
చెట్టూ చేమా ఉన్నచోట ఆరుబయట ఎగిరెగిరి పడే మిడతలను ఎవరు పట్టించుకుంటారని తీసిపారేయకండి. మేలిరకం మిడతలకు ఎంత ధర పలుకుతుందో తెలుసుకున్నారంటే కళ్లు తేలేస్తారు. పోరాట పటిమగల మేలిరకం మిడతలు గరిష్ఠంగా 50 వేల యువాన్లు (రూ.4.89 లక్షలు) వరకు పలుకుతున్నాయి. మిడతల నాణ్యతను బట్టి, రకాలను బట్టి మన కరెన్సీ లెక్కల్లో చెప్పుకోవాలంటే ఒక్కో మిడత కనీసం వంద రూపాయలు మొదలుకొని కొన్ని రకాలు వేలకు వేల రూపాయల మేరకు ధర పలుకుతాయి. మిడతలేంటి..? బంగారానికి మించిన ధర పలకడమేంటని ఆశ్చర్యపోతున్నారా..? మరి చైనాలో అంతే! ఎందుకలా? అంటారా? మనకు కోడిపందేలు మామూలైనట్లే చైనాలో మిడతల పందేలు చాలా మామూలు. చైనా దేశమంతటా ఇదే పద్ధతి కాదు గాని, షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లో సిదియాన్ పట్టణంలోను, పరిసర ప్రాంతాల్లోను మిడతల పందేలు మహా రంజుగా సాగుతుంటాయి. ఇదేదో ఈనాటి వినోదం కాదు. టాంగ్ వంశ పాలకుల హయాంలో క్రీస్తుశకం ఏడో శతాబ్ది నుంచి ఈ ప్రాంతంలో మిడతల పందేలు కొనసాగుతున్నాయి. రాచరికం అంతరించి కమ్యూనిస్టు పాలన మొదలైన తర్వాత కూడా ఇవి ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు.
మావో హయాంలో మిడతల పందేలపై నిషేధం విధించినా, ఇవి ఏమాత్రం అంతరించ లేదు. అయినా పందెం రాయుళ్లను నిషేధాజ్ఞలు ఆపగలవా? మన దేశంలో సంక్రాంతి సీజన్‌లో కోడి పందేలు జరిగినట్లే చైనాలో ఏటా ఆగస్టులో మిడతల పందేలు జరుగుతుంటాయి. పందేలకు కావలసిన మిడతలు సరఫరా చేసేందుకు ఈ సీజన్‌లో కొందరు మిడతలు పట్టడమే వ్యాపకంగా పెట్టుకుంటారు. కుటుంబాలకు కుటుంబాలే మిడతలు పట్టే పనిలో బిజీ బిజీగా ఉంటారు. సీజన్ పూర్తయ్యే సరికి సగటున ఒక్కో కుటుంబం కేవలం మిడతల విక్రయాల ద్వారానే లక్ష యువాన్ల (రూ.9.78 లక్షలు) వరకు సంపాదిస్తుంటారు. పందేలు పూర్తయ్యాక మిడతలనేం చేసుకుంటారని అంటారా..? మనోళ్లు కోడిపందేల తర్వాత వాటిని ఏం చేసుకుంటారో చైనా వాళ్లు మిడతలను కూడా అదే చేసుకుంటారు. గెలిచినా, ఓడినా ఎలాంటి మిడతైనా చివరకు పలారం కావాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment