తహసీల్దార్‌కు మొలకెత్తిన మొక్కజొన్నలను చూపిస్తున్న రైతు
ఆదుకోవాలంటూ తహసీల్దార్‌కు రైతుల విన్నపం
చిన్నశంకరంపేట: భారీగా కురిసిన వర్షాలకు తడిసిన మొక్కజొన్న కంకులు మొలకెత్తి తీవ్రంగా నష్టం వచ్చిందని పలు గ్రామాల రైతులు తహసీల్దార్ వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు. శనివారం చిన్నశంకరంపేట తహసీల్దార్ కార్యాలయానికి మొలకెత్తిన మొక్కజొన్న కంకులతో తరలి వచ్చి తమకు జరిగిన నష్టం వివరించారు.
జంగరాయి గ్రామ నాగులమ్మ తండాకు చెందిన రెడ్యా నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగుచేశారు. పంట చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలతో మొక్కజొన్న కంకులు మొలకెత్తి చేతికందకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మొలకెత్తిన మొక్కజొన్నలను ఎవరూ కొనుగోలు చేయరని, దీంతో తాము పెట్టిన పెట్టుబడులు చేతికందకపోగా, మరింత అప్పులయ్యయన్నారు.
ప్రభుత్వం నష్టపరిహరం అందించి ఆదుకోవాలని కోరారు. గవ్వలపల్లి తండాకు కిషన్ కూడా మొలకెత్తిన మొక్కజొన్న కంకులతో తహసీల్దార్ కార్యాలయానికి తరలివచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ విజయలక్ష్మి మార్క్‌ఫెడ్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి మొలకెత్తిన మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని కోరారు.