాన్ని తినేస్తాయి. ఈ దండు నేల వాలిందంటే ఆయా ప్రాంతాల్లో పంటలు, గడ్డి, ఆకులు పచ్చదనం అంతా ఇట్టే ఖాళీ అయిపోతుంది. ఆహార పంటలతోపాటు పచ్చిక బయళ్లను కూడా మిడతల దండు ఆరగించేస్తుంది. అడవులకూ బెడద పొంచి ఉంది.
జీవన కాలం 3 నెలలు
ఎడారి మిడత జీవిత కాలం సాధారణంగా 3 నెలలు. అయితే, చల్లని వాతావరణంలో 6 నెలలు కూడా జీవిస్తుంది. ఎడారి ప్రాంతాల్లో సైతం నెలకు 2.5 ఎం.ఎం. వర్షపాతం వరుసగా రెండు నెలల్లో కురిస్తే చాలు మిడతల దండు సంతతి వృద్ధికి సరిపోతుంది. తగిన తేమ ఉన్న ఇసుక నేలల్లో 2–4 అంగుళాల లోతున మిడత గుడ్లు పెడుతుంది. ఒక మిడత 80 నుంచి 160 గుడ్లను గంపగుత్తగా పెడుతుంది. చదరపు మీటరు స్థలంలో వందలాది మిడతలు గుడ్లు పెడతాయి. గుడ్ల లో నుంచి రెండు వారాల్లో పిల్లలు బయటకు వస్తాయి. 4–6 వారాల్లో రెక్కలు సంతరించుకొని ఎగర గలుగుతాయి. ఆ దశలో మిడతల దండులో చేరుతుంది. అప్పటి నుంచి 3–4 వారాలు యాక్టివ్‌గా ఉండిన తర్వాత మిడత గుడ్లు పెడుతుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే గుడ్లు పెట్టిన తర్వాత చనిపోతుంది.
అడ్డుకునేదెలా?
వాతావరణ మార్పుల నేపథ్యంలో అకాల వర్షాలతో ఏర్పడే అనువైన వాతావరణమే మిడతల దండు విజృంభించడానికి కారణమని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. పురుగులు మందు చల్లి సంతతిని అరికట్టే ప్రయత్నం చేయటం తప్ప అరికట్టేందుకు మరో మార్గమేదీ లేదంటున్నారు. ఆఫ్రికాలో రెండు రకాల (Schistocerca gregaria, Locusta migratoria) మిడతలు సమస్యాత్మకంగా తయారయ్యాయి. శక్తివంతమైన పురుగుమందులను మనుషులతోను, విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్ల తోను పిచికారీ చేయిస్తున్నారు. పురుగులను అరికట్టే మెటార్హిజియం శిలీంధ్రం (Metarhizium sp.) చల్లుతున్నారు. అయితే, శిలీంధ్రం వృద్ధి చెంది మిడతలను మట్టుబెట్టడానికి 7 నుంచి 14 రోజుల వ్యవధి అవసరం అవుతుంది. చెద పురుగులు, స్కరబ్ బీటిల్స్‌పై ఈ శిలీంధ్రం ప్రతికూల ప్రభావం చూపుతున్నదని అంటున్నారు.
మిడతలపై పురుగుల మందు పిచికారీ
Comments
Please login to add a commentAdd a comment