తీర్థయాత్రలు చేస్తారు కొందరు. వర్ణయాత్రలు కొందరికి ఇష్టం. మన దేశంలో హోలి చాలా హుషారైన పండగ. బహుశా దీపావళి తర్వాత చిన్నా పెద్దా అందరూ కేరింతలతో పాల్గొనే పండగ ఇదే. రొటీన్ వితంలో రంగులను నింపుకోవడం బాగుంటుంది. అయితే కొందరికి ఇంట్లోనో, అపార్ట్‌మెంట్ ప్రాగణంలోనో, వీధిలో, ఏరియా చౌరస్తాలోనో ఆడే హోలీ పెద్దగా ఆనదు. వారికి భారీ హోలి వేడుక చూడాలనిపిస్తుంది. అలాంటి వారి కోసం హోలి డెస్టినేషన్స్ ఉన్నాయి. మన దేశంలో. ఈ హోలీకి వెళ్లగలిగితే వెళ్లండి.
మధుర: ఉత్తరప్రదేశ్‌లోని మధురలో హోలి వేడుకలు చూడటం అంటే కృష్ణ రాధలు ఆడే హోలిని చూసినట్టే. ఇక్కడి బర్సానాలో స్త్రీలు గోపికల్లా, పురుషులు గోపబాలురలా అలంకరించుకుని హోలి ఆడతారు. రంగులు చల్లడానికి వచ్చిన గోపబాలురను స్త్రీలు సరదాగా బడితెలతో బాది దూరం తరుముతారు. అందుకే దీనిని ‘లాత్‌మార్ హోలి’ అంటారు.
ఉదయ్‌పూర్: ఇక రాచరికస్థాయిలో హోలి చూడాలంటే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు వెళ్లాలి. అక్కడి సిటీ ప్యాలెస్‌లో రాజ వంశీకుల హాజరీలో అద్భుతమైన హోలి వేడుకలు జరుగుతాయి. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాజస్థానీ జానపద కళల ప్రదర్శన ఉంటుంది. టూరిస్ట్‌లు ఈ వేడుకలు చూడటానికి తెగబడతారు.
బృందావన్: ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌కు వెళితే అక్కడి బన్‌కె బిహారి ఆలయంలో పూలు, రంగులు కలిపి చల్లుకుంటూ కోలాహలంగా హోలి నిర్వహిస్తారు. అందుకే దీనిని ‘ఫూల్‌వాలోంకి హోలి’ అంటారు. ఇక్కడ ఒకరోజు రెండు రోజులు కాదు... వారం రోజులపాటు హోలి వేడుకలు జరుగుతునే ఉంటాయి. చుట్టుపక్కల పల్లెలు రంగులతో తెల్లారి రంగులతో అస్తమిస్తాయి. ఈ అద్భుతమైన వేడుకలను చూడానికి టూరిస్ట్‌లు వస్తారు.
హంపి: తుంగభద్ర నది ఒడ్డున రంగుల పండగ ఎలా ఉంటుందో చూడాలంటే హంపి వెళ్లాలి. ఇక్కడ హంపి సందర్భంగా భారీగా అలంకరించి నిర్వహించే రథయాత్ర చూడటానికి రెండు కళ్లూ చాలవు. ఈ సాంస్కృతిక క్షేత్రంలో హోలీ ఒక విచిత్ర భావన కలిగిస్తుంది. నగర ప్రజలు డోళ్లు మోగిస్తూ హోలి వేడుకల్లో విశేషంగా పాల్గొంటారు. విరూపాక్ష ఆలయం ఈ సందర్భంగా కళకళలాడిపోతుంది. దక్షిణాదివారు హోలీ సెలవు హంపిలో గడిపి ఆనందించవచ్చు.
శాంతినికేతన్: పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్‌లో హోలి అయితే నయనానందమూ శ్రవణానందమూ కూడా. ఎందుకంటే అక్కడ హోలి అంటే రంగులు చల్లుకోవడం మాత్రమే కాదు... నృత్యాలు, సంగీతం, కవిత్వం... అమ్మాయిలు అబ్బాయిలు కలిసి మనోహరంగా హోలి జరుపుకుంటారు. రవీంద్రనాథ్ ఠాగూర్ మొదలెట్టిన ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. ఇక్కడకు వెళ్లి హోలి చూసినవారి హృదయం కచ్చితంగా రంగులతో నిండిపోతుంది.
ఆనంద్‌పూర్ సాహిబ్: పంజాబ్‌లోని ఈ ఊళ్లో హోలీ రంగులకు కళ్లు చెదురుతాయి. నిహాంగ్ సిక్కులు ఇక్కడ హోలి సమయంలో యుద్ధ విద్యలు ప్రదర్శిస్తారు. ఉత్తుత్తి పోరాటాలు ఇరు జట్ల మధ్య జరుగుతాయి. డోళ్లు తెగ మోగుతాయి. ఆట పాటల అట్టహాసం చూడతగ్గది.
Comments
Please login to add a commentAdd a comment