చేవెళ్ల రూరల్: అప్పుల బాధతో మనోవేదనకు గురై ఇంట్లోంచి వెళ్లిపోయిన ఓ రైతు బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన బుధవారం మండల పరిధిలోని ఎన్కేపల్లిలో వెలుగుచూసింది. మృతుడి కుటుంబీ కులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కావలి కిష్టయ్య(55) తనకున్న ఎకరం పొలంతో పాటు మరో రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు.
ఈఏడాది పత్తి, మొక్కజొన్న పంటలు సాగుచేశాడు.వర్షాలు సరిగా కురవకపోవడంతో ఆశించిన స్థాయిలో దిగుబడి లేదు. పెట్టుబడులు, కూతురి వివాహం కోసం కిష్టయ్య సుమారు రూ. 5 లక్షల వరకు అప్పులు చేశాడు. పంటలు బాగా పండితే కనీసం వడ్డీలైనా చెల్లించొచ్చని భావించిన రైతుకు నిరాశే ఎదురైంది. అప్పుల విషయమై ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఈనెల 9న కుటుంబీకులతో ఘర్షణపడిన కిష్టయ్య మనోవేదనకు గురై ఇంట్లోంచి వెళ్లి తిరిగి రాలేదు.
కుటుంబీకులు ఆయన కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం సా యంత్రం గ్రామ సమీపంలోని కందికొం డ సురేష్‌గౌడ్ బావిలోంచి దుర్వాసన రావడం స్థానికులు గమనించారు. బావి దగ్గరకు వెళ్లి చూడగా అందులో మృతదేహం కనిపించింది. అప్పటికే రాత్రి కావడంతో మృతదేహాన్ని వెలికితీయడం కుదరలేదు. బుధవారం ఉదయం మృతుడిని కావలి కిష్టయ్యగా గుర్తించి మృతదేహాన్ని వెలికితీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహం కుళ్లిపోయి ఉంది. దీంతో ఘటనా స్థలంలోనే వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి కొడుకు శ్యామ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబం
రైతు కిష్టయ్యకు భార్య వినోద, కొడుకు శ్యామ్, కూతురు అనురాధ ఉంది. కొన్ని రోజుల క్రితం కిష్టయ్య అప్పులు చేసి కూతురి వివాహం చేశాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో వినోద పుట్టింట్లోనే ఉంటోంది. కిష్టయ్య భార్య వినోద పక్షవాతంతో మంచానికే పరిమితమైంది. దీంతో ఆయన కొడుకు శ్యామ్‌తో కలిసి రెక్కలుముక్కలు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. కిష్టయ్య మృతితో కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యా రు. అందరితో కలుపుగోలుగా ఉండే కిష్టయ్య మృతిచెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
రైతు బలవన్మరణం
Published Wed, Nov 19 2014 11:55 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement