ఏటా వసంతాగమన వేళ వచ్చే హోలీ హిందువులకు రంగుల పండుగ. సిక్కులకు మాత్రం ఇది రంగుల పండుగ మాత్రమే కాదు, వీరవిద్యల వేడుక కూడా. హోలీ నాటితో మొదలై మూడు రోజులు కొనసాగే ఈ వేడుకను ‘హోలా మొహల్లా’ అంటారు. సిక్కుల గురువు గురు గోబింద్ సింగ్ ఈ వేడుకను జరుపుకొనే ఆనవాయితీని ప్రారంభించారు.
హోలీ వేడుకల్లో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడమే కాకుండా, ఆరుబయట మైదానాల్లోకి చేరి యువకులు సంప్రదాయ వీరవిద్యలను ప్రదర్శిస్తారు. జోడు గుర్రాల మీద నిలబడి స్వారీ చేయడం, గుర్రపు పందేలు, ఒంటెల పందేలు నిర్వహిస్తారు. ‘హోలా మొహల్లా’ అంటే ఉత్తుత్తి యుద్ధం అని అర్థం. ఈ వేడుకల్లో కత్తులు, బరిసెలతో ఉత్తుత్తి యుద్ధాల్లో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు.
తొలిసారిగా ‘హోలా మొహల్లా’ వేడుకలు 1701లో ఆనంద్‌పూర్ సాహిబ్‌లో జరిగాయి. అదే సంప్రదాయ ప్రకారం ఇప్పటికి కూడా ఆనంద్‌పూర్ సాహిబ్‌లో ఈ వేడుకలు ఆర్భాటంగా జరుగుతాయి. పంజాబ్, హర్యానాలతో పాటు పాకిస్తాన్‌లో కూడా సిక్కులు ఈ వేడుకను సంప్రదాయబద్ధంగా జరుపుకొంటారు. ఉదయం వేళ రంగులు చల్లుకోవడం, వీరవిద్యా ప్రదర్శనలు, ఆయుధ ప్రదర్శనలు; సాయంత్రం వేళలో ఆధ్యాత్మిక సంకీర్తనలు, సంగీత నృత్య ప్రదర్శనలు, కవి సమ్మేళనాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. వేడుకల్లో పాల్గొనడానికి భారీ సంఖ్యలో వచ్చే జనాలకు సంప్రదాయక వంటకాలతో ఆరుబయట విందుభోజనాలను ఏర్పాటు చేస్తారు.
ఇవి చదవండి: నాజూగ్గా ఉండే శిల్పాశెట్టి ఇంతలా ఫుడ్‌ని లాగించేస్తుందా..!
Comments
Please login to add a commentAdd a comment