ఉగాది పండుగ శుభాకాంక్షలతో..
‘ఉగాది’ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది అది మన తెలుగు పండుగ అని! ఉగాది నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని ప్రారంభించారని నమ్ముతారు. మత్సా్యవతారం ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. బ్రహ్మదేవుడు చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా ఈ జగత్తును సృష్టించాడంటారు. ‘ఉగాది’, ‘యుగాది’ అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ‘ఉగ’ అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి ‘ఆది’.. ‘ఉగాది’. అంటే సృష్టి ఆరంభమైన దినమే ‘ఉగాది’.
ఉగాది పండుగ రోజున త్వరగా నిద్రలేచి ఇంటి ముందర ముగ్గులు వేసి వసంత లక్ష్మిని స్వాగతిస్తారు. తలంటు స్నానాలు చేస్తారు. కొత్త బట్టలు ధరిస్తారు. గుమ్మాలకు మామిడాకుల తోరణాలు కడతారు. షడ్రుచు లతో కూడిన ఉగాది ప్రసాదాన్ని పంచాంగానికి, దేవతలకు నైవేద్యం చేసి తమ భవిష్యత్ జీవితాలు ఆనందంగా సాగాలని కోరుతూ ఉగాది పచ్చడి తింటారు. ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో ‘నింబ కుసుమ భక్షణం’; ‘అశోక కళికా ప్రాశనం’ అని వ్యవహరించేవారు.
"త్వామష్ఠ శోక నరాభీష్ట మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం మమ శోకం సదా కురు"
ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తు న్నాయి. ఉగాది పచ్చడి ఆహారంలో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికీ – ఆహారానికీ గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటి చెప్తుంది. ఉగాది రోజున తినే పచ్చడిలో కొత్త చింతపండు, లేత మామిడి చిగుళ్ళు, అశోక వృక్షం చిగుళ్ళు, కొత్త బెల్లం, వేపపూత, మామిడి కాయముక్కలు, చెరకు ముక్కలు, జీలకర్ర లాంటివి ఉపయోగించాలి. ఈ పచ్చడి శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేష్ఠమని ఆయుర్వేదం పేర్కొంటోంది. ఈ పచ్చడిని ఖాళీపొట్టతో తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచిదంటారు. బెల్లం – తీపి(ఆనందం), ఉప్పు (జీవితంలో ఉత్సాహం), వేప పువ్వు – చేదు (బాధ కలిగించే అనుభవాలు), చింతపండు – పులుపు (నేర్పుగా వ్యవహరించ వలసిన పరిస్థితులు), మామిడి – వగరు (కొత్త సవాళ్లు), కారం (సహనం కోల్పోయే స్థితి) గుణాలకు సంకేతాలు అంటారు.
ఉదయంవేళ, లేదా సాయంత్రం సమయాలలో పంచాంగ శ్రవణం చేస్తారు. పంచాంగం అంటే అయిదుఅంగాలని అర్థం చెపుతారు. ఉగాదికి సాహితీవేత్తలు ప్రత్యేకంగా ‘కవి సమ్మేళనం‘ నిర్వహిస్తారు. ఒక్క తెలుగు సంప్రదాయంలోనే కాక దేశంలోని పలు ప్రాంతాల్లో వివిధ పేర్లతో ఉగాది జరుపుతారు. తెలుగు వారిలానే చాంద్రమానాన్ని అనుసరించే మరాఠీలకు కూడా ఉగాది చైత్రశుద్ధ పాడ్యమి నాడే వస్తుంది. వారి సంవత్సరా దిని ’గుడి పడ్వా’గా (పడ్వా అంటే పాడ్యమి) వ్యవహరిస్తారు. తమిళుల ఉగాదిని (తమిళ) ‘పుత్తాండు’ అంటారు.
వారిది సౌరమానం. ఏప్రిల్ 14న సంవత్సరాదిని చేసుకుంటారు. బెంగాలీల నూతన సంవత్సరం వైశాఖ మాసంతో మొదలవుతుంది. వారి కాలమానం ప్రకారం వైశాఖశుద్ధ పాడ్యమినాడు ఉగాది వేడుకలు చేసుకుంటారు. వ్యాపారులు ఆ రోజున పాత ఖాతా పుస్తకాలన్నింటినీ మూసి, సరికొత్త పుస్తకాలు తెరుస్తారు.
– నందిరాజు రాధాకృష్ణ ‘ వెటరన్ జర్నలిస్ట్ 98481 28215
(రేపు ఉగాది పర్వదినం సందర్భంగా)
Comments
Please login to add a commentAdd a comment