మోర్తాడ్(బాల్కొండ): ఎర్రజొన్న సీడ్ పంపిణీకి అధికార యంత్రాంగం ఆంక్షలు విధించిన నేపథ్యంలో రబీ సీజనుకు గాను రైతులు మొక్కజొన్న పంటను సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. మోర్తాడ్, బాల్కొండ, వేల్పూర్, మెండోరా, ముప్కాల్, ఏర్గట్ల, ఆర్మూర్, నందిపేట్, జక్రాన్‌పల్లి మండలాల్లో ప్రతి రబీ సీజనులో ఎర్రజొన్నలను రైతులు సాగు చేస్తారు. దాదాపు 50 వేల ఎకరాల్లో ఎర్రజొన్నలు సాగు అవుతున్నాయి.గతంలో ఎర్రజొన్నలకు క్వింటాలుకు రూ.3వేల నుంచి రూ.4వేల ధర చెల్లించిన వ్యాపారులు కొంత కాలం నుచి ధరను తగ్గించారు. గడచిన సీజనులో ఎర్రజొన్నలకు వ్యాపారులు రూ.1,700 నుంచి రూ.1,800 వరకు ధర చెల్లిస్తామని ప్రకటించారు. దీంతో రైతులు ఆందోళన నిర్వహించగా ప్రభుత్వం ముందుకు వచ్చి మార్క్‌ఫెడ్ ద్వారా క్వింటాలు ఎర్రజొన్నలను రూ.2,300 ధరకు కొనుగోలు చేసింది. అయితే ఎర్రజొన్నల కొనుగోలు వల్ల ప్రభుత్వ ఖజానాకు భారం ఏర్పడటంతో పాటు కొన్న ఎర్రజొన్నలు గోదాంలలో నిలువ ఉండిపోయాయి.
దీంతో మార్క్‌ఫెడ్ సంస్థకు నష్టం వాటిల్లింది. మార్క్‌ఫెడ్ సంస్థ ప్రభుత్వ రంగానికి సంబంధించింది కాగా, ఈసారి ఎర్రజొన్నలను సాగు చేస్తే మళ్లీ ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తారనే ఉద్దేశంతో సీడ్ పంపిణీ విషయంలో అధికార యంత్రాంగం ఆంక్షలు విధించింది. రైతులకు సీడ్ పంపిణీ చేసే వ్యాపారులే ఎర్రజొన్నలను కొనుగోలు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఇందులో భాగంగా బడా సీడ్ వ్యాపారులు, రైతు సమన్వయ సమితి సభ్యులతో జిల్లా ఉన్నతాధికారులు సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాలలో సీడ్ ఇచ్చే వ్యాపారులే రైతులతో ఒప్పందం కుదుర్చుకుని ఎర్రజొన్నలను కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. అలాగే ధర ఒప్పందంను కుదుర్చుకుని రైతులు నష్టపోకుండా వ్యాపారులు చర్యలు తీసుకోవాలని కూడా అధికారులు తీర్మానించారు.
రైతు సమన్వయ సమితి సభ్యులు క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి సీడ్ ఇచ్చే వ్యాపారులను గుర్తించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సీడ్ ఇవ్వడానికి ఆసక్తిని చూపిన వ్యాపారులు ధర ఒప్పందం చేసుకోవడంతో పాటు ఎర్రజొన్నలను కొనుగోలు చేసే ఆంశంపై వెనుకడుగు వేశారు. సీడ్ ఇచ్చి ఎర్రజొన్నల కొనుగోలుకు ముందుకు రాని వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో హడలిపోయిన కొందరు వ్యాపారులు ఎర్రజొన్నల సీడ్ ఇవ్వడానికి విముఖత కనబరుస్తున్నారు. కొందరు రైతులు మాత్రం అధికారుల ఆంక్షలు పట్టించుకోకుండా వ్యాపారుల నుంచి సీడ్‌ను కొనుగోలు చేస్తున్నారు.
మరి కొందరు రైతులు ఎర్రజొన్నలను సాగు చేసి ఇబ్బంది పడటంకంటే ఆ పంట స్థానంలో మొక్కజొన్న పంటను సాగు చేయడం మేలు అని భావిస్తున్నారు. ఇప్పటికే ఎర్రజొన్నల విత్తనాలను పోయాల్సి ఉండగా రైతులు మొక్కజొన్న సాగు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మక్కలకు క్వింటాలుకు రూ.1,700 మద్దతు ధర ఉండటం వల్ల మొక్కజొన్న సాగుకే రైతులు మొగ్గు చూపుతున్నారు. ఎర్రజొన్నల సీడ్ పంపిణీకి ఆంక్షలు అమలు అవుతుండటంతో ఈ పంట సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనా రబీ సీజనులోను రైతులు మొక్కజొన్న సాగుకు మొగ్గు చూపుతుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment