Corn crops
-
ఉచితంగా రైతన్నలకు విత్తనాలు సరఫరా..!
-
మొక్కజొన్న సాగుతో మంచి లాభాలు మరియు డిమాండ్ ఎక్కువ
-
మొక్కజొన్న ‘ధర’హాసం
సాక్షి, అమరావతి: మొక్కజొన్న పంట కాసులు కురిపిస్తోంది. కరోనా కారణంగా రెండేళ్లపాటు కనీస మద్దతు ధరకు నోచుకోని మొక్కజొన్న రైతులు ఈసారి మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం క్వింటాల్ రూ.2 వేల నుంచి రూ.2,200 వరకు ధర పలుకుతుండగా రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా ఆ దేశం నుంచి మొక్కజొన్న దిగుమతులు నిలిచిపోవడంతో ధరలు పెరిగాయని చెబుతున్నారు. గతేడాది ఉక్రెయిన్ నుంచి మన దేశం 33.50 మిలియన్ టన్నుల మొక్కజొన్నను దిగుమతి చేసుకోగా.. ప్రస్తుత యుద్ధ ప్రభావంతో దేశీయంగా మొక్కజొన్న ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రెండేళ్ల పాటు దెబ్బతీసిన కరోనా మొక్కజొన్నను సాధారణంగా కోళ్లకు మేతగా వినియోగిస్తారు. ఇథనాల్, ఆల్కహాల్, పిండి పదార్థాల తయారీలోనూ విని యోగిస్తారు. కరోనా దెబ్బకు రెండేళ్లపాటు ఆక్వా, పౌల్ట్రీ పరిశ్రమ దెబ్బ తినడంతో మొక్కజొన్న క్వింటాల్ రూ.1,100 నుంచి రూ.1450కి మించి కొనేవారు లేక రైతులు విలవిల్లాడారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులకు అండగా నిలిచింది. మార్క్‌ఫెడ్ 2019–20 సీజన్లో 61,494 మంది రైతుల నుంచి రూ.806.20 కోట్ల విలువైన 4,16,426 టన్నులు, 2020–21 సీజన్లో 78,702 మంది రైతుల నుంచి రూ.1,010.68 కోట్ల విలువైన 4.96 లక్షల టన్నులను కొనుగోలు చేసి ఆదుకుంది. ఖరీఫ్–21లో ఎమ్మెస్పీని మించి ధర ప్రభుత్వ చర్యలతో 2021–22 సీజన్లో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కు మించి ధర పలకడం రైతుకు ఊరట నిచ్చింది. ఖరీఫ్– 2021 సీజన్లో 3.25 లక్షల ఎకరాల్లో మొక్క జొన్న సాగవగా.. 5.26 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ప్రభుత్వం ఎమ్మెస్పీ క్వింటాల్ రూ.1,870 ప్రకటించగా, మార్కెట్లో రూ.1,900 వరకు పలకడంతో రైతులు కొనుగోలు కేంద్రాల వైపు చూడలేదు. ప్రస్తుతం రబీ సీజన్లో 5.05 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవగా.. 8.50లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఎప్పుడూ ఈ ధర లేదు రబీలో 2.25 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. రూ.70 వేల వరకు పెట్టుబడి పెట్టా. ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో రూ.2 వేలకు పైగా పలుకుతోందంటున్నారు. గతంలో ఎప్పుడూ ఈ ధర చూడలేదు. ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం మంచి ఆదాయం వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. – యగ్గోని శ్రీనివాసరెడ్డి, చందవరం, ప్రకాశం జిల్లా సంతోషంగా ఉంది రబీలో 12 ఎకరాల్లో మొక్కజొన్న వేశా. మంచి దిగుబడి వచ్చేట్టు ఉంది. మార్కెట్లో రూ.2,200 వరకు ధర పలుకుతోందంటున్నారు. ధర లేక గత రబీలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ఎమ్మెస్పీకి అమ్ముకున్నా. ఈసారి మంచి రేటు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. – గంపెన వెంకటప్రసాద్, మంచికలపూడి, గుంటూరు జిల్లా -
34 వేల ఎకరాల్లో పంట నష్టం
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 34 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఇందులో మొక్కజొన్నతో పా టు వేరుశనగ, పెసలు, జొన్న, మినుములు, మిర్చి, వరి, కంది పంటలు దెబ్బతిన్నట్లు పేర్కొంది. వరంగల్, హనుమకొండ, మహ బూబాబాద్ జిల్లాల పరిధిలో ఎక్కువగా పంట నష్టం జరిగిందని నివేదించింది. అత్యధికంగా మిర్చి పంట 20 వేల ఎకరాల్లో దెబ్బతిన్నది. మరో 10 వేల ఎకరాల్లో మొక్కజొన్న, ఇంకో 4 వేల ఎకరాలు ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడమా లేక సబ్సిడీపై విత్తనాలు అందజేయడమా అనే విషయంపై సర్కారు త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, సూర్యాపేట జిల్లాలో జరిగిన పంట నష్టంపై అంచనాలు వేస్తున్నామని తెలిపారు. 3 రోజుల్లో .. 300 గ్రామాల్లో వరంగల్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వారం పాటు వడగళ్లు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. మొదటి మూడు రోజుల్లోనే 20 మండలాల్లోని 300 గ్రామాల్లో కోట్ల రూపాయల విలువైన పంటలకు నష్టం జరిగిందని అంచనా. ఒక్క వరంగల్, హనుమకొండ జిల్లాల్లోనే ఎక్కువ పంట నష్టం జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. బీమా లేక నష్టపోయిన రైతాంగం రెండేళ్లుగా రాష్ట్రంలో పంటల బీమా అమలు కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా, వాతావరణ బీమా పథకాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైదొలగింది. దీంతో అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నప్పటికీ రైతులకు పరిహారం అందని పరిస్థితి ఏర్పడింది. నష్ట పరిహారం చెల్లించాలి వారం రోజులు కురిసిన వడగండ్ల వర్షం వలన పొలాల్లో పంటలు దెబ్బతినడమే కాక, మార్కెట్‌కు వచ్చిన ధాన్యం, మిర్చి తడిచిపోయింది. కొంత ధాన్యం వరద లో కొట్టుకుపోయింది. దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలని కోరుతున్నాం. గత సంవత్సరం 12.60 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, ఈ సం వత్సరం 8.5 లక్షల ఎకరాల్లో వరదల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. దీనికి తో డు ఈ నెలలో వచ్చిన అధిక వర్షాలు, రా ళ్ళ వర్షాల వల్ల రైతుల పంటలకు నష్టం వాటిల్లింది. అయినా ఇంతవరకు ప్రభు త్వం ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. వెంటనే నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలి. – సాగర్, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం -
చేతులు ఎత్తేసిన తెలంగాణ మంత్రులు
బోథ్: రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేయాలని, డిమాండ్ లేదనే మొక్కజొన్న పంట వేయవద్దని తెలిపామని, కానీ ప్రత్యామ్నాయ పంట కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పలేదని, కొనడం కష్టమేనని, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రైతులకు స్పష్టం చేశారు. జొన్నపంటను కొనుగోలు చేయాలని మంత్రులకు ఫోన్ చేసిన రైతులతో అన్న మాటలివి. పంట కొంటామనలేదు.. టీ– శాట్ ఛానల్లో సోమవారం సాయంత్రం సేంద్రియ వ్యవసాయంపై నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ఫోన్ చేసిన రైతులకు పలు సూచనలు చేశారు. బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామానికి చెందిన భీమ గోవింద రాజు టి శాట్ ఛానల్‌కి ఫోన్ చేయగా.. మంత్రి స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న పంట వేయవద్దని చెప్పిందని.. ప్రత్యామ్నాయంగా జొన్నపంట వేశామని, ప్రభుత్వం కొనాలని మంత్రికి విన్నవించారు. దీనికి మంత్రి స్పందిస్తూ.. రైతులు ప్రత్యామ్నాయ పంటను వేయాలని మాత్రమే చెప్పామని అన్నారు. ఆ పంటను ప్రభుత్వం కొంటుందని ఎక్కడా చెప్పలేదని మంత్రి తెలిపారు. మా చేతిలో ఏమీ లేదు: మంత్రి ఐకేరెడ్డి మండలంలోని ధన్నూర్ గ్రామానికి చెందిన పసుల చంటి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి మంగళవారం జొన్న పంట కొనుగోలు చేయాలని ఫోన్లో విన్నవించారు. మంత్రి స్పందిస్తూ.. జొన్న పంటను కొనుగోలు చేయడం మా చేతుల్లో లేదని, బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్లను రద్దు చేసిందని తెలిపారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటను మాత్రమే వేయాలని రైతుకు సూచించారు. తమ జిల్లాలో 50వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశారని, ప్రభుత్వం కొనుగోలు చేయలేదని పేర్కొన్నారు. జొన్న పంట వేయమని ప్రభుత్వం చెప్పలేదని తెలిపారు. మంత్రులు పంట కొనుగోలుపై స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రభుత్వం జొన్న పంటను కొనుగోలు చేస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ముంచిన మొక్కజొన్న
ప్రకాశం, గిద్దలూరు: మా కంపెనీకి చెందిన మొక్కజొన్న విత్తనాలు విత్తుకుంటే మీ జీవితాలు మారిపోతాయని ఆశ చూపించిన సీడ్ కంపెనీల ప్రతినిధులు సకాలంలో ఎరువులు, పురుగు మందులు సరఫరా చేయకుండా రైతులను నిండా ముంచారు. దీంతో రైతులకు ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, 15 క్వింటాళ్లు వచ్చే పరిస్థితులు కూడా లేవని రైతులు ఆరోపిస్తున్నారు. మేము విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు ఉచితంగా ఇస్తామని రైతులకు ఆశచూపిన పలు మొక్కజొన్న విత్తన కంపెనీల ప్రతినిధులు చివరకు ఎరువులు, పురుగు మందులు సకాలంలో ఇవ్వకపోవడంతో పంట పూర్తిగా దెబ్బతిని తీవ్ర నష్టాల్ని చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇలా జిల్లాలో సుమారు 65 వేల ఎకరాల వరకు మొక్కజొన్న సాగులో ఉండగా, ఇందులో 40 వేల ఎకరాల వరకు సీడ్ కోసం రైతుల ద్వారా కంపెనీల ప్రతినిధులు పంటను సాగు చేయిస్తున్నారు. మరో 25 వేల ఎకరాల్లో కమర్షియల్ పంటను సాగు చేస్తున్నారు. మొక్కజొన్న కండెలో కనిపించని గింజలు: గత ఐదారేళ్ల పాటు తీవ్ర వర్షాభావంతో రైతులు పంటలు సాగు చేసుకునేందుకు నీరు లేక కరువుతో అల్లాడారు. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురవడం, భూగర్భ జలాలు పెరగడంతో రైతులు పంటల సాగు విస్తారంగా చేపట్టారు. మొక్కజొన్న పంట సాగు జిల్లాలోనే అత్యధికంగా గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 15 వేల ఎకరాల్లో సాగు చేపట్టారు. మొక్కజొన్న నాటితేఎకరానికి రూ.20 వేలు పెట్టుబడి పెడితే పంట ద్వారా రూ.50 వేల వరకు వస్తుందని, ఇందులో రూ.30 వేల వరకు మిగు లుతుందని విత్తన కంపెనీ ప్రతినిధుల మాయమాటలు విని ఎంతో ఆశపడ్డారు. కంకుల్లో విత్తనాలు కనిపించడం లేదని, ఎక్కడో ఒక విత్తనం ఉంటే కండె బరువు ఎలా తూగుతుందని రైతులు వాపోతున్నారు. ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి రాదని, చివరకు పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని చెబుతున్నారు. ఒక్కో రైతు 10 ఎకరాల వరకు కౌలుకు తీసుకుని పంటను సాగు చేశారు. పండిన పంట తీసుకునేందుకు కొన్ని చోట్ల కంపెనీ ప్రతినిధులు రాకపోవడంతో పొలంలోనే రాలిపోతున్నాయి. కమర్షియల్ విత్తనాలు సాగుచేస్తే దున్నేస్తామంటూ బెదిరింపులు:‘‘మేము గ్రామంలో సీడ్ మొక్కజొన్న విత్తనాలు సాగు చేయిస్తున్నాం... మీరు మొక్కజొన్న సాగుచేయాలంటే మా వద్దే విత్తనాలు తీసుకోండి. కమర్షియల్ విత్తనాలు సాగుచేస్తే మా పంటలకు దిగుబడి రాదు. ఒక వేళ మమ్మల్ని కాదని మీ ఇష్టానుసారం కమర్షియల్ విత్తనాలు సాగుచేస్తే రాత్రికి రాత్రే దున్నేస్తామంటూ’’ కంపెనీ ప్రతినిధులు రౌడీయిజం చేస్తున్నారు.అందుకే తాము వారి వద్దనే విత్తనాలు తీసుకుని పంట సాగు చేస్తే ఇలా మమ్మల్ని నట్టేట ముంచారని రైతులు వాపోయారు. పంటను కోసుకెళ్లాల్సిన కంపెనీ ప్రతినిధులు పొలం వద్దకు రావడం లేదని, కనీసం తమకు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల్లోనూ వ్యత్యాసం.. సీడ్ విత్తనాలు సాగు చేసిన రైతులకు ఎక్కువ ధరలు ఇవ్వాల్సిన కంపెనీల ప్రతినిధులు ధరల చెల్లింపులోనూ నిలువునా మోసం చేస్తున్నారు. కమర్షియల్ విధానంలో సాగైన మొక్కజొన్న పంటకు క్వింటాలు రూ.2,200 నుంచి రూ.2,600లు డిమాండ్ ఉండగా, సీడ్ కంపెనీలు మాత్రం రూ.1,650లు మాత్రమే ఇస్తామంటూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. విత్తనాలు ఉచితంగా ఇస్తున్నామని చెప్పుకునే కంపెనీలు విత్తనాల సంచిపై ఎలాంటి అనుమతి ఉన్న సర్టిఫికెట్, కంపెనీ వివరాలు లేకుండానే రైతులకు అందిస్తున్నారు. కనీసం బిల్లులు ఉండవు. గ్రామాల్లో వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులు ఏ విత్తనాలు సాగు చేస్తున్నారనేది వ్యవసాయాధికారులు పట్టించుకోకపోవడం లేదు. ఎవరూ ఫిర్యాదు చేయలేదు మొక్కజొన్న రైతులు పంట దిగుబడి రాలేదన్న విషయం నా దృష్టికి తాలేదు. రైతులు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. సీడ్ కోసం సాగు చేసే పంట కాబట్టి విత్తనాలను స్థానిక దుకాణాల్లో కొనుగోలు చేయరు. కంపెనీ నుంచి ఏజెంట్ల ద్వారా నేరుగా రైతులకు ఇస్తారు. రైతులు కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకోవాలి. కనీసం రశీదైనా తీసుకోవాలి. రైతులు రశీదులు తీసుకోరు, అగ్రిమెంట్ చేసుకోవడం లేదు. దీనిపై గతంలోనూ రైతులకు అనేక పర్యాయాలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. పంట దిగుబడి రాని రైతుల వద్దకు వెళ్లి విచారిస్తాం. కంపెనీల ద్వారా తగిన పరిహారం చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. – ఎస్.రామ్మోహన్‌రెడ్డి, ఏఓ, గిద్దలూరు 12 ఎకరాల్లో సాగు చేశాను నేను 12 ఎకరాలు కౌలుకు తీసుకుని సీడ్ మొక్కజొన్న విత్తనాలు సాగు చేశాను. ఎరువులు, పురుగు మందులు ఇస్తామని చెప్పిన కంపెనీ ప్రతినిధులు సకాలంలో ఇవ్వకపోవడంతో పంట పూర్తిగా దెబ్బతింది. 30 క్వింటాళ్లు దిగుబడి వస్తుందనుకుంటే 15 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కౌలు కార్డు లేకపోవడంతో ఇన్సూరెన్స్ వచ్చే అవకాశాలు లేవు. సీడ్ కంపెనీలు చేస్తున్న మోసాలపై తగు చర్యలు తీసుకుని మమ్మల్ని ఆదుకోవాలి.– పుల్లయ్య, రైతు, ప్రతాపరెడ్డి కాలనీ,గిద్దలూరు మండలం. -
గతేడాది కత్తెర పురుగు.. ఇప్పుడు మిడతలు
సాక్షి, మెదక్: రైతులను ప్రకృతి పగబట్టినట్లుంది. సకాలంలో వర్షాలు లేవు. దీనికి తోడుగా వందల అడుగుల లోతులో ఉన్న నీటికోసం అడుగడుగునా బోర్లువేసి భద్రంగా నీటి చుక్కలను కాపాడుకొని సాగుచేసిన పంటలు చేతికందే సమయంలోనే చెజారిపోతున్నాయి. మక్క పంటను గతేడాది కత్తెర పురుగు నాశనం చేయగా.. ఈసారి మిడతల దండు విరచుకుపడుతోంది. జిల్లాలో ఇప్పటికే 4 వేల ఎకరాల్లో పంటను పీల్చి పిప్పి చేశాయి. కనీసం పశువుల మేతకు కూడా పనికిరాకుండా చేస్తున్న మిడతలు అంటేనే రైతులు హడలెత్తిపోతున్నారు. పంటలను పరిశీలించిన వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు, అధికారులు నామమాత్రంగా మందులు స్ప్రే చేయాలని సూచించారే తప్ప.. మరేమీ చేయలేమని చేతులెత్తేశారు. నిన్నా మొన్నటి వరకు మొక్కజొన్న పంటను కత్తెర పురుగు ధ్వంసం చేయగా అనేక ఇబ్బందులు పడి దాని బారి నుంచి బయట పడ్డారోలేదో..? మళ్లీ మిడతల బెడద పట్టుకుంది. పంట చేతికందే సమయంలో పంటలపై మిడతలు దాడిచేసి పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్న పంటను పూర్తిగా ధ్వంసం చేసిన మిడతలు: పంటను తింటున్న మిడతలు జిల్లాలో ఈ యేడు వర్షాధార పంటగా జిల్లా వ్యాప్తంగా సుమారు 39 వేల హెక్టార్లలో మొక్కజొన్న పంటను సాగు చేశారు. అడపాదడప కురిసిన వర్షాలతోనే మొక్కజొన్న పంటను సాగు చేయగా ఆగస్టులో ఏకంగా 15రోజుల పాటు వర్షాలు కురవకపోవడంతో సాగుచేసిన మొక్కజొన్న పంటలో సగం మేర ఎండిపోయింది. మిగిలిన సగం పంటకు సైతం నిన్నా మొన్నటి వరకు కత్తెర పురుగు ఆశించటంతో దాని నివారణకు తలకు మించిన భారంతో పలురకాల మందులను స్ప్రే చేసి కొంతమేర దాని నుంచి ఉపశమనం పొందారో లేదో మళ్లీ మిడతలు మొక్కజొన్న చేలను ధ్వసం చేస్తున్నాయి. ఎకరాల కొద్దిపంటలను రోజుల వ్యవధిలోనే తింటున్నాయి. ఆరుగాలం కష్టపడి పంటలను సాగుచేస్తే మరో 20 రోజుల్లో పంటచేతికి అందుతుందనగా మిడతలు పంటను కళ్లముందే నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మొక్కజొన్నకు అన్నీ గండాలే... మొక్కజొన్న పంటను సాగుచేయాలంటే పెద్ద గగనమనే చెప్పాలి. పంటసాగుచేసిన నుంచి మొదలుకుని చేతికందే వరకు అనేక రకాల కష్టాలు పడాల్సిందే ఈ యేడు ముందుగా కత్తెర పురుగు వచ్చింది. దాన్ని నివారించగానే రాత్రి అయిందంటే చాలు అడవి పందులు వచ్చి పంటచేళ్లను తినేస్తున్నాయి. పగటి వేళలో కోతుల గుంపులు వచ్చి అందిన కాడికి ధ్వంసం చేస్తుండగా తాజాగా మిడతల గుంపులు వచ్చి మళ్లీ మొక్కజొన్నను తినేస్తున్నాయి. గడియ గడియకు ఇబ్బందులు పడుతూ పంటలను పండించేందుకు అన్నదాతలు పడుతున్న కష్టాలు అంతా ఇంతకావు. పంట చేతికందుతుందా లేదా అంటూ ఆవేదన చెందుతున్నారు. -
కత్తెర పురుగు కట్టడికి ప్రయత్నాలు షురూ!
సాక్షి, హైదరాబాద్: మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం చేస్తున్న కత్తెర పురుగు (ఫాల్ ఆర్మీ వర్మ్) నియంత్రణకు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం నడుం బిగించింది. దిగుబడిలో కనీసం 25–40% నష్టం చేయగల ఈ పురుగును గతేడాది కర్ణాటకలో తొలిసారి గుర్తించారు. అయితే ఇది ఏడాది కాలంలోనే దేశంలోని దాదాపు 8 రాష్ట్రాలకు విస్తరించడం.. మొక్కజొన్నతోపాటు 80 ఇతర పంటలకూ ఆశించగల సామర్థ్యం దీనికి ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్)లో బుధవారం ఒక సదస్సు జరిగింది. భారత వ్యవసాయ పరిశోధన సమాఖ్య (ఐసీఏఆర్)తోపాటు దేశంలోని అనేక ఇతర వ్యవసాయ పరిశోధన సంస్థలు, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు. ఈ పురుగు నియంత్రణకు ఏం చర్యలు తీసుకోవాలి? ఈ పురుగు విస్తరణ, ప్రభావం తదితర అంశాలపై విస్తృత స్థాయిలో పరిశోధనలు చేపట్టాలని తీర్మానించారు. హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ కేథరీన్ హడ్డా మీడియాతో మాట్లాడుతూ.. యూఎస్ఎయిడ్, సీఐఎంఎంవైటీ వంటి అంతర్జాతీయ సంస్థల సహకారంతో చేపట్టే ఈ పరిశోధనలతో సమీప భవిష్యత్తులోనే కత్తెర పురుగును నియంత్రించవచ్చునని.. తద్వారా చిన్న, సన్నకారు రైతులకు జరిగే నష్టాన్ని తగ్గించవచ్చని తెలిపారు. ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ త్రిలోచన్ మహాపాత్ర మాట్లాడుతూ.. కత్తెర పురుగు సమస్యను ఎదుర్కొనేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టిందని, అందుబాటులో ఉన్న సమాచారంతో రైతులు చేపట్టాల్సిన చర్యలను రాష్ట్రస్థాయి వ్యవసాయ అధికారులకు సమాచారం అందించడంతోపాటు ప్రభుత్వ స్థాయిలో విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేశామన్నారు. రాత్రికి రాత్రే వందల కిలోమీటర్ల దూరాలను చేరగల ఈ పురుగుపై ఓ కన్నేసి ఉంచేందుకు, చీడ ఆశించిన ప్రాంతాలపై నివేదికలు తెప్పించుకునేందుకూ ఏర్పాట్లు చేశామన్నారు. అమెరికాకు పాతకాపే.. కత్తెర పురుగు అమెరికాలో మొక్కజొన్న విస్తృతంగా పండే ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఉన్న కీటకమే. కాకపోతే మూడేళ్ల క్రితం దీన్ని తొలిసారి ఆఫ్రికా ఖండం లో గుర్తించారు. అమెరికాలోని కార్న్ బెల్ట్‌లో చలి వాతావరణాలను తట్టుకోలేక ఇవి దక్షిణ ప్రాంతాలకు వెళ్లేవని.. సీజన్లో మాత్రం మళ్లీ తిరిగి వచ్చేవని ఇంటర్నేషనల్ మెయిజ్ అండ్ వీట్ ఇంప్రూవ్మెంట్ సెంటర్ ప్రతినిధి డాక్టర్ ప్రసన్న తెలిపారు. మొక్కల ఆకులను చాలా వేగంగా తినేయగల, నష్టం చేయగల సామర్థ్యం కత్తెరపురుగు సొంతమని ప్రస్తుతానికి ఇది కేవలం మొక్కజొన్న పంటకే ఆశిస్తున్నా, ఇతర పంటలకూ ఆశించవచ్చునని, ఆసియాలోనూ వేగంగా విస్తరిస్తుండటంతో నియంత్రణ, నిర్వహణలు రెండూ అంతర్జాతీయ ప్రాముఖ్యతను సంపాదించుకున్నాయని అన్నారు. కార్యక్రమంలో ఇక్రిశాట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కిరణ్ శర్మ పాల్గొన్నారు. -
ఎర్రజొన్నకు బదులు మొక్కజొన్న...
మోర్తాడ్(బాల్కొండ): ఎర్రజొన్న సీడ్ పంపిణీకి అధికార యంత్రాంగం ఆంక్షలు విధించిన నేపథ్యంలో రబీ సీజనుకు గాను రైతులు మొక్కజొన్న పంటను సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. మోర్తాడ్, బాల్కొండ, వేల్పూర్, మెండోరా, ముప్కాల్, ఏర్గట్ల, ఆర్మూర్, నందిపేట్, జక్రాన్‌పల్లి మండలాల్లో ప్రతి రబీ సీజనులో ఎర్రజొన్నలను రైతులు సాగు చేస్తారు. దాదాపు 50 వేల ఎకరాల్లో ఎర్రజొన్నలు సాగు అవుతున్నాయి.గతంలో ఎర్రజొన్నలకు క్వింటాలుకు రూ.3వేల నుంచి రూ.4వేల ధర చెల్లించిన వ్యాపారులు కొంత కాలం నుచి ధరను తగ్గించారు. గడచిన సీజనులో ఎర్రజొన్నలకు వ్యాపారులు రూ.1,700 నుంచి రూ.1,800 వరకు ధర చెల్లిస్తామని ప్రకటించారు. దీంతో రైతులు ఆందోళన నిర్వహించగా ప్రభుత్వం ముందుకు వచ్చి మార్క్‌ఫెడ్ ద్వారా క్వింటాలు ఎర్రజొన్నలను రూ.2,300 ధరకు కొనుగోలు చేసింది. అయితే ఎర్రజొన్నల కొనుగోలు వల్ల ప్రభుత్వ ఖజానాకు భారం ఏర్పడటంతో పాటు కొన్న ఎర్రజొన్నలు గోదాంలలో నిలువ ఉండిపోయాయి. దీంతో మార్క్‌ఫెడ్ సంస్థకు నష్టం వాటిల్లింది. మార్క్‌ఫెడ్ సంస్థ ప్రభుత్వ రంగానికి సంబంధించింది కాగా, ఈసారి ఎర్రజొన్నలను సాగు చేస్తే మళ్లీ ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తారనే ఉద్దేశంతో సీడ్ పంపిణీ విషయంలో అధికార యంత్రాంగం ఆంక్షలు విధించింది. రైతులకు సీడ్ పంపిణీ చేసే వ్యాపారులే ఎర్రజొన్నలను కొనుగోలు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఇందులో భాగంగా బడా సీడ్ వ్యాపారులు, రైతు సమన్వయ సమితి సభ్యులతో జిల్లా ఉన్నతాధికారులు సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాలలో సీడ్ ఇచ్చే వ్యాపారులే రైతులతో ఒప్పందం కుదుర్చుకుని ఎర్రజొన్నలను కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. అలాగే ధర ఒప్పందంను కుదుర్చుకుని రైతులు నష్టపోకుండా వ్యాపారులు చర్యలు తీసుకోవాలని కూడా అధికారులు తీర్మానించారు. రైతు సమన్వయ సమితి సభ్యులు క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి సీడ్ ఇచ్చే వ్యాపారులను గుర్తించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సీడ్ ఇవ్వడానికి ఆసక్తిని చూపిన వ్యాపారులు ధర ఒప్పందం చేసుకోవడంతో పాటు ఎర్రజొన్నలను కొనుగోలు చేసే ఆంశంపై వెనుకడుగు వేశారు. సీడ్ ఇచ్చి ఎర్రజొన్నల కొనుగోలుకు ముందుకు రాని వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో హడలిపోయిన కొందరు వ్యాపారులు ఎర్రజొన్నల సీడ్ ఇవ్వడానికి విముఖత కనబరుస్తున్నారు. కొందరు రైతులు మాత్రం అధికారుల ఆంక్షలు పట్టించుకోకుండా వ్యాపారుల నుంచి సీడ్‌ను కొనుగోలు చేస్తున్నారు. మరి కొందరు రైతులు ఎర్రజొన్నలను సాగు చేసి ఇబ్బంది పడటంకంటే ఆ పంట స్థానంలో మొక్కజొన్న పంటను సాగు చేయడం మేలు అని భావిస్తున్నారు. ఇప్పటికే ఎర్రజొన్నల విత్తనాలను పోయాల్సి ఉండగా రైతులు మొక్కజొన్న సాగు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మక్కలకు క్వింటాలుకు రూ.1,700 మద్దతు ధర ఉండటం వల్ల మొక్కజొన్న సాగుకే రైతులు మొగ్గు చూపుతున్నారు. ఎర్రజొన్నల సీడ్ పంపిణీకి ఆంక్షలు అమలు అవుతుండటంతో ఈ పంట సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనా రబీ సీజనులోను రైతులు మొక్కజొన్న సాగుకు మొగ్గు చూపుతుండటం గమనార్హం. -
మొక్కజొన్న గజగజ
సాక్షి, హైదరాబాద్: మొక్కజొన్న పంటపై కత్తెర పురుగు దాడి ఉధృతమైంది. మొదట్లో సిద్దిపేట, మెదక్ జిల్లాలకే పరిమితమైన కత్తెర పురుగు (ఫాల్ ఆర్మీ వార్మ్) ఆ తర్వాత గత వారంలో 8 జిల్లాలకు విస్తరించింది. ఇప్పుడు ఏకంగా 17 జిల్లాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. ఈ విషయమై వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపింది. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, ఖమ్మం, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, గద్వాల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, మహబూబాబాద్, వికారాబాద్ జిల్లాల్లోని మొక్కజొన్న పంటపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని నివేదిక తెలిపింది. అలాగే పత్తిపై గులాబీ రంగు పురుగు దాడి విస్తరించింది. గత వారం వ్యవసాయ శాఖ వర్గాల లెక్కల ప్రకారం మెదక్, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోనే కనిపించిన గులాబీరంగు పురుగు, ఇప్పుడు ఏకంగా మరో 12 జిల్లాలకు విస్తరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, ఖమ్మం, భద్రాద్రి, నల్లగొండ, ఆసిఫాబాద్, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లోనూ కనిపించింది. మొక్కజొన్నపై కత్తెర, పత్తిపై గులాబీ పురుగు దాడి చేస్తున్నా చర్యలు చేపట్టడంలో వ్యవసాయశాఖ విఫలమైంది. కోటి ఎకరాల్లో పంటల సాగు... ఖరీఫ్ సాగు గణనీయంగా పెరిగింది. ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటికి 1.01 కోట్ల ఎకరాలకు అంటే 93 శాతానికి చేరింది. అందులో పత్తి సాగు గణనీయంగా పెరిగింది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు ఏకంగా 44.71 లక్షల (106%) ఎకరాల్లో సాగైంది. ఖరీఫ్ ఆహారధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 49.06 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 45.91 లక్షల(94%) ఎకరాల్లో సాగయ్యాయి. ఆహార పంటల్లో కీలకమైన వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.75 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 24.11 లక్షల (102%) ఎకరాల్లో నాట్లు పడ్డాయి. ఇటీవలి వర్షాలతో వరి నాట్లు సాధారణం కంటే గణనీయంగా పుంజుకున్నాయి. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 13.40 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 11.48 లక్షల (86%) ఎకరాల్లో సాగైంది. కంది 97%, పెసర 72% సాగయ్యాయి. పంట నష్టంపై కేంద్రానికి నివేదిక ఏదీ? ఇటీవల కురిసిన వర్షాలకు అనేకచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లాయి. అనేక జిల్లాల్లో దాదాపు రెండున్నర లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇవిగాక పలు జిల్లాల్లో పంటలు నీట మునిగాయి. పంట నష్టం ఇంత పెద్ద ఎత్తున ఉన్నా వ్యవసాయశాఖ కేవలం ప్రాథమిక నివేదిక వరకే పరిమితమైంది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి నివేదిక పంపించలేదని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. కనీసం ప్రాథమిక నివేదిక కూడా తమకు చేరలేదని విపత్తు నిర్వహణశాఖ తెలిపింది. 12 జిల్లాల్లో లోటు వర్షపాతం ఈ ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా సాధారణ వర్షపాతం 614.5 మిల్లీమీటర్లు (ఎంఎం) కాగా, ఇప్పటివరకు 584.1 ఎంఎంలు నమోదైంది. జూన్ నెలలో 14 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, జూలైలో 30 శాతం లోటు నమోదైంది. ఆగస్టులో 18 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్‌లో ఇప్పటివరకు ఈ ఐదు రోజుల్లో 74 శాతం లోటు నమోదైంది. ఇటీవల భారీగా వర్షాలు కురిసినప్పటికీ ఇప్పటికీ 12 జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, జోగులాంబ, నాగర్‌కర్నూలు, నల్లగొండ, వనపర్తి జిల్లాల్లో లోటు నమోదైంది. -
మొలకెత్తిన మొక్కజొన్న
ఆదుకోవాలంటూ తహసీల్దార్‌కు రైతుల విన్నపం చిన్నశంకరంపేట: భారీగా కురిసిన వర్షాలకు తడిసిన మొక్కజొన్న కంకులు మొలకెత్తి తీవ్రంగా నష్టం వచ్చిందని పలు గ్రామాల రైతులు తహసీల్దార్ వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు. శనివారం చిన్నశంకరంపేట తహసీల్దార్ కార్యాలయానికి మొలకెత్తిన మొక్కజొన్న కంకులతో తరలి వచ్చి తమకు జరిగిన నష్టం వివరించారు. జంగరాయి గ్రామ నాగులమ్మ తండాకు చెందిన రెడ్యా నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగుచేశారు. పంట చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలతో మొక్కజొన్న కంకులు మొలకెత్తి చేతికందకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మొలకెత్తిన మొక్కజొన్నలను ఎవరూ కొనుగోలు చేయరని, దీంతో తాము పెట్టిన పెట్టుబడులు చేతికందకపోగా, మరింత అప్పులయ్యయన్నారు. ప్రభుత్వం నష్టపరిహరం అందించి ఆదుకోవాలని కోరారు. గవ్వలపల్లి తండాకు కిషన్ కూడా మొలకెత్తిన మొక్కజొన్న కంకులతో తహసీల్దార్ కార్యాలయానికి తరలివచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ విజయలక్ష్మి మార్క్‌ఫెడ్ అధికారులతో ఫోన్లో మాట్లాడి మొలకెత్తిన మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని కోరారు. -
రైతు బలవన్మరణం
చేవెళ్ల రూరల్: అప్పుల బాధతో మనోవేదనకు గురై ఇంట్లోంచి వెళ్లిపోయిన ఓ రైతు బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన బుధవారం మండల పరిధిలోని ఎన్కేపల్లిలో వెలుగుచూసింది. మృతుడి కుటుంబీ కులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కావలి కిష్టయ్య(55) తనకున్న ఎకరం పొలంతో పాటు మరో రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈఏడాది పత్తి, మొక్కజొన్న పంటలు సాగుచేశాడు.వర్షాలు సరిగా కురవకపోవడంతో ఆశించిన స్థాయిలో దిగుబడి లేదు. పెట్టుబడులు, కూతురి వివాహం కోసం కిష్టయ్య సుమారు రూ. 5 లక్షల వరకు అప్పులు చేశాడు. పంటలు బాగా పండితే కనీసం వడ్డీలైనా చెల్లించొచ్చని భావించిన రైతుకు నిరాశే ఎదురైంది. అప్పుల విషయమై ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఈనెల 9న కుటుంబీకులతో ఘర్షణపడిన కిష్టయ్య మనోవేదనకు గురై ఇంట్లోంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు ఆయన కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం సా యంత్రం గ్రామ సమీపంలోని కందికొం డ సురేష్‌గౌడ్ బావిలోంచి దుర్వాసన రావడం స్థానికులు గమనించారు. బావి దగ్గరకు వెళ్లి చూడగా అందులో మృతదేహం కనిపించింది. అప్పటికే రాత్రి కావడంతో మృతదేహాన్ని వెలికితీయడం కుదరలేదు. బుధవారం ఉదయం మృతుడిని కావలి కిష్టయ్యగా గుర్తించి మృతదేహాన్ని వెలికితీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహం కుళ్లిపోయి ఉంది. దీంతో ఘటనా స్థలంలోనే వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి కొడుకు శ్యామ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబం రైతు కిష్టయ్యకు భార్య వినోద, కొడుకు శ్యామ్, కూతురు అనురాధ ఉంది. కొన్ని రోజుల క్రితం కిష్టయ్య అప్పులు చేసి కూతురి వివాహం చేశాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో వినోద పుట్టింట్లోనే ఉంటోంది. కిష్టయ్య భార్య వినోద పక్షవాతంతో మంచానికే పరిమితమైంది. దీంతో ఆయన కొడుకు శ్యామ్‌తో కలిసి రెక్కలుముక్కలు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. కిష్టయ్య మృతితో కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యా రు. అందరితో కలుపుగోలుగా ఉండే కిష్టయ్య మృతిచెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. -
మక్క దక్కేనా?
ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభం నుంచే వరుణుడు రైతులతో దోబూచులాడుతున్నాడు. అవసరమైన సమయంలో వర్షాలు లేక ఇప్పటికే చాలా మంది అన్నదాతలు పంటల సాగులో వెనకబడిపోయారు. అడపాదడపా కురిసిన వానలకు ధైర్యం చేసి కొందరు మొక్కజొన్న పంటలు వేశారు. ప్రస్తుతం చేలన్నీ పాలు పోసుకునే దశలో ఉన్నాయి. ఆరుతడి పంటలకు ప్రస్తుతం వాన చాలా అవసరం. కానీ వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో పంట చేతికి వస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో ముఖ్యంగా మొక్కజొన్న, పత్తి, కూరగాయ పంటలు ప్రస్తుతం కాత దశలో ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు కురిస్తేనే కంకులు విత్తులు పట్టే అవకాశం ఉంది. కీలకమైన ఈ సమయంలో వరుణుడి జాడ లేక అన్నదాతలు ఆవేదనకు గురవుతున్నారు. ఎండలు మండి పోతుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమయంలో ఒక్క వాన పడితే చాలు తమ కష్టాలు గట్టెక్కుతాయని భావిస్తున్నారు. లేదంటే ఇన్నాళ్లూ పడిన కష్టం వృథా అవుతుందని వాపోతున్నారు. వర్షం పడాలని కోరుతూ ఆలయాలు, ప్రార్థన మందిరాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వానదేవుడు కరుణించాలని వేడుకుంటున్నారు.