సాక్షి, మెదక్: రైతులను ప్రకృతి పగబట్టినట్లుంది. సకాలంలో వర్షాలు లేవు. దీనికి తోడుగా వందల అడుగుల లోతులో ఉన్న నీటికోసం అడుగడుగునా బోర్లువేసి భద్రంగా నీటి చుక్కలను కాపాడుకొని సాగుచేసిన పంటలు చేతికందే సమయంలోనే చెజారిపోతున్నాయి. మక్క పంటను గతేడాది కత్తెర పురుగు నాశనం చేయగా.. ఈసారి మిడతల దండు విరచుకుపడుతోంది. జిల్లాలో
ఇప్పటికే 4 వేల ఎకరాల్లో పంటను పీల్చి పిప్పి చేశాయి. కనీసం పశువుల మేతకు కూడా పనికిరాకుండా చేస్తున్న మిడతలు అంటేనే రైతులు హడలెత్తిపోతున్నారు. పంటలను పరిశీలించిన వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు, అధికారులు నామమాత్రంగా మందులు స్ప్రే చేయాలని సూచించారే తప్ప.. మరేమీ చేయలేమని చేతులెత్తేశారు. నిన్నా మొన్నటి వరకు మొక్కజొన్న పంటను కత్తెర పురుగు ధ్వంసం చేయగా అనేక ఇబ్బందులు పడి దాని బారి నుంచి బయట పడ్డారోలేదో..? మళ్లీ మిడతల బెడద పట్టుకుంది. పంట చేతికందే సమయంలో పంటలపై మిడతలు దాడిచేసి పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
మొక్కజొన్న పంటను పూర్తిగా ధ్వంసం చేసిన మిడతలు: పంటను తింటున్న మిడతలు
జిల్లాలో ఈ యేడు వర్షాధార పంటగా జిల్లా వ్యాప్తంగా సుమారు 39 వేల హెక్టార్లలో మొక్కజొన్న పంటను సాగు చేశారు. అడపాదడప కురిసిన వర్షాలతోనే మొక్కజొన్న పంటను సాగు చేయగా ఆగస్టులో ఏకంగా 15రోజుల పాటు వర్షాలు కురవకపోవడంతో సాగుచేసిన మొక్కజొన్న పంటలో సగం మేర ఎండిపోయింది. మిగిలిన సగం పంటకు సైతం నిన్నా మొన్నటి వరకు కత్తెర పురుగు ఆశించటంతో దాని నివారణకు తలకు మించిన భారంతో పలురకాల మందులను స్ప్రే చేసి కొంతమేర దాని నుంచి ఉపశమనం పొందారో లేదో మళ్లీ మిడతలు మొక్కజొన్న చేలను ధ్వసం చేస్తున్నాయి. ఎకరాల కొద్దిపంటలను రోజుల వ్యవధిలోనే తింటున్నాయి. ఆరుగాలం కష్టపడి పంటలను సాగుచేస్తే మరో 20 రోజుల్లో పంటచేతికి అందుతుందనగా మిడతలు పంటను కళ్లముందే నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
మొక్కజొన్నకు అన్నీ గండాలే...
మొక్కజొన్న పంటను సాగుచేయాలంటే పెద్ద గగనమనే చెప్పాలి. పంటసాగుచేసిన నుంచి మొదలుకుని చేతికందే వరకు అనేక రకాల కష్టాలు పడాల్సిందే ఈ యేడు ముందుగా కత్తెర పురుగు వచ్చింది. దాన్ని నివారించగానే రాత్రి అయిందంటే చాలు అడవి పందులు వచ్చి పంటచేళ్లను తినేస్తున్నాయి. పగటి వేళలో కోతుల గుంపులు వచ్చి అందిన కాడికి ధ్వంసం చేస్తుండగా తాజాగా మిడతల గుంపులు వచ్చి మళ్లీ మొక్కజొన్నను తినేస్తున్నాయి. గడియ గడియకు ఇబ్బందులు పడుతూ పంటలను పండించేందుకు అన్నదాతలు పడుతున్న కష్టాలు అంతా ఇంతకావు. పంట చేతికందుతుందా లేదా అంటూ ఆవేదన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment