సాక్షి, అమరావతి: మొక్కజొన్న పంట కాసులు కురిపిస్తోంది. కరోనా కారణంగా రెండేళ్లపాటు కనీస మద్దతు ధరకు నోచుకోని మొక్కజొన్న రైతులు ఈసారి మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం క్వింటాల్ రూ.2 వేల నుంచి రూ.2,200 వరకు ధర పలుకుతుండగా రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా ఆ దేశం నుంచి మొక్కజొన్న దిగుమతులు నిలిచిపోవడంతో ధరలు పెరిగాయని చెబుతున్నారు. గతేడాది ఉక్రెయిన్ నుంచి మన దేశం 33.50 మిలియన్ టన్నుల మొక్కజొన్నను దిగుమతి చేసుకోగా.. ప్రస్తుత యుద్ధ ప్రభావంతో దేశీయంగా మొక్కజొన్న ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి.
రెండేళ్ల పాటు దెబ్బతీసిన కరోనా
మొక్కజొన్నను సాధారణంగా కోళ్లకు మేతగా వినియోగిస్తారు. ఇథనాల్, ఆల్కహాల్, పిండి పదార్థాల తయారీలోనూ విని యోగిస్తారు. కరోనా దెబ్బకు రెండేళ్లపాటు ఆక్వా, పౌల్ట్రీ పరిశ్రమ దెబ్బ తినడంతో మొక్కజొన్న క్వింటాల్ రూ.1,100 నుంచి రూ.1450కి మించి కొనేవారు లేక రైతులు విలవిల్లాడారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులకు అండగా నిలిచింది. మార్క్‌ఫెడ్ 2019–20 సీజన్‌లో 61,494 మంది రైతుల నుంచి రూ.806.20 కోట్ల విలువైన 4,16,426 టన్నులు, 2020–21 సీజన్‌లో 78,702 మంది రైతుల నుంచి రూ.1,010.68 కోట్ల విలువైన 4.96 లక్షల టన్నులను కొనుగోలు చేసి ఆదుకుంది.
ఖరీఫ్–21లో ఎమ్మెస్పీని మించి ధర
ప్రభుత్వ చర్యలతో 2021–22 సీజన్‌లో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కు మించి ధర పలకడం రైతుకు ఊరట నిచ్చింది. ఖరీఫ్– 2021 సీజన్‌లో 3.25 లక్షల ఎకరాల్లో మొక్క జొన్న సాగవగా.. 5.26 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ప్రభుత్వం ఎమ్మెస్పీ క్వింటాల్ రూ.1,870 ప్రకటించగా, మార్కెట్‌లో రూ.1,900 వరకు పలకడంతో రైతులు కొనుగోలు కేంద్రాల వైపు చూడలేదు. ప్రస్తుతం రబీ సీజన్‌లో 5.05 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవగా.. 8.50లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు.
ఎప్పుడూ ఈ ధర లేదు
రబీలో 2.25 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. రూ.70 వేల వరకు పెట్టుబడి పెట్టా. ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.2 వేలకు పైగా పలుకుతోందంటున్నారు. గతంలో ఎప్పుడూ ఈ ధర చూడలేదు. ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం మంచి ఆదాయం వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.
– యగ్గోని శ్రీనివాసరెడ్డి, చందవరం, ప్రకాశం జిల్లా
సంతోషంగా ఉంది
రబీలో 12 ఎకరాల్లో మొక్కజొన్న వేశా. మంచి దిగుబడి వచ్చేట్టు ఉంది. మార్కెట్‌లో రూ.2,200 వరకు ధర పలుకుతోందంటున్నారు. ధర లేక గత రబీలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ఎమ్మెస్పీకి అమ్ముకున్నా. ఈసారి మంచి రేటు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది.
– గంపెన వెంకటప్రసాద్, మంచికలపూడి, గుంటూరు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment